17, నవంబర్ 2013, ఆదివారం

భారతరత్న సచిన్ టెండుల్కర్

    భారతమాత ముద్దుబిడ్డ సచిన్ టెండూల్కర్‍కు
భారతరత్న బిరుదు లభించిన సందర్భంలో

అక్షరాక్షతలు.
    బ్యాటు ఝళిపింప నరులకు భయము గల్గు
    పరుగు దీసిన శతకము బాది వదలు
    బంతి విసరిన నావలి యంతు జూచు
    సచిను భారత మాతకు సత్సుతుండు.

    విరులు మెల్లగా చల్లగా విరిసినట్లు
    వెండి వెన్నెల హాయిగా పండినట్లు
    సచిను నవ్విన మనసుకు సంతసమగు
    నతడు భారతరత్నమే యది నిజమ్ము.

    వీరుడవై క్రికెట్టునకు విస్తృత భాష్యము జెప్పి, బ్యాట్టుతో
    పోరుచు, వాడి బంతులను పూనిక వేయుచు, వైరి సోదరుల్
    'లే రితనిన్ జయింప నొరు లీభువి' నంచు వచించి మెచ్చుచున్
    పారగ భీరులై, భరత పావన ధాత్రికి వన్నె తెచ్చుచో
    లేరిక సాటి నీ కెవరు! లీలగ నైనను కాన రారులే!
    చేరియు నాటలో నెవరు చేరగ రాని మహోజ్జ్వల స్థితిన్
    నేరవు సుంత లౌక్యమును! నిర్మల మైన మనస్సు నెన్నడున్
    జారగ నీవు కీర్తి బల సంజనితంబగు పొంగు లోయలో!
    మీరిన బ్యాటు ఘంటమున మేలుగ దేశ క్రికెట్టు గాధ నిం
    పారగ నొంటిగా తిరగ వ్రాసిన లేఖకు డంచు మెచ్చెదన్!
    చోరుడ వంచు పల్కెదను సోదర మానసముల్ హరించుచో!
    భారత రత్నమా! సచిను! భారత కీర్తి మహత్పతాకమా!

రచన :
దువ్వూరి సుబ్బారావు (మిస్సన్న)

అభినందన

గౌరవనీయమౌ బిరుదు గాంచితి భారత రత్న భూషవై
వీరుల కెల్ల వీరునిగ వెల్గి క్రికెట్టను క్రీడలోన నా
పోరున బేటు పట్టునెడ భూరి పరాక్రమశాలి వౌచు నె
వ్వారును బంతి వేయునెడ బాగుగ బాదుచు పంపుచుండగా
నారులు నాల్గులౌ పరుగులై హడలందుచు నుండ బౌలరుల్
చేరితి వెన్నొ లక్ష్యముల ఛేదన చేయుచు క్రొత్త సీమలన్
లేరట నీకు సాటి యిల క్రీడకు ప్రాణము పోసితీవు నీ
తీరును గాంచి స్ఫూర్తి గొని తేజముతో వెలుగొందుచుండిరీ
ధారుణి నీ సమాశ్రితులు దైవముగా నిను గొల్చుచుండి నీ
పేరిదె మారుమ్రోగునట విశ్వమునందు క్రికెట్టు సీమలో
ధీరవరా! యశోధన నిధీ! చిరజీవితమందు గాంచుమా
భూరి జయోన్నతుల్ సచిను పుణ్యగుణాకర! విశ్వవందితా!  

రచన :
పండిత నేమాని సన్యాసి రావు

10 కామెంట్‌లు:

 1. భారత క్రికెట్టు ఆటగాడు సచిన్ టెండుల్కర్కు అభినందనలతో... కిడ్డు నాటి నుండి కిట్టుతో మొదలెట్టి
  యిల క్రికెట్టు నందు వెలుగు వెలిగి
  పరుగు లెట్టి పొందె భారత రత్నమ్ము
  యోగ్యతన్న నిదియె యువకు లార!

  రిప్లయితొలగించు
 2. మిస్సన్నగారూ !
  " మీరిన బ్యాటు ఘంటమున మేలుగ దేశ క్రికెట్టు గాధ నిం
  పారగ నొంటిగా తిరగ వ్రాసిన లేఖకు డంచు మెచ్చెదన్! "
  సిక్సర్ కొట్టినట్లు చెప్పారు. బాగుంది.
  సహదేవుడుగారూ ! బాగుంది.

  బాలును ' బ్యాటు ' బట్టె గద బాల్యమునుండి క్రికెట్టు క్రీడలో
  వేలుగ ' రన్సు' జేసె గద వేడుక మీరగ వేరొకండిలన్
  చాలడు చేయనట్లు మరిచాల ' రికార్డుల ' నెక్కి నిల్చెగా
  మేలుగ భారతీయులిక మెచ్చెను ' రత్నము గా సచిన్ ' యనెన్.

  రిప్లయితొలగించు
 3. సచిన్ క్రికెట్టు నుండి విశ్రాంతి తీసుకుంటున్నాననగానె క్రీజు, బాలు, బ్యాటుల మనోగతం...

  పరుగులు దీయ దీయ పయి పచ్చిగ పుండయె - నింక హాయిలే
  మెరుపుగ బాద బాద గను మిన్నుకు మన్నుకు నైతి - హాయికన్
  చురుకుగ నూపునూపు తరి చుక్కలు కాంపడె బంతికొట్ట - హాయ్
  మరియిక పండుగంచు మది మెచ్చెను క్రీజులు బాలు బ్యాటులే.

  రిప్లయితొలగించు
 4. సచిన్ క్రికెట్టు నుండి విశ్రాంతి తీసుకుంటున్నాననగానె క్రీజు, బాలు, బ్యాటుల మనోగతం...

  పరుగులు దీయ దీయ పయి పచ్చిగ పుండయె - నింక హాయిలే
  మెరుపుగ బాద బాద గను మిన్నుకు మన్నుకు నైతి - హాయికన్
  చురుకుగ నూపునూపు తరి చుక్కలు కన్పడె బంతికొట్ట - హాయ్
  మరియిక పండుగంచు మది మెచ్చెను క్రీజులు బాలు బ్యాటులే.

  రిప్లయితొలగించు
 5. శ్రీ మిస్సన్న గారికి శుభాశీస్సులు - శుభాభినందనలు. చక్కని మాలిక వ్రాసినారు. మీ స్ఫూర్తితో నాదొక చిన్న ప్రయత్నము:

  అభినందన:

  గౌరవనీయమౌ బిరుదు గాంచితి భారత రత్న భూషవై
  వీరుల కెల్ల వీరునిగ వెల్గి క్రికెట్టను క్రీడలోన నా
  పోరున బేటు పట్టునెడ భూరి పరాక్రమశాలి వౌచు నె
  వ్వారును బంతి వేయునెడ బాగుగ బాదుచు పంపుచుండగా
  నారులు నాల్గులౌ పరుగులై హడలందుచు నుండ బౌలరుల్
  చేరితి వెన్నొ లక్ష్యముల ఛేదన చేయుచు క్రొత్త సీమలన్
  లేరట నీకు సాటి యిల క్రీడకు ప్రాణము పోసితీవు నీ
  తీరును గాంచి స్ఫూర్తి గొని తేజముతో వెలుగొందుచుండిరీ
  ధారుణి నీ సమాశ్రితులు దైవముగా నిను గొల్చుచుండి నీ
  పేరిదె మారుమ్రోగునట విశ్వమునందు క్రికెట్టు సీమలో
  ధీరవరా! యశోధన నిధీ! చిరజీవితమందు గాంచుమా
  భూరి జయోన్నతుల్ సచిను పుణ్యగుణాకర! విశ్వవందితా!

  రిప్లయితొలగించు
 6. నేమాని పండితార్యా! మీ మార్గదర్శనమే! మీ ప్రశంస చాలా సంతోషాన్ని కలిగించింది.
  నాల్గులను, ఆరులను, పొలిమేరలను ప్రస్తావిస్తూ మీరు సచినునకు చేసిన ఆశీస్సులు అనుపమానం.

  రిప్లయితొలగించు
 7. గోలివారూ సచిను క్రీడా విన్యాసాలను, క్రీజు, బాలు, బ్యాటుల మనోగాతాలనూ అద్భుతంగా వర్ణించారు. అభినందనలు.

  రిప్లయితొలగించు
 8. మిస్సన్నగారూ ! ధన్యవాదములు.
  నేమానిగారూ !
  " బంతి వేయునెడ బాగుగ బాదుచు పంపుచుండగా
  నారులు నాల్గులౌ పరుగులై హడలందుచు నుండ బౌలరుల్ "
  ఆరులు నాల్గులౌ..ఓవరులోని ఆరుబంతులూ ఫొర్లైనట్లుగా ..బాగుంది..

  రిప్లయితొలగించు
 9. మిత్రులారా! శుభాశీస్సులు
  చక్కగా స్పందించిన శ్రీ కంది శంకరయ్య గారికి, శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి శ్రీ సహదేవుడు గారికి, శ్రీ మిస్సన్న గారికి అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించు