10, ఆగస్టు 2020, సోమవారం

సమస్య - 3453

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చుక్కలు నిప్పులను మంచు సూర్యుఁడు గురిసెన్"
(లేదా...)"
చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మంచును గ్రుమ్మరించెడిన్"

73 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    మక్కువ మీర మోడియట మందిర భూమిని వచ్చి చేరగా
    నిక్కును వీడి వోటులకు నివ్వెర వోవుచు దిక్కుతోచకే
    కక్కగ రామనామమును గంతులు వేయుచు సోనిపుత్రియే
    చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మంచును గ్రుమ్మరించెడిన్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    త్రొక్కుచు ముప్పదేండ్లుగను తోరపు రీతిని కాంగ్రెసోత్తముల్;
    ఫక్కున నవ్వి భాజపయె పాడగ కీర్తిని వీధివీధులన్;
    మిక్కిలి ప్రీతినిన్ గొనుచు మెండుగ పీవిని కౌగిలించగా
    చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మంచును గ్రుమ్మరించెడిన్

    రిప్లయితొలగించండి
  3. చొక్కిన మానసంబునను చూచితి ఘోర విమాన వార్త!వా
    రక్కడ మృత్యువాతఁబడిరయ్యొయొ-వాంఛలు తారుమారయెన్
    చక్కగ బంధువర్గమును సాదరమొప్పగఁజేరనెంచిరే
    "చుక్కలు నిప్పురవ్వలను సూర్యుడు మంచునుఁగ్రుమ్మరించెడిన్"

    రిప్లయితొలగించండి
  4. ఉ||
    మక్కువ దీర్చ రారయని మంత్రము జెప్పగ కుంతి ముగ్ధయై,
    యిక్కువలోననెల్ల త్యజియించెను భాస్వరవృత్తులన్నియున్
    నిక్కముజేయనావరము! నించెను ధర్మము చేయిదాటగన్
    చుక్కలు నిప్పురవ్వలును! సూర్యుడు మంచును గుమ్మరించెడిన్!
    Rohit 🙏🏻🙏🏻

    కుంతివరముదీర్చుటకు సూర్యుడు భాస్వరంబంతయూ వదిలినందుకు,చల్లని మంచులాంటి వరాన్ని ప్రసాదించాడు. ప్రకృతి ఈ అవాంతరమునకు స్పందన ప్రభావార్థం మామూలుగా చల్లగా ఉండే చుక్కలు నిప్పురవ్వలను కురిపించాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇక్కువ...?

      తొలగించండి
    2. గురుజి.. స్థానము అన్న అర్థంలో వాడానండీ..
      ఉన్నపళంగా ఉన్నచోట అన్నీ వదిలేసి..

      తొలగించండి
  5. అక్కజ మేమిగాదు; భరతావని యందు సతీమతల్లుల స
    ద్వాక్కులు నిత్యసత్యములు పావన లీలలు సత్యగాథలున్
    పెక్కురు నుగ్గడించిరిల వేమరు; వాదన లేల చూడుమా
    చుక్కలు నిప్పురవ్వలను సూర్యుడు మంచును గ్రుమ్మరించెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "సతీలలామ సద్వాక్కులు..." అందామా?

      తొలగించండి
  6. అక్కరిరాష్ట్రమందు జనమంద సుయోధను ధార్తరాష్టృడై,
    పెక్కగు దుర్నిమిత్తములు, పిక్కటి లంగగ నష్టదిక్కులన్,
    నక్కల యూళపాట, భువి నాలుగుదిక్కులకంపమొందగా
    చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మంచును గ్రుమ్మరించెడిన్.

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:
    పెక్కు దుర్నిమిత్తములు వెల్గిడె నా శిశుపాల సోదరుల్
    నక్కడి రాజ్యమా మధుర నందుదయించిన కాలమందునన్
    చొక్కిన మానసంబునను చూడగ గోచరమయ్యె నిట్టులన్
    చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మంచును గ్రుమ్మరించెడిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పెక్కగు దుర్నిమిత్తములు... అనండి. లేకుంటే గణభంగం.

      తొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    విక్కుచు దుశ్శకునమ్ములు
    పెక్కుగ శిశుపాల జనన వేళన గల్గెన్
    చొక్కిన మనమున చూడగ
    చుక్కలు నిప్పులను మంచు సూర్యుడు గురిసెన్.

    రిప్లయితొలగించండి
  10. కె.వి.యస్. లక్ష్మి:
    గురువుగారికి నమస్సులు. నిన్నటి పూరణ చూడగలరు.

    సత్య ధర్మ మోర్పులతోడ సాగు చుండు
    సత్పురుషులెల్ల నీసున చంచలించి
    పాపపు పనులొనర్చెడి వారి నుండి
    పారిపోవలె గీర్తిని గోరుకొనిన.

    రిప్లయితొలగించండి


  11. అక్కకు రాన్ కోపము స
    మ్మక్కగ మారె సమరమ్ము మదిలో మొదలై
    నిక్కముగ ప్రకృతి మారగ
    చుక్కలు నిప్పులను మంచు సూర్యుఁడు గురిసెన్


    జిలేబి

    రిప్లయితొలగించండి


  12. కందోత్పల



    కనులెర్రబడెను చూచె ల
    లన చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మం
    చును గ్రుమ్మరించెడిన్ విధ
    మనుభవ మాయె తృటిని భళి మగనికి కవిరాట్!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  13. అక్కకు వచ్చె కోపము చివాలు‌న లేచెను కత్తి పట్టె తా
    నెక్కెను గుర్రమున్ చనెను నేరుగ దుర్మతులెల్లరిన్ తృటి‌న్
    గ్రక్కున ఖండఖండములు గానరికెన్ గగనమ్ము మారెనా
    చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మంచును గ్రుమ్మరించెడిన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. చక్కగ పాలన సాగిన
    నిక్కముగా ప్రజలు శా౦తి నిలయులు కారే?
    వెక్కస పాలన మైనను
    చుక్కలు నిప్పులను మంచు సూర్యుఁడు గురిసెన్

    రిప్లయితొలగించండి
  15. లిక్కరుదొరకనివేళను
    కక్కూర్తిగతాగెనొకడుకల్తీసారా
    ఉక్కిరిబిక్కిరికాగా
    చుక్కలు నిప్పులను మంచు సూర్యుఁడు గురిసెన్

    రిప్లయితొలగించండి
  16. మైలవరపు వారి పూరణ

    ప్రోషితభర్తృక


    మక్కువ వాడు వచ్చునను మాటయె ప్రాణమునిల్పుచుండె., బల్
    చక్కని వాడు., నవ్వు వెదజల్లెడువాడు., మనోహరుండు వా...
    డెక్కడ ? రేబవళ్లు తపియించుచునుంటి వియోగబాధలో
    చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మంచును గ్రుమ్మరించెడిన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  17. ( పర్యావరణసౌభాగ్యాన్ని మ్రింగుతున్న మానవులను మ్రింగే రోజులు వస్తున్నాయి )
    చిక్కని దైవసంపదల
    ఛిద్రమొనర్చుచు దుష్టమానవుల్
    నిక్కుచు నింగినేలలను
    నిప్పును నీటిని వాయుమండలిన్
    వెక్కసమొల్కు రీతులను
    వెర్రిగ క్షైణ్య మొనర్చుచుండినన్
    జుక్కలు నిప్పురవ్వలను ,
    సూర్యుడు మంచును గ్రుమ్మరించెడిన్ .

    రిప్లయితొలగించండి
  18. అక్కరకు రాని మాటలు
    పెక్కుగ మాటాడు టదియె పిచ్చితనంబౌ
    యెక్కడ రాచూపించుము
    చుక్కలు నిప్పులను మంచు సూర్యుఁడు గురిసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పిచ్చితనంబౌ నెక్కడ... అనండి.

      తొలగించండి

  19. * శంకరాభరణం వేదిక *
    10/08/2020..సోమవారం

    సమస్య
    ********
    చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మంచును గ్రుమ్మరించెడిన్

    నాఫ పూరణ. ఉ..మా.
    *** ****** *

    టక్కరి కౌరవుల్ సభని టంకముతోడత వల్వలూడ్చగా

    మిక్కలి శోక తప్త హృది మీనల కన్నుల కృష్ణ వేడగన్

    దిక్కుల జూస్తు పాండవులు దీనత నుండిరి శౌర్యమున్ననన్

    అక్కట!ఏమి చిత్రమిది!ఆరయ తోచును నిట్లు హృత్తుకున్

    చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మంచును గ్రుమ్మరించెడిన్

    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      తోడుత... దిక్కులు జాడ/చి...శౌర్యముండి తా మక్కట... తోచిన దిట్లు నా మదిన్...

      తొలగించండి
  20. పెక్కు భయోత్పాతంబులు
    మిక్కిలి గా సంభవించె మేదిని యందున్
    వెక్కసముగ నయ్యెడ లన్
    చుక్కలు నిప్పులను మంచు సూర్యుడు గురిసెన్

    రిప్లయితొలగించండి
  21. అక్కటకలియుగమాయలు
    మిక్కుటముగజరుగుచుండెమేదినిగనుమా
    చిక్కడపల్లినిజూచితి
    చుక్కలునిప్పులనుమంచుసూర్యుడుకురిసెన్

    రిప్లయితొలగించండి
  22. చిక్కెను కోవిడు వ్యాధికి
    ఉక్కిరి బిక్కిరి యగుచును యూపిరి యాగన్ !
    చిక్కున బడెనుగ పాపము
    "చుక్కలు నిప్పులను మంచు సూర్యుఁడు గురిసెన్"

    రిప్లయితొలగించండి
  23. చిక్కితిమీ రక్కసికిక
    దక్కవు మా ప్రాణములని దైన్యము తోడన్
    దిక్కెవరను రైతు కనుల
    చుక్కలు నిప్పులను మంచు సూర్యుఁడు గురిసెన్

    రిప్లయితొలగించండి
  24. పెక్కురు భార్యలుండినను ప్రీతిగ సుందర పారిజాతమున్
    గ్రక్కున రుక్మిణీమణికి కాంతుడు గ్రుచ్చిన వైనమెంచుచున్
    చిక్కని దుఃఖభారమున జిక్కిన చేడియ కంటినీటివౌ
    చుక్కలు నిప్పురవ్వలను, సూర్యుడు మంచును, గ్రుమ్మరించెడిన్
    మక్కువమీర భామపద మంజుల స్పర్శ
    మురారి పొందగా

    రిప్లయితొలగించండి
  25. దిక్కులు చూడబోకుడిక తీరుగ జెప్పెద నాలకింపుడీ
    చక్కగ నాకసంబున నిశా సమయంబున వెల్గులీనెడిన్
    చుక్కలు; నిప్పురవ్వలను సూర్యుఁడు; మంచును గ్రుమ్మరించెడిన్
    రిక్కల రేడటంచు వివరించె బుదానుడు పాఠశాలలో

    రిప్లయితొలగించండి
  26. ఉ: దక్కగ బొట్టె లైదుగురు దైవవశమ్మున పాండురాజుకున్
    రక్కసు లుద్భవించ ధృతరాష్ట్రుని, పత్నికి, దుర్నిమిత్తముల్
    నక్కల కూతలున్ మరుయు నైరృత మూకల ఘోషణమ్ములున్
    చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మంచును గ్రుమ్మరిం

    రిప్లయితొలగించండి
  27. అక్కటయేమివింతయిదియాకసమందుననద్భుతంబుగా
    చుక్కలునిప్పురవ్వలనుసూర్యుడుమంచునుగ్రుమ్మరించెడిన్
    నిక్కలికాలమాయలివియేమనిజెప్పుదురాజశేఖరా!
    చిక్కడపల్లివాసులనెశ్రేయముగాదదిలోకులేరికిన్

    రిప్లయితొలగించండి
  28. నిక్కపుమాటదెల్పెదను నేస్తమ! నమ్ముము నిత్య సత్యమున్ !
    చక్కనిచుక్కతోనెపుడు ౘక్కటులాడిన మింటినున్న యా
    చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మంచును గ్రుమ్మరించెడిన్
    చక్కనిచాకచక్యమును చానలముందర జూపు మర్మిలిన్

    రిప్లయితొలగించండి
  29. అక్కట! కౌరవేంద్రుఁ సభ నందున ద్రౌపది చీరలొల్వగా
    పెక్కురు పెద్దలుండినను వేడిన యాయమ రోదనంబుఁ లే
    యొక్కరు నాలకింపరుగ, యుర్విని యున్నతు లూరకుండినన్
    చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మంచును గ్రుమ్మరించెడిన్

    రిప్లయితొలగించండి
  30. ఉక్క చెలంగఁగ నంతట
    లక్క కరగు మండుటెండలను సూర్యుండా
    టక్కరి వినుఁ డో చక్కని
    చుక్కలు! నిప్పులను మంచు సూర్యుఁడు గురిసెన్

    [మంచు = మనఁ జేయు నట్టి]


    ఎక్కటి తార లింక రవి యెక్కటి దీ భువి యక్కజమ్ముగన్
    మిక్కిలి యౌచు ద్వంద్వముల మిన్నున నిల్చి చెలంగు చుండగం
    జిక్కని మైల రాత్రిని విశేషపు టెండ లహమ్ము నందునుం
    జుక్కలు, నిప్పురవ్వలను సూర్యుఁడు, మంచును గ్రుమ్మరించెడిన్

    రిప్లయితొలగించండి
  31. చక్కదనమ్ములోన జలజారిని మించిన నా మనోహరుం
    డెక్కడి కేగెనో రమణుడెప్పుడు తానిటు వచ్చునో గదా
    చక్కెర వింటిదేవర పృషత్కములే యెద గ్రుచ్చుచుండగా
    ప్రక్కనలేక వాడు విరవాజులె హేళన సేయుచుండె నా
    చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మంచును గ్రుమ్మరించెడిన్.

    రిప్లయితొలగించండి
  32. ఈ నాటి శంకరాభరణము వారి సమస్య
    చుక్కలు నిప్పులను మంచు సూర్యుడు కురిసెన్

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

    బృందావనములో రాస లీల జరుగు సమయములో గోప కాంతలు నభములోని నక్షత్రములుగా మెరయుచు
    మదన తాప జ్వాలలలో వేధించబడు సమయమున నిప్పు సెగలు కక్కుతు ఉంటారు. సూర్య తేజ సమానుడైన
    ఆ శ్రీ కృష్ణుడు తన యొక్క తేజస్సును కట్టిపెట్టి వారి యొక్క మదన జ్వాలలు కురిపించి వారి పై చల్లని శీతలమును ప్రసరించెనను భావన కైలాసమునుంచి చూచు శివుని కనులకు తోచి ఆ విషయము పార్వతీ దేవికి తెలుపుట


    ఒకచోట మురళిని యూదుచు నొక గోప కాంతకు నిడుచుండె సంతసమును,
    లాస్యము లాడుచు లలనల తోడ నొక ప్రక్కన నిడుచుండు పరవశమును ,
    నింగిలో తారల భంగి గోపిక లెల్లరును మెరయుచు నుండె, తనువు తాప
    పు సెగలు క్రమ్మగ పూష సమానుడౌ వ్రజ కిశోరుని పొందు వలచిరిగ, త
    లచగ చుక్కలు నిప్పులను, మంచు సూర్యుడు కురిసెనని మనసుల్ మురియు చుండె,

    కనుము పార్వతీ, శ్రీహరి మనము లోన
    కామ వాంచయే గలుగక కాంత లెల్ల
    రకును ముక్తి పధమును జూపె రమ్య గతిగ
    ననుచు బలికె శివుడు తన వనిత తోడ




    రిప్లయితొలగించండి
  33. చిక్కనివాడుచుక్కలకు, చెక్కినశిల్పమొ చక్కనయ్యయో
    మక్కువవాడు నిక్కమగు మాణికమాతడు చుక్కలందునన్
    జక్కని చందురుండు మనసా వరియించి వియోగబాధతో
    చుక్కలు నిప్పురవ్వలనుసూర్యుడుమంచును గుమ్మరించెడిన్

    రిప్లయితొలగించండి
  34. మక్కువఁ జేరదీయగను మామను మోసము చేసి గద్దెపై
    నెక్కి ప్రజాళులన్ సతతమింపగు మాటల మభ్యపెట్టుచున్
    చెక్కెద సింగపూరు నిట చెన్నుగ నంచని, రైతు క్షేత్రముల్
    తక్కువ మూల్యమిచ్చి కొన తద్దయు ప్రీతిని వందిమాగధుల్
    దక్కెను సంపదంచు కడు దర్పము నెన్నిక లందుపాల్గొనన్
    తిక్కల యాత్మజన్మునకు దిమ్మదిరుంగగ నోడిరందరున్
    చెక్కలువాఱ నాశలవి చేయుచు నుండగ నార్తనాధముల్
    చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మంచును గ్రుమ్మరించెడిన్
    అసనారె

    రిప్లయితొలగించండి
  35. హక్కులకైశ్రమించికదనంబునసర్వమునొడ్డికార్మికుల్
    జిక్కియుశల్యమైరిచిరజీవపుస్వార్థప్రభుత్వశాసనం
    బక్కరరానిదయ్యెధనవంతులరాజ్యములోగుచేలుపై
    చుక్కలునిప్పురవ్వలనుసూర్యుడుమంచునుగ్రుమ్మరించెడిన్

    రిప్లయితొలగించండి
  36. ఉ:

    దిక్కులుపెక్కటిల్ల పలు తీరగు మాటల లెక్కజేయకన్
    మిక్కిలి కష్ట మోర్చి కడు మెప్పున శూరులు ధిక్కరించినన్
    నిక్కము తేల్చి "నిర్భయ" ను నేమము సేయగ లోకమిట్లనెన్
    చుక్కలు నిప్పు రవ్వలను సూర్యుడుమంచును గ్రుమ్మరించెడున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  37. కం.
    చక్కని పాలన కొరకై
    యెక్కిన రాజువలన ప్రజలెన్నో వ్యధలన్
    చిక్కుకొని మదిన తలచిరి
    చుక్కలు నిప్పులను మంచు సూర్యుఁడు గురిసెన్

    తిరివీధి శ్రీమన్నారాయణ

    రిప్లయితొలగించండి
  38. కందం
    మక్కువతో నను రమ్మని
    చిక్కక యెటు దాగినావొ చిలిపివి కృష్ణా!
    నిక్కుచు జాబిలి మాటున
    చుక్కలు నిప్పులను మంచు సూర్యుఁడు గురిసెన్!

    ఉత్పలమాల
    మక్కువ తో వరూధునిని మన్నన జూపుచు నీదు కౌగిటన్
    జిక్కెద నన్న చేకొనవు చిత్రమదే ప్రవరా! నభమ్మునన్
    నిక్కుచు తాళలేనటుల నీధ్రుని మాటునఁ గుండపోతగన్
    జుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మంచును గ్రుమ్మరించెడిన్

    రిప్లయితొలగించండి
  39. అక్కడి వేసవి కాలము
    చుక్కలు నిప్పులను మంచు సూర్యుడుగురిసెన్
    ఇక్కడి వేసవికాలము
    మిక్కిలి కాలుష్యగాలి మేదిని వీచెన్.

    రిప్లయితొలగించండి
  40. కం.
    పెక్కురు నాయకులిప్పుడు
    మక్కువ జూపుతు మెలిగిరి మరియును బ్రజలన్
    మిక్కుటముగ బాధించిరి
    చుక్కలు నిప్పులను మంచు సూర్యుఁడు గురిసెన్

    కం.
    పెక్కురు చెడుతలపెట్టుచు
    మక్కువ జూపుతు మెలిగిరి మంచిగ ; వారే
    మిక్కుటముగ బాధించిరి
    చుక్కలు నిప్పులను మంచు సూర్యుఁడు గురిసెన్

    తిరివీధి శ్రీమన్నారాయణ

    రిప్లయితొలగించండి

  41. మిక్కిలి దూరము, సెగలిడు,
    దక్కని ముత్యమ్ము, వెలుగు ధాత్రిన్ బగలున్,
    చక్కని వెన్నెల లేమయె?!
    చుక్కలు; నిప్పులను; మంచు;
    సూర్యుడు, గురిసెన్!

    రిప్లయితొలగించండి
  42. ఆకీనాశులు నిత్యమున్ ప్రజల నన్యాయమ్ముగాచంపుచున్
    చీకాకుల్ కలిగించు చుండ నడచన్ శ్రీకృష్ణుడీ పృథ్విపై
    తాకల్గెన్ వసుదేవు పుత్రుడయి యుద్ధారమ్ము చేయన్ ప్రజన్
    శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్ ?

    రిప్లయితొలగించండి