14, నవంబర్ 2013, గురువారం

దత్తపది - 34 (వల)

కవిమిత్రులారా!
"వల"
పై శబ్దాన్ని ప్రతి పాదాదిలో నిల్పుతూ
శకుంతలా దుష్యంతుల ప్రణయవృత్తాంతాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

42 కామెంట్‌లు:

 1. వలరా జను దుష్యంతుని
  వలపున శకుంతల జిక్కి వాపోయెనుగా
  వలపుల గాలము విసిరెడి
  వల రాజుల నమ్మ వలదు వాసవు డైనన్

  రిప్లయితొలగించు

 2. అక్కయ్యగారు మొత్తానికి "మగమహారాజు" ల మీద బాణం సంధించారు. మరి నా సమాధానం:
  వలదను వనితామణినే
  వలచిన దుష్యంతుడు తదుపరి వాపోయెన్
  వలవిసరుట లేదు కదా
  వలపుల పూబోడి నాకు వరుస కలుపుచున్!

  రిప్లయితొలగించు
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  శకుంతలా దుష్యంతుల ప్రణయ వృత్తాంతం :

  01)
  ____________________________________

  వలతిని జూచిన భూపతి
  వలపుల జిందించి పిదప - వలకేలిచ్చెన్ !
  వలబెట్ట నృపతి సదమున
  వలవలబోయెను వనితట - వ్యాకుల చిత్తై !
  ____________________________________
  వలతి = వనిత = స్త్రీ
  వలకేలిచ్చెన్ = దక్షిణ హస్తమునిచ్చెను(పాణిగ్రహణము)
  వలబెట్టు = మోసము జేయు
  సదము = సభ
  వలవలబోవు = ఏడ్చు

  రిప్లయితొలగించు
 4. సోదరులు మన తెలుగు గారి సమాధానం బాగుంది కానీ

  వలపుల చెలి పలికిన దని
  వల జిక్కిన దుష్యం తుడు మతి భ్రమ ణముచే
  వల పన్నకు నిన్నెరుగను
  వల దంచును పరుష మాడి వాదించె నుగా

  రిప్లయితొలగించు
 5. వలచెను తా దుష్యంతుడు
  వలతి శకుంతలను జూచి వ్యాలోలుండై
  వలలోన జిక్కి రిరువురు
  వలమురి తాలుపు తనయుని బాణము మహిమన్

  రిప్లయితొలగించు
 6. వలరాజున్ దలపించు సుందరుడు భాస్వత్కీర్తి యా సీమలో
  వలజన్ గాంచి శకుంతలన్ హృదయ దీవ్యత్పద్మ మొప్పారగన్
  వలపుల్ నిండగ జేర్చి కౌగిటను సద్భావాన దుష్యంతుడా
  వలతిన్ దేల్చె మనోజ లీలల రస ప్రాశస్త్య మేపారగన్

  రిప్లయితొలగించు
 7. కవిమిత్రులందరూ చక్కగా ' వల ' లు విసురు తున్నారు..అభినందనలు.

  రిప్లయితొలగించు
 8. అక్కయ్యా,
  మీ రెండో పద్యము చాలా బాగుంది. కానీ రెండో పాదములో గణభంగము జరిగినట్టుంది.

  రిప్లయితొలగించు
 9. వలచినదని దుష్యంతుడు
  వలపించి పిదప వలదన వాపోయెను, నా
  వలగనెను శకుంతల భూ
  వలయంబును నేలు భరతు, భర్తయె మెచ్చన్.

  రిప్లయితొలగించు
 10. వలరాణి యనుచు కన్యను
  వలచిన వాడై మురిపెపు పలుకుల పలికెన్,
  వలపుల పులకాంకితయై
  వలదనుటను మాని చేరె వనితయె భ్రమలో.

  రిప్లయితొలగించు
 11. అందరూ పద్యాలను అందంగా పొదుగుతున్నారు. అభినందనలు.
  కానీ ఇక్కడ ప్రణయవృత్తాంతము మాత్రమే గురువుగారు అడిగినారని నా భావన.
  మిత్రులు వలలో జిక్కకుండా , వాపోకుండా పూరణలు చేయమని మనవి.
  శాస్త్రి గారూ, వలయం వాడాలని అనుకొని వాడలేకపోయినాను. మీరు బాగా ఉపయోగించినారు.

  రిప్లయితొలగించు
 12. లక్ష్మీదేవి గారూ ! ధన్యవాదములు.

  వలచితి రాజా! నాన్నా
  వల వెళ్ళెను లేడననగ పట్టెను చేయిన్
  వల వల యేడ్చె శకుంతల
  వలదని దుష్యంతుడనగ పదిమందెదుటన్.

  రిప్లయితొలగించు
 13. వల రాజు తూపు సోకగ
  వలపున శకుంతల కరమున్ బట్టియు నొకటై
  వలతికి దుష్యంతుడొసఁగె
  వలపుల పంటగ జగతికి భరతున్ శూరున్!

  రిప్లయితొలగించు
 14. నా పద్యంలో చిన్న సవరణ :
  ‘ వ్యాలోలుండై' కి బదులు ‘ వ్యామోహమునన్ ' అని చదువుకొన వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించు
 15. వలచి వలపించుకున్న శకుంతలా దుష్యంతుల ప్రణయ వృత్తాంతం విషయంగా మనోహరమైన పద్యాలను వ్రాస్తున్న కవిమిత్రులకు ధన్యవాదాలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
  మొదటి పద్యం రెండవ పాదంలో ‘శకుంత’ (సరిగణంగా జగణం) గణదోషం. ఆ పాదాన్ని ‘వలపు శకుంతల దలంచి వాపోయెనుగా" అందాం.
  రెండవ పద్యం రెండవ పాదంలో గణ,యతి దోషాలు రెండూ సంభవించాయి. సవరణకు లొంగనంటున్నది :-)
  *
  చంద్రశేఖర్ గారూ,
  అందమైన పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘వనిత + అట, చిత్త + ఐ’ అన్నప్పుడు సంధి లేదు. ఆ పాదాన్ని ‘వలవలబోయెను వనితయె వ్యాకులహృదియై" అందామా?
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  భాస్వత్కీర్తిని సిద్ధింపజేసే మనోజ్ఞమైన పద్యాన్ని వ్రాసారు. అభినందనలు, ధన్యవాదాలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పద్యంలో ‘వెళ్ళెను’ అని వ్యావహారిక ప్రయోగం. ‘లేడని + అనగ, మంది + ఎదుటన్’ అన్నప్పుడు సంధి లేదు. మీ పద్యానికి నా సవరణ....
  వలచితి రాజా! నాన్నా
  వల కేగెను లేడనంగ పట్టెను చేయిన్
  వల వల యేడ్చె శకుంతల
  వలదని దుష్యంతుడనగ పదుగురి యెదుటన్.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మురిపెపు పలుకుల మురిపెపు పలుకుల మీ పద్యం అందంగా ఉంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  రెండవ పాదంలో (శకుంత - జగణం) గణదోషం. ఆ పాదాన్ని ‘వలచి శకుంతల కరమును బట్టియు నొకటై’ అందాం.

  రిప్లయితొలగించు
 16. వలచి శకుంతల తా భూ
  వలయంబునునేలు రాజు వద్దకుజేరెన్
  వలరాజు పొదల జేరుచు
  వలపించగ ప్రియముజెంది పరిణయమాడెన్.

  రిప్లయితొలగించు
 17. మాస్టరుగారూ ! ధన్యవాదములు.
  మీసవరణ బాగుంది...

  వలచితి రాజా! నాన్నా
  వల కేగెను లేడనంగ పట్టెను చేయిన్
  వల వల యేడ్చె శకుంతల
  వలదని దుష్యంతుడనగ పదుగురి యెదుటన్.

  రిప్లయితొలగించు
 18. గురువుగారూ, ధన్యవాదములు.

  కమల విలసితము -

  వలపు పిలుపు మగువ వినిన తోడన్
  వలదనక ప్రియుని వలచిన తీ,రా
  వలపు ప్రియమగును వనితకు; ఱేడా
  వలపును మఱువగ వగపులు నొచ్చున్.

  రిప్లయితొలగించు
 19. వలచిన వాడే మరువగ
  వలపును గురుతులనుజూపి వలవల యేడ్చెన్
  వలతిశకుంతల కలతల
  వలలో జిక్కెను చివరికి వలపే గెలిచెన్

  రిప్లయితొలగించు
 20. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ మూడవ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ కమలవికసిత విశేషవృత్తం చాలా బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  ఈ ‘పోకస్’ ఎవరో కొత్త మిత్రులు బ్లాగుకు పరిచయ మయ్యారని సంబరపడ్డాను. మీరేనా?
  వలపును గెలిపించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 21. వలపుల బాణ తుంపరలవారితమై వసురాజు పంపనా
  వల విడలేకపోగ తనవారలగాంచక భీతిచెంది క్రే
  వలగల గుట్టకేగతనిఁ బాయగలేక పరాజయమ్ముచే
  నిలువ, లతాంగిన్ గదిసి నెచ్చెలి నీవనె ప్రేమమూర్తియై.

  రిప్లయితొలగించు
 22. ధన్యవాదములు గురువుగారు,..
  ఫోకస్ నాదే అంటే మా వారిది....దత్తపది అంశము చూడటం, వ్రాయటం నాకు ఇదే మొదటిసారి..

  రిప్లయితొలగించు
 23. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పద్యం ధారాశుద్ధితో మనోహరంగా ఉంది. అభినందనలు.
  దుష్యంతునకు వసురాజు అన్న పేరుందా? నాకు తెలియదు.
  మూడవ పాదంలో ‘ఏగి + అతని’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘ఏగి ప్రియు బాయగలేక’ అందామా?
  *
  శైలజ గారూ,
  మొదటి ప్రయత్నంలోనే సత్ఫలితాన్ని సాధించారు. సంతోషం.

  రిప్లయితొలగించు
 24. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ! శుభాశీస్సులు.

  మీ పద్యమును చూచితిని. అభినందనలు. కొన్ని సవరణలు కావాలి.
  1. బాణ తుంపరలు అనే సమాసము సాధువు కాదు.
  2. 4వ పాదమును "వల" అను అక్షరములతో ప్రారంబించ లేదు.
  3. 4వ పాదములో గణభంగము కలదు.
  4. శకుంతలా దుష్యంతుల పేళ్ళు పద్యములో లేవు కాని వసురాజు పేరు ఉన్నది.
  స్వస్తి.

  రిప్లయితొలగించు
 25. శ్రీ కంది గురువర్యులకు మరియు శ్రీ నేమాని పండిత వర్యులకు నమస్కారములు.

  వసురాజు అంటే ధనమునకు అధిపతి ( దుష్యంతుడు రాజవడము చేత ) అనే అర్థములో ప్రయోగించినాను. ఒప్పో తప్పో తెలీదు.

  బాణతుంపరలు దుష్టసమాసము అనుకుంటాను. ఇంకా ఈ దుష్టసమాసములు కుసంధుల గురించి సరియైన అవగాహన రావడములేదు.

  4 వ పాదములో లతాంగినిన్ అని ఉండాలి లతాంగిన్ అని టైపాటు.

  ఇకపోతే, వల అనునది పాదాదిని అనే నియమము చూసుకొనలేదు. క్షమించాలి.

  వీలైతే ఇంకొక ప్రయత్నము చేస్తానండీ.

  తప్పులు చూపినందుకు / సవరించినందుకు శతథా ధన్యవాదములండీ.

  రిప్లయితొలగించు
 26. గురువుగారూ,

  మరియొక చిన్న ప్రయత్నము...........

  నాకే కొంచము అనుమానంగా ఉంది. కానీ.......

  వలపుల ప్రేమభావనలభంగములై చెలువొందుచుండ క్రే
  వలగల శారికా శుకపు భాషలకద్దముఁ బట్టు రీతి తాఁ
  వలచినదీ శకుంతలయె భవ్యవిరాజిత కీర్తిమంతునిన్
  వలసిన కామ్యకంబునకు వారధియై కనుపట్టు ఱేనినిన్.

  రిప్లయితొలగించు
 27. అవుబు కదా ! సోదరి లక్ష్మీ దేవిగారు చెప్పినట్టు గణ దోషాన్ని గురువులు సరిజేసారు 'ఇక రెండవ పద్యంలో మూడవ పాదం గురువు గారికే లొంగ లేదంటే.....ఇక నేననగా ఎంత ?

  రిప్లయితొలగించు
 28. శంకరయ్య గురుదేవులుగారికి వందనములు
  శ్రీభాగవతుల కృష్ణారావు గారి పూరణ

  వలచి వచ్చిన దుష్యంతవర్యుని గని
  వలపు గొన్న శకుంతల వశ్య యవగ
  వలపు మరచిన రాజును తలచి తలచి
  వలవలా నశ్రువుల గార్చె కలవరమున

  రిప్లయితొలగించు
 29. శంకరయ్య గురుదేవులుగారికి వందనములు

  వలచె తొలి చూపులో శకుంతలను ఱేడు

  వలయు గాంధర్వ విధిని వైవాహికమ్ము

  వలన పుత్రుడు గల్గ నెవ్వతెవు నీవు

  వలజ? నెరుగనటంచును పలికె సభను

  రిప్లయితొలగించు
 30. సవరించిన రెండవ పాదము

  వలపున చెలిపలి కినదని
  వలయం బునజిక్కి మరచె వసుధా ధిపుడై
  వల పన్నకు నిన్నెరుగను
  వలదంచును పరుష మాడి వాదించెను గా

  రిప్లయితొలగించు
 31. దారితప్పి మున్యాశ్రమములజేరిన దుష్యంతుడు, అచట ఆడుకొనుచున్న శకుంతలను జూచెను, ఆమెయునాతనింజూచెను:

  వలపులు వెల్లువలయెను కు
  వలయాక్షింగనఁగువలయవల్లభుని మదిన్;
  "వలరాజు కవలయా" యని
  వలతి శకుంతలయునచలవలెనిలిచెనటన్||

  అటులనిలిచిన శకుంతల తనలోతాను యిటులనుకొనెను:

  వలచినవాడుసన్నిదికి వచ్చెను! ఓమది! యేలనీవు వ
  ల్వలబడుచుంటివిప్పుడిటఁవారికిఁసమ్మతమౌనొ నీవుకే
  వలమొక ఖాత్రవాసివి నృపాలుడతండు! మహేశ్వరీ! జగ
  ద్వలయమునేలు గౌరి! ననుఁబాపవెకోరికఁదీర్చి దయన్||

  ఆమెయిటులుండగ ఆమెసంకోచము,సమ్మతీ తెలియని దుష్యంతమహారాజు యిటులనెను:

  వలతీ! యీనెలనేలుభూపతిని! నీవయ్యరముల్జూచి నీ
  వలపుంజిక్కితి నన్నిటన్ తడుపునీవాత్సల్యదృక్ధారలన్
  వలరాజైననునాకుసాటియగునే వైముఖ్యమున్ పొందగా
  వలదింకన్ నినుజేతుపట్టమహిషిన్ వాగ్దానమున్ జేతునే||

  సంతోషముగా వారిగాంధర్వవివాహము జేసికొనిరి

  రిప్లయితొలగించు
 32. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ రెండవ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీరావు గారూ,
  మీ ద్వారా శ్రీభాగవతుల కృష్ణారావు గారు బ్లాగుకు పరిచయం కావడం సంతోషాన్ని కలిగించింది. వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.
  వారి పూరణ బాగుంది. నా అభినందనలను తెలియజేయండి.
  కాకుంటే ‘వలవలా నశ్రువులు’ అన్నదే దోషం. ఆ పాదాన్ని ‘వలవల విలపించెను మించు కలవరమున’ అందాం.
  ఇక మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  సవరించిన పాదంతో మీ పద్యం చక్కగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 33. 3వ పాద్యము 1వ పాదములో దుష్యంతుడు భావావేశములో "వయ్యారము" నకు బదులుగా "వయ్యరమ"ని తప్పుగా పలికాడు..
  అటులనే శకుంతల 2వ పద్యము నాల్గవ పాదములో: అమ్మవారిని "కోరిక దీర్చవేదయన్" అనబోయి ఒక అక్షరము తక్కువజెప్పినది
  పాపం వారి ఆత్రమునర్ధము జేసుకొని మన్నించ ప్రార్ధన

  రిప్లయితొలగించు
 34. గూడ రఘురామ్ గారూ,
  అబ్బో! ఆశ్చర్య మాశ్చర్యము...
  ఖండికా రూపంలో మూడు పద్యాలు. అవి కూడా దత్తపదిని సమర్థంగా పాటిస్తూ. చాలా బాగున్నవి. అభినందనలు.
  రెండవ పద్యంలో ‘వచ్చెను ఓ మది’ అని విసంధిగా వ్రాసారు. అక్కడ ‘వచ్చెను; నా మది’ అనవచ్చు. ‘దయన్’ అన్నచోట గణదోషం. అక్కడ ‘సత్కృపన్’ అంటే సరి!
  మూడవ పద్యంలో ‘ఈ నెల నేలు’....?

  రిప్లయితొలగించు
 35. రఘురామ్ గారూ,
  ‘వయ్యరము’ వయ్యారంగా నా దృష్టిలో పడకుండా తప్పించుకున్నది.
  ‘తీర్చవే దయన్’ ... బాగుంది.

  రిప్లయితొలగించు
 36. నేను ఆ దొషమును "దీర్చవే దయన్" అని మార్చాను.. మీ "సత్కృపన్" ఇంకా బాగుంది. అలాగేమార్చుకుంటాను.
  ఇంకా 3వ పద్యములో నెల అంటే చోటని.. ఈ ప్ర్రాంతమునకు నేను రాజునని చెప్ప దలచుకున్నాను.. "ఈ ధరనేలు" అని మార్చుకుందాము
  మీ సూచనలకు ధన్యవాదాలు

  రిప్లయితొలగించు
 37. వలచెను దుశ్యంతుండా
  వలజ శకుంతలను కణ్వ వాసములోనన్
  వలవలమని యేడ్చెను సతి
  వలదనుకొన్న తన భర్త వలపును బొందన్

  రిప్లయితొలగించు
 38. బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించు

 39. వలపుల్ పొంగెను వారి డెందముల పర్వం బాయె నా సీమకున్
  వలరే డంతట పంచ బాణములతో బాధించె నా యిర్వురన్
  'వలదే చింతయు వత్తు వేగమె సఖీ!' వారించె దుష్యంతు డా
  వలతిన్, దుఃఖిత, నా శకుంతలను పోవం గోరి వీడ్కొల్పుగా.

  రిప్లయితొలగించు
 40. మిస్సన్న గారూ,
  మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.

  రిప్లయితొలగించు
 41. శంకరయ్య గురుదేవులుగారికి వందనములు
  ==========*==============
  వలపుల యలలకు జిక్కిన
  వలపుల రాణి, వనమున వివాహము జరిగెన్
  వలకేలు బట్టి నడువగ
  వలరాయుడు నొడినొరగె వలజ ముదమునన్!
  ===========*====================
  వలరాయుడొసగె ముద్రిక
  వలజకు నపుడు వరములిడి వలసరి యయ్యెన్
  వలజ మరులుగొని విడువగ
  జలమున ముద్రిక వలయుడు ఝకటము లాడెన్
  =================*=============
  వలయుని బలుకులను వినిన
  వలజ వివరమును దెలుపుచు వలవల యేడ్చెన్
  వలయకు జిక్కిన ముద్రిక
  వలయుడు గని వెదకె నంత వలజ పదము నన్!

  (వలజ = శకుంతల, వలరాయుడు= దుష్యంతుడు)

  రిప్లయితొలగించు
 42. వరప్రసాద్ గారూ,
  మీ దత్తపది పూరణను ఆలస్యంగా చూశాను. మన్నించాలి.
  మీ మూడు పద్యాల ఖండిక కా‘వల’సినంత సంతోషాన్నిచ్చింది. చాలా బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు