12, నవంబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం - 1233 (ప్రాణ మొసఁగును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
ప్రాణ మొసఁగును మృత్యుదేవత జనులకు.

36 కామెంట్‌లు:

  1. మరణమొందినవారలు మరలబుట్టు
    దురట; మరుజనుమకదియే తొలియడుగు
    పాతతనువున(దీసి నవవపువందు
    ప్రాణమొసగును మృత్యుదేవత జనులకు !

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించ నున్నవి !

    పుణ్యపాప ఋణ విముక్త మగు వరకు :

    01)
    ___________________________________

    పూర్వజన్మ కృతము లైన - పుణ్య పాప
    సంచితము వల్ల గలుగును - జన్మ లెల్ల !
    పుణ్య పాప ఋణ విముక్త - ము లగు వరకు
    ప్రాణ మొసఁగును మృత్యుదే - వత జనులకు
    నంతవరకు లేదెవరికి - నాళుతనము
    ప్రాణముల దీయగా నిల - ప్రాణులకును !
    ___________________________________
    ఆళుతనము = అధికారము

    రిప్లయితొలగించండి
  3. సతీసావిత్రే మన కాదర్శం :

    02)
    ___________________________________

    పూర్వ గాథలే యాదర్శ - ము లను కొనిన;
    పట్టు బట్టి యముని వెంట - బడిన పడతి
    సాధ్వి సావిత్రి వలె నేగ - సాదరముగ
    ప్రాణ మొసఁగును మృత్యుదే - వత జనులకు !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  4. ఔను ! మార్కండేయుడు కూడా ఉన్నాడుగా :

    03)
    ___________________________________

    ప్రాణ భయమన్నదే లేదు - ప్రాణులకును
    బాధ దీర్చి మార్కండేయ - బాలు బ్రోచు
    పరమశివు నదె పూజింప - పరమ భక్తి
    ప్రాణ మొసఁగును మృత్యుదే - వత జనులకు !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  5. సమరానికి నేడే - ప్రారంభం
    యమరాజుకు మూడెను - ప్రారబ్దం
    అంటూ
    యమగోల సినిమాలోలా
    అన్నగారు మళ్ళీ పుట్టి సమ్మె జేయిస్తే :

    04)
    ___________________________________

    అన్న గారదె యమలోక - మందు జేరి
    సమ్మె జేయించి మూయించ - శని సదనము
    సమ్మె సమయాన సమసిన - సరకుగొనక
    ప్రాణ మొసఁగును మృత్యుదే - వత జనులకు !
    ___________________________________
    శని = యముడు

    రిప్లయితొలగించండి
  6. పాతాళభైరవిలో సంజీవిని తస్కరిస్తే :

    05)
    ___________________________________

    కోరి నేపాళమాంత్రికు - గుహను జేరి
    కుండ నున్నట్టి సంజీవి - దండుకొచ్చి
    శిరసు-పాదము దాకించ - తిరిగి మరల
    ప్రాణ మొసఁగును మృత్యుదే - వత జనులకు !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  7. అయ్యో ! అసలైన ఆంజనేయ స్వామిని మరచానే :

    06)
    ___________________________________

    ఆంజనేయుని వలె వెళ్ళి - యాకసమున
    కొండనున్నట్టి సంజీవి - క్షోణిజమును
    త్రుంచి స్పర్శించ నాసికా - తొలికలకును
    విగతజీవుల కెల్లనూ - వేడుకలర
    ప్రాణ మొసఁగును మృత్యుదే - వత జనులకు !
    ___________________________________
    క్షోణిజము = వృక్షము
    తొలికలు = రంధ్రములు

    రిప్లయితొలగించండి
  8. వాయువును స్తంభిస్తే ప్రాణాలు పోవు- వస్తాయి :
    బాలాంజనేయుడికి వచ్చాయి గదా :

    07)
    ___________________________________

    వాయుదేవుని స్మరియించి - వాని వలన
    వాయుస్తంభన జేయించ - సాయ మడిగి
    బ్రహ్మదేవుడు దిగివచ్చు - భయము దీర్చు !
    ప్రాణ మొసఁగును మృత్యుదే - వత జనులకు !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  9. సూర్యుడు లేక పోయినా - చచ్చి బ్రతకొచ్చు :

    08)
    ___________________________________

    క్రోధ, మావేశ , దుఖఃముల్ - కూడుకొనగ
    సుమతి వలె నాప , రథమును - సూర్య దేవు !
    ముగ్గురమ్మలు పతులతో - ముందు నిలచు !
    ప్రాణ మొసఁగును మృత్యుదే - వత జనులకు !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  10. బాలప్రహ్లాదుని వలె :

    09)
    ___________________________________

    సంతతము హరి నామమున్ - స్మరణ జేయ
    కత్తి ఖండింప జాలదు - నెత్తి నైన
    విషము ప్రాణముల్ హరియింప - వీలు పడదు
    కొండ పై నుండి పడ దోయ - వీడ మవని
    హస్తి ఘట్టన నిడలేదు - నస్తమయము
    పాము కరచిన నాగును - ప్రమయమైన
    నిప్పుకాల్చదు నిన్నింక - నిధన మవగ
    నీట ముంచిన నీకేమి - చేటు రాదు
    ప్రాణ మొసఁగును మృత్యుదే - వత జనులకు !
    __________________________________
    ప్రమయము = మరణము

    రిప్లయితొలగించండి
  11. జన్మమెత్తినఁ దప్పదు చావ కుండ
    మోక్ష సాధనా కార్యము ముగియు దనుక
    రాక పోకలు జీవుల లక్షణమ్ము
    ప్రాణ మొసఁగును మృత్యు దేవత జనులకు

    రిప్లయితొలగించండి
  12. జన్మ మిడి వ్రాసి నుదుటను పద్మభవుడు
    ప్రాణమొసగును, మృత్యుదేవత జనులకు
    ప్రాణమును దీయుచుండు జన్మాంతమందు
    నవ్విధుల మార్చ గల్గునే యెవ్వడేని?

    రిప్లయితొలగించండి

  13. ఒక్కరిద్దరికెట్టులో దక్కెగాని
    అందరడుగగ నా "రూలు " నతడు మార్చు
    తనదు ధర్మంబు దప్పుచు తప్పకెటుల
    ప్రాణ మొసఁగును మృత్యు దేవత జనులకు?

    రిప్లయితొలగించండి
  14. శుష్క దేహము బూర్తిగా శుధ్ధిజేసి
    కర్మ బంధమ్ములన్నియు కడిగి వేసి
    మారు తనువిచ్చి మమతతో మరల బ్రతుక
    ప్రాణ మొసగును మృత్యుదేవత జనులకు

    రిప్లయితొలగించండి
  15. సంచి తంబగు కర్మలు సడలు వరకు
    అంచితంబగు యోగము యబ్బు వరకు
    ముంచి తీయును జన్మలు ముగియు వరకు
    ప్రాణ మొసగును మృత్యుదేవత జనులకు

    రిప్లయితొలగించండి
  16. ప్రాణమపహరించ గలుగు ప్రబల వ్యాధి
    మేన జేరి యున్న భయము మీరు వేళ
    నెదుట నున్నదని తలచి బెదరి పోవు
    ప్రాణ మొసఁగును మృత్యుదేవత జనులకు

    రిప్లయితొలగించండి
  17. ప్రబల వ్యాధి లో ల గురువు అవుతున్నందున సవరణ చేయుచున్నాను.
    ప్రాణమపహరించ గలిగి ప్రబలు వ్యాధి

    రిప్లయితొలగించండి
  18. కవిమిత్రులకు నమస్కృతులు.
    నేను హైదరాబాదులోని ఒక వృద్ధాశ్రమంలో చేరాను. ఇంకా నా కంప్యూటర్ ను సెట్ చేసుకోలేదు. తరువాత వివరంగా కారణాలు తెలియజేస్తాను. ఈ విషయంలో కొందరు మిత్రుల సలహాలను పెడచెవిన బెట్టానని కోపం తెచ్చుకోకండి. నా కారణాలు నాకున్నవి. ఈలోగా దయచేసి పూరణల గుణదోషాలను పరస్పరం పరామర్శించుకోండి. అందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. గురువుగారికి ప్రణమిల్లుతూ..
    మీ మనసు ఎంత గాయపడిందో ....ఇంత నిర్ణయం తీసుకున్నారు..ఏది ఏమయినా మీరిలా ఆశ్రమంలో చేరడం బాధ కల్గిస్తోంది..

    రిప్లయితొలగించండి
  20. ప౦డిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్యగారికి వందనములు
    పుడమి కైడులోశిక్షకు గడువు ముగియ
    ముక్తి కలిగించి దేహిని పుణ్య గతికి
    జముని దర్బారులో హాజరు నొనర్ప
    ప్రాణ మొసగును మృత్యు దేవత జనులకు

    రిప్లయితొలగించండి
  21. జనన మరణము ధాత్రిలో జరుగు బ్రహ్మ
    ప్రాణ మొసగును; మృత్యు దేవత, జనులకు
    మిగుల భీతిగొలుపునట్టి, ప్రాణములను
    దీయు వెంటనే విధి వ్రాత తీరునరసి.

    రిప్లయితొలగించండి
  22. గురువుగారూ,
    భగవంతుడు మీకు ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ఇవ్వాలని కోరుతున్నా.

    రిప్లయితొలగించండి
  23. గురువుగారికి నమస్సులు తమరెంత బాధపడ్డారో? యింతటి నిర్ణయం తీసుకోవటానికి, తమరు మనశ్శాంతితో ఆరోగ్యంగా వుండాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  24. గురువుగారు నమస్సులు .
    కారణా లేవైన మీరు వృద్దాశ్రమములో చేరడం మాకు చాలా బాధగానుంది. సర్వదా మీరు ఆరోగ్యమును కాపాడుకోవాలని భగవంతుడు మీకు మనశ్శాంతి ప్రసాదించాలని ఆశిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  25. కవిమిత్రులకు నమస్కృతులు.
    నేను వృద్ధాశ్రమంలో చేరడం ఆవేశంలో, తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాదు. ఇంట్లో మనశ్శాంతి కరువయింది. తీర్చలేని అప్పులు ఒకవైపు, వచ్చే పెన్షన్ సరిపోక పడే అవస్థ మరోవైపు... ఇంట్లో ఆత్మీయమైన వాతావరణం లోపించింది. కోపాలూ, సణుగుడులూ, గొడవలూ... పట్టింపులకు పోకుండా సంతోషంగా గడుపుదామన్న ఆలోచనే లేదు మా కుటుంబ సభ్యుల్లో... ఎన్నో రోజులుగా ఆలోచించి చివరికి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎంతో మానసిక వేదనను అనుభవించాను. ఇప్పుడేదో ఆశ్రమంలో చేరి సుఖంగా ఉన్నానని కాదు. ఇప్పుడు ఏ టెన్షనూ, గొడవలూ లేవు. కాకుంటే ఆత్మీయులకు దూరంగా ఉన్నాను కదా అనే బాధ మాత్రం ఉంది.
    నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా మన బ్లాగు మాత్రం నిరాటంకంగా కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను.
    సాంత్వన వాక్యాలు తెలిపిన మిత్రులకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. గూడ రఘురామ్ గారూ,
    పునర్జన్మ ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణలు నవరత్నాలై తేజరిల్లుతున్నవి. అన్నీ బాగున్నవి. అభినందనలు.
    ఆరవ పూరణలో ‘వెళ్ళి, ఎల్లనూ’ అని వ్యావహారికాలను ప్రయోగించారు. ‘వలె నేగి, ఎల్లను’ అంటే సరి!
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ‘విధుల మార్చగల్గునే యెవ్వడేని’ ఎంత బాగా సెలవిచ్చారు. మంచి పూరణ. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నిజమే... అందరూ సతీ సావిత్రియో, మార్కండేయుడో కారు కదా! మంచి పూరణ. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి.. అభినందనలు.
    రెండవ పూరణలో ‘యోగము + అబ్బు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘యోగము లబ్బువరకు’ అందాం.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    టైపాటువల్ల ‘కైదు’ అన్నది ‘కైడు’ అయింది.
    *
    గండూరి లక్ష్మీనారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘మిగుల భీతి గొలుపునట్టి’ అన్నదానికి అన్వయం కుదిరినట్టు లేదు. అక్కడ ‘మిగుల భీతిని గొల్పుచు’ అందామా?

    రిప్లయితొలగించండి
  27. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    తాబేలు ఏమీ జేయకుండు కానీ ఎక్కువ కాలము బ్రతుకును - అల్లరి నరేశ్
    కోడి ఉదయముననే లేచి ఏమీ సాధించును- అల్లు ఆర్జున్
    అల్లరి నరేశ్ మరియు అల్లు ఆర్జున్ బలుకులకు ప్రేక్షకులు ఈలలు వేసి యుందురు. కానీ అవి మంచి కావు.
    ========*=============
    నిద్ర బద్దకమ్ము సిరులు నీ కొసంగు,
    పంది వలె దిను వారికి బలముపెరుగు,
    మెండు గాను వినుడనుచు మించు చున్న
    మూర్ఖుల బలుకలను విని ముదము నొంద
    ప్రాణ మొసగును మృత్యు దేవత జనులకు!

    వయసు ౧౪ అతని బైక్ ఖరీదు ౧౫ లక్షలు, బైక్ రేసింగ్ లో పారిశుద్య కూలీలను జంపినారట
    ==========*===============
    ధన మదము తోడ దిరిగెడి ఘనులకెల్ల,
    కూలి వారిని గూల్చిన శూలి సుతుల
    కర్మ ఫలము లెల్ల భువిని కరుగు వరకు
    ప్రాణ మొసగును, మృత్యు దేవత జనులకు
    ముక్తి నొసగుచు నుండును ముదముతోడ!

    రిప్లయితొలగించండి
  28. వరప్రసాద్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. శంకరయ్య గారికి నమస్కారం, మీకు కలిగిన బాధకు త్వరలో పరిష్కారం దొరకాలని కోరుకుంటూ ఆ శ్రీ మాతని కోరుతూ

    మనవడే మనవాడే అని తాత తెలుపలేదా,
    "అసలు కన్నా వడ్డీ మిన్న", వాడుక నీకు వర్తించదా,
    శారదాంబ తనయులను కరుణించవా వరదా,
    శాంతి సౌభాగ్యాల వరదా సజ్జనులకీయ్యరాదా ?

    రిప్లయితొలగించండి
  30. శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు, పండితనేమాని గురుదేవులకు నమస్కారములు...
    శ్రీ కంది శంకరయ్య గురుదేవులు ఎదుర్కొంటున్న బాధలకు చింతిస్తున్నాను.

    బ్రహ్మ వ్రాసిన వ్రాతను బడసి నట్టి
    మానవుల మెల్ల మహిలోన మనగవలయు
    కర్మ ఫలితమ్ము పూర్తిగా గాంచకుండ
    యాత్మ బలిదాన మొనరించు నపుడు విధిగ
    ప్రాణ మొసగును మృత్యుదేవత జనులకు.

    రిప్లయితొలగించండి
  31. నమస్కారములు
    ఏది ఏమైనా గురువు గారి నిర్ణయం చాలా బాధగా ఉంది. భగ వంతుడు వారికి అన్ని విధాలా మనశ్శాం తిని చేకూర్చాలని ప్రార్ధిం చడం తప్ప ఏం చేయ గలం ?

    పాత కమ్ముల వెలగట్టి బ్రతుకు మార్చి
    ప్రాణ మొసగును మృత్యు దేవతజనులకు
    రాజు పేదైన బాపడు రాజ్య మేల
    నుదుటి వ్రాతను వెను ద్రిప్పి బ్రతుకు నిడును

    రిప్లయితొలగించండి
  32. మద్దూరి ఆదిత్య గారూ,
    ధన్యవాదాలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. నా నిర్ణయం వెనుక భగవత్సంకల్పం ఉన్నదేమో...
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. మాస్టరు గారూ ! నమస్కారములు. తొందరపాటు నిర్ణయము కాదని విజ్ఞులైన మీరు చెప్పిన తరువాత మేమింకేమీ మాట్లాడలేము. యేదైనా " జరిగేవన్నీ మంచికని..అనుకోవడమే మనిషిపనీ.." అన్నట్లు కొన్ని సంఘటనలు యే మంచికోసమో..అప్పటి వరకూ మీకు మనశ్శాంతీ. ఆరోగ్యము ప్రసాదించాలని భగవంతుని కోరుకొనుచున్నాను.

    రిప్లయితొలగించండి
  34. శ్రీ శంకరయ్య గురువర్యులకు నమస్కారములు
    మీరన్నట్లు సమన్వయము కుదరలేదు . మీ సవరణకు ధన్యవాదములు.

    జనన మరణము ధాత్రిలో జరుగు బ్రహ్మ
    ప్రాణ మొసగును; మృత్యు దేవత జనులకు
    మిగుల భీతిగొల్పుచు ప్రాణములను
    దీయు వెంటనే విధి వ్రాత తీరునరసి.

    రిప్లయితొలగించండి
  35. జనన మరణము ధాత్రిలో జరుగు బ్రహ్మ
    ప్రాణ మొసగును; మృత్యు దేవత జనులకు
    మిగుల భీతిని గొల్పుచు ప్రాణములను
    దీయు వెంటనే విధి వ్రాత తీరునరసి.

    రిప్లయితొలగించండి
  36. శంకరార్యా ! ధన్యవాదములు !

    చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు ! అభినందనలు !
    కొద్దికాలం దూరంగా ఉంటే
    మనసులు తప్పకుండా దగ్గరౌతాయి !

    ":అనుకున్నామని - జరగవు అన్నీ
    అనుకోలేదని - ఆగవు కొన్ని
    జరిగేవన్నీ మంచికనీ
    అనుకోవడమే - మనిషి పని "

    అన్నారు గదా మనసుకవి ఆత్రేయ గారు !

    ఇప్పుడైనా మనఃశ్శాంతి చిక్కితే అదే పదివేలు !



    రిప్లయితొలగించండి