25, మార్చి 2022, శుక్రవారం

సమస్య - 4031

26-3-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారముతో వచ్చెనఁట జగత్పతికి నతుల్”
(లేదా...)
“కారముతోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్”

20 కామెంట్‌లు:


 1. నారాయణుడే వాడని
  వారించిన శుక్రుని గని బల వచియించెన్
  భూరి యిట వామనుని యా
  కారముతో వచ్చెనట జగత్పతికి నుతుల్.

  రిప్లయితొలగించండి
 2. కందం
  తా రథ చక్రము గొని హుం
  కారము నన్ భీష్ముఁ గూల్చి కవ్వడిఁ గావన్
  సారించి వేగఁ గోపా
  కారముతో వచ్చెనఁట, జగత్పతికి నతుల్

  ఉత్పలమాల
  తా రథ చక్రమున్ గొనుచు తాండవ కృష్ణుడు యుద్ధభూమినిన్
  వీరవరేణ్యుడై చెలఁగు భీష్ముని గూల్చుచు గ్రీడిఁ గావగన్
  వారణమందగన్ దుముకు భారి మృగేంద్రపు రీతిఁ జేర హుం
  కారముతోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్

  రిప్లయితొలగించండి
 3. పారమునంటుటసాధన
  భారమునాయెనుజనులకుభావనసేయన్
  తారొకవిగ్రహమనునా
  కారముతోవచ్చెనటజగత్పతికినతుల్

  రిప్లయితొలగించండి
 4. నారాయణ గావు మనుచు
  భారము వేసి గజరాజు ప్రార్థన సేయన్
  భోరున భక్తునికై సా
  కారముతో వచ్చె నట జగత్పతికి నతుల్

  రిప్లయితొలగించండి
 5. ఉత్పలమాల లో 'భీష్ముని నిల్పఁగఁ' అని చదువుకొన ప్రార్థన.

  రిప్లయితొలగించండి

 6. ధారుణిఁ ధర్మమున్ నిలుపు దక్షుడు ధృత్వుడు పృశ్నిశృంగుడా

  భూరి త్రిధాముడా జినుడు పుష్కరనాభుడు దేవదేవుడా

  వారిశుడా యధోక్షజుడు వ్యక్తుడు తామరకంటి వామనా

  కారము తోడవచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లగా దగున్.

  రిప్లయితొలగించండి
 7. కోరుకొనిన రీతిగ కడు
  దూరపు నెలకువల నుండి తొలగిన కతనన్
  చేరుకొనియుండ కడు మమ
  కారముతో వచ్చెనఁట జగత్పతికి నతుల్

  రిప్లయితొలగించండి
 8. సారసలోచనుడనుచును
  శ్రీరాముండనుచుహరిని సేవింప నిరా
  కారుండగు దైవము సా
  కారముతో వచ్చెనఁట, జగత్పతికి నతుల్

  రిప్లయితొలగించండి
 9. ఔరా!స్వయంవరంబున
  శ్రీరాముఁడు విల్లువిఱిచి సీతాదేవిన్
  దారగఁగొనగ ధనుష్టం
  కారముతో వచ్చెనట జగత్పతికి నతుల్.

  రిప్లయితొలగించండి
 10. భారత దేశ జంతువుల భాగ్యము సర్వము నీవెఱుంగవే!
  భారతవర్షమందు హరి పల్మఱుఁ బుట్టుచు జీవకోటికిన్
  జేరువ యయ్యె, కుయ్యిడగ శ్రీహరి బందుగు డౌచు దా శుభా
  కారముతోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్.

  రిప్లయితొలగించండి
 11. కారుణ్యహృదయగత మమ
  కారముతో భక్తజనుల కనులకు సాక్షా
  త్కారముతో సౌందర్యా
  కారముతో వచ్చెనఁట జగత్పతికి నతుల్

  రిప్లయితొలగించండి
 12. చేరగనెంచి శ్రీహరిని చిత్తమునందున
  నిలిపి సర్వదా
  సారములేన జీవితము చాలని మ్రొక్కుచు
  స్వామి నీదరిన్
  జేరెడు త్రోవజూపుమని చింతులు భక్తుడు
  సంస్తుతించ నా
  కారముతోడ వచ్చిన జగత్పతికిన్ ప్రణ
  మిల్లగా వలెన్.

  రిప్లయితొలగించండి
 13. క్షీర సముద్ర ముంజిలుక చేకురెగా సుధ,దానిఁబంచగా
  వారిజనేత్రమోహినిగ వారిజనాభుడు వచ్చినంతనే
  వీరులు దేవదానవులు విస్మయమందిరి,దివ్య సుందరా
  *కారముతోడ వచ్చిన జగత్పతికిన్ ప్రణమిల్లగా దగున్.*

  రిప్లయితొలగించండి
 14. ఘోర పయోధిమధ్యమునఁ గొట్టుకు పోవుచు దిక్కుతోచకన్
  తీరము కానరానితరి తీరుగనొడ్డుకు జేర్చ నార్తితో
  భారము నీదెయంచు కడు భక్తిగ దోసిలియొగ్గి వేఁడ నోం
  కారముతోడ, వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్

  రిప్లయితొలగించండి
 15. కందం
  ఆరాధ్య దేవ దర్శన
  కోరిక మదిన పొడజూప ఘోర తపమునున్
  తీరుగ జేయగ సగుణా
  కారము తో వచ్చెనట ,జగత్పతికి నతుల్.

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 16. ధారుణి భారము మోయుచుఁ
  బౌరజన క్షేమ మెంచి పన్నుగ నిటకుం
  దోర మెడఁద మీఱిన మమ
  కారముతో వచ్చె నఁట జగత్పతికి నతుల్


  కారణ జన్ముఁడై భువినిఁ గావఁగ శిష్టులఁ ద్రుంచ దుష్టులం
  గోరఁగ ధర్మనందనుఁడు కూర్మి సెలంగఁగ వాసుదేవుఁడే
  గౌరవ మొప్ప నెల్లరకుఁ గౌరవ పాండవ సంధి నెంచి శ్రీ
  కారము తోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్

  రిప్లయితొలగించండి
 17. ఇలపై దైత్యుల కృత్యముల్ మడఁ చగా నెల్లప్పుడున్ శౌరితాన్
  గలుగున్ తప్పక మారురూపములతో కాంక్షించి సంక్షేమమున్
  చెలువంమొప్పగ వెంకటేశ్వరునిగా జీమూత శృంగమ్ముపై
  కలికాలంబునఁ బుట్టె రాఘవుఁడు లోకంబెల్ల రక్షించఁగన్

  రిప్లయితొలగించండి
 18. నైరృతులన్ కనుంగొని వినాశమొనర్చు తలంపు శౌరియే
  ధారుణి పైన జన్మగొనె తామరవిందు కులమ్ము నందునన్
  కారణ జన్ముడై ప్రజల కష్టములన్ శమియించగా పరి
  ష్కారము తోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్

  రిప్లయితొలగించండి
 19. నారాయణ నారాయణ
  నారాయణ యంచు గజము నయమున వేడన్
  నారవము వినిన హరిసా
  కారముతో వచ్చెనట జగత్పతికి నతుల్

  రిప్లయితొలగించండి
 20. తోరము నీరసంబడిన తొండపు జంతువు వేడుకోగసా
  కారముతోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లగా దగున్
  దీరని యాపదల్గలుగ దేకువతోడను దైవప్రార్ధనే
  మూలము నెల్లవారలకు మోదము గూర్చగ నొప్పునీధరన్

  రిప్లయితొలగించండి