20, నవంబర్ 2013, బుధవారం

సమస్యాపూరణం - 1240 (యాగముఁ జేయఁగా సమిధ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
యాగముఁ జేయఁగా సమిధ లాజ్యము లగ్నులు హోత లెందుకో.

29 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    మనస్సులో తపోయాగము చెయ్యడానికి ఏం కావాలి
    రావణ హిరణ్యకశిపాదులకున్న దీక్ష తప్ప :

    01)
    ____________________________________________

    భోగము నిచ్చు సంపదల, - భూమిని, భామిని,నెల్లవారలన్
    వేగమె వీడి, చేరి వన - పీఠిని , గూర్చొని ధ్యానమగ్నుడై
    యీగలు వాలనీ , మధువు - నిచ్చెడి యీగలు పట్టి కుట్టనీ
    సాగగ నేండ్లు పూండ్లు, మది, - జాబిలి తాల్పదె మెచ్చగన్, తపో
    యాగముఁ జేయఁగా సమిధ - లాజ్యము లగ్నులు హోత లెందుకో ?
    ____________________________________________
    ఏండ్లు పూండ్లు = అనేక సంవత్సరములు
    జాబిలితాల్పు = శంకరుడు

    రిప్లయితొలగించండి
  2. రాగము జెంది చేయగను రక్కసి మూకల పార ద్రోలగా
    భోగము లంది దేవతలు భూరి శుభంబుల నిచ్చు గావుతన్
    సాగిల మ్రొక్కి భక్తిమొయి సాదర మొప్పగ నీమ నిష్టలన్
    యాగముఁ జేయఁ గా సమిధ లాజ్యము లగ్నులు హోత లెందుకో

    రిప్లయితొలగించండి
  3. రాజకీయ నిరుద్యోగుల వసతి కోసం
    రాష్ట్రం ముక్కలవడం దారుణం ! దుర్భరం !

    02)
    ____________________________________________

    ఏ గతి లేని నాయకుల - యీసదె ద్రోహపు రూపు దాల్చగా
    బాగుగ నున్న రాష్ట్రమున - భాగము బంచగ గోరుచున్న , దుర్
    యాగముఁ జేయఁగా సమిధ - లాజ్యము లగ్నులు హోత లెందుకో ?
    ఈ గతి చీలుచుండె గద - యీర్ష్య , యసూయల ద్రోహచింతనన్
    సోగగ నున్న రాష్ట్రమదె - సూనృత శూన్యము ! దుర్భరంబహో !!!
    ____________________________________________
    ఏ గతి లేని నాయకులు = రాజకీయ నిరుద్యోగులు
    సోగ = దీర్ఘము (పెద్దది దక్షిణాదిలో)
    సూనృతము = శుభము
    దుర్భరము = భరింపగూడనిది

    రిప్లయితొలగించండి
  4. వానా , వరదా పంటల్నీ ,పల్లెల్నీ ,పట్నాల్నీ ముంచెత్తగా
    వరదబాధితుల నాదుకొనాలనే సత్సంకల్పానికి
    యేం గావల్నె భాయ్ :

    03)
    ____________________________________________

    వాగులు, వంకలున్ బొరలి - బంగరు పంటలు , పల్లె పట్నముల్
    దోగగ జేయు వానల, న - ధోగతి జేరిన దుఃఖ్ఖితాత్ములన్
    వేగమె జేరి యాదుకొని - వేదన దీర్చగ పూనుకొన్న , సద్
    యాగముఁ జేయఁగా సమిధ - లాజ్యము లగ్నులు హోత లెందుకో ?
    ____________________________________________
    పొరలు = పొర్లు = To be in excess, to over-flow.
    దోగు = 1.To be wet. తడియు.
    2. To be bruised, కొట్టుకొనిపోవు
    అధోగతి = utter destruction. నాశనము.

    రిప్లయితొలగించండి
  5. శ్రీగిరిజా మనోహరుని చిత్తమునన్ నెలకొల్పి దీక్షతో
    సాగుచు యోగమార్గమున సర్వము తన్మయమంచు గాంచుచున్
    త్యాగ మొనర్చి సర్వమును ధ్యానము వెల్గ మనస్థ వేదిపై
    యాగము జేయగా సమిథ లాజ్యము లగ్నులు హోత లెందుకో?

    రిప్లయితొలగించండి
  6. నమస్కారములు
    పూజ్య గురువులు అవధాన సరస్వతులు శ్రీ పండిత నేమాని ఆది దంపతులకు స్వాగతం సుస్వాగతం
    నేను పరాధీనను ఈ సారైనా అతిధ్య మివ్వ గలిగితే ధన్యు రాలను

    రిప్లయితొలగించండి
  7. శ్రీమతి రాజేశ్వరి గారూ!
    తమ్ముడు చి. డా. గన్నవరపు వ. న. మూర్తి
    మిత్రులు శ్రీ ఛంద్రశేఖర్ గారూ!

    శుభాశీస్సులు.

    నేను న్యూ జెర్సీలో ఫిబ్రవరి నుండి జూలై వరకు ఉంటాను. అప్పటిలోనే నా 70వ జన్మదినము 23-2-2014 ఆదివారమునాడు జరుగును. మీరు అందరు ఆ నిర్వహణలో పాలు పంచుకొంటారను కొనుచున్నాను. మీ ఆదరాభిమానములతో పండువ జరుపు కొనుటయే నిజమైన ఆనందదాయకము కదా. స్వస్తి.
    సన్యాసిరావు

    రిప్లయితొలగించండి
  8. శ్రీ నేమాని గారూ ! నమస్కారములు. మీ విదేశీ యానము మిక్కిలి ఆనందదాయకముగా సాగాలని కోరుకొనుచున్నాను.మీ 70వ జన్మదిన వేడుకలు వైభవోపేతముగా కవిమిత్రుల సమక్షములో జరుగగలదని ఆకాంక్షిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గారూ!
    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    శుభాశీస్సులు.
    మా విదేశీ యానము గురించి మీరు అభినందనలు తెలిపినందులకు సంతోషము. పూర్వము నేను 2 పర్యాయములు చలికాలములో అమెరికాలో గడిపితిని. ఈ మాటు ఇంగ్లండులో గడపుతాను. అలవాటు పడిన వాడినే. వేసవి అంతయు అమెరికాలో నుంటాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. భోగము కొంత మానుకొని పుణ్యముగూర్చుకొనంగ భక్తిమై
    బాగులు జూడనెంచు జన బంధువు- దీనజనాళి వృద్ధికై
    త్యాగము సేవలున్ బ్రతుకు ధర్మమటంచు ప్రజాహితాఖ్యయౌ
    యాగముఁ జేయఁగా సమిధ లాజ్యము లగ్నులు హోత లెందుకో?

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శంకరయ్య గారికివందనములు
    యాగము యన్న కర్మలను ధర్మవిధిన్నొనరించి వాసనల్
    త్యాగము జేసి కర్మ ఫలితమ్మును కృష్ణున కర్పణమ్మిడన్
    రాగముమత్సరమ్ము విడనాడుచు జేసిన కార్యమే యనన్
    యాగము సేయగా సమిధలాజ్యము లగ్నులు హోతలె౦దుకో

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు నమస్కృతులు.
    మా బంధువుల వివాహానికి గ్రామాంతరం వచ్చాను. సమయాభావం వల్ల ఈనాటి పూరణలను సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  13. భోగము, యోగమున్, విరతి, మోహము లoటక తామరాకు పై
    దోగెడు నీటి బొట్టువలె దుస్తరమౌ భవమున్ తరింపగన్
    యోగిగ సాగ యజ్ఞమన యుక్తము కాదొకొ? యెంచి చూడగన్
    యాగముఁ జేయఁగా సమిధ లాజ్యము లగ్నులు హోత లెందుకో!

    రిప్లయితొలగించండి
  14. శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యమును చూచేను. అభినందనలు. కొన్ని సూచనలు:
    యాగము + అన్న అని సంధి చేసినచో యాగమన్న అగును; యడాగమము రాదు. విధిన్ + ఒనరించి అని సంధి చేసినచో విధినొనరించి అగును. విధిన్నొనరించి అనుట సాధు ప్రయోగము కాదు. ఎందరో కవులు ఇట్టి ప్రయోగములు చేయుచున్నను ఇది వ్యాకరణ శుద్ధము కాదనియే నా భావము. మీరు మొదటి పాదములో యతిని కూడా వేయ లేదు. అందుచేత మీ పద్యములోని మొదటి పాదమును ఇలాగ మార్చుదాము:
    యాగమునందు కర్మల సమంచిత రీతి నొనర్చి వాసనల్ -- --
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    "ప్రజాహితాఖ్య" అనే ప్రయోగములో దోషము లేదు. కాని అది వేరొక కోణమునుండి చూచినచో విరుద్ధమైన అర్థమును ఇచ్చును; చూడండి: ప్రజా + హిత = ప్రజాహిత (2) ప్రజా + అహిత = ప్రజాహిత. ఇట్టి వ్యంగ్యములకు తావు లేకుండా ప్రయోగములు చేయుట శ్రేయస్కరము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా , ఈ విధము గా సవరణ చేసినాను. ధన్యవాదములు.
    త్యాగము సేవలున్ బ్రతుకు ధర్మమటంచును జీవనమ్మునే

    రిప్లయితొలగించండి
  17. అమ్మా! లక్ష్మీ దేవి గారూ!
    మీరు వ్రాసిన పద్యములో మార్పు అక్కరలేదు. నేను ఒక చిన్న సూచన చేసేను - అందులోని వ్యంగ్యమును కూడా చూపించుచు - అంతే. స్వస్తి

    రిప్లయితొలగించండి
  18. రోగము బాగుజేతుమని రోగుల దగ్గర దొంగసాధువుల్
    యాగము సల్పమంచు నతి యాత్రము జూపుచు నమ్మబల్కుచున్
    వేగము తోడ మంత్రములు పెద్దగ నుడ్చుచు డబ్బుకోసమై
    యాగముఁ జేయఁ గా సమిధ లాజ్యము లగ్నులు హోత లెందుకో.

    రిప్లయితొలగించండి
  19. అయ్యా! శ్రీ బొడ్డు శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము 2వ పాదములో అతియాత్రము అనే సమాసము సాధువు కాదు. అతి సంస్కృతము పదము, ఆత్రము తెలుగు పదము. అందుచేత కడునాత్రము గా మార్చుదాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. సంతో్షమండి.
    తిమ్మాజీ్రావు గారి పూరణలో మూడవపాదములో యతి కుదిరినదా అని సందేహము.
    శంకరయ్య గారి పూరణలో నుడ్చుచు అంటే నుడువుచు అనేనా అని సందేహము.
    మిత్రులు శ్రమనుకోక వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  21. పండిత నేమానిచారికి వందనములు
    మీరు సూచించిన సవరణకు ధన్యవాదములు
    చిరంజీవి లక్స్మిదేవికి ఆశీస్సులు
    మీ సందేహము సమంజసమే కానియతిభంగము
    కాలేదు దయచేసి యతిమైత్రిని మరియొకసారి పరిశీలించండి

    రిప్లయితొలగించండి
  22. శ్రీమతి లక్ష్మీదేవి గారికి నమస్కారములు,
    నుడ్చుచు ప్రయోగం తప్పో ఒప్పో పెద్దలే చెప్పగలరు.
    కాని మీరు సందేహం వ్యక్తం చేసిన తర్వాత నాకు కూడ అనుమానం కలిగింది.
    నుడ్చుచు అన్న చోట నుడ్వుచు అని చదవమనవి.

    రిప్లయితొలగించండి
  23. పండిత నేమాని గురువు గారికి నమస్కారములు, మీరు సూచించిన సవరణతో.......

    రోగము బాగుజేతుమని రోగుల దగ్గర దొంగసాధువుల్
    యాగము సల్పమంచు కడు నాత్రము జూపుచు నమ్మబల్కుచున్
    వేగము తోడ మంత్రములు పెద్దగ నుడ్వుచు డబ్బుకోసమై
    యాగముఁ జేయఁ గా సమిధ లాజ్యము లగ్నులు హోత లెందుకో.

    రిప్లయితొలగించండి
  24. ఈ సమస్యకు చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు....
    వసంత కిశోర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    పండిత నేమాని వారికి,
    లక్ష్మీదేవి గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    మిస్సన్న గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    నా అనుపస్థితిలో మిత్రుల పూరణల గుణదోషాలను ప్రస్తావించి, సవరణలను సూచించిన పండిత నేమాని వారికి పాదాభివందనములు.

    రిప్లయితొలగించండి
  25. తిమ్మాజీ రావుగారి పూరణ లోని మూడవపాదంలో యతి మైత్రి గురించి నాకూ అనుమానమే.

    బొడ్డు శంకరయ్య గారు నుడ్వుచు అనడానికి బదులు పల్కుచు లేదా చెప్పుచు అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  26. శ్రీమతి లక్ష్మీ దేవి గారూ.
    శ్రీ మిస్సన్న గారూ!
    శుభాశీస్సులు.
    శ్రీ తిమ్మాజీ రావు గారి మొదటి పద్యము 2వ పాదము చివరలో "న్" ఉన్నది కదా. దానిని 3వ పాదము ముందున జేర్చి చదువుకొనినచో యతి మైత్రి కుదురు చున్నది కదా. అందుచేత యతి భంగము కాలేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  27. నేమాని పండితార్యా! సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. జాగృతి చేయగా ప్రజల శంకలు మాపుచు ధైర్యమివ్వగన్
    వేగమె చంద్రశేఖరుడు బింకము మీరగ మాటిమాటికిన్
    యాగముఁ జేయఁగా సమిధ లాజ్యము లగ్నులు హోత లెందుకో
    బాగుగ వక్కణించెదరు బామ్మలు తాతలు సోమయాజులున్

    రిప్లయితొలగించండి