5, జులై 2020, ఆదివారం

సమస్య - 3418

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కోమలి తలమీద రెండు కొమ్ములు వుట్టెన్"
(లేదా...)
"కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్"  

39 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    కుమ్మగ నార్యపుత్రునహ గుమ్మయె జేయుచు నట్టహాసమున్
    దమ్ములు క్రుంగి పోవగను దారుణ రీతి యమేఠినందునన్
    గమ్మున జేర్చ కాంగ్రెసున గర్వము హెచ్చగ వద్ర రాణికిన్
    కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి విశిష్టాంకితం)

    వమ్మవు గద్యపూరణలు వందలు జేయుచు చీదరించుచున్
    సుమ్ముగ నాంధ్ర ఛందమును చూడగ నయ్యరు విస్తుపోవుచున్
    కమ్మగ కంది శంకరుని గాలులు వీచగ జృంభణమ్మునన్
    కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్

    రిప్లయితొలగించండి


  3. ఆమని పాడవె తీయగ
    కోమలి, తలమీద రెండు కొమ్ములు వుట్టెన్
    శ్యామలకు చూడవే రా
    వే మాలక్ష్మి వలె రావె వేంచేయి వెసన్



    జిలేబి

    రిప్లయితొలగించండి


  4. తెములుము సఖి వెడలెదము మ
    నము కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీ
    ర్షమునందుఁ గాంచఁగన్ త్వరి
    తముగా నిక యెర్రగడ్డ దవఖానాకై !



    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. ఉ//
    గుమ్మము దాటివచ్చిరిక కూరిమి తోడను పెద్దలెందరో !
    బొమ్మల పెండ్లియాటలకు బోలెడు సందడి జేయు చుండగన్ !
    నమ్ముట శక్యమా జనుల నాలుక ద్వందపురీతి బల్కగన్ !
    కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్ !!

    రిప్లయితొలగించండి


  6. తమ్మల యేను కారణము తన్వి మృదుత్వము పోయె హెచ్చుగా
    కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్
    గమ్మతు రాజమౌళిదగు కాల్పనికమ్మగు చిత్ర మాయె రా
    వమ్మరొ చూచెదమ్మిదె ప్రభాసుడె నాయకు డంట దానిలో


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. ఉ//
    కొమ్మలు, పిల్లలున్, శిరసు గొట్టుకొనంగను యూసులాడ గన్ !
    రమ్మని జెప్పగా గదిలె రాగము దీయుచు హేళనంబుగా !
    తుమ్మిన బాలురే బలికె తుమ్మిన సత్యము జూపునింకనన్ !
    కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షము నందుఁ గాంచఁగన్ !!

    రిప్లయితొలగించండి
  8. గోముగ దెబ్బలు వేసితి
    కోమలి తలమీద రెండు ; కొమ్ములు వుట్టెన్
    నామె కనాయాసముగనె
    కామిత సొమ్ము కనకములు గలిగినవేళన్

    రిప్లయితొలగించండి
  9. ఇమ్ముకొనెన్ గృహాంగణము నిమ్ముగ నాటిన పూల మొక్కలో
    ఘుమ్మని సౌరభావళుల గూర్చెడు పూవుల సోయగంబులా
    నమ్మిన నమ్మకున్న నళినానన సంతస మొందె నా విరుల్
    కొమ్ములు రెండు పుట్టినవి, కోమలి శీర్షమునందు, గాంచఁగన్.

    రిప్లయితొలగించండి
  10. సామియమాత్యుడవగన్
    గామినికే గర్వమెచ్చి కరుణనె వీడన్
    జామాత కాంచి పలికెను
    కోమలి తలమీద రెండు కొమ్ములు వుట్టెన్

    రిప్లయితొలగించండి
  11. ఏమనిచెప్పుదు సఖియా
    కోమలి తలమీద రెండు కొమ్ములు వుట్టెన్
    కాముడుతనసోదరుఁడను
    నామనితనతోననయమునాటాడుననున్

    రిప్లయితొలగించండి
  12. దమ్మము తప్పి యెన్నికల తంతును గెల్చినట్టి నా
    తమ్ముడు మంత్రియయ్యె నిక ధారుణి నేలెడువాడు వాడటం
    చమ్మడు పొంగిపోవగ నహమ్మది పెర్గగ గాంచి పల్కిరే
    కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్.

    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    అమ్మ దయాంతరంగ ప్రణవాకృతి శ్రీ లలితాంబ మందహా..
    సమ్ముల వెల్గు తల్లి విలసన్నవరత్నకిరీటకాంతితో
    నిమ్ముగ దర్శనమ్మిడగ నిందుకళాగ్రములిట్లు తోచెడిన్
    కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మరొక పూరణ 🙏🙏

      అమ్మతనమ్ము దక్కని వ్యథార్తను నన్ దయ సుంత లేక మూ...
      ర్ఖమ్ముగ దండ్రియున్ కొడుకు కాల్చిరి చూడుమటంచు రెండు వ్యా...
      జ్యమ్ముల వేయ., కాపునిడె న్యాయసురక్షవిభాగముల్ భళా!
      కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  14. * శంకరాభరణం వేదిక *

    05/07/2020...ఆదివారం

    సమస్య
    ********
    కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్"  

    నా పూరణ. ఉ.మా.
    *** ********

    ఇమ్మగు పారిజాతమును నీయగ రుక్మిణికిన్ మురారియే...

    క్రమ్మిన తాప వహ్ని తన కాయము నంతయు గాల్చ "సత్య" రో

    షమ్మున ప్రాణనాథుడగు సారసనాభుని ఱొమ్ము దన్నగా

    నిమ్మహి వేల్పు శౌరి మది నెంచె నిలా సతి.."మీఱ గర్వమే

    కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందు గాంచగన్ "


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷



    రిప్లయితొలగించండి
  15. రాముండను వాడొక్కడు
    పామరు డై కలను గాంచె పలు వింత ల నా
    సోమరి కందున్ గనబడె
    కోమలి తలమీద రెండు కొమ్ములు పుట్టె న్

    రిప్లయితొలగించండి
  16. ఈనాటి శంకరా భరణము వారి సమస్య

    కోమలి తలపైన రెండు కొమ్ములు పుట్టెన్


    ఇచ్చిన సమస్య కందపాదము

    నా పూరణము సీశములో


    కృష్ణుని చంపుటకు పూతన అతి సుందరవతిగా మారి పాలు ఇచ్చు నెపముతో నంద కులమునకు వస్తుంది. పూతన మరణము పొందు నపుడు జరుగు పరిణామములు ఒక్కొక్కటిగా గని నంద కులము లో జనులు పరుగిడినారు అను భావన



    వ్రజవరుడు చనులన్ వాటము గాపట్టి ముదముగ వేయగ మొదటి గుటక

    భీకఱ మైనట్టి పీడను పొందుచు, రెండవ గుటకుకు గుండె గతులు

    తప్పగ చుక్కలు ద్రాపమున గని ఘోరంబుగ నచట నరచుచు పడెను

    ధరణి పై ,కోమలి తలపైన రెండు కొమ్ములు పుట్టె నెదుటి పలువరుసలు



    కోరలుగ మార, రుధిరము కార నోట

    పూతన తన కోమల రూపమును వదలచు

    మరణమును పొంద భీతిల్లి పరుగు లెట్టె

    జనులు భీషణ దృశ్యమున్ కనుల గాంచి





    రిప్లయితొలగించండి
  17. రామునిపై మోహంబున
    లేమగ శూర్పణఖ మారె రేపగ వలపున్
    కామిని దెగడగ రాముడు
    కోమలి తలమీద రెండు కొమ్ములు వుట్టెన్

    రిప్లయితొలగించండి
  18. కోమలముగ నూనె నలది
    సీమంతిని కొప్పునట్టుచెలువము తోడన్
    భామయు జడలేయ ననిరి
    కోమలి తలమీద రెండు కొమ్ములు పుట్టెన్

    రిప్లయితొలగించండి
  19. ఇమ్ముగనాగరీకమనునిచ్ఛనుకోందరుసుందరాంగులున్
    కమ్మనివేణిగాదనుచుకత్తినిజుట్టునుకత్తిరింపగా
    ఇమ్మహిఁజూచువారలకువింతగజూపుకుశోభనీయగా
    కోమ్మలురెండుపుట్టినవికోమలిశీర్షమునందుఁగాంచగన్

    రిప్లయితొలగించండి
  20. ఇమ్ముగ సంచరించు మనయింటను పుట్టిన కోడెదూడ రా
    గమ్మును పంచు చుండు నల గంతులు వేయుచు సంతతమ్ము నా
    నమ్మను కాంచగానె వడి నాట్యము చేయును ప్రీతిఁ గాంచుమా
    కొమ్ములు రెండు పుట్టినవి, కోమలి! శీర్షమునందుఁ గాంచఁగన్

    రిప్లయితొలగించండి
  21. (సరదాగా...)
    రమ్మిటు జూడుమీ యువతరమ్మిక నేర్చెను వింత యల్లరిన్
    యిమ్ముగ నందరున్ గలిసిరిచ్చట జూడగ స్వీయ చిత్రమున్
    కొమ్మల వెన్క జేసితిరి కోతుల చేష్టల బోలు భంగిమల్
    కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్

    రిప్లయితొలగించండి
  22. పామాయిలురాయుటతో
    నేమోగానయ్యిజుట్టునేర్పడబెరుసున్
    నిమ్ముగగనబడెగనుమా
    కోమలితలమీదరెండుకొమ్ములువుట్టెన్

    రిప్లయితొలగించండి
  23. ఏమిది? బొమ్మను గల యీ
    కోమలి తల మీద రెండు కొమ్ములు పుట్టెన్
    మామా " యన తానిటులనె
    " ఈమె చెవుల వ్రాయగ నిట శృంగము లయ్యెన్!

    రిప్లయితొలగించండి
  24. 05.07.2020
    అందరికీ నమస్సులు🙏😀

    సరదా పూరణ..😀😀

    *కం*

    శ్రీమతి తో యుద్దమనిన
    నేమాత్రము తగదు యనిన నెంచక నిజమున్
    నామిత్రుడు యోడినపుడు
    *"కోమలి తలమీద రెండు కొమ్ములు వుట్టెన్"!!*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  25. అమ్మడు వచ్చి నిల్చె తను యందముగా నగుమోము చూపుచూ
    గమ్మున తీసె చిత్రము టకాల్మని ఫోనునఁ, వెన్క వ్రేల్బడెన్
    గుమ్మమునందు దుప్పిబొమ కొమ్ములతో, కలగల్పి చిత్రమున్
    కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్౹౹

    రిప్లయితొలగించండి
  26. కమ్మకులంబునందువిదకాంతిశిరోమణిరాయదేనెనున్
    నమ్మలువెంట్రుకల్బిగుసునైగడుమొద్దుగనుండగాననెన్
    కొమ్ములురెండుపుట్టినవికోమలిశీర్షమునందుగాంచగన్
    నమ్మరొ!జూచితేయదియయబ్బురమయ్యెనుజూచువారికిన్

    రిప్లయితొలగించండి
  27. ఇమ్మగునందచందములనీభువినెవ్వరుసాటిరారు నే
    నమ్మితిమంకురమ్మునదినాసొగసుల్ ప్రకటించు చూడగా
    నమ్మకమాయెనాకుసరినాప్రతిబింబమటంచుపల్కెదో
    అమ్మకచెల్ల కన్గొనగనామెకుగర్వమునెత్తికెక్కగా
    కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్

    రిప్లయితొలగించండి
  28. ఆమృగ లోలాక్షి కృశ
    హ్రీమృగ మధ్యకు ధవళ మహీ సదృశాంగీ
    దామ పరివృత జటాఖ్యలు
    కోమలి తలమీద రెండు కొమ్ములు వుట్టెన్

    [కొమ్ములు గల జింక, గోవులతోఁ బోలిక గల కాంతకు జడ లను కొమ్ము లుండుట భావ్యమే]


    అమ్మను లోకమాతఁ బరమాత్మ హరీశ్వరి నెల్ల రింక నె
    య్యమ్మున విశ్వకర్మ యిడ నంచిత దుగ్ధ సముద్రకన్య స్తో
    త్రమ్ములఁ గొల్వుఁ డింపుగను దప్త సువర్ణ కిరీట మందు నా
    కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్

    రిప్లయితొలగించండి
  29. గుమ్మకు నందమిచ్చునది కొప్పుకు దిద్దిన శైలియే కదా!

    నమ్మకమైన భర్తకును నచ్చిన రీతిగ రెండు కొప్పులన్

    నెమ్మదిగాను దువ్వుకొని నిల్వగ నాతని కిట్లు తోచె "నా

    కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్"  

    రిప్లయితొలగించండి
  30. మంధర కైకల సంవాదం..

    కందం
    రాముని పట్టము మురిపెమె?
    నీ మునుపటి వరములెంచి నీధ్రమ్మంపన్
    సేమము! రాజగు సుతుడనఁ
    గోమలి తలమీద రెండు కొమ్ములు వుట్టెన్

    ఉత్పలమాల
    వమ్మొనరించి బాసలవి పట్టము రాముని కెంచె రాజహో!
    పొమ్మని రాముఁ గానలకుఁ బుత్రుని రాజుగ నెంచఁ బూన్చగన్
    నమ్మఁగ కైక మంధరను నాథుఁడొసంగిన వౌ వరమ్ములన్
    గొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్!

    రిప్లయితొలగించండి
  31. ఉ:

    రొమ్ములు వచ్చిరానివిగ రూపము దాల్చగ కొంగుచాటునన్
    గమ్మున మామ్మ జేరి తన కష్టము దెల్పగ వేడుకోలుగన్
    బొమ్మకు నందముంగలుగ బొందిన హంగుగ చిందులేయగన్
    కొమ్ములు రెండుపుట్టినవి కోమలి శీర్షము నందు గాంచగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  32. రెమ్మలు రెండు బుట్టినవి రేపటి జాతికి వారసత్వమై
    కొమ్మల చేయినందుకొని కూర్మిగ నిద్దరు బిడ్డలన్ గనన్
    రమ్మని పిల్చెనొక్కడను రంజిల దేశము పిల్చెనంచుచున్!!
    "కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్"  

    రిప్లయితొలగించండి
  33. కందము:
    ప్రేమగ పూతన విషమును
    ధీమాగా నీయనెంచ త్రెక్కొన హరియే
    భూమినిబడ నిజరూపము
    కోమలి తలమీద రెండు కొమ్ములు వుట్టెన్.

    --గోలి.

    రిప్లయితొలగించండి