25, ఆగస్టు 2019, ఆదివారం

సమస్య - 3114 (పాపము దక్కు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాపము దక్కు జనులకు శివస్తుతిఁ జేయన్"
(లేదా...)
"పాపమె దక్కు నెల్లెడ శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్"

55 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    రూపము లేని కోతులని ప్రొద్దున రేతిరి గేలిజేయుచున్
    ధూపము మానరో యనుచు దుండగి చేష్టలు మానకుండినన్
    కోపము మీరగా సతుల కొట్టుచు తిట్టుచు వెళ్ళగొట్టుచో
    పాపమె దక్కు నెల్లెడ శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్

    రిప్లయితొలగించండి
  2. దీపారాధన వేళల
    మాపాలిటవేల్పువయ్య మము గావంగన్
    యేపగిదిన వేడగ,నే
    పాపము దక్కు జనులకు శివస్తుతిఁ జేయన్!

    రిప్లయితొలగించండి
  3. దీపారాధన వేళల
    మాపాలిటవేల్పువయ్య మము గావగని
    న్నేపగిదిని వేడగ,నే
    పాపము దక్కు జనులకు శివస్తుతిఁ జేయన్!

    --------యెనిశెట్టి గంగా ప్రసాద్.
    సవరణతో...!

    రిప్లయితొలగించండి
  4. రూపము లేనివాడు పలు రూపము లెత్తుచు రూపుమాపడే
    *పాపమె! దక్కు నెల్లెడ శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్*
    వే పరమాత్మ సన్నిధియె భిన్నములై సఖ!పాపపుణ్యముల్
    దాపరికమ్ము లేక వరదానము లిచ్చెడి వాని గొల్వుమా!

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి


  5. ఓ పడతి! కాళహస్తిని
    నే పరమేశు తిలకింప నెక్కగ నార్టీ
    సీ పొడగంటి ప్రకటనను
    "పాపము దక్కు జనులకు శివస్తుతిఁ జేయన్"!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. మాపతి వ్యర్థుండనుచు ను
    మాపతియే దేవుడనుచు మదినమ్ముచు తా
    ద్రాపుని కొలచిన నేమిర
    పాపము దక్కు జనులకు శివస్తుతిఁ జేయన్

    రిప్లయితొలగించండి
  7. ఆపరమేష్ఠియున్ సురవరాదులు గొల్తురు భక్తియుక్తులై
    చూపక భేదభావమిట జూపిన చో శివకేశవద్వయిన్
    పాపమె దక్కు నెల్లెడ, శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్
    శ్రీపతి నెంచువారయిన శీఘ్రమె కల్గును సౌఖ్యసంపదల్.

    రిప్లయితొలగించండి

  8. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పోపును కొల్చురోయనుచు బొబ్బలు పెట్టుచు మైకులందునన్
    చూపుచు బస్సు టిక్కెటుల షోకగు తీరున జెర్సులేమునున్
    ధూపము త్రిప్ప కోవెలల తొంబది మారులు వోట్లకోసమై
    పాపమె దక్కు నెల్లెడ శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్

    రిప్లయితొలగించండి
  9. పాపమునకు మూలము గన
    కోపము, నద్దానిరూపు, కోర్కెల పుట్టల్
    ప్రాపింపనీకు సతతము
    పాపము దక్కు జనులకు శివస్తుతిఁ జేయన్

    రిప్లయితొలగించండి


  10. ఓ పడతీ! జిలేబి మన వూరికథే విను ! కాళహస్తికై
    నే పయనమ్ము చేయ మన నెమ్మది బస్సగు నార్టిసీని హ
    న్నా! పొడ గంటి నే ప్రకటనమ్మొక టిన్ ! విను !"బుద్ధిహీనతౌ!
    పాపమె దక్కు నెల్లెడ శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్"


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నిత్యపాపాలు ఆదివారం ప్రార్థనతో సరి! అలాంటి పాపుల ప్రకటనలు ప్రభుత్వ సంస్థల ఆస్తులపై కనిపించినపుడు ఉపేక్షించడం మనకు పాపం! కాని పిల్లి మెడకు గంట కట్టేదెవరు?

      తొలగించండి
  11. చూపులతోడ ఛీత్కృతి,వచో కఠినాత్మక దుష్ట బుద్ధియున్
    రేపులు,మాపులున్ దనుజ రీతి వహించి,నికృష్టులైనచో
    పాపము దక్కునెల్లెడ; శివస్తుతిఁజేసిన భక్తకోటికిన్
    శ్రీ పరమేశుడిచ్చును సుశీల,సుభద్ర,సుఖానుభూతులన్.

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    దీపితభక్తిగొల్వ జగదేకవిభుండు ప్రసన్నుడౌను.! నీ
    ప్రాపన నాతడే.! సుజనబంధువతండె దయాళువౌట నీ
    కాపదబాపు ! వాని పరిహాసమతిన్ బలుకంగరాదిటుల్!
    పాపమె దక్కు నెల్లెడ శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్.!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  13. (చేసేవి శివపూజలు .కాని ...)
    "కోపములేని మంచుమల
    కూతురు పార్వతి ప్రాణనాథునిన్ ;
    దాపములన్ని బాపెడి యు
    దారుని పూజల గొల్చుచుంటి ;మిం
    కే పని నైన జేతు " మని
    కేరుచు సల్పిన దుష్టకార్యముల్ ;
    పాపమె దక్కు నెల్లెడ శి
    వస్తుతి జేసిన భక్తకోటికిన్ .

    రిప్లయితొలగించండి

  14. కంది వారి స్ఫూర్తి తో


    పాపమె దక్కు నెల్లెడ శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్
    పాపపు చింత చేయ యను బాధల నీవిక తల్లడిల్లకోయ్
    పాపుల రైన దేవుడిదె భారత దేశపు పుణ్య మూర్తి! రా!
    పాపము చెల్లు నేసుడిని ప్రార్థన చేయగ నాదివారముల్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. ఓ పరమేశ్వర దిక్కని
    నోపికతో జలముదెచ్చి యొడలే కడుగన్
    కాపుగ నుండుగ, నెవ్విధి
    పాపము దక్కు జనులకు శివస్తుతిఁ జేయన్?

    రిప్లయితొలగించండి
  16. పాపము! మనకై గరళము
    నోపికను మ్రింగి మిగుల నూరట గూర్చెన్
    ఆపుము! వాచాల మెటుల
    పాపము దక్కు జనులకు శివస్తుతిఁ జేయన్?

    రిప్లయితొలగించండి
  17. భర్తమరణానంతరం అత్తగారి వద్ద రోదిస్తున్న రతీదేవి..

    *పాపమె దక్కు నెల్లెడ శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్*
    భో!పరమేశుడా!యతడు!బూదిగ జేసెను నాదుభర్తనే
    దీపము నార్పెనత్త! యిక దిక్కెవరే మరుతల్లి జెప్పరో
    శాపము నిత్తు జ్వాలికమ!శాకిని వీనికి యర్ధభాగమౌ!

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  18. కోపము తాపము వీడక
    చాపల్యము తోడ మనుచు శ్రద్ధయు భక్తిన్
    లోపించిన చోట నెపుడు
    పాపము దక్కు జనులకు శివస్తుతిఁ జేయన్

    రిప్లయితొలగించండి
  19. పాపుల సాంగత్యముతో
    పాపము దక్కు జనులకు; శివస్తుతిఁ జేయన్
    తాపము నశియించి సకల
    పాపమ్ములు దొలగి పరమపదమే దక్కున్

    రిప్లయితొలగించండి
  20. ఓపరమేశ శంభో
    ప్రాపుగ నిలువుమని వేడ వదలక కాచున్
    తాపము తొలగించుగద యే
    పాపము దక్కును జనులకు శివస్తుతి జేయన్

    రిప్లయితొలగించండి
  21. సమస్య :-
    *పాపము దక్కు జనులకు శివస్తుతిఁ జేయన్*

    *కందం**

    రూపము పంచిన తల్లిని
    నా పాలిటి దైవ మనక నరకము జూపన్
    ధూపము వేయుచు వేడగ
    పాపము దక్కు జనులకు శివస్తుతిఁ జేయన్
    .......................✍చక్రి

    రిప్లయితొలగించండి
  22. ఏ పూజలు చేయని యొడ
    పాపము దక్కు జనులకు, శివస్తుతి జేయన్
    పాపములు తొలిగి మనలను
    కాపాడును సద్గతులను కలుగగ జేయున్

    రిప్లయితొలగించండి
  23. కోపము తాపముల్ విడక కోరికలందున దేలిపోవుచున్
    పాపపు కర్మముల్ మరగి పాతకులై నడయాడు వారికిన్
    పాపమె దక్కు నెల్లెడ; శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్
    పాప వినాశనమ్మగుచు పావనమౌ శివ లోక ప్రాప్తియౌ

    రిప్లయితొలగించండి


  24. కంది వారి స్ఫూర్తి తో


    ఓ పాపుల్లారా! నలి
    పాపము దక్కు జనులకు శివస్తుతి జేయన్
    మా ప్రభువును నమ్మండీ
    మీ పాపము లాదివారమే తొలగు వెసన్ !



    నారాయణ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. దీపములార్పుటగుడిలో
    పాపము,దక్కుజనులకుశివస్తుతిజేయన్
    బాపములుబోయి పుణ్యము
    లేపారగవచ్చియార్య!యీశునిగరుణన్

    రిప్లయితొలగించండి
  26. దీపము లార్పుచు నిత్యము
    దోపిడులను చేయచు భువి దూరుచు పరులన్
    చూపించ కపట భక్తిని,
    పాపము దక్కు జనులకు శివస్తుతిఁ జేయన్

    రిప్లయితొలగించండి
  27. తాప తమో హారి వితత
    పాప గణ వినాశ కార్త భక్తావళి దుః
    ఖాపహరణ సువిరా డ్రూ
    పాపము దక్కు జనులకు శివస్తుతిఁ జేయన్
    [ విరాడ్రూప +ఆపము; విరాడ్రూపునిచేఁ బొందఁ దగినది]


    ప్రాపు నొసంగె దేహమున పార్వతి కేనిక చర్మ మూనె ది
    వ్యాపగ కిచ్చె మూర్ధతల వాసము చంద్రున కిచ్చె మౌళినే
    తాపము లెల్లఁ బాసి నిరతమ్మును బుణ్యము, ధాత్రి క్షీణమై
    పాపమె, దక్కు నెల్లెడ శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్

    రిప్లయితొలగించండి
  28. కోపమున చేసిన కసటు
    బాపుకొనగ , శివునిగుడికి పరుగున దానిన్
    దాపుకు దాసరి చన , నే
    పాపము దక్కు జనులకు శివస్తుతిఁ జేయన్ ?

    రిప్లయితొలగించండి
  29. దీపములార్పుచో గనలిదేవళమందున గల్గునెప్పుడున్
    బాపమె,దక్కునెల్లెడలశివస్తుతిజేసిన భక్తకోటికిన్
    బాపముబోయికల్గునిల బ్రాపును,పుణ్యము దప్పకుండగన్
    నాపరమేశుడేజగతి కంతటికీశుడు చింతజేయగన్

    రిప్లయితొలగించండి
  30. చూపి నభేధమున్ హరియు శూలధరుండు సమమ్మటంచు నే
    కోపము చూపకున్నను ముకుందుని భక్తులపైన మేలగున్
    మోపి నెపమ్ము వైష్ణవుల పూని శపించిన దుష్టశీలులై
    పాపమె దక్కు నెల్లెడ శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్

    రిప్లయితొలగించండి
  31. పాప హరుండు కాదు హరి, పాతకు డంచును విష్ణుద్వేషులై
    కోపము తోడ వైష్ణవులఁ గొట్టుచు దూరుచు లోకరక్షకున్
    డా పరమేశు డొక్కడని యాలము తోడను గొల్వనేమిరా
    పాపమె దక్కు నెల్లెడ శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్

    రిప్లయితొలగించండి
  32. కాపురుషులకీజగతిని
    పాపము దక్కు, జనులకు శివస్తుతిఁ జేయన్
    తాపములన్నియును తొలగి
    పాపపు ప్రక్షాళనమున పరము లభించున్

    రిప్లయితొలగించండి
  33. ధూపము దీపము యర్ఘ్యము
    రూపము నైవేద్య శౌచ రూకల లోనన్
    లోపము లెన్నైన యుండని
    పాపము దక్కు జనులకు శివస్తుతి చేయన్

    రిప్లయితొలగించండి
  34. దూరమునుండి బిల్వమిడి దోసెడు నీళ్లను చిల్కరించియే
    భారము నీదెరా యన నపారకృపామతి నాయుమాపతిన్
    మీరల కర్మపాకమును మించి సమంచిత పుణ్యము వినా
    పాపమె దక్కు నెల్లెడ శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్

    రిప్లయితొలగించండి
  35. కోపముబూని యన్యమత కూటములందునయార్ష సంస్కృతిన్
    క్షేపముజేయువారలకు ఖేదముతప్పదు వారికీ భువిన్
    పాపమె దక్కు నెల్లెడ, శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్
    పాపవిముక్తి చేకురునుబాయక శాంతియు సౌఖ్యమబ్బెడిన్.

    రిప్లయితొలగించండి
  36. Mall isiripuram
    శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
    కం.
    రూపాకర్షణ మరుగున l
    పాపాలను మూటగట్టి పాలించంగన్ l
    లోపాయికారి తనమున l
    పాపము దక్కు, జనులకు శివస్తుతిఁ జేయన్ ll

    రిప్లయితొలగించండి
  37. ఉత్పలమాల

    శ్రీ పరమేశ్వరున్ గనఁగఁ జేరి ప్రదక్షిణ లెంచి కోవెలన్
    దాపలి వైపుగా జనుచు దాటని హద్దుగ సోమసూత్రమే
    యాపక ముందు వెన్కలకు నర్గుచుఁ జేయఁగ నొప్పు కానిచో
    పాపమె దక్కు నెల్లెడ శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్

    రిప్లయితొలగించండి
  38. కందం
    లోపించఁ జిత్త శుద్ధియె
    పాపము దక్కు జనులకు, శివస్తుతిఁ జేయన్
    దీపించు మానసమ్ముల
    నేపారును భక్తితత్వ మేర్పడి భువిలో

    రిప్లయితొలగించండి