7, నవంబర్ 2013, గురువారం

సమస్యాపూరణం - 1228 (కర్ణుఁడు సుయోధనుని జంపె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
కర్ణుఁడు సుయోధనుని జంపెఁ గదనమందు.

13 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    రారాజు చావుకు ప్రత్యక్ష కారణం భీముడైనా
    పరోక్ష కారణం కర్ణుడూ - వాని స్నేహమూనూ !
    అసలు కర్ణుడే లేకపోతే యుద్ధమూ లేదు
    భారతమూ లేదు ! ఏమంటారు ?

    01)
    ___________________________________

    కవ్వడిని జంపు వాడిల - కర్ణు డనుచు
    కండకావర మది హెచ్చ - దుండగీడు
    కరుణ లేకయె సభ లోన - కాంత జూచి
    కరము , తొడజూపి యామెకు - కన్ను గొట్టి
    కదనరంగము , భీముడు - గదను మోద
    కడకు జచ్చుట కేమిటి - కారణమ్ము ?
    కర్ణుడే లేని భారతం - గలదె కనగ ?
    కావున నిటుల జరిగెను - గనుక, నిజము
    కర్ణుఁడు సుయోధనుని జంపెఁ - గదన మందు !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  2. అందరికీ తెలిసిందే గద !
    అర్జునుని చేతిలో కర్ణుడు
    భీముని చేతిలో సుయోధనుడు :

    02)
    ___________________________________

    కుంతి కొమరుడు పార్థుడు - పంతమూని
    సుంత దయలేక , చంపిన - నంతమాయె
    కర్ణుఁడు ! సుయోధనుని జంపెఁ - గదన మందు
    ఘోర దుర్వార గుదియా ప్ర - హారములను
    భీము డొనరించి తొడలపై - భీకరముగ !
    ___________________________________
    గుదియ = గద

    రిప్లయితొలగించండి
  3. కర్ణుడు బ్రతికి ఉన్నంత వరకు దుర్యోధనుని భీముడు యేమీ చేయలేడు...

    భీమసేనుడు మడుగున భీరువగుచు
    దాగియున్నట్టి వానిని దరికి బిలిచె
    తోడు నీడగ మెలిగిన వాడు లేడు
    కర్ణుఁడు, సుయోధనుని జంపెఁ గదనమందు.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    కుంతి విన్నపమును విని కర్ణుడు రేపటి దినము ఏమి చేయునో యన్న సంసయమున నిద్రించగ దుశ్శాసనుడు
    =============*===========
    పలుక వడివడిగను పరి-వార మిట్లు
    కర్ణుఁడు సుయోధనుని జంపెఁ-గదనమందు
    ననుచు దుశ్శాసనుండంత -గనులు దెరచి
    స్వప్నమును గంటి ననుచును- సంతసించె !

    రిప్లయితొలగించండి
  5. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    కుంతి విన్నపమును విని కర్ణుడు రేపటి దినము ఏమి చేయునో యన్న సంసయమున నిద్రించగ కర్ణుని భార్య

    =============*===========
    తల్లి విన్నపముల కెల్ల -తల్ల డిల్లి
    సోదరుల జెంత జేరగ -సొగసు గాను
    కర్ణుఁడు సుయోధనుని జంపెఁ గదనమందు
    ననుచు స్వప్నము గని నామె -గనులు దెరచె

    రిప్లయితొలగించండి
  6. పాండు తనయుడు పార్ధుడు ప్రతిన తీర
    అన్న నెరుగక జంపగ నంతమాయె
    కర్ణుడు ,సుయోధనుని జంపె గదనమందు
    భీమ సేనుడు గదతోడ భీకరముగ

    రిప్లయితొలగించండి
  7. మడుగు యడుగున దాగిన మానధనుని
    భీకరమ్ముగ బిలిచెను భీము డపుడు
    హితుడు హతమారె గావగ ఇంక రాడు
    కర్ణుడు ,సుయోధనుని జంపె గదనమందు

    రిప్లయితొలగించండి
  8. కుంతి సూర్యుల పుత్రుడు కువలయాక్షి !
    కర్ణుడు, సుయోధనుని జంపె గదన మందు
    భీమసేనుడు గదతోడ భీకరముగ
    కొట్టి దొడ మీద గిలగిల గొట్టు కొనగ

    రిప్లయితొలగించండి
  9. ద్రౌపదిని నిండుసభ లోన దౌష్ట్యముగను
    పరిహసించ నధర్మము వలదనె వి
    కర్ణుడు,సుయోధనుని జంపె గదనమందు
    తొడలు విరుగంగ గొట్టి భీముడు ముగించె

    రిప్లయితొలగించండి




  10. విరథుడై రణరంగాన విగతజీవు
    డాయె ,పార్థుడు విడచిన యమ్ముతోడ
    కర్ణుడు;సుయోధనుని జంపె గదనమందు
    దన గదాఘాతమున భీము డనిని బిదప.

    రిప్లయితొలగించండి
  11. వసంత కిశోర్ గారూ,
    మొదటి పూరణలోని లాజిక్ బాగుంది. విరుపుతో రెండవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    "భారతం" అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    స్వప్న వృత్తాంతాలుగా మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    విరుపుతో మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ విరుపుతో చక్కగా ఉంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    వికర్ణుని ప్రస్తావనతో మీ పూరణ వవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. బీరముల్ పలు విధముల పెక్కు మార్లు
    పల్కె; పెంచుచు మూర్ఖపు భ్రమల కోటి,
    వైరి బలముల నరయక పలికి, నాడు
    కర్ణుఁడు సుయోధనుని జంపెఁ గదనమందు.

    రిప్లయితొలగించండి