15, నవంబర్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం - 1235 (కమలాప్తుని రశ్మి సోఁకి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
కమలాప్తుని రశ్మి సోఁకి కలువలు విచ్చెన్.

36 కామెంట్‌లు:

  1. రమణీయపు వన మందున
    కమలాప్తుని రశ్మి సోకి కలువలు విచ్చెన్
    ప్రమదలు సంతస మొందగ
    హిమ వంతుడు సరస మాడె హేమంత మటన్

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    అ : అన్నగారు , యభ : యమభటులు
    ------------------------------------

    అ : ఏమొచ్చింది కర్మ !
    ఇక్కడ షిప్టు సిస్టంకూడా లేదా ?
    యభ : అంటే ?
    అ : అంటే, ఒక బాచ్ 8 గంటలు పనిచేస్తే ఆ తరువాత ఇంకో బాచ్ రావాలి !
    యభ : అదేం లేదు
    అ : పోనీ ఓటీ అయిన ఉందా ?
    యభ : అదేంట్రా ?
    అ : అంటే ఓవర్ టైమ్ ! ఎక్కువ గంటలు పనిచేస్తే యెక్కువ కూలి యివ్వాలి
    యభ : అదేం లేదు చస్తన్నాం ! వచ్చే పాపులు పుట్టలు పెరిగినట్టు, ఓ... పెరిగి పోతున్నారు
    అ : పాపులు పెరిగితే పనివాళ్ళ సంఖ్య కూడా పెంచాలి !
    యభ : ఏవిటి పెంచేది ? నేను త్రేతాయుగం నాటి నుంచి పంజేస్తున్నాను !
    అప్పుడెంతమంది పనివారో ఇప్పుడూ అంతే !
    పాపులు మాత్రం పదివేల రెట్లు పెరిగారు !
    అ : అన్యాయం ! అక్రమం ! మరి మీ కార్మిక సంఘం ఏం జేస్తోంది ?
    యభ : కార్మిక సంఘమా ?
    అ : మీకు సంఘం కూడా లేదా ?
    హవ్వ !
    ఎంత వెనకబడి ఉన్నారయ్యా !
    నిజంగా నరకంలోనే ఉన్నారు !
    మీలో సాంఘిక చైతన్యం లేదు !
    విప్లవ రక్తం లేదు !
    నరకలోక కార్మిక సోదరులారా !
    రండి !
    లేవండి !
    విప్లవ శంఖం పూరించండి !
    ఐక్య కార్మిక శక్తి నిరూపించండి !
    కాబట్టి కామ్రేడ్స్ ! నేం జెప్పేదేమిటంటే
    మీ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని నిరంకుశ వాదులు
    మిమ్మల్ని దోచుకుంటున్నారు !
    మీ చేత వెట్టిచాకిరీ చేయిస్తున్నారు !
    కాబట్టి కామ్రేడ్స్ ! నేం జెప్పేదేమిటంటే
    మీరందరూ ఏకం కావాలి !
    మీ హక్కులకై మీరు పోరాడాలి !
    సాంఘిక న్యాయం సాధించాలి !
    కాబట్టి కామ్రేడ్స్ ! నేం జెప్పేదేమిటంటే
    పదిమంది చెయ్యవలసిన పనిని ఒక్కరితో చేయించి
    మీ కార్మిక శక్తిని దోచుకుంటున్నారు !
    ఇదన్యాయం !
    కాబట్టి కామ్రేడ్స్ ! నేం జెప్పేదేమిటంటే
    మీరందరూ...మీరందరూ...మీరందరూ...మీరందరూ...
    ఏకం కావాలి !
    యభ : ఎట్లాగ ?
    అ : ఎట్లాగా ! అది నేంజెప్తాను !
    కాబట్టి కామ్రేడ్స్ ! నేం జెప్పేదేమిటంటే
    మీరంతా కలసి ఒక కార్మిక సంఘాన్ని స్థాపించు కోవాలి !
    యభ : అది కూడా నువ్వే చెయ్యాలి ! నువ్వే చెయ్యాలి !
    అ : ఆ... ! నేనే చేస్తాను ! ఇప్పుడే ముహూర్తం పెడతాను
    ఆ... ! నరకలోక కార్మిక సంఘం????????
    యభ : ----------------
    అ : జిందాబాద్ అనండయ్యా ! అందరూ గట్టిగ అరవండి
    నరకలోక కారిక సంఘం
    యభ : జిందాబాద్
    అ :నరకలోక కార్మిక సంఘం
    యభ : జిందాబాద్
    అ : ఆ ఆ చూచారా ! అప్పుడే మీలో విప్లవ చైతన్యం వచ్చింది !
    వేడి రక్తం ప్రవహిస్తోంది !
    విప్లవం ??????????????
    యభ : --------------------
    అ : అనండయ్యా ! ఐక్య కంఠంతో అరవండి వర్థిల్లాలి వర్థిల్లాలి అని
    విప్లవం
    యభ :వర్థిల్లాలి
    అ :విప్లవం
    యభ : వర్థిల్లాలి
    అ : కాబట్టి కామ్రేడ్స్ ! నేం జెప్పేదేమిటంటే
    మీ విప్లవ సంఘనికి మీరంతా కలసి ఒక నాయకుణ్ణెన్నుకోవాలి
    యభ : నువ్వే మా నాయకుడివి నువ్వే మా నాయకుడివి
    అ : విప్లవ కార్మిక నాయకుడు వీర కామ్రేడ్ సత్యం
    యభ : జిందాబాద్
    అ : వీర కామ్రేడ్ సత్యం
    యభ : జిందాబాద్
    అ : కాబట్టి కామ్రేడ్స్ ! నేం జెప్పేదేమిటంటే
    నరకలోక కార్మిక సంక్షేమం కోసం మనందరం యమగోల జెయ్యాలి !
    యభ : ఆ ఆ
    అ :న్యాయ సమ్మతమైన మన కనీస కోర్కెలు తీర్చే వరకూ
    మీ ఆందోళన యిలాగే సాగించాలి !
    యభ : కనీస కోర్కెలంటే ?
    అ : నేం జెప్తా , వినవయ్యా !
    రోజుకి 8 గంటలే పని చెయ్యాలి !
    పని పెరిగితే కార్మికుల సంఖ్య కూడా పెంచాలి !
    ఆడ పాపులను శిక్షించడానికి ఆడ భటులనే నియమించాలి !
    వారికి కడుపులొస్తే సెలవు లివ్వాలి
    వాళ్ళకు పుట్టిన పిల్లలకు యథాశక్తి ఇక్కడే యీ నరక లోకంలోనే
    ఉద్యోగాలివ్వాలి !
    యభ : ఇవన్నీ ఆయన ఒప్పుకుంటారా ?
    అ : ఒప్పుకోక పోతే సమ్మె చేస్తాం
    యభ : అంటే ?
    అ : అంటే , పని చెయ్యకుండా మొండికేస్తాం !
    యభ : పనిలోంచి తీసేస్తే ?
    అ : యీ పనెవడు చేస్తాడు ?
    యభ : ఇంకొకర్ని పెట్టుకుంటాడు !
    అ : వీల్లేదు !
    కాబట్టి కామ్రేడ్స్ ! నేం జెప్పేదేమిటంటే
    మన కార్మిక సంఘం పెర్మిషన్ లేకుండా
    బయటి వాళ్ళ నెవ్వరినీ పనిలోకి తీసుకోవడానికి వీల్లేదు !
    మనం పని చెయ్యం ! యింకొకర్ని చెయ్యనివ్వం !
    పననే దసలే జరగ నివ్వం !
    అప్పటికి గాని పాలకులు బుద్ధి తెచ్చుకొని కాళ్ళ బేరానికి రారు !
    కాబట్టి కామ్రేడ్స్ ! నేం జెప్పేదేమిటంటే
    ఐక్యకార్మిక సంఘటనకు అపజయమంటూ లేనే లేదు
    ఈ పద్ధతులన్నీ భూలోకంలో అవలంబించాం !
    కార్మిక విజయం సాధించాం !
    అభ్యుదయ పథంలో పురోగమించాం !
    నిరంకుశత్వం నిర్మూలించాం !
    కాబట్టి కామ్రేడ్స్ ! నేం జెప్పేదేమిటంటే
    ఏమీ లేదు !
    విప్లవం
    యభ : వర్థిల్లాలి
    అ : విప్లవం
    యభ :వర్థిల్లాలి
    అ : గట్టిగా అరవండి ! విప్లవం
    యభ : వర్థిల్లాలి

    ఈ విధంగా యమభటులలో స్ఫూర్తి రగిలించిన అన్నగారు :

    01)
    __________________________________

    యమలోకము నా సత్యం
    సమరానికి పురిగొలుపగ - శని సైనికులన్
    సమవర్తియె దిగి వచ్చెను !
    కమలాప్తుని రశ్మి సోఁకి - కలువలు విచ్చెన్ !
    __________________________________
    http://www.youtube.com/watch?v=T9BPZ_m74NE

    రిప్లయితొలగించండి
  3. కుముదము వికసించుట కని
    హిమ కరు డరు దెంచె ననగ హేలా రతుడై
    సమయము మించిన దనుకొని
    కమలాప్తుని రశ్మి సోకి కలువలు విచ్చెన్

    రిప్లయితొలగించండి
  4. మిత్రులారా! శుభాశీస్సులు.
    విజ్ఞాన శాస్త్రము ప్రకారము సూర్య కాంతియే చంద్రునిపై బడి రాత్రి భూమిపైకి వెన్నెలయై వచ్చును. ఆ రీతిగా నా పూరణను గమనించండి:

    కమలాప్తుని కిరణములే
    హిమకరుపై బడియు పిదప నిలకున్ జేరున్
    ప్రమదమున నటుల మారిన
    కమలాప్తుని రశ్మి సోకి కలువలు విచ్చెన్

    రిప్లయితొలగించండి
  5. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    నేడు శ్రీ వసంత కిషోర్ గారు బలుకులు అక్షర సత్యము,అందరి పూరణలూ అలరింప నున్నవి !

    నాపూరణ కర్ణాటక రాజకీయములపై
    =========*=================
    యమ పాలకుండు "యడ్డీ"
    సమూలముగ ద్రుంచి నాడు శాకుని కుండై
    సమరము నందు సమరథుడు,
    కమలాప్తుని రశ్మి సోకి కలువలు విచ్చెన్

    ( యడ్డీ= యడ్యురప్పు, శాకుని కుండై= పక్షుల వేటకాడు,సమరథుడు= మోడీ,కలువలు= బి జే పి నాయకులు )

    రిప్లయితొలగించండి
  6. రమణీయ కౌముదులొసఁగ
    హిమకరుడాకాశ మందు నిలవేలుపుగా
    క్రమమున్ దప్పక రేయిని
    కమలాప్తుని రశ్మి సోఁకి, కలువలు విచ్చెన్

    రిప్లయితొలగించండి
  7. వెన్నెల రావాలంటే చంద్రునికి సూర్య రశ్మి సోకాలికదా...నేనూ శ్రీ నేమాని వారి బాటలోనే...

    హేమంత ఋతువు నందున
    మామగు చంద్రుండు నింగి మసలుచు భువిపై
    ప్రేమగ కురిపెను వెన్నెల
    కమలాప్తుని రశ్మి సోఁకి - కలువలు విచ్చెన్

    రిప్లయితొలగించండి
  8. కుముదపు రేకుల కన్నుల
    రమణియు నక్కుంతి తలచి రప్పించు తరిన్
    కుముదములే కమలములై
    కమలాప్తుని రశ్మి సోఁకి, కలువలు విచ్చెన్

    రిప్లయితొలగించండి
  9. కమలములువిరిసె సరసున
    కమలాప్తుని రశ్మి సోకి , కలువలు విచ్చెన్
    కుముదే శునిగని ముదముగ
    మమకారముతో సుమములు మరిమరి మురిసెన్


    నవంబర్ 15, 2013 9:23 AM

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమానిగారికి పూజ్యగురుదేవులు
    శ౦కరయ్య గారికి వ౦దనములు
    కమలమ్ములు వికసి౦చును
    కమలాత్ముని రశ్మి సోకి.కలువలు విచ్చెన్
    హిమకరుడు తొంగలించగ
    అమలిన శృంగార మిటుల హవణిల్లుననన్

    రిప్లయితొలగించండి
  11. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ మొదటి పూరణ కొంత అయోమయాన్ని కలిగిస్తున్నది. సూర్యరశ్మికి కలువలు పూయడం ఏమిటి? నేమాని వారివలె శాస్త్రీయకారణాన్ని పేర్కొనలేదు. చివరి పాదంలోనూ అన్వయలోపం ఉన్నట్టుంది.
    మీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ ఓపికకు నమోవాకాలు. యూట్యూబ్‍లో చూస్తూ అంత పెద్ద సంభాషణను టైప్ చేశారా?
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    శాస్త్రీయమైన హేతువుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నేమాని వారి బాటలోనే నడిచినా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మామ + అగు’ సంధి లేదు. ‘మామ శశాంకుండు నింగి....’ అందామా?
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీరావు గారూ,
    విరుపుతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గురుదేవులకు వ౦దనములు
    ===========*============
    కమలజుడు వ్రాసె నిట్టుల
    కమలాప్తుని రశ్మి సోకి కలువలు విచ్చెన్!
    కమతము నందున కమతులు
    కమనీయపు కలువ దెచ్చె కమలిని జేయన్!

    ( కమలజుడు= శ్రీ శంకరయ్య గారు, కమతము = శంకరాభరణము, కమతులు= కవులు,కమలిని = తామర కొలను )

    రిప్లయితొలగించండి
  13. కమలమ్ములు వికసించెను
    కమలాప్తుని రశ్మి సోకి; కలువలు విచ్చెన్
    హిమకరు క్రీగంటి చలువ
    సుమశరు తూణీరమందు సొంపుగ నిలువన్

    రిప్లయితొలగించండి
  14. సోకినదోయి రశ్మి కడు సుందర వర్ణమునందు విచ్చెనీ
    సోకుల జల్లు చెంగలువ సూర్యుని నుండి గ్రహించి చంద్రుడే
    తాకిన నేటి ఱేయి నిల తారకగా ప్రభవింప నింగి దా
    ప్రాకెనొ నేల కిట్లెనెడు భ్రాంతి కనుంగవ నేడు పొందగా!

    రిప్లయితొలగించండి
  15. శ్రీ లక్ష్మీ దేవి గారు బహుబాగున్నది మీ పద్యము, సమస్య?

    రిప్లయితొలగించండి
  16. రమణునికైవేచె రమణి
    తమమున; వేకువనఱిగిన ధవునిఁగని నెఱిన్
    విమలముఖికనులు వెలిగెను;
    కమలాప్తుని రస్మిసోకి కలువలువిచ్చెన్

    రిప్లయితొలగించండి
  17. ధన్యవదాలు వరప్రసాద్ గారూ, సమస్యను కందంలో పూరణ చేయడం అయింది. కానీ ఈ భావాన్ని ఒక అందమైన వృత్తంలో చెప్దామని వ్రాసిన పద్యమిది అంతే.

    రిప్లయితొలగించండి
  18. కమలెను వాడెను గనుమా
    కమలాప్తుని రశ్మి సోకి కలువలు, విచ్చెన్
    కమలములు బాంధవుని గని
    కమలా! పూజింప దెమ్ము కమలను వేగన్.

    రిప్లయితొలగించండి
  19. వరప్రసాద్ గారూ,
    మీ తాజా పద్యం (పూరణ) బాగుంది. నన్ను బ్రహ్మను చేసారు. మన బ్లాగును కమతం (అనేకులు చేరి చేసే సేద్యం) చేసారు. కవిమిత్రులను కమతులు (సేవకులు)గా చేశారు.
    *
    పింగళి శశిధర్ గారూ,
    చాలాకాలానికి దర్శనమిచ్చారు. సంతోషం.
    విరుపుతో సుమశరతూణీరాన్ని పోలిన పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ఈ మధ్య ‘పద్యరచన’ శీర్షిక లేకపోవడంతో ఆ కోరికను ఇలా తీర్చుకున్నారనుకుంటాను. సంతోషం.
    మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    గూడ రఘురామ్ గారూ,
    మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ కడు రమ్యముగా నున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    మీరు ప్రాస నియమమును పాటించలేదు. ప్రాస అక్షరమును (2వ అక్షరమును) "మ" అని మాత్రమే పాటించుచో సరిపోదు. తొలి అక్షరము నాలుగు పాదములలోను ఒకే లాగున ఉండాలి. సమస్యలో తొలి అక్షరము లఘువు కావున 1, 2, 3 పాదములలో కూడ తొలి అక్షరమును లఘువునే వ్రాయాలి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నేమాని వారు చెప్పేదాక నేను గమనించనే లేదు. మరో ప్రయత్నం చేయండి.
    *
    పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి




  22. కమలెను రేకులు వాడగ
    కమలాప్తుని రశ్మి సోకి కలువలు;-విచ్చెన్
    కమలములు వాని గనుగొని
    భ్రమరము ఝమ్మని తిరుగుచు వ్రాలెను పైనన్.

    రిప్లయితొలగించండి
  23. కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. కుముదంబులు విచ్చుకొను 'య
    నిమేషనం'దున లిఖించు నిమిషము నందున్
    భ్రమపడి శశిఁ రవి జేయఁగ!
    కమలాప్తుని రశ్మి సోఁకి కలువలు విచ్చెన్!

    రిప్లయితొలగించండి
  25. రమణి యొకతె గీసెను చి
    త్రము నొక్కటి యందు దొరలె తప్పొక్కటి చి
    త్రమనుచు గనగా బళిరా!
    కమలాప్తుని రశ్మి సోకి కలువలు విచ్చెన్

    రిప్లయితొలగించండి
  26. గురువు గారూ,
    ధన్యురాలను.
    అందరినీ ప్రోత్సహించే విధంగా రోజూ ఇవ్వబడుతున్న కందము, ఆటవెలది, తేటగీతులతో బాటు వివిధములైన వృత్తములనూ అభ్యాసము చేయవలెనని నా అభిలాష.
    మీరు గాని, మీకు వీలు కాకున్నచో తెలిసిన వారెవరైననూ తగిన సూచనలు, సలహాలు ఇచ్చినచో స్వీకరించి కొంతైననూ పద్యవిద్య మెఱుగు పఱచుకొనవలెనని నా అభిమతము. ప్రోత్సహించుచున్న అందరికీ, అభ్యాసమునకు తగిన ఈ వాతావరణానికీ ఎంతోఋణపడి ఉన్నాను. నమస్కారములతో ---
    లక్ష్మీదేవి.

    రిప్లయితొలగించండి
  27. అమవస రాతిరి నభమున
    హిమధాముడు కానరాక నెందుకొ యేమో
    తమవాడని తెలవారగ
    కమలాప్తుని రశ్మి సోకి కలువలు విచ్చెన్.

    రిప్లయితొలగించండి
  28. గురువులకు ధన్య వాదంలు .సవరించిన పద్యం

    రమణీయ మైన దృశ్యము
    హిమకరుడు వెఱగు బడుచు హేలగ నవ్వెన్
    తమకమ్మున తొందరబడి
    కమలాప్తుని రశ్మి సోకి కలువలు విచ్చెన్

    రిప్లయితొలగించండి

  29. పండిత నేమానిగారికి పూజ్యగురుదేవులు
    శ౦కరయ్య గారికి వ౦దనములు

    శ్రీభాగవతుల కృష్ణారావు గారి పూరణ

    సమయమునకు శశి రాగా
    గమనించిన రవియు గ్రుంకు కాలమురాగా
    క్రమముగ తరుగుచు జను నా
    కమలాప్తుని రశ్మి సోకి కలువలు విచ్చెన్




    రిప్లయితొలగించండి
  30. సహదేవుడు గారూ,
    మీ animation పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ రెండవ పూరణ.. చిత్రకళావైచిత్రి చాలా బాగుంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణలోని భ్రాంతిమదంలాకారం అలరించింది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శ్రీభాగవతులు కృష్ణారావు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘రాగా’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ఆ రెండుపాదాలను ‘సమయమునకు శశి రాకను/గమనించిన రవియు గ్రుంకు కాలము వచ్చెన్’ అని సవరిస్తే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  31. శ్రీ నేమాని వారికి, మాస్టరుగారికి నమస్కారములు.
    కార్యాలయమునకు వెడలు హడావిడిలో ప్రాస నియమమున పొరపాటు జరిగినది.
    పద్యమును మొత్తము మార్చుచున్నాను...ధన్యవాదములు.

    సుమములు వేచెను సరసున
    కమనీయపు చందమామ గగనమునుండే
    గమనించి కురిపె వెన్నెల
    కమలాప్తుని రశ్మి సోఁకి - కలువలు విచ్చెన్ .

    రిప్లయితొలగించండి
  32. గోలి హనమచ్ఛాస్త్రి గారూ,
    సవరించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. కమలాప్తనేత్రఁడౌ హరి
    కమలాసనవైపు చూడ కలువలకన్నుల్
    ప్రముదమున విచ్చి రమ గనె.
    కమలాప్తుని రశ్మి సోఁకి కలువలు విచ్చెన్.

    రిప్లయితొలగించండి
  34. చింతా రామకృష్ణారావు గారూ,
    మనోహరమైన భావచిత్రాన్ని ఆవిష్కరించారు. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  35. రమణీయమైన పుడమిని
    కమలాప్తుని రశ్మి లేక కలవే సుమముల్?
    సమయము సందర్భమునన్
    కమలాప్తుని రశ్మి సోఁకి కలువలు విచ్చెన్

    రిప్లయితొలగించండి
  36. కమలమ్ములు విచ్చు భడవ!
    కమలాప్తుని రశ్మి సోఁకి; కలువలు విచ్చెన్
    కమలాప్తుడు క్రుంగి, పిదప
    విమలమ్మగు వెన్నెలొసగు వికసుండెసగన్

    రిప్లయితొలగించండి