6, నవంబర్ 2013, బుధవారం

సమస్యాపూరణం - 1227 (భరతునిఁ జంపె రాఘవుడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
భరతునిఁ జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చఁగన్.  
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు.

31 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ధరణి కాదర్శము - శ్రీరామ రాజ్యము :

    01)
    _______________________________________________

    భరతము పట్టె , శిష్టులను - బాధలు వెట్టెడి క్రూరకర్ములన్ ! - (తాటకిని)
    భరతము పట్టె , తాపసుల - వాజజ విఘ్నము సల్పువారలన్ - (సుబాహుని)
    భరతము పట్టె రాక్షసుల - భామిని శూర్పణ ఖండదండలౌ ! - (ఖర,దూషణాదులను)
    భరతునిఁ జంపె రాఘవుడు - భామినికై సురకోటి మెచ్చఁగన్ ! - (రావణుని)
    భరతుని గాచె , ప్రేమమున - భాను కులోద్భవ వంశ పుంగవున్ !
    భరతము నేలె ధర్మముగ - భార్యను త్యాగము జేసి యొంటిమై
    సరి యిక లే దనంగ సరి - సాటిది నేటికి రామరాజ్యమే !
    _______________________________________________
    భరతముపట్టు = శిక్షించు
    వాజజము = యాగము
    భరతుడు = ఆయుధధారిగా జీవించేవాడు = రావణుడు
    భరతుడు = రాముడి తమ్ముడు
    భరతము = భరత ఖండము

    రిప్లయితొలగించండి
  2. నిరతము కామ క్రోధముల నీమము లేకను ఘోర పాపముల్
    వరలుచు సుంద రాంగనల పాలిట భాగ్య మటంచు మోహమున్
    కరుగుచు భోగ లాలసను కాలుని మించి మదాంధు డైన యా
    భరతుని జంపె రాఘవుడు భామినికై సుర కోటి మెచ్చగన్
    భరతుడు = రావణుడు

    రిప్లయితొలగించండి
  3. వరమద గర్వితుండయిన పంక్తిముఖుం డమరారి, జానకిన్
    పరమ పతివ్రతన్ రథముపై గొనిపోవగ దొంగిలింవి, యా
    దురిత ధనాఢ్యు, రావణుని, దుర్మద మెల్లను డుల్చి, యా ప్రలో
    భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  4. నిరతము యోగి బృందముల నెంతయుఁ గీడ్పడఁ జేయు రాక్షసిన్
    దురమునఁ గూల్చి, ఱాయి నటఁ దోయజ లోచనయౌ యహల్యగన్
    జరణ వనేజ రేణువునఁ జక్క నొనర్చియుఁ, రావణాఖ్యు, దం
    భ రతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురకోటి మెచ్చఁగన్!

    రిప్లయితొలగించండి
  5. శ్రీ నేమాని వారి బాటలోనే...

    వరములబొంది రావణుడు బాధలవెట్టుఛు శిష్టకోటినే
    దురుతములెన్నొజేసి మరి దొంగిలి తెచ్చెను జానకీసతిన్
    హరిధరబుట్టి రామునిగ నాయసురున్ మద కాముకున్ ప్రలో
    భ రతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్.

    రిప్లయితొలగించండి
  6. ధరణిజ హర్తనున్, సుర వితాన నియంతను, దైత్యభూపునిన్,
    వరబల గర్వితున్, గిరిశ భక్తుని, నష్ట దిశేశ శత్రునిన్,
    వరముని బాధకున్, దనుజ వంశ వినాశకు, రావణాఖ్యు, లో
    భ రతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురకోటి మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

    శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

    తెలియక జేసిన తప్పులకు మన్నించ ప్రార్థన .
    కందములో
    ========*=========
    వర గర్వి యైన లంకా
    పుర భరతునిఁ జంపె రాఘవుఁడు భామినికై
    సురకోటి మెచ్చఁగను వా
    నర వీరులు రాము వెంట నడచిరి భక్తిన్ !
    (నర తతులు వరదుని తోడు నడచిరి భక్తిన్!)

    రిప్లయితొలగించండి
  8. వరమున తీవ్ర గర్వతర భావము భావమునందు నిల్వ ధీ
    వరులగు విష్ణు భక్తులనవారిత ఖడ్గ హతాశుఁ జేసి యా
    ధరణిజ మోషణంబనెడు దౌష్ట్యము సల్పిన రావణాఖ్య రం
    భ రతునిఁ జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగాన్.

    మోషణము = అపహరణము

    రిప్లయితొలగించండి
  9. గురువుగారికి నమస్కారములు.

    ఈ సమస్యను, సుమారు ఏబదికి పైగా అవధానములనొనర్చిన అవధాని శ్రీ రేవూరు అనంత పద్మనాభరావు గారిచే పూరింపబడినది. ఆ పూరణ మన కవిమిత్రుల కొఱకు......

    వరమునికోటి కెల్లరకు బాధలు గూర్చెడి నట్టి వారలన్
    దురమున ద్రుంచినాడు, మదితుష్టిని గూర్చె నహల్యభామకున్
    కరుణయొకింత లేక సతిగాసిలజేసెడి నీచవృత్తి రం
    భ రతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్.

    రిప్లయితొలగించండి
  10. మిత్రులు సంపత్ కుమార్ శాస్త్రిగారూ! గతములో నిదియే సమస్య యీయఁబడినది. ఆ సందర్భమున పూజ్యులు నేమానివారు "రంభ రతుఁడు" సాధుప్రయోగము కాదని యభ్యంతరముఁ దెలిపి, "రంభా రతుఁడు" సాధువగునని సూచించిరి.గణభంగ మగును గాన, దానిని లోభ రతుఁడని గాని, దంభ రతుఁడని గాని మార్చుకొనవలసి వచ్చినది.

    అవధాని శ్రీ రేవూరు అనంత పద్మనాభరావు గారి పూరణము నేనును జూచుట జరిగినది. దాని పాఠము కొద్ది భేదముతో...

    వర మునికోటి కెల్లరకు బాధలు గూర్చెడి రాక్షసాధమున్
    దురమున ద్రుంచినాడు; మది తుష్టిని గూర్చె నహల్యభామకున్;
    కరుణ యొకింత లేక సతి గాసిల జేసిన నీచుడైన రం
    భ రతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్!

    అసాధు ప్రయోగము నెవరు ప్రయోగించినను, దోషమే కదా! అన్యథా భావింపక, పరిశీలించఁగలరు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ గుండుమధుసూధన్ గారికి నమస్సులు.

    గతములో ఈ సమస్యను ఇచ్చినవిషయము నాకు తెలీదు. బహుశా ఆ రోజు నేను శంకరాభరణం ను వీక్షించక పోయి ఉండవచ్చు. అందువలననే ఈ విషయము నా దృష్టికి రాలేదు.

    మీరన్నట్లు తప్పు ఎవరుచేసినా తప్పే. రంభరతుడు అని అవధాని ప్రయోగించిన కారణంగా అది సరియగు ప్రయోగమని నేను కూడా ప్రయోగించినాను.

    దానిని మీరన్నట్లుగా "దంభరతుడు" అని సవరించుచున్నాను.

    విషయము తెల్పినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  12. సురులకు వెర్వనట్టి ఘన శూరుని, దానవ వంశ సంభవా
    సురవర నాధు, సాధ్వియగు సుందర నారిని జానకీ సతిన్
    చెరగొని నట్టి వాన్ని, తన చేటును తాగొని తెచ్చుకొన్న ధీ
    భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  13. పూజ్యులు శ్రీ పండిత నేమాని గురువర్యులకు,
    పూజ్యులు శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు నమస్సులు

    శంకరా భరణము బ్లాగులో పద్యములు వ్రాయడం కేవలము
    తెలియక చేయుచున్న తప్పులను తెలసి చేయుచున్న పొరపాట్లను
    సవరించుకొనే అవకాశము కలదనే ఉద్దేశ్యముతోనే. కావున తమరు
    తప్పకుండ తప్పులను గుర్తించి సూచించగలరని మనవి. స్వస్తి

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమానిగారికి
    పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి వందనముల
    దురితుడు రావణాసురుడు దుర్మదుడై చరియించి జానకిన్
    పరసతి లంక జేర్చియట బల్మిని పొందగ నెంచగా మదే
    భ రతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్
    ధర జను లెల్ల జీవనము ధర్మము తప్పక నాచరించగన్

    రిప్లయితొలగించండి
  15. వరమిడి పంపె రాముడు పాదుక లిచ్చియు రాజ్యమేలగన్
    సరగున మాయలేడి మనసైనది సీతకు చిక్కకుండినన్
    హరిగణ సేవితుండగుచు హద్దలు మీఱ దశాస్యు ద్రుంచెనే
    భరతునిఁ, జంపె రాఘవుఁడు, భామినికై సురకోటి మెచ్చగన్
    (క్రమాలంకారం)

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈమధ్య మతిమరుపు ఎక్కువై పోతున్నది. ఈనాటి సమస్యను 5-7-2013 నాడు ఇచ్చి ఉన్నాను. మరిచిపోయి మళ్ళీ ఇచ్చాను. మన్నించండి.
    అప్పుడప్పుడు మిత్రుల మధ్య భాషాసాహిత్య చర్చలు సుహృద్భావంగా కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగించండి
    కొన్ని దినాలుగా నేను తీరికలేని కార్యక్రమాల వల్ల పూరణలపై, వ్యాఖ్యలపై స్పందించలేకపోతున్నాను. మరొక నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి. మిత్త్రులు నన్ను క్షమించాలి.
    నేను ఎట్టి పరిస్థితిలో ఉన్నా ప్రతిరోజూ సమస్యను ఇస్తూనే ఉంటాను. పద్యరచన శీర్షికను నేను స్థిమితపడ్డాక (నాలుగైదు రోజుల తర్వాత) కొనసాగిస్తాను.
    అందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. Message from Pandit. Nemani

    మిత్రులారా! శుభాశీస్సులు

    నేను హైదరాబాదు కేంపు వచ్చినందున నాలుగు రోజులు ఇంతర్నెట్ చూడ్డము అవదు.

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  19. సురలను గెల్చినాడనని సొక్కెడు వైరిని రావణాసురున్
    వరములగర్వమందదొక భ్రాంతిని చావిక రాదటంచునున్
    తరుణిని మాయజేసి కడు ధైర్యముఁ జూపిన మూర్ఖుడైన దం
    భ రతునిఁ జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  20. మరణ భయమ్ములేక మద మత్సర మోహపు మత్తునందునన్
    పరసతి పొందుగోరి బలవంతుడ నంచు వివేక హీనుడై
    ధరణిజ నెత్తుకేగి భువి ధర్మము దప్పిన దుష్టుడైన లో
    భ రతుని జంపె రాఘవుడు భామినికై సుర కోటిమెచ్చగన్

    రిప్లయితొలగించండి
  21. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు నమస్కారములు,
    నేను పూరిస్తున్న పాత పూరణలను సమీక్షిస్తూ స్పందిస్తున్నందులకు కృతజ్ఞతలు.
    మీ స్పందన మాకు ప్రేరణ కలిగించుచున్నది.

    రిప్లయితొలగించండి
  23. శిరమున దాల్చి పొమ్మనుచు చిక్కులు దీర్చుచు ధర్మ వీధినిన్
    మురియుచు పాదుకల్ నిడుచు ముచ్చట మీరగ కౌగిలించి యా
    భరతునిఁ;...జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చఁగన్
    బరువగు శీర్షముల్ పదిని వంగక మోసిన రావణాసురున్ 😊

    రిప్లయితొలగించండి