17, అక్టోబర్ 2019, గురువారం

సమస్య - 3165 (కారాగారము నుండి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ"
(లేదా...)
"కారాగారమునుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతఁడే"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

101 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    1977:

    ఆరోజిందిర మూసి వేయగనహో హైరాన గావించుచున్
    తీరున్ తెన్నును గానలేక ఘనుడౌ దేశాయి మోరార్జినిన్
    వేరే దారిని గానరాక వడిగా విప్పంగ ద్వారమ్ములన్
    కారాగారమునుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతఁడే

    రిప్లయితొలగించండి


  2. ఔరా! చిదంబరు ల తీ
    హారున కంపెదరకో బెహతరునుకొనుచున్?
    ఓరోరీ సీబీయై
    కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. (అన్యాయంగా జైలుపాలై తిరిగి వస్తున్న కొడుకును చూచి
    కన్నతల్లి కన్నులు తుడుచుకుంటూ అంటున్నది )
    నేరాలెన్నియొ మోపినారకట ! మీ
    నేత్రాలు విప్పార్చుచున్
    నా రాజీవము బోలు బిడ్డపయి ; మీ
    నాశమ్ము దాపించెలే ;
    మా రాతల్ సరిచేసె దేవుడట ; మీ
    మానమ్ము పోద్రోయగా
    కారాగారము నుండి వచ్చె నిపుడే ;
    కాబోవు రాజీతడే !!

    రిప్లయితొలగించండి
  4. రోరోజును పరమాత్ముని
    ధారణ చేయగ విడువక తన మది లోనన్
    ఈ రాతల బంధ మనెడు
    "కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ"

    రాం కిడాంబి

    రిప్లయితొలగించండి


  5. ఘోరంబాయె స్వదేశమందు బతుకుల్ గోరాజనుల్ యేలగా
    నారానిచ్చెను దండు నెక్కొన భళా నాదేశ మీ ఆఫ్రికా
    పోరాటమ్ముల సల్పె దేశమున దాబున్వీడి మండేల నా
    కారాగారమునుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతఁడే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జనుల్ + ఏలగా' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    మరల.. మరల..

    భారంబౌ చెరసాల జీవనమిటన్ , బంధుత్వముల్ లేవు కా
    శ్మీరమ్మందని దుఃఖభాక్కులనఁ ., దా స్వేచ్ఛన్ ప్రసాదింపగా
    రేరాజై మనమోది జూప గృప., నీరీతిన్ జయధ్వానముల్
    కారాగారమునుండి వచ్చె నిపుడే " *కాబోవు రాజీతఁడే*" !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మారామాపతి ధాత్రి బుట్టుటకు ధర్మస్థాపనాకాంక్షతో
      నా రేపల్లెకు రత్నమై తనర , మోక్షార్థమ్ము సూచింపగా
      జేరెన్ జూడుడటంచు నింగి విబుధుల్ సేయన్ జయధ్వానముల్
      కారాగారమునుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతఁడే!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి.

      తొలగించండి
  7. సారా యుద్యమ మందున
    దారా సుతులను విడిచి ధర్మము నిలుపన్
    బోరి బన హృదిని గెలిచిన
    కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. 'విడిచి' అన్నచోట 'త్యజించి' అనండి. 'బన/జన' టైపాటు.

      తొలగించండి
  8. ఔరాతెలగాణోద్యమ
    సైరికుడీతండుప్రజలసన్నుతినందెన్
    పౌరులు గెలిపింతురహో
    "కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ

    రిప్లయితొలగించండి
  9. ముద్దుల లోకమున్ సృజితమోహనమై విలసిల్లఁ జేసి, తాఁ
    దద్దయఁ నేలి, తల్లయవిధాయిగ రాజిలి, క్షీరవార్ధిలో
    మొద్దు విధాన నిశ్చలనముగ్ధమనోహరయోగముద్రలో
    నిద్దురఁ బోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్.

    నిన్నటి పూరణ.

    రిప్లయితొలగించండి
  10. వద్దుర! యన్ననుఁన్ వినడ వారితదౌష్ట్యము లాచరించు, యే
    సుద్దులఁ జప్పినన్ చెవినిఁ జొర్రవ, నారతపాపచిత్తుడై
    తద్దయు మాయమర్మసముదంచితరీతి నమాయకుండునై,
    నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్,

    నిన్నటి మరో పూరణ.

    రిప్లయితొలగించండి
  11. నేరాలేమియు చేయనేర డతడున్ నిక్కంబు సచ్ఛీలుడై
    కారాగారము నుండి వచ్చె నిపుడే;కాబోవు రాజీతడే!
    నైరాశ్యంబును వీడి బీదజన భిన్న క్లేశముల్ బాపుచున్
    సారోదార విచార చారుతర విశ్వప్రేమలో మున్గుచున్

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు

    1. ఆటవిడుపు సరదా పూరణ:
      (జిలేబి గారికి అంకితం)

      స్వీయ చరిత్ర (1989):

      తీరున్ తెన్నును లేని ఖర్గపురినిన్ దేశంపు బంగాలునన్
      భారమ్మంచును బొబ్బరిల్లుచునహో బంగారు రాణెమ్మనున్
      కోరన్ బ్రహ్మను చేతులెత్తుచునటన్, ఘోరంపు నేకాంతమన్
      కారాగారమునుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతఁడే

      తొలగించండి
    2. ఏకాంతమనే కారాగారామా? బాగుంది మీ ఆటవిడుపు పూరణ. అభినందనలు.

      తొలగించండి

    3. 🙏

      "కన్నె చెఱ" కు పుంలింగము తెలియదు నాకు

      😊

      తొలగించండి
  13. దారా సుతు లను విడిచియు
    ఘోరాటవి చేరి సల్పె గొప్ప తపంబు న్
    పేరాశ యు సంసా ర పు
    కారా గృ హ ముక్తు డితఁడు కాగల రాజౌ a

    రిప్లయితొలగించండి
  14. పౌరుల్ సజ్జను లోకబాంధవు హితున్ ప్రజ్ఞాన్వితుండైన సం
    స్కారింజూచి వచించుచుండి రిటులన్ సత్యంబు దుర్మార్గులౌ
    వారీవ్యక్తికి నేరముం బులిమి రా వైకుంఠునిన్ గొల్చుటన్
    గారాగారమునుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతఁడే.

    రిప్లయితొలగించండి
  15. నేరము లాపాదించుచు
    పౌరుల మది దోచినట్టి ప్రజ్ఞా శాలిన్
    దూరిరి, నిందలు తొలగగ
    కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ

    రిప్లయితొలగించండి
  16. సారపు సత్యాన్వేషణ
    భారము తలకెత్తి యిల్లు వదిలిన వారే
    లేరా? బంధ విముక్తులు
    కారా? గృహముక్తుఁడితఁడె కాఁగల రాజౌ..

    క్రూరాత్మకుడా కంసుని
    బారిన పడనట్టి శిశువు పరమాత్ముండే,
    తీరుగ వసుదేవునిచే
    కారాగృహముక్తుఁడితఁడె కాఁగల రాజౌ..

    రిప్లయితొలగించండి

  17. కృష్ణుడు శిశువుగా జన్మించినప్పుడు దేవకి తలంపు ...

    కం॥
    ఘోరముగా చెరనుంచెను

    భారముగా పుట్టె బిడ్డ బ్రతుకుగ గలడో!

    దూరముగ నుంచి పెంచద

    *"కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ"*


    రిప్లయితొలగించండి
  18. క్రూరాత్ముల పాలనపై
    వీరోచిత పోరు సలిపి విజయుడు కాగా
    నారాటమున జనులనిరి
    "కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వీరోచిత పోరు' దుష్ట సమాసం. "వీరుండై పోరు సలిపి..." అనండి.

      తొలగించండి
  19. వీరాగ్రాఖిలరాజ్యపాలనలసద్విశ్వాంతవిఖ్యాతుగాన్,
    కారుణ్యప్రథితాంబుధిప్రకటలోకాశ్రేయసంరక్షుగాన్
    ధీరోదాత్తుడు మాతృగర్భకటుసందీప్యన్నివాసంబునా
    కారాగారమునుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతఁడే.

    రిప్లయితొలగించండి
  20. కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ

    వీరుడు సూరుడు కాకను
    ధీరుడు కాకున్నయునిల దివినేలగ, తా
    పోరుతొ నరిషడ్వర్గపు
    కారాగృహముక్తుఁ డితఁడె, కాఁగల రాజౌ!

    🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పోరుతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "పోరున" అనండి.

      తొలగించండి
  21. కాశ్మీరు గురించి మాట్లాడుటకు జవహర్ లాల్ నెహ్రు 1946 మే 15 నాడు వెళ్ళాడు అప్పుడు అతనిని అరేస్ట్ చేసి జైలులో ఉంచారు అతనిని తిరిగివదలు నప్పుడు అచ్చటి జనులు అనుకొన్న మాటలివి అను భావన





    చేరెను జవహరు లాల్ కా
    శ్మీరుకు, రయముగ నతనిని చేసిరి యరెస్టున్,
    కోరిరట నప్పుడు జనులు
    కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేసి రరెస్టున్ । కోరిరట యప్పుడు...' అనండి.

      తొలగించండి


  22. పోరాడెను గుజరాతున
    పోరాడునిక మన దేశపు ప్రగతికిన్ ! దే
    వేరిని విడిచె నితండు! స
    కారా! గృహముక్తుఁడితఁడె కాఁగల రాజౌ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. "నీచ రాజకీయాల చదరంగపుటెత్తులలో
    ఆరితేరి నేరగాళ్ళు అందలాలెక్కే కాలంలో
    కారాగారము నుండి
    వచ్చెనిపుడే కాబోవు రాజీతడే"
    --- హిత ప్రజ్ఞ

    రిప్లయితొలగించండి
  24. భారత భూమికి దాస్యము
    దూరము చేయగ జవహరు దొరలకు చిక్కెన్ |
    పోరున గెలిచిన పిమ్మట
    *"కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ"

    రిప్లయితొలగించండి
  25. శ్రీకృష్ణుడు కంస వధానంతరము ఉగ్రసేనుని రాజుగావించుట.🙏 శార్దూలం

    భారంబయ్యెనికన్ యయాతిఁడిన యాబన్నంబు నడ్డయ్యెడిన్
    వీరాగ్రేసరులయ్యు యాదవులకున్! వీరుండు ధీరుండు మీ
    శూరాగ్రేసరు నుగ్రసేను మహరాజుంజేతు వెన్వెంటనే
    కారాగారమునుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతఁడే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వారుగ్రసేను గనుచును
      మీరాజ్యంబేలుమింక మేలుగ తాతా!
      యా రామకృష్ణు లుడివిరి
      కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ

      తొలగించండి
  26. నేరమ్ముల్ ఘటియించి కృత్రిమముగా నీచాత్ములౌ నేతలే
    వీరుండై తళుకొత్తు నాయకుని నిర్వీర్యంబు కావించగా
    ధీరోదాత్తుడు త్రుంపి వ్యూహముల తా దీపించె భాస్వంతుడై
    కారాగారమునుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతఁడే

    రిప్లయితొలగించండి
  27. భార్యను విడచిపెట్టి రాజకీయంగా రాణించాలని ప్రయత్నించే వానిని పార్టీ అధ్యక్షునకు పరిచయం చేస్తూ తోటి రాజకీయ నాయకుని పలుకులు...

    కందం
    దారయన నాశయమ్మునుఁ
    జేరఁగ నడ్డంకి యనుచుఁ జింతించిన శ్రీ
    కారులు ప్రధాని మోదీ
    కారా! గృహ ముక్తుఁడితఁడె కాఁగల రాజౌ!

    రిప్లయితొలగించండి
  28. వారుగ్రసేను గనుచును
    మీరాజ్యంబేలుమింక మేలుగ తాతా!
    యా రామకృష్ణు లుడివిరి
    కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ

    రిప్లయితొలగించండి
  29. ఓౌరాయాజగనన్నను
    నేరములేజూపియిడిరి నిర్బంధమునన్
    నేరములేమిని విడువగ
    కారాగృహముక్తుడితడెకాగలరాజౌ

    రిప్లయితొలగించండి
  30. క్రూరుల పీచమ్మణచుట
    దారుణ మెటులగును రాజ ధర్మమటంచున్
    నేరారోపణ దొలగెను
    కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ

    రిప్లయితొలగించండి
  31. శా:

    నేరారోపణ జేయుటెంత సులువో నిక్కంబు నీరోజులన్
    తీరా పంతము నెగ్గ నెట్టి శ్రమమో దెల్పంగ నిర్దోషిగా
    వీరావేశము పొంగ నొట్టుగొనగా వీరంగమున్ జేయుచున్
    కారాగారము నుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతడే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిక్కంబె యీరోజులన్' అనండి. 'తీరా' అన్నది వ్యావహరికం.

      తొలగించండి
  32. పారావా రావని నిభ
    ధీరక్షాంతి గుణగణ విదిత వర ధర్మో
    దా రాచర సచ్ఛీలుఁడు
    కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ

    వీరావేశుఁడు ధూర్త కంసుఁడు చెఱం బెట్టంగ నున్మాదియై
    ధారాళమ్ము గ్రహించఁ గంస పిత సద్ధర్మాత్ముఁ డిందీవ రా
    శీ రానుగ్రహ దాయకుండు హరి రాజీవాక్షు దాక్షిణ్యమే
    కారాగారమునుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతఁడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'ధర్మోదా రాచర..' అర్థం కాలేదు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
      ధర్మ + ఉదార + ఆచర ; ధర్మము నధికముగా నాచరించువాఁడు. ఇదండి నా భావము.
      ఆచర్ ధాతువు సమాసములో దురాచర వలె ఉదా రాచర సమాసము.

      తొలగించండి
    3. పారావా రావని నిభ ధీర క్షాంతి గుణ క్రమాలంకారము.

      తొలగించండి
  33. పోరగ బానిసము తొలగె
    కారాగృహముక్తులవగ గరువము దక్కెన్
    దారుణ మొనర్చి చేరిన
    కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ

    రిప్లయితొలగించండి
  34. ఓౌరా!యేమనిజెప్పనోపుదుమఱిన్ మౌనంబుగానుండుచున్
    గారాగారమునుండివచ్చెనిపుడేకాబోవురాజీతడే
    యారాజేంద్రునిబుత్రుడైనజగనేనయ్యెన్గదాముఖ్యుడున్
    ధీరోదాత్తులలక్షణంబులటులేదీపించునెల్లప్పుడున్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మఱిన్' అన్నది సాధురూపం కాదు. "జెప్పనోపుదును నే మౌనంబుగా.." అనండి. "జగనే యయ్యెన్" అనండి.

      తొలగించండి
  35. మిత్రులందఱకు నమస్సులు!

    [శూద్రకుని మృచ్ఛకటిక నాటకమున రాజభవనమున నున్న యిరువురు రాజభటు లార్యకుని గూర్చి ముచ్చటించుకొనుచున్న సందర్భము]

    "రారా! శర్విలకుండు కాచె నితనిన్ బ్రాణమ్ముఁ బోకుండఁగా!
    ధీరోదాత్తుఁడు చారుదత్తుఁ డితనిన్ ద్రెంపించి సంకెళ్ళనున్
    జేరంబంపఁగ, రాజుఁ జంపఁ దివిరెన్ నేఁ డార్యకుం డోహొహో!
    కారాగారమునుండి వచ్చె నిపుడే! కాఁబోవు రాజీతఁడే!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సంకెళ్ళులన్?
      సంకెళ్ళన్‍ అన్నది మాత్రం సాధువు అనుకుంటాను. సంకెళ్ళులు అన్నది అసందర్భం కాబట్టి సంకెళ్ళులన్ అన్నదీ కుదర దనుకుంటానండి.

      తొలగించండి
    3. బాల. ఆచ్ఛిక. 17.
      ఒకానొకచో నామంబు సంశ్లిష్ట బహువచనాంత తుల్యంబయి బహువచనంబు నెనయు.
      కొడవండ్లులు - కొడవండ్లులను, కొడవళ్ళులు - కొడవళ్లులను ఇట్లు ప్రయోగదృష్టంబులు గ్రహించునది.

      తొలగించండి
    4. బాల. తత్సమ. 31
      బహుత్వంబున ద్వితీయాది విభక్తులకు లడాగమంబగు.
      రాములను - రాములచేతను, విధాతృలను - విధాతృలచేతను.

      తొలగించండి
    5. సంకెళ్ళు బహువచనము కదండి ల డాగమము తప్పని సరి.

      తొలగించండి
    6. తేళ్ళునుం బసులు, కోళ్ళులు భార. అశ్వ. 2. 117.
      కీళ్ళులు భార. శాంతి. 5. 232.
      కీళులు దమయంతన చెందు భార. శాంతి. 5. 596.

      గుళ్ళుఁ జెఱువులు గట్టించుఁ గోరి యూళ్ళు / లగ్రహారముల్ భార. ఆశ్ర. 1. 7.
      గాన రొకళులు భార. ఆశ్ర. 1. 16.
      కన్నీళ్ళులు దొరఁగఁగ భార. ఆశ్ర. 1. 164.
      నెల నాళు లయ్యెడ.. భార. ఆశ్ర. 2. 69.
      బలు గావళులును భార. మౌస. 1. 29.

      తొలగించండి
    7. నేను అప్యర్థంలో వాడానండీ...సంకెళ్ళ(ను/న్)+ఉను...సంకెళ్ళనున్...కాదా?...మరెలా మారునో...తెలుపగలరు...

      ***

      నా పూరణకు మెచ్చుకోలు తెలిపిన మాన్యులు శంకరయ్య గారికి ధన్యవాదములు!

      తొలగించండి
    8. మాన్యులు తాడిగడప శ్యామలరావు గారు మొదట తెలిపినదే సరియైనది...ాని నా భావన...దానికి అప్యర్థం చేరి...సంకెళ్ళనున్...అవుతుంది...

      తొలగించండి
    9. నమస్సులండి. ఓహో బాగుందండి. కానీ అప్పుడు :
      అసలు శబ్దము సంకెళ్ళు కదా దానికి ను చేరితే సంకెళ్ళునున్ (సంకెళ్ళు +ను) అవ్వాలి కదా.
      ళ్ళ అకారాంతము రాదు కదా. సంకెళ్ళే యను నర్థములో “అ”కారాంత మయితే తిరిగి ను అప్యర్థములో రాదు కదా.
      ఇది నా యభిప్రాయము. పరిశీలించఁ గలరు.

      తొలగించండి
    10. బహువచనాంతమైన సంకెళ్ళు పదమునకు ద్వితీయను చేర్చగా సంకెళ్ళు+ను సంకెళ్ళను గామారినది. దీనికి అప్యర్థం చేరి సంకెళ్ళనున్ (సంకెళ్ళను కూడా) అయినదండీ! మీరనుకున్నట్లుగా నేను ప్రథమాంతానికి అప్యర్థం చేర్చలేదు. ద్వితీయాంతానికి అప్యర్థాన్ని చేర్చాను. గమనించగలరు.

      మీరన్నది ఏకవచనానికి వర్తిస్తుంది. బహువచనానికి వర్తించదు. ఉదా. గుఱ్ఱము+ను=గుఱ్ఱమును (ఏ.వ.) గుఱ్ఱములు+ను=గుఱ్ఱములను (బ.వ.)

      వీనికి అప్యర్థం జోడిస్తే...గుఱ్ఱములును/గుఱ్ఱములున్ (ఏ.వ.) గుఱ్ఱములనున్ (బ.వ.) గుఱ్ఱములను కూడా అని అర్థం...

      నమస్సులతో...

      తొలగించండి
    11. సరిగ్గా నేను నదే చెప్పుచుంటి నండి. బహువచనమునకు ద్వితీయ ను వచ్చినప్పుడు లడాగమము రావాలి.

      సంకెళ్ళు + ను (ద్వితీయ) = ల వచ్చి సంకెళ్ళులను
      (కొడవళ్లులను వలె- బాల. వ్యా. ఆచ్చి. 17. ల డాగమము లేకుండ సంకెళ్ళను రూపము రాదు)

      సంకెళ్ళులను + ను (ఏవ) = సంకెళ్ళులనున్
      ప్రథమ మీద నయితే సంకెళ్ళు +ను (ఏవ) = సంకెళ్ళున్ /సంకెళ్ళునున్


      మీరు చెప్పిన గుఱ్ఱములను లో బహువచనము లు అకారము పొందలేదు, “ల” ఆగమముయ్యినది.
      గుఱ్ఱము + ను = గుఱ్ఱమును (ఏక వచనము)
      గుఱ్ఱము + ను = గుఱ్ఱములను బహువచనము.
      ద్వితీయ విభక్తి వచ్చి నపుడు ప్రథమా బహువచనము లు రాదు. లడాగ మయి గుఱ్ఱములను.

      అందుకే కొడవళ్లు + ను = కొడవళ్లులను – ద్వితీయ బహువచనము.
      కొడవళ్లు + లు = కొడవళ్లులు - ప్రథమా బహువచనము.

      గుఱ్ఱములనున్ - ఏవార్థముతో నిది సాధువే “ల” ఆగమ మున్నది.

      సంకెళ్ళు లోని ళ్ళు చూచి మీరు బహువచనముగా భావించు చున్నారు.
      అది బహువచ నాంత తుల్యమై దాని మీద బహు వచనము వచ్చిన సంకెళ్ళులు. ద్వితీయ వచ్చిన సంకెళ్ళులను (లడాగమముతో). బాల. ఆచ్ఛిక. 17.
      ఇది నా యుద్దేశ్యమండి. ఆలోచించంచండి. నమస్సులు.

      తొలగించండి
  36. నాడు శ్రీ రాజీవ్ గాంధీ గారి మరణం తర్వాత అఖండ మెజార్టీతో గెలిచినప్పటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం

    శార్దూలవిక్రీడితము
    మా రాజీవుల నుగ్రవాద మగువే మార్కొన్నఁదాఁ గూలఁగన్
    దూరాలోచన జేసి యోటరులిలన్ దోడౌచు గెల్పించగన్
    ధీరుండౌ నరసింహరావుతగెడున్ దిక్కైన యోగ్యుండుగా
    కారా? గారము నుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతఁడే!

    రిప్లయితొలగించండి
  37. గురువుగారు సూచించిన మార్పులతో..

    శా:

    నేరారోపణ జేయుటెంత సులువో నిక్కంబె యీరోజులన్
    నోరాడించుచు దెల్ప నెంత శ్రమమో నొప్పార నిర్దోషిగా
    వీరావేశము పొంగ నొట్టుగొనగా వీరంగమున్ జేయుచున్
    కారాగారము నుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతడే

    నోరాడించు-ప్రసంగించు

    వై. చంద్రశేఖర్

    సూచనలకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  38. దూరుచు నిష్కారణముగ
    నేరములనుమోపి తనను నెట్టగ చెరలో
    తీరుపులో నిర్దోషై
    కారాగృహముక్తుడితడె కాగల రాజౌ

    రిప్లయితొలగించండి
  39. నేరస్థుండవనేమి మాకు ధనమున్ నిండార మద్యమ్ము నే
    భూరిన్ బంచెడు వాడె ముద్దని జనుల్ బుయ్యారమందున్న యా
    చోరుండన్ గొనియాడుచున్ బలికిరే చోద్యంబుగా నిట్టులన్
    కారాగారమునుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతఁడే

    రిప్లయితొలగించండి