2, జనవరి 2020, గురువారం

సమస్య - 3239 (కలిమి గలుఁగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలిమి గలుఁగు వసించినఁ గాననమున"
(లేదా...)
"కలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానలకేఁగి వసించువారికిన్"
(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో...)

66 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  జలుబును దగ్గు నిచ్చుచును జబ్బులు తెచ్చెడు హైద్రబాదునన్
  కలలను గూడ పొందనిది,...కమ్మగ పీల్చగ రోజురోజునన్
  మలినములేని వాయువును మందుల కర్చులు పారిపోవగా
  కలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానలకేఁగి వసించువారికిన్

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  వలపులు మీరు సంస్మృతులు వందలు వేలుగ బాధనిచ్చెడిన్
  తలపులు వీడి భారముగ తల్పులు మూయుచు నోరుగల్లునన్
  సులువుగ హైద్రబాదునను సొంపున జేరగ వాఙ్మయమ్మునౌ
  కలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానలకేఁగి వసించువారికిన్

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !
  అందరికీ ఆంగ్లవత్సర శుభాకాంక్షలు
  A-1)
  శాంతి మించిన ధనమేది :
  __________________________

  పండ్లు పూవులు వృక్షముల్ - పలుకరింప
  పచ్చ దనమున మనసదె - పరవశింప
  సరసి యందున లభియింప - స్వచ్ఛ సరము
  వింత పక్షులు జంతువుల్ - విందు నిడగ
  కక్ష కార్పణ్యములు లేక - కలుగు శాంతి
  శాంతి మించిన ధనమేది - జగతి యందు
  కలిమి గలుఁగు వసించినఁ - గాననమున !
  __________________________
  విందు = సంతోషము
  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి


 4. "మంచిని గోరుచు తపమొన
  రించగ భవబంధముల పరిధియున్ మీరన్
  సంచితపు కలిమి గలుఁగు వ
  సించినఁ గాననమున" ప్రవచించిరి గురువుల్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. విపిన మందున లభియించు వేయి నిధులు
  మధుర గానము కోయిల సుధలు కురియ
  జాలు వారును జలపాత చంద్ర ద్యుతి
  కలిమి గలుగు వసించినఁ గాన నమున

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చంద్రద్యుతి' అన్నపుడు 'ద్ర' గురువై గణభంగం. "చంద్రకాంతి" అనండి.

   తొలగించండి
  2. విపిన మందున లభియించు వేయి నిధులు
   మధుర గానము కోయిల సుధలు కురియ
   జాలు వారును జలపాత చంద్ర కాంతి
   కలిమి గలుగు వసించినఁ గాన నమున

   తొలగించండి
 6. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  B-1)
  శాంతి మించిన ధనమేది :
  __________________________

  కలుగును పుష్ప జాతులను - గాంచిన మించిన శాంతి సౌఖ్యముల్
  కలుగవె జంతు జాలముల - గాంచిన హెచ్చిన విందు వేడుకల్
  కలుగదె పక్షి రీతులను - గాంచిన మిక్కిలి నంద నెయ్యముల్
  కలుగును పుష్పకీటములు - క్రాలుట గాంచిన తేనె విందులే
  కలుగదె పర్వతాగ్రమున - గాంచగ హృష్టియె చెట్టుచేమలన్
  కలుగునె కోట్ల కోట్ల ధన - కంట్లము లున్నను శాంతి స్వాంతమున్
  కలిమి ఘనంబుగాఁ గలుగుఁ - గానలకేఁగి వసించు వారికిన్ !
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 7. నేటి శంకరా భరణముసమస్య

  కలిమి గలుఁగు వసించినఁ గాననమున"


  రాముడు వనవాసమునకు వెడలునపుడు సీతను అడవులకు వలదు అని పలుకగా సీత పలికిన మాటలు


  పతికి చేయు సేవల కన్న భాగ్యమేది
  పతిని వీడి భోగమ్ములు బడయ రాదు
  పతిని యెడబాసి యీ సీత బ్రతుక లేదు
  కలిమి గలుగు వసించిన కాననమున
  ననుచు పలికె రాముని చరణములు బట్టి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పతిని+ఎడబాసి' అన్నపుడు యడాగమం రాదు. "పతిని నెడబాసి/భర్త నెడబాసి" అనండి.

   తొలగించండి
 8. నిలువగనీడలేదనుచు,నివ్వెరపోవగరైతుజీవికే
  విలువలు మాసిపోయెనని,విజ్ఞులుయీ మొరలాలకించకన్
  పలుపునగట్టివారలను,పాశవికమ్ముగ వీధికీడ్వగా
  కలిమి ఘనంబుగా గలుగు,గానలకేగి వసించువారికిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'విజ్ఞులు+ఈ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. 'ఆలకించక' అన్నది కళ. ద్రుతాంతం కాదు. "విజ్ఞులె యీ మొరలాలకించకే" అనండి.

   తొలగించండి
 9. తలపులుగొప్పవై గెలువ, ధన్యతజెందగ జేయునెప్పుడున్!
  సులువగు సాహితీప్రభల,సుందరమౌ నగరమ్ములేనిచో
  విలువలు మాసిపోవుగద,విజ్ఞులపాలిట శాపమై నికన్
  "కలిమి ఘనంబుగా గలుగు,గానలకేగి వసించువారికిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "శాపమై యికన్" అనండి.

   తొలగించండి
  2. తలపులుగొప్పవై గెలువ, ధన్యతజెందగ జేయునెప్పుడున్!
   సులువగు సాహితీప్రభల,సుందరమౌ నగరమ్ములేనిచో
   విలువలు మాసిపోవుగద,విజ్ఞులపాలిట శాపమైయికన్
   కలిమి ఘనంబుగా గలుగు,గానలకేగి వసించువారికిన్.
   [సవరణ పాఠము ధన్యవాదాలతో]

   తొలగించండి
 10. B-2)
  శ్రీరామునకు వలె :
  __________________________

  కలిగెను గాఢ స్నేహమది - గైరికు తోడను గంగ దాటుటన్
  కలిసెను వాయుపుత్రుడదె - కానగ భూమిజ జాడ నీడలన్
  కలిగెను చింకిలీకముల - కమ్మని తోడదె సేతు బంధనన్
  కలిగెను రావణాదులను - గావొనరింప, ప్రకీర్తి చంద్రికల్
  కలిగెను శాంతి సౌఖ్యములు - క్రమ్మర లోకములందు విందుగన్
  కలిమి ఘనంబుగాఁ గలుగుఁ - గానలకేఁగి వసించు వారికిన్ !
  __________________________
  గైరికుడు=బోయ-గుహుడు

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 11. ముక్తి యన్ని కలుములందు ముఖ్యమనుచు
  తత్పురుష ధామమొక్కటె దాని కిరువు
  దాన మునివరుల్దాపసుల్దలచిరట్టి
  కలిమి గలుఁగువసించినఁ గాననమున"

  రిప్లయితొలగించండి
 12. కస్తూరి శివశంకర్గురువారం, జనవరి 02, 2020 6:02:00 AM

  అడవి పక్షులకెవ్వరాహారములను
  తరువులకెవరు తోడుగ దయనుజూపు
  కలిమి గలుఁగు వసించినఁ గాననమున
  మర్మ మేమిటో తెలుసుకో నిర్మలముగ

  రిప్లయితొలగించండి
 13. మైలవరపు వారి పూరణ

  విశ్వామిత్రుడు బాలరాముని పంపుమని కోరు సందర్భము...

  బలమిసుమంతలేని పసిబాలుడు రాఘవుడంచునేల చిం...
  తిలెదు ? మహాశనమ్ములు వనీస్థలినుండు., మహౌషధమ్ములున్
  గలవట., విద్యనేర్పెదను., కాదనబోకు., మహత్తరమ్మునౌ
  కలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానలకేఁగి వసించువారికిన్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

  రిప్లయితొలగించండి


 14. పలుకుల నెమ్మితోడు తమ భావన లందు పరాత్పరుండె భా
  సిలగను జీవితమ్మున ప్రసిద్ధము గా యనురాగమొక్కటే
  బలిమియు మీరగా, విరియబాఱగ బుద్ధియు మోక్షగామిగా
  కలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానలకేఁగి వసించువారికిన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "ప్రసిద్ధముగా ననురాగ మొక్కటే" అనండి.

   తొలగించండి
 15. నిర్మల o బైన చిత్తము నిశ్చలతఁయు
  దైవ చింతనకను వౌచు తప మని యె డి
  కలిమి గలుగు వసించి న కాన నమున
  ననుచు మునులెల్ల భావించి ర న వ రతము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నిశ్చలతయు' ఇందులో అరసున్న ఎందుకు?

   తొలగించండి
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 17. ఇలపయి నన్ని ప్రాంతముల నీసమయమ్మున జీవనమ్మునన్
  వలసిన వస్తుసంతతు లవారితమూల్యములై దివంబునన్
  నిలబడి యందకుండినవి నిక్కము మోక్షము గోరుచుండినన్
  "గలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానలకేఁగి వసించువారికిన్"

  రిప్లయితొలగించండి
 18. కలకల రావముల్ శుక పికమ్ముల కమ్మని కంఠ నాదముల్
  జలజల పారు యేటి సడి ఝల్లనిపించెడి శ్రావ్య రాగముల్
  కలుగును శాంతి సౌఖ్యములు కమ్మని విందొనరింప వీనులన్
  కలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానలకేఁగి వసించువారికిన్

  రిప్లయితొలగించండి
 19. అడవినందుండు మృగముల నణచ ధైర్య
  కలిమి గలుఁగు వసించినఁ గాననమున
  రాజకీయము నందుజేర నవినీతి
  కలిమి గలుగు జనతను కల్లసేయ

  రిప్లయితొలగించండి
 20. కలిమి యనంగ గాదయ నిగారపుటాభరణంబులున్ సిరుల్
  కలిమి యనంగ భూములవి గాదయ శాశ్వతుడా మురారి యే
  కలిమి నతండె నెల్లరను గాచును ఘోరతపంబు సేయగా
  కలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానలకేఁగి వసించువారికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కలిమి నతండె యెల్లరను...' అనండి.

   తొలగించండి
 21. చంపకమాల
  జలములు వాయువుల్ మిగుల శబ్ధము లోకుల మానసమ్ములున్
  కలుషిత మయ్యె స్వార్థమున గండము జీవన మీ పురమ్ములన్
  ఫలముల నారగించి భగవంతుని భావనఁ జేయ మోక్షమన్
  గలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానలకేఁగి వసించువారికిన్

  రిప్లయితొలగించండి
 22. మిత్రులందఱకు నమస్సులు!

  చలమును వీడి శాంతమునఁ జక్కఁగ కాఱడవిన్ వసించి, ని
  శ్చలమగు మానసమ్మునను సద్గురుమూర్తి సుబోధచొప్పునన్
  బలుమఱు ధ్యానమున్ జలుప బ్రహ్మము తానుగ వచ్చు! నీ విధిన్

  గలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానలకేఁగి వసించువారికిన్!

  రిప్లయితొలగించండి
 23. చం:

  కలుషితమైన నీరు మరి గాలియు దిండిని నొక్కటేమిటో
  విలవిల లాడు జీవితము వింతగు రోగములెన్నొ జేరగన్
  కొలువును గూడి జేరనిటు కోసుల దూరము పట్టణంబునన్
  కలిమి ఘనంబుగా గలుగు గానలకేగి వసించు వారికిన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 24. రిప్లయిలు
  1. సలిలసమీరసాంద్రజనసంగతకశ్మలహేతురోగసం
   కలితవిధానమందు పురకమ్రనివాసుల కద్వితీయమౌ
   కలిమి ఘనంబుగాఁ గలుగుఁ, గానలకేఁగి వసించువారికిన్
   బలిమి ఘనంబునౌ విమలవాయుజలమ్ములు స్వీకరించగన్.

   తొలగించండి
 25. విలువకలిగిన గంధపువిటపులనెడు
  కలిమి,గలుగువసించినగాననమున
  లభ్యమగునార్య!యచ్చటలలితములగు
  నన్నిరకములవనరులుమిన్నగాను

  రిప్లయితొలగించండి
 26. సింహ శార్దూల జంతు రాశి చరియింపఁ
  బంట పండఁగ వాటికిఁ గంటఁ బడఁగ
  నా క్షణంబ నిశ్శంకగ భక్షణంపుఁ
  గలిమి గలుఁగు వసించినఁ గాననమున


  సలలిత మానసం బలరఁ జక్కఁగఁ జేయుచు దైవచింతనల్
  కలవర మింత యేని మదిఁ గానక యానుచుఁ గందమూలముల్
  పలలము మాని సంతతము ప్రాఁజదువుల్ వెలయించు చుండఁ బ్రాఁ
  గలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానల కేఁగి వసించు వారికిన్

  రిప్లయితొలగించండి
 27. కలకలరావముల్గలిగికాననమంతయునందగించగా
  సలిలపుధారలోమునుగసామజశ్రేణులునుత్సహించగా
  లలితమనోహరంబగుచులాలనజేయుచునాసువాసన
  ల్గలిమిఘనంబుగాగలుగు,గానలకేగివసించువారికిన్

  రిప్లయితొలగించండి
 28. అలజడి లేని ప్రాంతమది యద్భుత రీతిని ముక్తి గోరుచున్
  దలపులలోన శంకరుని తల్చి తపమ్మును సేయనెంచినన్
  ఫలప్రద మౌగదా యదియె భాగ్యము గాదుటె మోక్షగామికిన్
  కలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానలకేఁగి వసించువారికిన్

  రిప్లయితొలగించండి
 29. క్రూర మృగమ్ములు తిరుగు కుందిలమున
  భయము తో బ్రతుకుట దుర్లభమ్ము గాదె
  యెట్లు చెప్పితి వోయి నీవిట్టు లెటుల
  కలిమి గలుఁగు వసించినఁ గాననమున?

  రిప్లయితొలగించండి
 30. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "కలిమి గలుఁగు వసించినఁ గాననమున"

  సందర్భము:
  తపస్వినాం రణే శత్రూన్
  హంతు మిచ్ఛామి రాక్షసాన్
  కి.కాం. 6-25
  "తపస్వులకు శత్రువులైన రాక్షసులను సంహరిస్తాను." అని రాముడు మునుల కభయ మిచ్చాడు..
  తాపసాశ్రమ మండలమైన దండకాటవిలో ప్రవేశించినాడు రాముడు. దండకు డనే రాజు రాజ్యమే శుక్రుని శాపంచేత దండకారణ్య మయింది.
  ఆ ప్రాంతంలోని మునులు వచ్చి రాక్షసులు చెలరేగి యజ్ఞ యాగాదులను విధ్వంసం చేయడం పరిపాటి యైపోయిం దని ముఖ్యంగా పంపానదీ తీరవాసులూ శరభంగాశ్రమ సమీపాన ప్రవహించే గంగా నదీ తీరవాసులూ అయిన ఋషు లధికంగా రాక్షసులచే పీడింపబడుతున్నా రని మమ్మల్ని కాపాడు మనీ ప్రాధేయపడ్డారు.
  పై విధంగా రాము డభయ మొసంగినాడు. ఆ సందర్భంలోనిది పద్యం. మీ దీవనలే మాకు కలిమి.. అన్నాడు.
  అధ్యాత్మ రామాయణంలో ఇలా...
  మునులు తమ ఆశ్రమాలు చూపించడానికి తీసుకువెళితే మార్గ మధ్యంలో ఎన్నో చోట్ల పుఱ్ఱెలు, ఎముకలు పడివున్నాయి. రాము డివి ఎవ్వరి వన్నాడు. ఇవి ఋషుల శిరస్సు లని అవి తినగా మిగిలిన ఎముక లని వారు చెప్పినారు.
  శ్రుత్వా వాక్యం మునీనాం స భయ దైన్య సమన్వితం ప్రతిజ్ఞామకరోద్రామో వధాయాశేష రాక్షసామ్.. 2-22
  అశేష రాక్షస సమూహాన్నీ వధిస్తా నని రాముడు ప్రతిజ్ఞ చేసినాడు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఆముష్మికోన్నతి నాశించు మును లుంద్రు
  మాయనుఁ దరియించు మానవాళి..
  యాటవికపు జాతు లైనట్టి వారుంద్రు
  మాయికుల్ గానట్టి మానవాళి..
  శాంతి కాముకులు విశ్వ ప్రేమికులు వార
  లడవిలో నివసింతు రచట నచట..
  మునుల తపః కార్యములకు నాటంకమ్ము
  లూరకే కల్పించు వార లెంత
  వారయిన, రాక్షసులునైన వదలబోను..
  సంహరింతును.. కానలన్ సంచరింతు..
  దీని నమ్ముడు.. నాకు మీ దీవన లను
  కలిమి గలుఁగు వసించినఁ గాననమున

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  2.01.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 31. క్రొవ్విడి వేంకట రాజారావు:

  గురువుగారికి నమస్కారములు. నిన్నటి, నేటి పూరణలను పంపుతున్నాను. దయతో పరిశీలించగలరు.

  01-01-2020:

  కాంతుల నెల్లెడ నిలుపుచు
  నెంతయు సుఖసంపదలిడి నిరతము మీకున్
  సంతసమేర్పరుచుచు ని
  ర్వంతల నిడుగాత! నూత్నవత్సర మింకన్.

  02-01-2020:

  ఆత్మశుద్ధిని గూడుచు ననవరతము
  నిశ్చలమ్మగు భక్తితో నీలగళుని
  స్థిరముగా గొల్చి నంతట సిద్ధి యనెడి
  కలిమి గలుగు వసించిన గాననమున

  రిప్లయితొలగించండి
 32. దేవుని కృప లేనిదే సాధ్యమవదేది
  మనిషి యత్నమున్న కానిదేది?
  నిలుకడగల కలిమి గలుగు, వసించిన
  కాననమున గూడ కలసివచ్చు.

  రిప్లయితొలగించండి
 33. కులముకు పెద్దపీటయని,కూటమిగట్టుచు మార్చనాతనిన్
  పలుచనజేసెనీప్రభువు,పాలననంతయుప్రక్కకెళ్ళగా
  విలువలు వీగిపోయెనిట,విద్యకుబోధననగూడ యాంగ్లమే
  కలిమి ఘనంబుగా గలుగు,గానలకేగి వసించువారికిన్.

  రిప్లయితొలగించండి
 34. అలజడి లేని ప్రాంతమది యద్భుత రీతిని ముక్తి గోరుచున్
  దలపులలోన శంకరుని తల్చి తపమ్మును సేసినంత స
  త్ఫలమగు వాస్తవమ్మదియె భాగ్యము గాదుటె మోక్షగామికిన్
  కలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానలకేఁగి వసించువారికిన్

  రిప్లయితొలగించండి
 35. కులుకులు కుమ్మరించుచును,గొప్పగమాపయి ముద్దులిచ్చుచున్
  విలువలుయెన్నొజెప్పుచును,విందులలోమము గుమ్మరించుచున్
  తలపులనూరుభావనల తన్నగనయ్యవి మూడుముక్కలౌ
  కలిమి ఘనంబుగా గలుగు,గానలకేగి వసించువారికిన్.

  రిప్లయితొలగించండి
 36. చలువలుగ్రమ్ముమంచుమల, చక్కని శాంతివహించు గొప్పగా
  విలువగు జీవనమ్మునకు,వేత్తగనిల్చును వేదసం హితై
  సులువుగ ముక్తి సాధనకు,సూక్తిసుధాకరమై వహించగా
  కలిమి ఘనంబుగా గలుగు,గానలకేగి వసించువారికిన్.

  రిప్లయితొలగించండి
 37. తేటగీతి
  సర్వ కాలుష్యములమధ్య శాంతి లేక
  బ్రతుకు నీదుట మిగుల దుర్భరముఁ గాదె
  భక్తి భగవంతుని గొలువఁ బరమనియెడు
  కలిమి గలుఁగు వసించినఁ గాననమున

  రిప్లయితొలగించండి
 38. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
  *తే గీ::*

  కొలువు చేయ వలెననెడి గొడవ లేదు
  జనుల పొగుడుచు జేయఁ భజనలు లేవు
  గృహము బదులు మనకు మెండు గుహలు గలవు
  *కలిమి గలుఁగు వసించినఁ గాననమున*
  కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి

  రిప్లయితొలగించండి
 39. ఇహమునాముష్మికమునొందనిలనుతపము
  మనుజుడొనరింపవలయును, తనువుమీద
  యాస విడువుము శ్వాసపై ధ్యాస నుంచు
  కలిమి గలుఁగు వసించినఁ గాననమున

  రిప్లయితొలగించండి
 40. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "కలిమి గలుఁగు వసించినఁ గాననమున"

  సందర్భము: ఏకాంతమంటే ఒక్కడే వుండడం. ఐహిక బంధాలనుండి విడివడనివాడు ఒక్కడే వుండలేడు. వుంటే పిచ్చెత్తిపోతాడు. అందుకని వాడు నలుగురి నడుమనే వుండాలి. ఒక్కడే వుంటే అది వాడికి ఒంటరితనం.
  ఐహిక బంధాలనుండి విడివడినవాడు ఒక్కడే వుండగలడు. వుంటే మరింత ఎదిగిపోతాడు. ఎందుకంటే అది వాడికి ఏకాంతం.
  ఏకాంతంలోనే ఏకాగ్రత కుదురుతుంది. జనాల నడుమ అది దొరకదని అడవులకు వెళ్ళి తపస్సులు చేసుకోవడం అనాదిగా వున్నదే!
  ఏకాంత మనేదే కలిమి.. ఒక సంపద. కాననంలో నివసిస్తే అది కలుగుతుం దని
  పద్యంలో చెప్పబడింది.
  కస్తరతి కస్తరతి మాయామ్? యః సంగం త్యజతి.. యో మహానుభావం సేవతే, నిర్మమో భవతి 46 యో వివిక్త స్థానం సేవతే, యో లోకబంధ మున్మూలయతి... 47 అంటాడు నారద భక్తి సూత్రాలలో నారదమహర్షి.
  సంక్షిప్తంగా వీని భావ మిది.
  ఎవడు తరిస్తాడు? ఎవడు తరిస్తా డీ మాయను? ఎవడైతే సంగమును త్యజిస్తాడో..ఎవడైతే మహానుభావులను సేవిస్తాడో.. నిర్మము డౌతాడో..
  ఎవడు ఏకాంత స్థలాన్ని సేవిస్తాడో.. లోకంతో బంధాన్ని తెగతెంపులు చేసుకుంటాడో.. (వాడు మాత్రమే!)
  అంటూ ఇంకా పేర్కొన్నాడు. చివరకు స తరతి స తరతి స లోకాం స్తారయతి.. (అతడు తరిస్తాడు.. అతడు తరిస్తాడు.. అంతేకాదు. లోకాన్నీ తరింప జేస్తాడు..) అన్నాడు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  అరయ నెయ్యది పరమ తత్త్వానుభూతి

  నరునకు నొసంగునో.. పావనతను నిలుప

  గలుగునో.. యటువంటి యేకాంత మనెడు

  కలిమి గలుఁగు వసించినఁ గాననమున

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  2.01.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి