8, అక్టోబర్ 2019, మంగళవారం

సమస్య - 3156 (ఆయుధపూజ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఆయుధమ్ముల పూజ లనర్థకములు"
(లేదా...)
"ఆయుధపూజ సేయుట యనర్థకమే కద పర్వమందునన్"

64 వ్యాఖ్యలు:

 1. శ్రీయుతమైన భావమును జేర్చుచు లోకమునందు దీప్తికై
  న్యాయము దప్పకుండ కడుహర్షముతోడ నిరంతరమ్ముగా
  స్వీయ బలంబు జూపవలె విజ్ఞతలేక సమాజహానికై
  యాయుధపూజ సేయుట యనర్థకమే కద పర్వమందునన్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సమాజహానికై యాయుధపూజ లనర్థకాలన్న మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
 2. ప్రాతః కాలపు సరదా పూరణ:

  తీయని మద్యమున్ గొనుచు తియ్యగ త్రోలుచు హైద్రబాదునన్
  సాయము నందునన్ బలుపు సందడి చేయుచు చంపుచున్ ప్రజన్
  మాయలు మంత్రముల్ సలిపి మందిర మందున డొక్కు కారుకై
  యాయుధపూజ సేయుట యనర్థకమే కద పర్వమందుననన్

  ప్రత్యుత్తరంతొలగించు


 3. అత్యవసర పరిస్థితుల నెదురుకొన
  సావధానులై సిద్ధత జనులు బడయ
  నాయుధమ్ముల పూజ లనర్థకములు
  కావు నెలతుక చేర్చును ఖద్దినదియె


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటిపాదంలో యతి తప్పింది. 'ఖద్ది యదియె' అని ఉండాలనుకుంటాను.

   తొలగించు
 4. క్రూరమనస్కుడై పరుల కొంపలు గూల్చెడు చింతనమ్ముతో
  నేరిని నెట్లు దోచ వలె నెట్టి విధమ్మున మోసపుచ్చ నే
  దారులు నున్నవో తెలియ దందడి నంతరజాలమందు క్షో
  భా రతమున్ బఠింప ఘనవైభవముల్ నశియించు నందురే.

  ప్రత్యుత్తరంతొలగించు


 5. శ్రేయము గాన నెల్లరు విశేషులు గాన జనాళి క్షేమమౌ
  నాయుధపూజ సేయుట, యనర్థకమే కద పర్వమందునన్
  ధ్యేయము లేక డప్పుల నదేపని కొట్టుచు వీధులంబడన్
  హేయము గా ప్రవర్తనల హీనత చూపుచు రయ్యనన్ జనుల్


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మైలవరపు వారి పూరణ

  ఆ యముడే స్వయమ్ముగ రణాంగణమందగుపించెనేని దీ...
  క్షాయుతశౌర్యధైర్యసముదంచితపార్థునిభంగి యుద్ధమున్
  చేయగనొప్పు , నుత్తరునిచేష్టననిన్ వెనుజూపనెంచుచో
  "నాయుధపూజ సేయుట యనర్థకమే కద పర్వమందునన్"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఇంతకు ముందు పంపినపద్యములో రెండవపాదంలో యతిదోషము.. ప్రమాదపతితము.. మన్నించండి.. 🙏🙏
   ఇలా మార్పుచేసితినండీ🙏🙏

   ఆ యముడే స్వయమ్ముగ రణాంగణమందగుపించెనేని దీ...
   క్షాయుతశౌర్యధైర్యగుణసంయుతు పార్థునిభంగి యుద్ధమున్
   చేయగనొప్పు , నుత్తరునిచేష్టననిన్ వెనుజూపనెంచుచో
   "నాయుధపూజ సేయుట యనర్థకమే కద పర్వమందునన్"

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించు
  2. మైలవరపు వారి పూరణ మహత్తరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
  3. మరొక పూ *రణము*

   "ధ్యేయము మాకిదే పొరుగుదేశపు సుందరభూమి" యంచు మీ...
   రాయుధపూజ సేయుట యనర్థకమే కద పర్వమందునన్ !
   జేయకయుండునే రణము సింగము నక్కలెదిర్చి నిల్చుచో ?!
   పాయక యుద్ధమే యగు , ప్రపంచపటమ్మున మీరలుందురే ?!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించు
 7. ఏది ఆయుధమీ భువి నేది కాదు?
  కలము జిహ్వముల ను మించి గలవ యిలను?
  శాంత మౌనములకు నేవి సాటి రావు
  ఆయుధమ్ముల పూజ లనర్థకములు

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కలాన్ని, నాలుకను ఆయుధాలుగా భావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు


 8. నా పూరణ. ఉ.మా.
  ***** ****

  న్యాయము ధర్మమున్ నిలుప నాయుధపూజలు లోకమందునన్

  జేయగ నెంచ నొప్పు కడు సేమమె గాని జగాల నాశమే

  ధ్యేయముగా తలంచుచును హీనుల దుష్టుల రక్షణంబుకై

  ఆయుధపూజ సేయుట యనర్థకమే కద పర్వమందునన్


  🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
  🌷🌷 వనపర్తి 🌷🌷


  ప్రత్యుత్తరంతొలగించు
 9. వృత్తి పనిముట్లు పూజించు విధమెరింగి
  మానకు కులవృత్తియటన్న మధురసూక్తి
  ఆయుధమ్ముల పూజ ల;నర్థకములు
  నీకు తగనివి పూజించ నీకుహాని

  ప్రత్యుత్తరంతొలగించు
 10. (సందర్భాన్ని బట్టి ఆయుధాలుఉపయోగించాలి . వాటికి
  ప్రతేకంగా పండుగనాడు ఆడంబరపూజ అనవసరం .)
  శ్రీయుతమూర్తి గౌతముడు
  చేసెను దేశము శాంతిమంతమున్ ;
  ధీయుతుడౌ మహాత్ముడును
  తెచ్చెను స్వేచ్ఛను సత్యధర్ముడై ;
  చేయియు చేయియున్ గలిపి
  శ్రేయపుబాటను సాగు వేళలో
  నాయుధపూజ సేయుట య
  నర్థకమే కద పర్వమందునన్ .

  ప్రత్యుత్తరంతొలగించు
 11. కలము గళముల మేళనే కాదె మనకు
  సాధన మయెను స్వాతంత్ర్య సమరమునను
  గాంధి జూపిన మార్గమే బంధు వౌను
  ఆయుధమ్ముల పూజ లనర్థకములు

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మేళన + ఏ' అన్నపుడు సంధి లేదు.

   తొలగించు
  2. ధన్యవాదాలు గురువు గారూ..

   మేళనే బదులు హోరుయే అంటే సరిపోతుంది.


   కలము గళముల హోరు యే కాద మనకు
   సాధన మయెను స్వాతంత్ర్య సమరమునను
   గాంధి జూపిన మార్గమే బంధు వౌను
   ఆయుధమ్ముల పూజ లనర్థకములు

   తొలగించు
  3. హోరు + ఏ... అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "హోరులే" అనండి.

   తొలగించు

 12. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  Villager 1968: True Story

  కాయలు పండులున్ విరివి కమ్మగ చేరగ నారు కాన్పులన్
  తీయని మాటలన్ వినుచు త్రిప్పలు తోడుత మార్కెటందునన్
  మాయల మారి యాయుధము మంచిగ తెచ్చుచు వాడకుండనే
  యాయుధపూజ సేయుట యనర్థకమే కద పర్వమందునన్

  ప్రత్యుత్తరంతొలగించు
 13. కన,నిరాయుధీ కరణమె క్రాంతి పథము
  దేశముల మధ్య తరచుగ ద్వేష మెచ్చు
  పంతమున జేయు యుద్ధమ్ము లంతమందె
  ఆయుధమ్ముల పూజ లనర్థకములు

  ప్రత్యుత్తరంతొలగించు
 14. బాధ లందున మునిగిన వారి రక్ష
  సేయుట కు ప యోగ పడక చెంత నున్న
  ఆయుధ ము ల పూజ ల న ర్థ క ములు గాక మరి యెట్లు తోచును కవి వ రే ణ్య

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ధర్మ పరిరక్షణా దీక్ష ధరణి నిల్ప
  శాంత్యహింసలు సత్యమె సాధనములు
  మతము మత్సరముల బెంచు మౌఢ్య మార
  ణాయుధమ్ముల పూజ లనర్థకములు

  ప్రత్యుత్తరంతొలగించు
 16. గురువు గారికి మరియు కవిమిత్రులoదరికి దసరా పర్వదిన శుభాకాంక్షలు.
  సత్యము కరుణ ప్రేమయు సద్భక్తికి
  శ్రీమహితమగు లక్ష్యంబు సిద్ధినిచ్చు
  ఆయుధమ్ములపూజలనర్థకములు
  పరుల సొమ్ము నాశించు పతితులకును.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. శ్రీ గురుభ్యోన్నమః🙏 సభ్యులకు దసరా శుభాకాంక్షలు💐

  సంఘములతోడ మరియొక సంఘమునెది
  రించ దలచు సంఘద్రోహులెంతభక్తి
  హెచ్చి జేయనేమి ఫలము హేతి పూజ?
  ఆయుధమ్ముల పూజ లనర్థకములు

  ప్రత్యుత్తరంతొలగించు
 18. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. సత్యహింసలనెల్లపు డాయుధమ్ము
  లగుట గని పోరు సల్పెసలక్షణముగ
  గాంధి,నేడట్టివేవియు గానకనిరి
  ఆయుధమ్ముల పూజ లనర్థకములు!!

  ప్రత్యుత్తరంతొలగించు
 20. గొప్ప సంప్రదాయమయిన గూడ, నెపుడు
  చదివి యెరుగని పెద్ద పుస్తకములకును
  వాడుటెరుగక తుప్పును పట్టి నట్టి
  ఆయుధమ్ముల పూజ లనర్థకములు

  ప్రత్యుత్తరంతొలగించు
 21. సర్వమానవ శ్రేయము శాంత్యహింస
  మార్గమందునజేకూరు మహినియెప్డు
  పోరునష్టము పొందునన్ పొందు సుఖము
  ఆయుధమ్ముల పూజ లనర్థకములు

  ప్రత్యుత్తరంతొలగించు
 22. ఆయుధమ్ములపూజలనర్ధకములు
  నిజముబల్కితివిట్లని నీరజాక్షి!
  పూజజేసినజేయక పోయిననుసు
  తప్పవుప్రమాదములుప్రజ కప్పుడపుడు

  ప్రత్యుత్తరంతొలగించు
 23. సాయముజేతునంచు నరు
  సారథియై రణరంగమందు నే
  యాయుధమున్ ధరింపకయె-
  అంతముజేసెనపార సైన్యముల్
  మాయకు వశ్యులై జనులు
  మాధవుగొల్వక నల్పబుద్ధితో
  నాయుధపూజసేయుట య
  నర్ధకమేకద పర్వమందునన్.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. అణ్వుదిత సత్వ పూరిత రేణ్వఖిల జ
  గద్విలయ పరిభూతము కాదె కానఁ
  గుతల నాశ నార్థ కృత ఘోరతర మార
  ణాయుధమ్ముల పూజ లనర్థకములు


  ఆయత విశ్వగోళమున నాడుచు నుండు పరాత్మ రూపుఁడై
  స్వీయ చ రాచ రాత్మల నభేదము విష్ణుఁడు నిశ్చయమ్ముగా
  నాయన లేని కించి దణు వైనను లేదన నిట్లనంగ రా
  దాయుధపూజ సేయుట యనర్థకమే కద పర్వమందునన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. చిన్న వ్యాకరణ సంశయము.
   పర్వ మందునన్: ఈ విధముగా సర్వసాధారణముగా చాలమంది (నేను గూడ) ప్రయోగించుచున్నారు.
   ఇది యే రీతి సాధువో నాకు తెలియుట లేదు.
   ఇది చర్చనీయాంశమని నా భావన.

   అందు , న రెండు నే కార్థ సప్తమీ విభక్తి ప్రత్యయములే, ద్రుతాంతములే . పర్వమందు , పర్వమున సమానార్థకములు. అప్పుడు ద్విరుక్త దోషము.
   పర్వమందును ఇక్కడ “ను” అప్యర్థక ప్రయోగము. సాధువు కాగలదు.
   పర్వమందు+ ను+అ = పర్వమందున. సాధువు కాగలదు. కాని ఇక్కడ “న” ద్రుతాంతము కాఁజాలదు.
   అందు = అచ్చోటు. అందునన్ = ఆ చోటు నందు. ఈ విధముగాను సాధువు కాఁగలదు.

   తొలగించు
  2. అదియునుం గాక ప్రయోగము ప్రసిద్ధమే కదా!

   తొలగించు
  3. అవునండి. అది సుప్రసిద్ధమే. అది యు పూర్వక ను ప్రత్యయము. ఆ ను కూడా ద్రుతాంతమే.

   నామ సర్వ నామంబులకును గళ లగు నవ్యయంబులకును గడపల సముచ్ఛయార్థవిశేష పాదపూరణంబుల యందు “ను” శబ్దంబు తఱచుగ నగు.
   కళ లగు ననుదదంత శబ్దము మీఁద నయ్యది యు వర్ణ పూర్వకంబు విభాషనగు.
   మఱియు నది శేష షష్టి యందు యొక్క లోపించు నపుడు లాగమాంత బహు వచనంబు మీదను సముచ్చయమునం జూపట్టెడి. ప్రౌఢ. వ్యా. శబ్ద. 116.

   తొలగించు
 25. న్యాయముఁ గెల్వఁజూచుటఁ వినాశపుఁజేష్టల నెత్తిచూపు ట
  న్యాయముఁగాదు ధర్మమది,యంత్రపుఁబొమ్మల రీతిఁలోన నే
  ధ్యేయము లేకఁనున్నపుడు దీక్షలఁ బూనుటఁ దప్పె,యెంచగా
  నాయుధపూజ సేయుట యనర్థకమే కద పర్వమందునన్?

  ప్రత్యుత్తరంతొలగించు
 26. పాయనిభక్తినిన్ దనరివర్షమువర్షమునానమాయితే
  నాయుధపూజసేయుట,యనర్ధకమేకద పర్వమందునన్
  మాయలుసేయుచున్మిగుల,మాంత్రికువోలెనుమంత్రదండమున్
  వేయగభావ్యమేయరయ భీతినిగొల్పగనుండజేయగా

  ప్రత్యుత్తరంతొలగించు
 27. పూజ్యులు శంకరయ్యగారికి కవి మిత్ర బృందమునకు దసరా శుభాకాంక్షలతో:

  వనజ దళాయతాక్షి! నిజ భక్త జనావన సత్క్రియా రతై
  క! నిజ మనోరథప్రకర కంజ ముఖాంబుజ! వారి రాశి సం
  జనిత రమాభిధాన విలసల్లలి తాంబుజ హస్త! హస్తి భా
  జన జల భాసమానశిర! చక్రధరాంగన! లక్ష్మిఁ దల్చెదన్


  మన్మోహమ్ము నశింపఁ జేసి జగదంబా! కావుమా కాళికా!
  సన్మాయా తను కామ రూప విలసత్సాహస్ర నామాత్మికా!
  సన్మానార్చక నిర్జ రోత్కర సదా సంసేవ్య మానాంబికా!
  తన్మూర్తిత్రయ రూప ధారిణి! జగద్రక్షైక మాతృత్రయీ!


  దుర్గ! దత్త గాత్ర తుష్టాంతరంగ భ
  ర్గా! గగన దుకూల కాయ రమణ!
  దేవ నుతి నికాయ తృప్త! సర్గ స్థితి
  విలయ కార్య భార విలసి తాంబ!

  ప్రత్యుత్తరంతొలగించు
 28. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  ఆయుధమ్ముల పూజ లనర్థకములు

  సందర్భము: భవతరణం.. అనగా సంసార సాగరాన్ని తరించటం.. అదే మనం పొందవలసిన అంతిమ విజయం.
  ఆ విజయం ప్రాప్తించవలె నంటే మనస్సును అన్య విషయాలమీదినుంచి మళ్ళించి దేవిమీద స్థిరంగా నిలిపి యుద్ధం చేయగలుగాలి. అలా నిలుపలేకపోతే
  పద్య రచన అనే యుద్ధంలో యతి ప్రాస లనే ఆయుధాల నెంత శ్రద్ధగా పూజించినా.. అంటే వాటి నెంతగా సాధించినా.. ప్రయోజనం లేదు సుమా!
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  భవ తరణ మన్న విజయమ్ముఁ
  బడయుటకయి
  మలిపి చిత్తమున్ దేవిపై నిలుపకున్నఁ
  బద్య రచనాజిలో యతి ప్రాస లనెడు
  నాయుధమ్ముల పూజ లనర్థకములు

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  8.10.19
  -----------------------------------------------------------

  ప్రత్యుత్తరంతొలగించు
 29. తే.గీ.

  గణన సాధన యంత్రము గణుతి కెక్క
  నేడు నాయుధ సంపత్తి నిదియె గాగ
  విధిగ పూజింప విశ్వము, విప్లవ దెస
  నాయుధమ్ముల పూజలనర్థ కములు

  వై. చంద్రశేఖర్

  ప్రత్యుత్తరంతొలగించు
 30. గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

  ఉత్పలమాల
  సాయము తోడ రావణుని సద్గుణ శోభుడు రామచంద్రుడున్
  సాయము నీయ శౌరి తగు శస్త్రము లందుచు పాండవేయులున్
  మాయని గెల్పునందిరి సుమా! యరి నడ్డగఁ దూగవన్నచో
  యాయుధపూజ సేయుట యనర్థకమే కద పర్వమందునన్

  సాయము = బాణము(మొదటి పాదములో)
  = సహాయము (రెండవ పాదంలో)

  ప్రత్యుత్తరంతొలగించు
 31. ఆయుధమన్నచో నరయ నస్త్త్రవిశేషణమంచు కాదులే
  ప్రాయికకార్యసాధకము బంధురశక్తివిధాయకమ్మునౌ
  నాయువుపట్టువంచు నిట నర్చనఁ ౙేయగ వాచకార్థమౌ
  నాయుధపూజ సేయుట యనర్థకమే కద పర్వమందునన్?

  ప్రత్యుత్తరంతొలగించు
 32. కవిమిత్రులకు నమస్సులు.
  జ్వరం మళ్ళీ వస్తున్నది. ఒంటి నొప్పులు, నీరసం ఉన్నాయి. రోజంతా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను. మందులు వాడుతున్నాను. ఈరోజు కూడ మీ పూరణలను సమీక్షించలేకపోయాను. మన్నించండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 33. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  ఆయుధమ్ముల పూజ లనర్థకములు

  సందర్భము:
  ప్రణవో ధనుః శరో హ్యాత్మా
  బ్రహ్మ తల్లక్ష్య ముచ్యతే
  అప్రమత్తేన వేద్దవ్యం
  శరవత్ తన్మయో భవేత్
  (ముండకోపనిషత్)

  ప్రణవమే (ఓంకారమే) ధనుస్సు. ఆత్మయే బాణం. బ్రహ్మమే లక్ష్యం. ధీరుడైనవాడు గొప్పదైన ఆ లక్ష్యాన్ని భేదించడానికి అప్రమత్తుడై ఆ ధనుస్సును ధరించాలి. (చిన్న చిన్న లక్ష్యాలు పనికిమాలినవి సుమా!) అంటుంది ముండకోపనిషత్తు.
  ఆ బాణం సంధించి ఆ లక్ష్యాన్ని గనుక భేదించగలిగావో నీవే పరబ్రహ్మమువై పోతావు. చంచలమై సాగే బాణం నిశ్చలమైన ఆ లక్ష్యాన్ని భేదించి తానూ నిశ్చలత్వాన్ని పొంది అక్కడే వుండిపోతుంది లేదా అందులోనే కలిసిపోతుంది. అంటే ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోతుంది.
  ఆ ఆయుధంతో చేసే ఆ లక్ష్య భేదనమే యథార్థమైన పూజ. ఆ పూజ చేయజాలకపోతే తక్కిన భౌతికములైన ఆయుధ పూజ లెందుకు పనికివస్తాయి?...
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  అల ప్రణవ ధనువును బూని యాత్మ శరము
  లాగి యా పరబ్రహ్మ మన్ లక్ష్యముఁ గని,
  వడిగ భేదింపవలె.. మొక్కుబడిగఁ జేయు
  నాయుధమ్ముల పూజ లనర్థకములు

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  8.10.19
  -----------------------------------------------------------

  ప్రత్యుత్తరంతొలగించు