27, ఆగస్టు 2020, గురువారం

సమస్య - 3470

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బకునిఁ గొల్చిరి హరి వాయుసుతులు"

(లేదా...)
"బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్"

65 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    (Pure Bluff)

    నికరంబంచును గెల్పు పాండవులదన్ నింపాదిగా పోవుచున్
    నికటం బైనది వెండికొండ సరసన్ నీహారమున్ సైచుచున్
    వికలం బొందగ మానసమ్ము లపుడున్ వేగంబుగా కూడి త్ర్యం
    బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    సకలం బైనవి శాస్త్రముల్ చదివితిన్ జాగ్రత్తగా నిప్పుడే!
    అకటా! పూరణ తోచలేక సరిగా హ్లాదంబు కోల్పోయితిన్
    నికరంబైనది రీతి శంకరవరా!నిర్భీతినిన్ జెప్పుడే
    బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

    2. సరదా మత్తేభం

      వెరైటీ కోసం:

      ఒకనా డేగుచు కృష్ణ భీములదురన్ హోరైన వానందునన్
      బకమున్ గాంచిరి గంగ తీరమున భల్ వైరాగ్య భావంబుతో
      నొక కాలానుచు నేలమీద శమమున్ హుందాగ ధ్యానించగా
      బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్

      తొలగించండి
  3. శకునంబియ్యది మంచిదైనదనుచున్
    జంపన్ జరాసంధునిన్
    వికటంబైన మహీసురాకృతిని
    వేవేగంబుగా బోవుచున్
    సకలంబా శివునాజ్ఞగా దలచుచున్ శాస్త్రాను సారంబు త్ర్యం
    బకుని గొల్చిరి కృష్ణభీములు గడున్ భక్తిం బ్రదర్శించుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జరాసంధుడు శివభక్తుడు కనుక విజయం కోసం శివుని ప్రార్ధించినట్లు భావన! 😊😊🙏🙏

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువర్యా! నమోనమః! 🙏🙏🙏🙏

      తొలగించండి
  4. ధర్మ యుద్ధమందు దాయాదులను గెల్వ
    తగిన నాత్మ బలము ధైర్యములను
    కృప నొసంగు మనుచు కేలుమోడ్చి యును త్ర్యం
    బకుని గొల్చిరి హరి వాయు సుతులు

    రిప్లయితొలగించండి
  5. ధరణిజను గనుగొని దనుజుని జెరనుండి
    యామెను విడిపించు యత్నమందు
    బ్రాహ్మణవధ జరిగె , బాపముడుగ త్రియం
    బకునిఁ గొల్చిరి హరి వాయుసుతులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పాప ముడుగగ త్ర్యం।బకుని..." అనండి.

      తొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    బవర మందు కౌరవ పరివారమునెల్ల
    యోడజేయు శక్తి యుక్తు లడుగ
    తక్కినట్టి కుంతి తనయులతోడ త్య్రం
    బకుని గొల్చిరి హరి వాయుసుతులు.

    రిప్లయితొలగించండి

  7. మ||
    సకలైశ్వర్యములెల్ల వీడి వనమున్ సాగించగన్ జీవితం
    బకళంకుండగు వాసుదేవదయతోనౌదార్యముల్ బొందగన్
    వికటింపన్ దనుజాధమున్ దునిమి సర్వేశున్ దలంపన్ విడన్
    బకునిన్, గొల్చిరి కృష్ణభీములు గడున్ భక్తిన్ ప్రదర్శించుచున్

    ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  8. సర్పభూషణుండు జడముడి జంగము
    గరళ కంఠు డైన కామ హారి
    నంది వర్ధనుండు నభవుడు భగుడు త్ర్యం
    బకునిఁ గొల్చిరి హరి వాయుసుతులు

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సకలంబా కురుసైన్య మంతయున్ ననిన్ చావంగా వాంఛించుచున్
    నికరంబైనిలు శక్తినిన్ ప్రభవమున్ నేర్పున్ ప్రసాదించగన్
    ప్రకటంబౌనటు భక్తినిన్ మిగిలినా పార్ధాదులన్ తోడ త్య్రం
    బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ లో నా సవరణలను చూడండి.

      తొలగించండి
    2. సకలంబా కురుసైన్య మంతయు ననిన్ జావంగ వాంఛించుచున్
      నికరంబైనిలు శక్తినిన్ ప్రభవమున్ నేర్పున్ ప్రసాదించగన్
      ప్రకటంబౌనటు భక్తినిన్ మిగిలి యా పార్ధాదులంం గూడి త్య్రం
      బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్.

      తొలగించండి
    3. గురువుగారి సూచనలతో పద్యాన్ని పైవిధంగా సవరించినాను. ధన్యవాదములు.

      తొలగించండి
  10. రావణుడిని గెలువ లాఘవంబదికాదు,
    సర్వ లోక హితుడు సాంబుడంచు,
    లంక జేరు తఱిని రామేశ్వరాన త్ర్యం
    బకునిఁ గొల్చిరి హరి వాయుసుతులు.

    రిప్లయితొలగించండి


  11. పిట్ట కథల చేర్చు విన్నాణమేనాటి
    దో కదా జిలేబి ! తొంగలించు
    గాధ నొకటి చేర్చు కాననమున త్రయం
    బకునిఁ గొల్చిరి హరి వాయుసుతులు !



    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. యుధ్ధ మందు నీదు యుధ్ధతి చూపుచు
    భీమ ! వైరి చంపి వీరుడగు మ
    దేల భయము నీకు నిదె నడుమని త్ర్యం
    బకునిఁ గొల్చిరి హరి వాయుసుతులు

    రిప్లయితొలగించండి
  13. కండజూపుమనిషికామితములబొందు
    తెలివిలేనితనముతేజమిచ్చు
    బుద్ధిజీవులెపుడుముద్దుగాదురయంచు
    బకునిగొల్చిరిహరివాయుసుతులు

    రిప్లయితొలగించండి


  14. అకటా! విస్తృత మైన గాధలవి యేరాళమ్ము! జోడింపుగా
    ప్రకటింపంగ జిలేబి పిట్టకథ తా ప్రార్థించి వ్రాసెన్ భళా
    వికటింపంగ విధాత రాతగనరే వీరత్వమేగూడ త్ర్యం
    బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. సంగరంబునందుశాత్రవులనణచి
    విజయకేతనంబువిభవమలర
    నెగురవేయబూననేగియిరువురు త్ర్యం
    బకునిఁ గొల్చిరి హరి వాయుసుతులు

    రిప్లయితొలగించండి
  16. దుష్టబుద్ధి యైన దుడుకు జరాసంధు
    మట్టుబెట్ట నెంచినట్టివారు
    విజయమందఁ గోరి విజితపంచ కుసుమాం
    బకునిఁ గొల్చిరి హరి వాయుసుతులు.

    రిప్లయితొలగించండి
  17. ప్రకటింపంగనె రాజసూయమని యాపద్బంధువౌ వెన్నుడా
    సకలార్థంబు లెఱంగువాడనె జరాసంధుండనే ద్రుంచకన్
    మఖమున్ జేయుట యొప్పదంచు తెలుపన్ మాతంగి పాతిన్ ద్రియం
    బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్

    రిప్లయితొలగించండి
  18. మైలవరపు వారి పూరణ

    అకలంకున్ రజతాద్రిమందిరుని విశ్వాంతస్స్థితున్., లోకకా...
    రకు., భద్రాకృతి., విశ్వసద్భ్రమణలీలాహేతువున్ వేదగా...
    నకళాలోలుని నాగభూషణుని సందర్భానుసారమ్ము త్ర్యం...
    బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  19. కె.వి.యస్. లక్ష్మి:

    నిర్వికల్పుడీవు నిర్వికారుడవీవు
    నిర్భయుండవీవు నీలకంఠ!
    నిరతమీవు మమ్ము నరయుమనుచును త్య్రం
    బకునిఁ గొల్చిరి హరి వాయుసుతులు

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.

    రావణ వధనెంచి రామేశ్వరము చేరి
    శివుని పూజనచట చేయదలచి
    లింగము నొకటి యొనరించి ప్రతిష్ట త్ర్యం
    బకునిఁ గొల్చిరి హరి, వాయు సుతులు.

    రిప్లయితొలగించండి
  21. సకటుండా మగధాపురాధిపుఁ జరాసంధున్ విఘాతించి త్ర్యం
    బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్
    ప్రకటంబాయెను భీమసేను భుజ ప్రాబల్యంబు లోకంబునన్
    సకలంబా హరి లీలయే నెరపగా సద్ధర్మ సంస్థాపనన్

    రిప్లయితొలగించండి
  22. ఆటవెలది
    నందమూరి వైచి పొందంగ సత్కీర్తి
    నటులె పేరు నంద నాశతోడ
    పాత్రధారులగుచు వడి నటరాజుఁ ద్ర్యం
    బకునిఁ గొల్చిరి హరి, వాయుసుతులు

    మత్తేభవిక్రీడితము
    అకలంకమ్ముగ నందమూరిదగు నాహార్యంబు నీ పాత్రలన్
    సకలంబందున వాసిఁ గాంచ, నటులై సాధించి తత్కీర్తులన్
    సుకరంబందఁగ వేషమందు నటరాజున్, శూలి, గౌరీశుఁ ద్ర్యం
    బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్

    రిప్లయితొలగించండి
  23. ఆ.వె.

    గరళ కంఠుడనుచు గంగా ధరుండని
    నీలలోహితుడును నృత్య ప్రియుని
    సేవ భావ మలర సిద్ధియోగీశు త్ర్యం
    బకుని గొల్చిరి హరి వాయు సుతులు

    వై.చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  24. చిన్నతనము నొకడు విన్నపంబు నొకడు
    బకుల గూల్చె హరి వాయుసుతులు
    శిష్యుడొకడు వ్రాసె శీఘ్రంబుగానిట్లు
    బకుని గొల్చె హరి వాయుసుతులు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గూల్చిరి, గొల్చిరి గా చదువ ప్రార్థన! 🙏🙏🙏

      తొలగించండి
    2. చాలా బాగుందండి.
      కాని చిన్నతనమున నొకఁడు విన్నపంబున నొకఁడు- అన వలెను గదా .

      తొలగించండి
    3. ధన్యవాదములార్యా! “న” కారము implied అనుకొన్నాను. తప్పైన మార్చడానికి ప్రయత్నిస్తాను! 🙏🙏🙏

      తొలగించండి
    4. సవరించిన పూరణ
      వెన్నదినుచు నొకడు విన్నపాన నొకడు
      బకుల గూల్చిరి హరి వాయుసుతులు
      శిష్యుడొకడు వ్రాసె శీఘ్రంబుగానిట్లు
      బకుని గొల్చిరి హరి వాయుసుతులు!

      తొలగించండి
  25. గరళకంఠ శూలి గంగాధర పురారి
    జంద్రశేఖర హర శంభు సాంబ
    బార్వతీపతి శివ బంచవక్త్ర యని త్ర్యం
    బకునిఁ గొల్చిరి హరి వాయుసుతులు


    సకల ప్రాణి భవ స్థితి క్షయ సురక్షా దక్ష విశ్వాత్మునిన్
    సక లోర్వీజన సేవ నార్హు ఘనుఁ గంసధ్వంసుఁ బద్మాక్షునిన్
    వికసన్నేత్రునిఁ గృష్ణు ఖండిత మరుద్విద్వేషి చంచుప్రభా
    బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్

    [కృష్ణభీములు = భీమార్జునులు]

    రిప్లయితొలగించండి
  26. యుద్ధరింగమందునౌద్ధత్యమునకుత్ర్రం
    బకునిగొల్చిరిహరివాయుసుతులు
    సకలజీవకోటినికనుసన్ననగాచు
    నీశుడాతడెకదయిలనుజూడ

    రిప్లయితొలగించండి
  27. అంకమైన పిదప లంకానరేశుతో
    పుష్పకంబు పైని పురము కేఁగి
    రాముడచట నిట్లు రామేశ్వరునిగ త్ర్యం
    బకుని గొల్చిరి హరి వాయుసుతులు
    ----- శ్రీరామ్ 10వ తరగతి

    రిప్లయితొలగించండి
  28. అకళంకమ్మగు జీవితమ్ములిల నాప్యాయమ్ముగా బోవుచున్
    సకలార్తాళిని కావుచున్ బ్రతుకులో సంతోషమున్ గ్రోలుచున్
    మకురాత్ముల్ ఘన పాండవుల్ మిగుల ధర్మాత్ముల్ జయమ్మొంద త్ర్యం
    బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్

    రిప్లయితొలగించండి
  29. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  30. సకలంబౌకురుసైన్యమున్ కలనునాసాంతంబుగూల్చంగత్ర్రం
    బకునిం గొల్చిరికృష్ణభీములుగడున్ భక్తిన్ బ్రదర్శించుచున్
    సకలంబంతయుదానయైవరలునాశాజ్యోతియావెన్నుడే
    వికచాంభోరుహలోచనుందమినిదావేడంగజీత్రంబహో

    రిప్లయితొలగించండి
  31. సకలాధీశుల తోడపోరి జయమున్ సాధించి సత్కీర్తితో
    సుకృతంబైనది రాజసూయము నహో! శోభాయమానంబుగా
    వికచాంభోరుహ నేత్రునిన్ గృపను సంప్రీతిన్ ధనాధీశునిన్
    బకుని గొల్చిరి కృష్ణభీములు కడున్ భక్తిన్ బ్రదర్శించుచున్

    బకుడు = కుబేరుడు
    కృష్ణ భీములు = భీమార్జునులు

    రిప్లయితొలగించండి
  32. నంది వాహనుడని నగజాత పతియని
    వామ దేవుడనుచు వాసి గాను
    భక్తి తోడ విడక ఫాలాక్షుడైన త్య్రం
    బకుని గొల్చిరి హరి వాయు సుతులు

    రిప్లయితొలగించండి
  33. పక్షి రాజని భ్రమపడి పక్షితతులు
    బకుని గొల్చిరి, హరి - వాయుసుతులు
    బకులనెడురాక్షసులను జంపి పరగ జనుల
    సేమమొప్పగ సత్కీర్తిజెందిరంత!

    రిప్లయితొలగించండి