4, నవంబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం - 1225 (కందుకూరి వీరేశలింగము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
కందుకూరి వీరేశలింగము ఖలుండు.

19 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    వీరేశలింగంగారి సమకాలికుల సంభాషణ :

    01)
    ___________________________

    విధవలకు వివాహములను - వృద్ధి జేసి
    మేటి యాచారముల నెల్ల - నోటి జేసి
    పాడు జేయుచు నున్నాడు - ప్రజలనెల్ల
    కందుకూరి వీరేశలిం - గము ఖలుండు !
    ___________________________

    రిప్లయితొలగించండి
  2. వీరేశలింగంగారి దగ్గరి బంధువుల వేదన :

    02)
    ___________________________

    వెర్రివాడందుమా - వేద శాస్త్రములెల్ల
    జక్కగా జదివిన - చదువరతడు !

    పిచ్చివాడందుమా - వేవేల వ్యాసాలు
    పత్రిక లందున - వ్రాసినాడు !

    దుర్జనుడందుమా - దూరడు నెవ్వారి
    బాలికలకు విద్య - బరప జూచు !

    దుర్మార్గు డందుమా - దుఖ్ఖంబులో నున్న
    పేదసాదలనెల్ల - నాదు కొనును !

    యేమి పాపమొ యేమొకొ - నెరుగ లేము !
    బాలలకు వివాహములను - భంగ పరచు !
    పెళ్ళి జేయగ సమకట్టు - విధవలకును !
    కందుకూరి వీరేశలిం - గము ఖలుండు !
    ___________________________
    ఖలుడు = మూర్ఖుడు

    రిప్లయితొలగించండి
  3. వీరేశలింగంగారి అనుయాయుల ప్రశంస :

    03)
    ___________________________

    కన్యకా మణులను - కాపాడ సమకట్టి
    బాల్య వివాహముల్ - పాడు జేయు

    నుద్ధరించగ నెంచి - యువిదల నెల్లరన్
    స్త్రీవిద్య కై పోరు - సేయు నతడు !

    తన యిల్లు వాకిలి - ధర్మంబు గా నిచ్చి
    యాశ్రమంబును బెట్టె - నతివలకును !

    జీవితాంతము దుఖః - జీవనమున మ్రగ్గు
    గతభర్తృకల లోన - కాంతి నింపె !


    వేయి కరముల ప్రసరించి - వేదనలను
    దీర్చి జేర్చగ సుఖమయ - తీరములకు
    కందుకూరి వీరేశలిం - గము ఖలుండు
    భావి భారత వనితల - భాగ్యమనగ
    నుద్భవించెను యుర్విని - యద్భుతముగ !
    ___________________________
    ఖలుడు = సూర్యుడు

    రిప్లయితొలగించండి
  4. కందుకూరి వీరేశలింగము ఘనుండ
    నంగ పొరపాటుగా వినినట్టి వాడొ
    కండు వ్రాసిన చందము గాంచు డిదిగొ
    కందుకూరి వీరేశలింగము ఖలుండు

    రిప్లయితొలగించండి
  5. మాన్యులు శ్రీ కంది శంకరయ్యగారికి
    నమస్కృతులతో,

    "వివేకవర్ధని"ని త్రిప్పి చదివితే, “నిర్ధవకు + అవి + ఏవి?” అవుతుందన్న ఆనాటి కృతకసంప్రదాయవాదుల అపహాస్యపు మాటల పునరుక్తిగా, పూరణ:

    "విద్యయు, వివేకమును గూర్చి వెలఁదులను స్వ
    తంత్రముగఁ దీర్చు నంట! నిర్ధవ కవేవి!
    ఆ ‘వివేకవర్ధని’ నెల్ల రడ్డుకొనుఁడు!
    కందుకూరి వీరేశలింగము ఖలుండు!"

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  6. పూజ్యులు నేమానివారికి, మిత్రులు...వసంతకిశోర్...ఏల్చూరి మురళీధరగావు గార్లకు నమస్కారములు! మీ మువ్వురి పూరణములు చాల బాగుగ నున్నవి.అభినందనలు!

    నా పూరణము:

    స్త్రీ పున ర్వివాహములను జేయఁగాను
    నడుము కట్టంగ మెచ్చలేనట్టి జనులు
    "కందుకూరి వీరేశలింగము ఖలుండు"
    ననుచు వదరసాఁగిరి! కాని, యతఁడు ఘనుఁడు!

    రిప్లయితొలగించండి
  7. సంఘ సంస్కర్త గా నెఱు గంగ వలయు
    కందు కూరి వీ రేశ లింగము , ఖలుండు
    దుష్ట బుద్ధిని మెలగుచు దురితములను
    చేయు చుండును నిర తము చెప్ప లేని

    రిప్లయితొలగించండి




  8. మూఢమతులు నవ్యసమాజమును గ్రహింప
    జాలకుండిన యంధు లజ్ఞాను లపుడు
    ఆగ్రహమున నిందించిరి హద్దుమీరి
    '' కందికూరి వీరేశలింగము ''ఖలుందు
    ( అని సంప్రదాయవాదులు ,అభివృద్ధినిరోధకులు అన్నారు కదా! )

    రిప్లయితొలగించండి
  9. కాల ధనములు జగతికే ఖర్చుజేయు
    కందుకూరి వీరేశలింగము ఖలుండు
    గాదు, గద్యతిక్కనతడు కవివరుండు
    పరహితంబునుగోరెడి ప్రజ్ఞాశాలి

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
    శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
    =============*============
    రాజమహేంద్రపు రమునందు బుట్టిన
    ---బ్రాహ్మణ వంశపు రాసబిడ్డ
    సకల శాస్త్రములను జదివిన సంఘసం
    ----స్కర్త జేడును ద్రుంచె గత్తి బట్టి
    కన్యాశులకమను గణ్యమైన కథను
    ---జనులకందించిరి చల్లగాను
    వీధులందు వ్యధలు జెందు విధవలను
    ----గాంచి, తోడుగ యుండ నెంచి నాడు
    మెల్ల మెల్లన గనువిచ్చి మేలు గాంచి
    యార్తులకు బాద ప్రక్షాళ నంబు సల్పి
    శూలమును బట్టిన తెనుగు బాలుడైన
    కందుకూరి వీరేశ లింగము ఖలుండు!
    ===========*=============
    విధవలకు మరు పెండ్లియే వేడుకనగ
    కోప తాపములు గలుగ కోవిధులకు
    నిప్పులను గురిపించిరి నింగి వరకు
    కందుకూరి వీరేశ లింగము ఖలుండు!
    గనుక దృవతార వలె నిల్చె కలియుగమున!
    (ఖలుడు = సూర్యుడు)

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    సతి యనలదగ్ధయైన విషయ మెరింగి
    కందు కూరి వీరేశ లింగము ఖలుండు దక్షునిన్ శిక్ష జేసి నధ్వరము నణచ
    వీరభద్రుని బనిచెను బోరనంగ
    కందు =ఎర్రనగు ;కోపించు
    కూరు =సంభవిల్లు ;కలుగు
    వీరేశలింగము =కుంకుమ శివలింగము
    కందుకూరి వీరేశలింగము =క్రోధముతో నెర్రబడిన పరమేశ్వరుడు నని భావము

    రిప్లయితొలగించండి
  12. విద్య నేర్పించె స్త్రీలకు విధవలకును
    పెళ్లి గావించె, మాన్పించె పెండ్లి బాల
    బాలికల, మంచి నచ్చని వారలనిరి
    "కందుకూరి వీరేశలింగము ఖలుండు."

    రిప్లయితొలగించండి
  13. చ్చాం దసంబున నెందరొ చకితు లైన
    సంఘ విద్రోహు లందరు భంగ పరచ
    కందు కూరి వీరేశ లింగము ఖలుం డ
    టంచు నిరసించి తెగడిరి కించ పరచి

    రిప్లయితొలగించండి
  14. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న సమస్యను పోస్ట్ చేసిన వెంటనే జనగామ వెళ్ళి రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఇల్లు చేరాను. అందువల్ల మీ పూరణలను సమీక్షించలేకపోయాను. మన్నించండి.
    *
    వసంత కిశోర్ గారూ,
    కందుకూరి వారిని సమకాలిక సంప్రదాయవాదులు ఎన్ని బాధలు పెట్టారో, ఎంతగా విమర్శించారో అందరికీ తెలిసిన విషయమే.
    మీ మొదటి పూరణ బాగుంది.
    రెండవ పూరణలో మీరు చెప్పినట్లు ఖల శబ్దానికి మూర్ఖుడు అన్న అర్థం ఉన్నట్టు లేదు.
    సూర్యుడు అనే అర్థంతో చేసిన మూడవ పూరణ ప్రశంసింపదగినది.
    మీకు నా అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    స్ఖాలిత్యాన్ని ఆశ్రయించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    ఏల్చూరి మురళీధరరావు గారూ,
    మీరు తఱచుగా పూరణలు చేయరు. ఎప్పుడైనా చేశారంటే అందులో వైవిధ్యం కాని, ఏదో విశేషం కాని తప్పక ఉంటాయి. ‘నిర్ధవ క వేవి?’ అని పంతులుగారిని ఎగతాళి చేసిన విషయం నాకు క్రొత్త. అద్భుతమైన పూరణ చేశారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ఖలుడు కాదు ఘనుడంటూ మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    విరుపుతో చక్కని పూరణ చేశారు. అభినందనలు.
    మొదటి పాదంలో ‘సంఘ-గంగ’ అని ప్రాసయతి దోషం.
    *
    కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘అపుడు+ఆగ్రహమున’ అని విసంధిగా వ్రాయరాదు కదా. ‘అప్పు/డాగ్రహమున’ అంటే సరి!
    *
    శైలజ గారూ,
    మంచి పూరణ వ్రాశారు. అభినందనలు.
    ‘తిక్కన + అతడు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘గద్యతిక్కన యని ఘనత గాంచె’ అందామా?
    ‘ప్రజ్ఞాశాలి’ అన్నప్పుడు గణదోషం. ప్రాజ్ఞుడు గద’ అంటే సరి.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ రెండు పద్యాలూ చాలా బాగున్నవి. అభినందనలు.
    ‘శుల్కము’ను ‘శులకము’ అన్నారు. అయినా ‘కన్యాశుల్కము’ను వ్రాసినది గురజాడవారు కదా!
    ‘తోడుగ + ఉండ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తోడుగ నుండ’ అనండి.
    ఎత్తుగీతి రెండవ పాదంలో యతి తప్పింది.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. ‘కందుకూరి వీరేశలింగము’నకు మీరిచ్చిన విశేషార్థం ప్రశంసనీయం. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. శంకరార్యా ! ధన్యవాదములు !

    ఇదొక సారి చూడండి
    *****
    ఖలుడు
    ఖలుడు : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
    khaluḍu
    [Skt.] n.

    A vile wretch, a sinner. నీచుడు.

    ఖలుఁడు : శ్రీహరి నిఘంటువు (రవ్వా శ్రీహరి)
    వి.
    మూర్ఖుఁడు.

    ఖలుఁడు : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
    n.

    an evil doer, a wicked man.

    ఖలుఁడు : తెలుగు నిఘంటువు (జి.ఎన్.రెడ్డి - ఆం.ప్ర. సాహిత్య అకాడమీ)
    సంస్కృత విశేష్యము

    1. దుర్జనుడు, నీచుడు. అధముడు.
    2. సూర్యుడు.

    రిప్లయితొలగించండి
  16. కందుకూరి వీరేశలింగము ఖలుడు కాదు ఘనుడని
    గొప్పగా చెప్పిన గుండు మధుసూదన్ గారికి
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి