19, ఏప్రిల్ 2017, బుధవారం

సమస్య - 2341 (కారమె వారలకు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్"
(లేదా...)
"కారమె వారి పెండ్లి కొక కారణ మయ్యెను వింటివే చెలీ"
(ఆకాశవాణి వారి సమస్య... బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

108 కామెంట్‌లు:

 1. (శ్రీపండితారాధ్యుల) S.P బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించే “పాడుతా తీయగా” పోటీలో పాల్గొని “మల్లికాపూర్ణిమ”లు
  దంపతులైన సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని.

  చేరిరి పోటీ యందున
  కోరిన పాటలట పాడ కూరిమి పెరుగన్
  మీరగ “బాలు”డి డిన స
  "త్కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్"

  రిప్లయితొలగించండి
 2. కౌరవ దుష్టకోటి పథకంబున యాదవ పొత్తు కోరినన్
  వారల మాయజేసి కడు భద్రముగన్ శశిరేఖ మెచ్చెడిన్
  వీరుని కృష్ణయానతిని వేదిక జేర్చిన లోకభీకరా
  కారమె వారి పెండ్లి కొక కారణ మయ్యెను వింటివే చెలీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫణికుమార్ గారూ,
   భారతంలో లేని ఘట్టమైనా ఘటోత్కచుని ప్రస్తావనతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
   "కృష్ణు నానతి" అనండి.

   తొలగించండి
  2. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

   తొలగించండి


 3. ఓరకనుల జూచుకొనుచు
  జోరుగనుచు జోడుగట్టి సోరణిదివియల్
  పాఱింప సయాటల చెలి
  కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   స్నేహమనే చెలికారంతో మీ పూరణ బాగున్నది. 'సోరణిదివియల'కోసం ఆంధ్రభారతిని సంప్రదించవలసి వచ్చింది. మీ నూతన పదప్రయోగ నైపుణ్యానికి జోహార్లు.

   తొలగించండి
 4. తీరుగ శకుంత లొకతరి
  తారట లాడగ వలపుల తలపుల వనిలో
  జోరైన తుమ్మెదల ఝం
  కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   భ్రమర ఝంకారంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శకుంతల+ఒక' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. "శకుంతల యొకట" అనండి.

   తొలగించండి
  2. ఒకసారి కాకుండా ఒకచోట అన్న అర్థం వస్తుంది.

   తొలగించండి


  3. మధుకై టభులు జిలేబ
   మ్మ, దొరకక తిరిగు నుగాగమ యడాగమముల్
   సదనంబందు నటునిటు మ
   న దుంప త్రెంచుచు సయాటన యిటునటుగనున్ :)

   జిలేబి

   తొలగించండి


 5. చారణుడాడ, నట్టువము సాధన జేసిరి యిర్వురున్నటన్
  జోరుగ జోడు గట్టి యట జొంపపు మాటున ముద్దులాటలన్
  జేరుచు సోర పిల్లడటు చెంపకు గంధము బూయగన్నలం
  కారమె వారి పెండ్లి కొక కారణ మయ్యెను వింటివే చెలీ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. కారము కోరనేలనొ వికారము కల్గు భుజింప హెచ్చు శ్రీ
  కారము చేయవేల సహకారము చేయగ వీడి నీ యహం
  కారమటంచు వేడగ నకారము తెల్పని రాకుమారు స్వీ
  కారమె వారి పెండ్లికొక కారణ మయ్యెను వింటివే చెలీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సోమయాజులు గారూ,
   అబ్బో... ఎన్ని కారాలు!? పలు రకాల కారాలతో మీ పూరణ పురస్కారానికి తగి ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ధన్యవాదాలండీ. నమస్"కారము"లు.

   తొలగించండి
 7. నారి సుభద్రను పార్థుడు
  కోరుచు మునివేషమందు కోమలి జేరన్
  భూరిగనా కృష్ణుని మమ
  కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   సుభద్రా పరిణయం విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మమకారం కంటే కృష్ణుని సహకార మంటే ఇంకా బాగుంటుందేమో!

   తొలగించండి
 8. కేరింతలతో నిరువురు
  జోరుగ బాల్యము గడుపగ, సోయగములిడన్
  మారుడు, పెరిగిన మదనవి
  కారమె వారలకు పెండ్లికి కారణమయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాగమణి గారూ,
   యౌవనంలోని మదన వికారంతో మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 9. వారిద్దరి చూపుల తొలి
  సారియె ప్రేమంబు గల్గె సర్వవిధాలన్
  కూరిమి నిండిన యా మమ
  కారమె వారలకు పెండ్లి కారణ మయ్యెన్.

  వారొక యుత్సవంబునను బాల్గొన గోరుచు నేడనుండియో
  చేరినవేళ చూపులకు చిక్కిరి యంతట ప్రేమభావ మా
  మారుడు కల్గజేసె నను మానము లేదను రక్తికందు శ్రీ
  కారమె వారి పెండ్లి కొక కారణ మయ్యెను వింటివే చెలీ.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూర్తి గారూ,
   మమకారంతో అనురక్తికి శ్రీకారం చుట్టిన మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 10. డా.పిట్టా
  పారము లేనిది శాస్త్రము
  తీరని కుజ దోషమన్న దివిజుని శమనం
  బారడి మాన్చెను జప మోం
  కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్

  రిప్లయితొలగించండి
 11. డా.పిట్టా
  సారము లేని కట్టుకథ సై యన నాయిక ప్రేమ యత్నమున్
  పారగనీదు; దర్శకుడు బట్టిన నాయకు నెల్ల వేళలన్
  ఘోర వికర్షణన్ గలియ గూర్చెను వేసట;వానిపైని ఛీ
  త్కారమె వారి పెళ్లికొక కారణమయ్యెను వింటివే చెలీ!
  (నాయిక ఛీత్కారమే నాయకుని పొందుకు కారణమవడం, సినిమా కథ)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   ఓంకార, చీత్కారాలతో మీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 12. వీర వరేణ్యుడు రాముఁడు
  తీరుగ హరు విల్లుఁద్రుంచ ధీరుల్ దిక్కుల్
  హోరున కంపించఁగ టం
  కారమె వారలకుఁ బెండ్లి కారణమయ్యెన్

  రిప్లయితొలగించండి
 13. ధీరగుణుండునౌ వరుడు దేహరుచిన్ నవమన్మథుండు , శృం....
  గార రసాధిదేవి యనగా సుదతీమణియౌ, పరస్పరా..
  కారములిట్టులొండొరులకై సృజియించెనొ బ్రహ్మ ! మోహనా..
  కారమె వారి పెండ్లి కొక కారణ మయ్యెను వింటివే చెలీ"

  రిప్లయితొలగించండి
 14. సారసగర్భుని రాతయె
  వారిరువురి మధ్యలోన వలపును బెంచన్
  సారము గల్గిన యా మమ
  కారమె వారలకు పెండ్లికారణమయ్యెన్!!!


  వారిరువురి ప్రేమనెవరు
  దీరుగ మరి యొప్పుకొనక దిట్టగ నిండ్లన్
  కూరిమి గల మిత్రుల సహ
  కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మమకార, సహకారాలతో మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 15. డా.పిట్టా
  సారము లేని కట్టుకథ సై యన నాయిక ప్రేమ యత్నమున్
  పారగనీదు; దర్శకుడు బట్టిన నాయకు నెల్ల వేళలన్
  ఘోర వికర్షణన్ గలియ గూర్చెను వేసట;వానిపైని ఛీ
  త్కారమె వారి పెళ్లికొక కారణమయ్యెను వింటివే చెలీ!
  (నాయిక ఛీత్కారమే నాయకుని పొందుకు కారణమవడం, సినిమా కథ)

  రిప్లయితొలగించండి
 16. రిప్లయిలు
  1. తారకు సంహా రమునకు
   మారుని పొగరణచు కొరకు మార్గమ్మైనన్
   గౌరీశానుల యంగీ
   కారమె వారలకుఁ బెండ్లి కారణమయ్యెన్

   తొలగించండి
  2. దారినఁబోవు రాజు యిటుఁదాపసిఁజూడగ వచ్చు చుండగా
   గోరెనొ బ్రహ్మ వారలనుఁగూర్ప శకుంతల కూతపెట్టెనే!
   బారుగ వచ్చుతుమ్మెదలుఁపైబడు నంచు,మిళింద కోటి ఝం
   కారమె వారి పెండ్లి కొక కారణ మయ్యెను వింటివే చెలీ

   తొలగించండి
  3. రాజ్ కుమార్ గారూ,
   అంగీకార, ఝంకారాలతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'రాజు+ఇటు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "భూపు డిటు" అనండి.

   తొలగించండి
  4. ప్రభాకర శాస్త్రిగారి ఝంకారానికి కృతజ్ఞతాంజలులు

   తొలగించండి
  5. ధన్యవాదాలు శంకరయ్యగారు.
   "రాజుయిటు"... ×
   "భూవరుడు" √

   తొలగించండి
 17. తెల్లవారగానె యుల్లము రంజిల్ల
  నెన్నొ పూరణమ్ము లిచట నా స
  మీక్ష కొఱకు నివె ప్రతీక్షించుచున్నవి
  వ్రాసిన కవులార! వందనములు.

  కారము సత్కారము సహ
  కారము సంస్కారము మమకారము మోహా
  కారము టంకారము ఝం
  కారము స్వీకారములె వికారము లేదే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకరయ్య గారూ.. మీ యీ మొదటి పద్యం చూస్తే నేను వ్రాసిన వేంకటేశ్వర శతకం ( ముద్రణ దశలో ఉంది) లో స్వామివారి మేలుకొలుపు స్మృతిపథంలో మెదిలింది.. మిత్రులతో పంచుకోవాలని పంపిస్తున్నాను అవధరించండి.. ఆశీర్వదించండి... 🙏🙏

   🌺🙏ఓం నమో వేంకటేశాయ 🙏🌺
   ద్వాదశ తీర్థ సంకలిత వారి విభాసిత పాత్రధారులై
   వేద పవిత్ర మంత్ర శ్రుతిపేయ సునాద విభూషితాస్యులై
   పాదయుగాభిషేకమతి వచ్చిరి విప్రులు , మేలుకొమ్ము ! భా..
   గ్యోదయకారకా! దినకరోదయమైనది వేంకటేశ్వరా !!

   తొలగించండి
  2. మైలవరపు మురళీకృష్ణ గారు మీ మేలుకొలుపు పద్దెపు వింజామర మనోహరముగా నున్నది. ఈ పద్యమొక్కటి చాలు మీ శతకాభిరామ దర్శనమునకు. అభినందనలు.

   తొలగించండి
  3. శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమస్సులు.. మీ వంటి వారల మార్గమే మా బోంట్లకు అనుసరణీయము.. మీ పూరణలలోని అర్థభేదాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి అనుట అతిశయోక్తి గానేరదు. శతకం రూపు దిద్దుకొన్న తరువాత తమరికి అందజేయగలను. మీ ప్రశంసకు ధన్యవాదాలతో... మురళీకృష్ణ

   తొలగించండి
  4. మైలవరపు వారు:

   పోచిరాజు వారి "వేంకటేశ్వరా శతకము"ను ఇచ్చట చూడగలరు:

   http://kraopochiraju4.blogspot.com/2016/09/blog-post.html

   తొలగించండి
  5. శంకరయ్యగారు! అందరి కారాలతో మీ కందం అదిరింది.నమస్కారం.

   తొలగించండి
 18. చారెడు కన్నులున్ తెలుపు చాయయు చక్కని మోము నల్లనౌ
  బారెడు జుట్టుతో పధువు, పాతికలోపు వయస్సు కల్గినన్
  తీరగునాకృతిన్ వరుడు తేజమునొల్కగ వారి మోహనా
  కారమె వారిపెండ్లికొక కారణమయ్యెను వింటివే చెలీ

  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   వధూవరుల మోహనాకారాలతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
   టైపాటువల్ల వధువు.. పధువు అయింది.

   తొలగించండి
 19. ఆ రెండు కుటుంబమ్ములు
  వారక మేలగు మిరపను పండించుటచేఁ
  గోరియు వియ్యము నందిరి
  కారమె వారలకుఁ బెండ్లి కారణ మయ్యెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుదేవులకు నమస్సులు!! ఏ కారమును కూర్చకుండా అచ్చమైన కారంతోనే పెండ్లి చేసిన మీ చమత్కారానికి జోతలు!!
   అత్యుత్తమమైన పూరణ!🙏🙏🙏🙏

   తొలగించండి
 20. నిరుపేద అయిన చక్కని
  తరుణిని ప్రేమించెనొకడు తద్దయువేడ్కన్
  పరికింప స్నేహితుల సహ
  కారమె వారిపెండ్లికిని కారణమయ్యెన్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   సహకారంతో మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. మొదటి మూడు పాదములలో మొదటి అక్షరం దీర్ఘముగా సరిజేయమనవి

   తొలగించండి
 21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 22. చేరిరి పాండవుల్సభకు శ్రీకరభూసుర రూపధారులై
  యోరగజూచె ధర్మజుడు నూయని తమ్మునివైపు పార్థుడున్
  నారిని జూచి యంత్రముననాటెనుకోలను మెచ్చగా ఝషా
  కారమె వారి పెండ్లి కొక కారణ మయ్యెను వింటివే చెలీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   మత్స్యయంత్ర భేదనం విషయంగా మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 23. శంకరయ్య గారు మీకు నా నమస్కారం మీలాంటి వారి వల్ల తెలుగు వెలుగుతోంది
  శ్యామల

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్యామల గారూ,
   ధన్యవాదాలు.
   ఏదో నాకు, నా ద్వారా కొందరికి కాలక్షేపానికి, మరి కొందరికి పద్యరచనాభ్యాసానికే ఈ బ్లాగు నిర్వహణ తప్ప భాషా సాహిత్య సేవల వంటి పెద్ద మాటలకు అర్హుణ్ణి కాను.

   తొలగించండి
 24. ఘోరతపమ్మున మున్గిన
  కారణమున హరుడె యుమను గాంచకయున్నన్
  మారుని పూబాణపు శ్రీ
  కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మదనుడు పూలబాణాలతో ఉమాశంకరుల ప్రణయ కథకు శ్రీకారం చుట్టాడన్న మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 25. కోరిన వాడే కనబడి
  తీరుగ మాటిచ్చి కలలు తీరగ మనువున్
  కోరగ వారిరువురిమమ
  కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   పరస్పర మమకారంపై మీరు వ్రాసిన పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 26. క్రూరమ్మగు చూపులతో
  తోరమ్ముగ నొకరి నొకరు దూరుచు ప్రతినల్
  తీరుగ నొనరించిన ధి
  క్కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్
  {మంగమ్మ శపథము}

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తిమ్మాజీ రావు గారూ,
   మంగమ్మ శపథం కధా ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 27. నేరమని ప్రేమజీవుల
  నారడి పెట్ట స్వజనమ్ము లావేశముతో
  ధీరత్వమునఁ బ్రజల సహ
  కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ ప్రజా సహకారపు పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 28. మీ ప్రోత్సాహాలకు నెనర్లండీ కందివారు

  సోరణి దివియల్ తీరున
  బారులు దీర్చుచు జిలేబి పదముల్ బేర్చెన్ ;). అంతే


  మీ ప్రోత్సాహమునకు మా
  కై ప్రాతః కాలమిచ్చు కైపదములకున్
  మీ ప్రేరణలకు నెనరుల్
  మీ ప్రాపులు వన్నె దీర్చె మేలున్ గూర్చెన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 29. తోరపు విద్య ఘనముగ కు
  బేరుని మించు ధనరాశి విశ్రుత కులమున్
  మారునిఁ బోలు వరుని యా
  కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్


  దూరము నుండి వచ్చిన సుదూరపు బంధు గణమ్ముఁ జూచి వే
  గౌరవ భావ మేర్పడగఁ గమ్మని పల్కుల నాదరించుచున్
  భారమ యంచు నెంచకయె పన్నుగ వా రొనరించి నట్టి స
  త్కారమె వారి పెండ్లి కొక కారణ మయ్యెను వింటివే చెలీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   వరుని శుభాకారం, బంధు సత్కారాలతో మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 30. ప్రేరణ నివ్వకంజముఖి వేంకట నాథుని మందిరమ్మునన్
  చేరెనొకండు శీఘ్రముగ చేడియ చెంతకు నిష్టపూర్తిగా
  నేరమటంచు వంశజులు నీతులఁ జెప్పగఁ బ్రేమజంట ధి
  క్కారమె వారి పెండ్లి కొక కారణ మయ్యెను వింటివే చెలీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   ప్రేమికుల బంధు ధిక్కారంతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. గురువర్యులకు నమస్సులు ధన్యవాదములు.

   తొలగించండి
 31. మీరెను పెద్దల మాటలు
  కోరక వరకట్నమేమి, కూరిమి కలుగన్
  చారు గుణ శీలవతి సం
  స్కారమె వారలకు పెండ్లి కారణమయ్యన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి వారూ,
   కట్నం కాకుండా సంస్కారమే పెండ్లి కారణమయిందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 32. జోరుగ వచ్చిన లైకులు
  పేరుప్రతిష్టల నొసగగ, ఫేస్బుక్ ద్వారా
  కూరిమి తో పొందిన మమ
  కారమె వారలకు పెండ్లికి కారణమయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాగమణి గారూ,
   ముఖ పుస్తక ప్రేమాయణంతో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 33. కోరగ వైదర్భి వలచి
  కూరిమితో నిషధరాజు కూడగ పతిగన్
  సారెకు సారెకు యమిసహ
  కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   హంస సహకారంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 34. .ప్రేరణగూర్చగ తగుసహ
  కారమె వారలకు పెండ్లి కారణ మయ్యెన్|
  మారెడి సమాజ మందున
  జేరినయవ్వనము జేయుచేష్టల చేతన్|
  2.కారమె గాదు తీపి మమకారమునన్ సహకార వాంచలా
  కారమె కంటిపాప లుపకారముజేర?వధూవరాజ్ఞ సం
  స్కారమునందు పందిట “ల”కారముజేర్చగ తాళిగట్టె|శ్రీ
  కారమె వారి పెండ్లి కొకకారణ మయ్యెను వింటివే చెలీ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   ఆహా! రెండవ పూరణలో ఎన్ని 'కారాలు'! జనవ్యవహారంలోని లకారాన్ని కూడా చేర్చారు. రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 35. శ్రీరమణీస్వరూపయగు సీతను బెండిలి యాడ ప్రేమతో
  సారసనాభుడే ధరణి చక్కని రూపము దాల్చి రాముడై
  చేరియు శైవకార్ముకము చేత ధరించి బిగించి చేయు టం..
  కారమె వారి పెండ్లి కొక కారణ మయ్యెను వింటివే చెలీ!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారూ,
   ధనుష్టంకారంతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 36. చేరగ లైలా మజునూ
  దూరపు టైయ్యైటి లోన దోరగ వయసుల్
  మీరగ, ద్వైయాంశిక గుణ
  కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్

  ద్వైయాంశిక గుణకారము = binary multiplication

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాస్త్రి గారూ,
   మీ శాస్త్రియ గుణకారపు పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 37. కోరుకొనిన మిథునపు సం
  స్కారము, వియ్యంకుల సహకారము కన్నన్
  కారము దరి చేరని మమ
  కారమె వారలకు బెండ్లి కారణ మయ్యెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   వివిధాలైన కారాలతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 38. ధీర సమీరే యమునా
  తీరే వసతి " యని వధువు తీయగ పాడన్
  కోరి , జయదేవ గీతా
  కారమె* వారలకు బెండ్లి కారణమయ్యెన్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారూ,
   అష్టపది పల్లవితో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 39. నారాయణమ్మ యొకపరి
  దారినిదాబోవుచుండి ధర్మునిజూడ
  న్నిరువురి చూపులగలమమ
  కారమె వారలకు పెండ్లి కారణ మయ్యెన్

  రిప్లయితొలగించండి
 40. చేరగ రాక్షస వనమున
  వీరులు పాండవులు కుంతి; భీముని గాంచన్
  క్రూర హిడింబుని హాహా
  కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాస్త్రి గారూ,
   హిడింబుని హాహాకారంతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 41. వారపు సంతకున్వెడలి భారతి మోహనుజూచి ,తోడనే
  మారుని బాణమున్బడగ మాటలు చేష్టలు లేకయుండినన్
  వారల రూపు రేఖలును వారల జాలితనంబు మో హనా
  కారమె వారి పెండ్లి కొకకారణ మయ్యెను వింటివే చెలీ!

  రిప్లయితొలగించండి
 42. ధీర సమీరే యమునా
  తీరే వసతి" యని వధువు తీయగ పాడన్
  కోరి , జయదేవ గీతా
  కారమె వారలకు బెండ్లి కారణమయ్యెన్!!

  రిప్లయితొలగించండి
 43. కూరకు నారకున్ కొసరి కూరిమి లేకయె వంగ భూమిలో
  తీరని కోర్కెతో గతికి తీపి జిలేబులు రాజభోగులన్
  కోరిక మీరగా తినిన కోమలి తెచ్చిన నావకాయదౌ
  కారమె వారి పెండ్లి కొక కారణ మయ్యెను వింటివే చెలీ!

  రిప్లయితొలగించండి