14, డిసెంబర్ 2019, శనివారం

సమస్య - 3220 (పగలో మున్గినవారి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పగను మున్గ నడఁగుఁ బాపచయము"
(లేదా...)
"పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాని సమస్య)

35 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    గగనంబున్ గన రాక్షసుండతివనున్ కాజేయుచున్ మాయతో...
    వెగటౌ రీతిని కాంతనున్ కొలువునన్ వేసారగా నీడ్చుచో...
    దిగజారంగను కైపునందబలనున్ ద్వేషాగ్నినిన్ కాల్చగా...
    తగవుల్ తీర్చెడి ధర్మమూర్తులగుచున్ తాడించు వేళందునన్
    పగలో మున్గిన వారి పాపచయముల్ భస్మంబులౌ నెప్పుడున్


    పగ = విరోధము (శబ్దరత్నాకరము)

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అమిత్ షా ఉవాచ:

    పగలున్ రాతిరి వేకువన్ వదరుచున్ పంతమ్ము గర్వమ్ముతో
    తెగనాడంగను భాజపానహముతో తీండ్రించి బాధించుచున్
    వెగటౌ చిద్దును ద్రోయగా ముదముతో వెంటాడి జైలందునన్
    పగలో మున్గిన వారి పాపచయముల్ భస్మంబులౌ నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  3. గగనం బందున వేచియున్న తెలి మేఘాలోక సౌరం భముల్
    రగడల్ జేయుచు భూమిపై ప్రళయ రాగాలాల పించన్ దగున్
    సెగలే గ్రక్కుచు కోపతాప విషమున్ చోద్యం బుగా జిమ్మినన్
    పగలో మున్గిన వారి పాపచయముల్ భస్మంబులౌ నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    B-1)
    రావణవధ :
    __________________________

    వగతో రాముని చేరి సుప్పనక ప్రే - ప్సన్ దీర్చగా కోరినన్
    మగువన్ సీతను దప్ప నొల్ల నని, యా - మానైనవా డొప్పనన్
    తెగువన్ లక్ష్మణు గోరి ముక్కు చెవులన్ - త్రెంచించు కొన్నట్టిదై
    వగపున్ రావణు జేరి చెప్పుటను; నా - వైదేహి నంకించుటన్
    తెగెనే శీర్షము నేలపై బడెను పం - క్తిగ్రీవు డంతంబవన్
    పగలో మున్గిన వారి పాపచయముల్ - భస్మంబులౌ నెప్పుడున్ !
    __________________________
    వగ = శృంగారచేష్ట
    వగపు = దుఃఖము
    మానైనవాడు = అందగాడు(లక్ష్మణుడు)

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-1)
    రావణవధ :
    __________________________

    రగుల వగ పడతిని - రావణు డెత్తుక
    పోయి లంక జేర్చి - పొందు గోర
    సీత ఛీత్కరించె - శ్రీరాముడదె కూల్చె !
    పగను మున్గ నడఁగుఁ - బాపచయము !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  6. విరించి.

    ఖగరాట్వాహనుడైన విష్ణు నధమాంగమ్మందు జన్మించి తా

    నగమే భూషణ మైన శంకరుని పత్యాధ్యానమే వాసమై

    నగరాజమ్మును జేరి పారుచును దన్వంతమ్ములో కూడునా

    పగలో మున్గిన వారి పాప చయముల్ భస్మంబులౌ నెప్పుడున్.

    రిప్లయితొలగించండి


  7. కోపపు పల్కుల వలదు సు
    మీ పట్టింపులు తగవులు మింకిరి తనముల్
    పాప! పగను మున్గ నడఁగుఁ
    బాపచ యము? వలదె పోరు పడతి విడువుమా


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. భక్తి యుక్తు లగుచు భార్య పిల్లల తోడ
    తీర్థ యాత్ర సల్పి దివ్య మగుచు
    పేరు పొంది నట్టి విఖ్యాత మైన నా
    పగ ను మున్గ నడగు పాప చయము

    రిప్లయితొలగించండి

  9. ఆకాశవాణికి పంపినది


    మిగులన్ దోపరి గాండ్లుగా విడువకన్ మేలంపు కాలమ్ములన్
    సెగలన్ గ్రక్కెడు తీక్ష్ణదారముల నిశ్శేషమ్ముగా కుత్తుకల్
    తెగగోయన్ వెనుకాడకన్ భగభగా దివ్సాలు దివ్సాలుగా
    పగలో మున్గిన వారి పాపచయముల్ భస్మంబులౌ నెప్పుడున్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. మత్తేభవిక్రీడితము
    మృగమై పక్షినిఁ గూల్చుచున్ వగచి వల్మీకమ్మునన్ మౌని బో
    ధగ రామామృత పానమత్తుడయి సత్కావ్యాల రామాయణా
    దిగ వ్రాయందగె బోయఁ డాదికవియై! దృష్టించి రామున్ స్మరిం
    పగ లో మున్గిన వారి పాప చయముల్ భస్మంబు లౌ నెప్పుడున్!!

    రిప్లయితొలగించండి
  11. ( ముత్తాతల భస్మరాశులపై గగనగంగను పారించి ముక్తి కలిగించిన
    భగీరథచక్రవర్తితో రాజగురువు )
    జగముల్ గాంచగ ఘోరవీరతపమున్
    శ్లాఘ్యమ్ముగా జేసితే !
    గగనారూఢను గంగమన్ మధురవా
    గానందితన్ ధాత్రికిన్
    నగజానాథుని బేర్మి దాతలపయిన్
    నర్తింపగాజేసి ; తా
    పగలో మున్గినవారి పాపచయముల్
    భస్మమ్ములౌ నెప్పుడున్ .
    (నగజానాథుడు - ఈశ్వరుడు ;ఆపగ - నది )

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    సుగతిన్ గల్గగజేయ సాగరులకున్ శుభ్రాంబుసంపూతగా
    ఖగరాడ్వాహను పాదజాత వరగంగామాత జన్మించియున్
    సిగపూబంతిగ మారి ఈశ్వరునకున్ జేరెన్ ధరిత్రిన్ ., శుభా...
    పగలో మున్గిన వారి పాప చయముల్ భస్మంబులౌ నెప్పుడున్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పగలో మున్గగనేల? కాశి జనుమా! భావంబునన్ శాంతి గ...
      ల్గగ దీవింపుమటంచు కోరుమ! శుభాలన్ గూర్చు గంగానదిన్
      దిగుమా! ముక్కును మూసి మున్గుమదియే దిక్కౌనురా! రేయియో
      పగలో మున్గిన వారి పాప చయముల్ భస్మంబులౌ నెప్పుడున్!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  13. అగజానాథుని శీర్షభాగజటలన్ హర్షంబునన్ దూకె, నా
    ఖగరాడ్వాహనపాదపద్మభవయై కల్యాణముల్ గూర్చ నీ
    జగమంతన్ బ్రవహించె శుద్ధజలయై సత్యమ్ము భక్తిన్ తదా
    పగలో మున్గినవారి పాపచయముల్ భస్మంబులౌ నెప్పుడున్.

    (తత్+ఆపగ = తదాపగ)

    రిప్లయితొలగించండి
  14. తగవుల్ పెంచుచు దుష్టమైన మదితో ధర్మమ్ము వర్జించుచున్
    జగతిన్ వర్తిలు వారికిన్ దొలగునే సాగించు దుష్కర్మముల్ ?
    పగలన్ వీడి సుబుద్ధితో మెలగుచున్ బద్మాక్షు సేవించి యా
    పగలో మున్గిన వారి పాప చయముల్ భస్మంబులౌ నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  15. ఆకాశవాణిలో ప్రసారం:

    గగనంబందుననుండిశంభుశిరమున్ గంగమ్మతాఁజేరెఁ నా
    సిగలోచిక్కినదేవసింధువును దాక్షిణ్యంబుతోపృధ్వికిన్
    తగనంపెన్ శివుఁడెల్ల జీవులకు సంత్రాణంబునీయంగఁ నా
    పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌనెప్పుడున్

    రిప్లయితొలగించండి
  16. వచ్చే వారం ఆకాశవాణి వారి సమస్య ..

    "*చలిపులి పల్కరించగనె చయ్యన పారె సహస్ర రశ్మియున్"*

    గురువారం సాయంత్రం లోగా చేరేటట్టుగా
    Padyamairhyd@gmail.com

    కు పంపవలెను

    రిప్లయితొలగించండి
  17. వగ నీకేలనె వారిజాక్షి మనమున్ బాధింపగా నేరకో,
    అగ చాట్లెన్నియొ దాటి వచ్చితిమిగా యా దైవమే యండగా,
    సిగ నీబట్టినవాని యొక్క యురమున్ చీల్చేసెదన్ కాచుకో
    పగలో మున్గిన వారి పాప చయముల్ భస్మంబు లౌ నెప్పుడున్

    రామ్ కిడాంబి



    పగ బంధించును దాని పాశములలో బద్ధుండవై మూల్గుచున్
    పగ రాజిల్లును ప్రేమ కన్న వడిగా పంకంబులో ముంచునే
    పగ వేధించును రేబవళ్ళు నొకటై బంధంబులన్ ద్రుంచునే
    పగలో మున్గిన వారి పాప చయముల్ భస్మంబు లౌ నెప్పుడున్




    ద్వేష రాగములను వేగముగ విడిచి
    భయము క్రోధములను బార వేసి
    మదము మత్సరములను వదలుచు నా సురా
    *"పగను, మున్గ, నడఁగుఁ బాపచయము"*

    రామ్ కిడాంబి

    రిప్లయితొలగించండి
  18. పగలో మున్గిన వారి పాప చయముల్ భస్మంబులౌ నెప్పుడున్
    జగదాధారుని ధ్యానమే యొసగు సద్భావమ్ము సద్బుద్ధియున్
    సుగమంబౌనిక శాంతి సత్యములతో శోభిల్లగా లోకముల్
    జగమందెల్లెడ ధర్మ వర్తనము సౌజన్యమ్ము వర్ధిల్లుగా

    రిప్లయితొలగించండి
  19. సుగుణా!చెప్పెడునాదుమాటలనుదుస్సుంజేయజూతె?సురా
    పగలోమున్గినవారిపాపచయముల్భస్మంబులౌనెప్పుడున్
    సుగమంబిచ్చునునన్యప్రాణులకుదాసుస్నానమాడంగగా
    విగతుల్సైతములేచివత్తురుగనావిన్నేఱులోమున్గుచో

    రిప్లయితొలగించండి
  20. మ:

    వగలన్ బోవుచు వింత చేష్టలన కైవారంబు ముంచెత్తుచున్
    సగమై వొప్పుచు కౄర కార్యముల సంసారంబు లే కూల్చగా
    ఇగ మీ యాటలు సాగవంచు భటులే తెంచెంగదా సేవలో
    పగలో మున్గిన వారి పాప చయముల్ భస్మంబలౌ నెప్పుడున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి


  21. ఆకాశవాణి విశేషములు తెలుపగలరు‌

    రిప్లయితొలగించండి
  22. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    పగలో మున్గిన వారి పాప చయముల్
    భస్మమ్ము లౌ నెప్పుడున్

    సందర్భము: విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకువెళ్ళినాడు.
    "ఇది అంగదేశం. కామ దహనం జరిగిన ప్రాంతం. ఇక్కడే పవిత్రమైన శివుని ఆశ్రమ మున్నది. గంగా సరయూ నదుల నడుమ గల ఈ ఆశ్రమంలో రాత్రి నిదురించి పొద్దున్నే గంగానదిని దాటుదాము.." అన్నాడు విశ్వామిత్రుడు. (23 స)
    ఆ ప్రాంతంలోని మునులు ఆతిథ్య మిచ్చిరి. ఉదయాన్నే ఒక మంచి పడవ నెక్కించిరి. నది నడుమ హోరు మనే మహాధ్వని విని రాము డ దే మనగా విశ్వామిత్రు డిలా అన్నాడు.
    "కైలాస పర్వతే రామ!
    మనసా నిర్మితం సరః
    బ్రహ్మణా నర శార్దూల!
    తేనేదం మానసం సరః
    (రామా! కైలాసగిరిమీద బ్రహ్మ తన మనః సంకల్పంతో ఒక సరస్సు సృష్టించినాడు. అందుచేత దాని పేరు మానస సరోవరం.)
    అందులోనుంచే సరయూనది పుట్టింది. ఆ నది పవిత్రమైన గంగలో కలిసే శబ్ద మది.
    ఈ నిర్జరాపగ.. దేవనదియైన గంగలో మునిగిన వారి పాపాలన్నీ పోతాయి."
    (బా.కాం. 24 స..5-10 శ్లో.)

    మానసము = మానస సరోవరం
    నగజాధీశ గిరీంద్రము = కైలాస పర్వతం
    నిర్జరాపగ = దేవనది..గంగ
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    *పుణ్యనదీ స్మరణము*

    "నగజాధీశ గిరీంద్రమందు నజుడున్
    గల్పించె నా "మానసం"
    బొగి.. దానన్ బ్రభవించి యా "సరయుఁ" దా
    నుప్పొంగుచున్ భూ పవి
    త్రగఁ బే రొందిన "గంగ"లోఁ గలియు శ
    బ్దం బద్ది.. యీ నిర్జరా
    పగలో మున్గిన వారి పాప చయముల్
    భస్మమ్ము లౌ నెప్పుడున్"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    14.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  23. కాంచన నయనుండు కాంచనకశిపుఁడు
    ఘోర రావణుండు కుంభకర్ణుఁ
    డు శిశుపాలుర గనుఁడు మఱి దంతవదను
    బగను మున్గ నడఁగుఁ బాపచయము


    ఖగ రాజేంద్రు పయిం జరించు హరి విఖ్యా తాంఘ్రి యుగ్మంబునం
    దగ జన్మించి త్రిలోకచారిణియనన్ ధాత్రిం బ్రవేశించి చా
    గఁగ వేగంబుగఁ బ్రీతిఁ గొల్చుచు మదిన్ గంగాసరిత్తుం దరిం
    పగ లో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  24. ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
    సమస్యాపూరణ కార్యక్రమంలో...
    14/12/2019 శనివారం ప్రసారమైన నా పూరణ

    సమస్య. :
    **** ****

    పగలో మున్గిన వారి పాప చయముల్ భస్మంబు లౌ నెప్పుడున్

    నా పూరణ. శార్ధూలము
    **** *** ***

    వగచే వేడిరి ద్వార పాలకులు శాపమ్మే హరించన్ హరిన్!

    జగదీశుండగు శౌరి చూపె పథమున్ శాపంబు బోగొట్టగన్

    తెగ నిందించగ చక్రి ముక్తి నొసగెన్ త్రెళ్ళించియున్ వారికిన్!

    పగలో మున్గిన వారి పాప చయముల్ భస్మంబు లౌ నెప్పుడున్

    -- ఆకుల శాంతి భూషణ్

    వనపర్తి

    రిప్లయితొలగించండి
  25. పరులహింసవలన బరగెడుపాపమా
    పగనుమున్గనడగు పాపచయము
    పగనుబెంచునెడల బ్రాణమునకుముప్పు
    కలసిమెలసియుండ కలదుసుఖము

    రిప్లయితొలగించండి
  26. శ్వేత గిరుల నుండి సింధువు నేజేర
    పరుగు తో ప్రయాగ వారణాశి
    దాటుచు ప్రవహించు మేటి పవిత్ర యా
    పగను మున్గ నడఁగుఁ బాపచయము

    రిప్లయితొలగించండి

  27. ఈ నాటిశంకరా భరణమువారి సమస్య

    పగలో మున్గిన వారి పాపచయముల్ భస్మంబు లౌనెప్పుడున్

    ఇచ్చిన సమస్య పాదము మత్తేభము నా పూరణము సీసములో

    “జయవిజయులు మూడు జన్మములు శ్రీహరికి విరోధులుగా పుట్టి అతని పై పగ పెంచుకొని హరి చేత మరణమునొంది పాపములు పొగొట్టు కున్నారు. పగ వలన నీకు సుఖములు కలుగును ఓ జనమేజయా సర్పయాగము చేయుము” అని ఉదంకుడు తెలిపెనని భావన తో పూరణము


    నిరతము శ్రీహరిని డొగరుచు హిరణ్య
    కశిపుడు బాసెగా నసువులు హరి

    వలనన్, విడువక నా వాసుదేవుని దూష
    ణముల నాడుచు మరణమ్ము నొందె

    గా శిశుపాలుడు కంసారి చేతన్,ధ
    రణిజను చెరబట్టి రావణుండు

    రాముని చేత పరాగమమును పొందె .
    విస్మయము వలదు, వినుము మాన

    వ, (పగలో మున్గిన వారి పాపచయముల్
    భస్మంబు లౌనెప్పుడున్) స లక్ష


    ణముగ తరచి చూడగ పురాణముల లోన,
    మొదలిడుము సర్ప యాగము ముదము తోడ
    నీవు , జనమేజయా! కల్గు నీకు సుఖము
    లని యుదంకుడు బలికె శలంగు గాంచి

    శలంగుడు రాజు

    రిప్లయితొలగించండి
  28. కామ క్రోధములను కడకు నెట్టుచు సదా
    మానసమున హరిని మానుగాను
    తలచి పాపములను తొలగజేసెడుసురా
    పగను మున్గ నడగు బాప చయము.

    రిప్లయితొలగించండి
  29. ఆటవెలది
    రామ మూర్తిఁ గొలువ నామ సంకీర్తన
    దాసు లాచరించి ధరణి పైన
    ధన్య చరితు లైరి యన్యుల కదియె నే
    ర్పగను మున్గ నడఁగుఁ బాపచయము

    రిప్లయితొలగించండి
  30. మత్తేభము

    సుగమంబౌ మునగంగపుష్కరములల్ జూడన్ గపంచాంగముల్

    తగువేళన్ పసిగట్టుచున్ నదులప్రాధాన్యంబులెక్కించుచున్

    జగతిన్ మానవసేవలోమునిగి స్వేచ్ఛన్ !గంగలో రాత్రులో
    *పగలో మున్గిన వారి పాప చయముల్ భస్మంబు లౌ నెప్పుడున్*

    *గాదిరాజు మధుసూదనరాజు తాడిపత్రి అనంతపూరము జిల్లా*

    నిత్యము మానవసేవలో మునిగి యుండే ..స్వచ్ఛందమానవసేవా తత్పరులు ...పగలో రాత్రో ఎపుడైనా ఒకసారి గంగలో మునిగితే చాలు.. పాపాలు భస్మమైపోతాయి. అట్టి వారికి పుష్కరాలతో పనిలేదు

    రిప్లయితొలగించండి