24, మార్చి 2022, గురువారం

సమస్య - 4030

25-3-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలికాలమునందుఁ బుట్టెఁ గద రాఘవుఁడే”
(లేదా...)
“కలికాలంబునఁ బుట్టె రాఘవుఁడు లోకంబెల్ల రక్షించఁగన్”

17 కామెంట్‌లు:


 1. కలుషము లెన్నియొ పెరిగెను
  కలికాలమునందు, బుట్టెఁ గద రాఘవుఁడే
  ఖలు రావణు దునుమగ నిన
  కులమున్ ద్రేతాయుగమున కువలయ మందున్.

  రిప్లయితొలగించండి
 2. తలపడు దౌష్ట్యమునెప్పుడు
  కలికికినెదురాడకుండు గయ్యాళైనన్
  కలసియుకాపురముండును
  కలికాలమునందుబుట్టెగదరాఘవుడే

  రిప్లయితొలగించండి
 3. పలు రకముల మోసమ్ములు
  విలువలు లేనట్టి జనులు విరివిగ పెరుగన్
  ఖలులను నాశ నము సలుప
  కలికాలము నందు బుట్టె గద రాఘవుఁడే !

  రిప్లయితొలగించండి
 4. కందం
  అలికాక్షుని భక్తునిగన్
  దులతూగుచు లంకనేలు దోర్బలుడైనన్
  వలకాడు, రావణుఁడను వె
  కలి కాలమునందుఁ బుట్టెఁ గద రాఘవుఁడే!

  మత్తేభవిక్రీడితము
  అలికాక్షున్ మురిపించి భక్తునిగ తానత్యంత దోర్వీర్యుఁడై
  తులతూగన్ గల స్వర్ణలంకపతియై దుర్మోహ పౌసస్త్యుడున్
  వలకాడౌచును నన్యకాంతగొని బ్రాణాపాయమున్ గోరు వె
  క్కలి కాలంబునఁ బుట్టె రాఘవుఁడు లోకంబెల్ల రక్షించఁగన్

  వెక్కలి/
  వెకలి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 గ్రంథసంకేతాది వివేచన పట్టిక
  వై. విణ.
  1. మూఢుఁడు;
  "సీ. వీధిలోఁబొడగన్న వృద్ధుల నరికట్టి వెకలియై పలుమాఱు వెక్కిరించు." ఉ, రా. ౭, ఆ.
  2. ఆసక్తుఁడు* .
  "ఎ, గీ. వనిత చిన్నారిపొన్నారి వయసుగాని, విప్రనందనుఁ గన్నంత వెకలియగుచు." పాండు. ౩, ఆ.

  రిప్లయితొలగించండి

 5. అలవైకుంఠపురమ్ము వీడి యిల భక్తాళిన్ బ్రపోషింపగన్

  వెలసెన్ గాదుటె వేంకటాచలముఁ గోవిందుండు రోదస్సులో

  కలికాలంబునఁ, బుట్టె రాఘవుఁడు లోకంబెల్ల రక్షించగన్

  ఖలు పౌలస్త్యుని యూచమట్టుగొను సత్కార్యంబు సాధింపగన్.

  రిప్లయితొలగించండి
 6. కలుషము లపరిమితము లీ
  కలికాలమునందుఁ, బుట్టెఁ గద రాఘవుఁడే
  నిలుపగ ధర్మము భువిలో
  కలిలో యవతారమెత్తగా శుభమొదవున్

  రిప్లయితొలగించండి
 7. వలచియు మా సీతక్కను
  వలదంచును కట్నములను పరిణయమాడన్
  పలికిరి బంధువులెల్లరు
  కలికాలమునందుఁబుట్టెఁగద రాఘవుడే

  రిప్లయితొలగించండి
 8. అలనాడు రాజపత్విని
  పలుదినములు పరులయింట వర్తిలెనంచున్
  తలవంపుగ పలికిన చా
  కలి కాలమునందుఁ బుట్టెఁ గద రాఘవుఁడే

  రిప్లయితొలగించండి
 9. ఖలులౌ రావణ కుంభకర్ణులకటా!కారుణ్యమేలేక,మా
  యలతో మౌనుల యాగసత్క్రియలకే యాటంకముంజేయగా
  నలవైకుంఠపురంబుఁజేరి హరినే ప్రార్థించగా వారు,తె
  క్కలి కాలంబునఁబుట్టె రాఘవుఁడు లోకంబెల్ల రక్షించగన్.
  తెక్కలి=వంచన,ప్రమాదము.

  రిప్లయితొలగించండి
 10. అలనాడు క్షామము వలన
  విలవిలలాడుచు పలువురు పేదలు కడు నా
  కలితోడ వగవనర్రా
  కలి కాలమునందుఁ బుట్టెఁ గద రాఘవుఁడే

  రిప్లయితొలగించండి
 11. ఇలజను లాకలికేకలు
  "కలికాలమునఁ బుట్టెఁ గద రాఘవుడే"
  పిలిచిన పలికియునన్నము
  పలుదారులనందజేసె పౌరులకెల్లన్.

  రిప్లయితొలగించండి
 12. అల గోపన్న మహాత్ముం
  డిలఁ గట్టిన మందిరమ్ము నెలమిని భద్రా
  చల రాముం డాంధ్రమ్మునఁ
  గలి కాలము నందుఁ బుట్టెఁ గద రాఘవుఁడే


  లలి తాకారుఁడు ముగ్ధ మోహనుఁడు లీలా కేళి దక్షుండు కే
  వల నైర్గుణ్యుఁడు శైల రూప ధరుఁడై పద్మావతీ నాథుఁడే
  నలినాక్షుం డిల వేంకటేశ్వరునిగా నారాయణుం డింపుగం
  గలికాలంబునఁ బుట్టె రాఘవుఁడు లోకం బెల్ల రక్షింపఁగన్

  రిప్లయితొలగించండి
 13. కందం
  ఇలలో కల్కేతెంచున్
  కలికాలమునందు ,బుట్టె గద రాఘవుడే
  తొలుతన త్రేతా యుగమున
  పొలమేపరులను వధింప బూనిక తోడన్

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 14. కం.
  బలిమిని చెలరేగుచు గన
  విలయంబుల సృష్టిజేయ ఫేరవులెగయన్
  దొలగించగ శ్రీపతిగా
  *కలికాలమునందుఁ బుట్టెఁ గద రాఘవుఁడే*
  మత్తేభము.
  బలగర్వంబుల దేలుచుండి ధన ప్రాబల్యంబులన్ ధూర్తుడై
  విలయాలే గలిగించుచున్సెలగ దా విధ్వంసకారుండుగా
  నిల గాళ్ళూనిన వానిఁద్రుంచి, యిడుముల్నీడేర్చ గోవిందుడై
  *కలికాలంబునఁ బుట్టె రాఘవుఁడు లోకంబెల్ల రక్షించఁగన్*

  రిప్లయితొలగించండి
 15. విలువగు శిల్పులు గుడిలో
  అలుపెరుగక కష్టపడియు యద్బుతరీతిన్
  నిలిపినరామునిగనియనె
  కలికాలమునందుబుట్టెరాఘవుడే!

  రిప్లయితొలగించండి
 16. ఇలపై దైత్యుల కృత్యముల్ మడఁ చగా నెల్లప్పుడున్ శౌరితాన్
  గలుగున్ తప్పక మారురూపములతో కాంక్షించి సంక్షేమమున్
  చెలువంమొప్పగ వెంకటేశ్వరునిగా జీమూత శృంగమ్ముపై
  కలికాలంబునఁ బుట్టె రాఘవుఁడు లోకంబెల్ల రక్షించఁగన్

  రిప్లయితొలగించండి