30, మార్చి 2022, బుధవారం

సమస్య - 4036

31-3-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లంచమునకు రాచగద్దె లభియించుఁ గదా”
(లేదా...)
“లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజపీఠమే”

16 కామెంట్‌లు:

 1. కందం
  పంచుదురు చీరసారెలు
  వంచుదురు ధనమ్ము మందు వలలోఁ బడగన్
  గొంచముగ నోటరులకిడు
  లంచమునకు రాచగద్దె లభియించుఁ గదా!

  ఉత్పలమాల
  పంచిన చీరసారెలను బంగరు దిద్దులు ముక్కుపుడ్కలున్
  బంచిన మందుగిందు తలవంచుచు వారివె గాక దొంగ యో
  ట్లంచితమంచనన్ మనకు నర్పణజేసెదరన్న నోటరుల్
  లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజపీఠమే!

  రిప్లయితొలగించండి
 2. సంచితపాపపుకర్మము
  మించగమానవులయందుమేతయెదగిలెన్
  ఎంచగపదవినిగొప్పగ
  లంచమునకురాచగద్దెలభియించుగదా

  రిప్లయితొలగించండి
 3. సంచుల కొద్ది నిధిని దన
  నెంచు కొనగ నేలుకోటికెనికల వేళన్
  కొంచెముగ పంచి యిచ్చిన
  లంచమునకు రాచగద్దె లభియించుఁ గదా

  ఏలుకోటి = ఏలుబడికి లోపడిన జనము

  రిప్లయితొలగించండి
 4. వంచకబుద్ధిజూపెగదభారతమందునరాజరాజుతా
  పంచనుజేర్చికర్ణునినిభాసురరీతినిరాజ్యమిచ్చియున్
  సంచితపాపకర్మమునషండుడునయ్యెనుసూర్యపుత్రుడే
  లంచముస్వీకరించినఫలంబుగదక్కునురాజపీఠమే

  రిప్లయితొలగించండి
 5. సంచలనోపన్యాసపు
  వంచనయే మూలధనము పంచిన నోట్లే
  పెంచునుగద వోట్లనిచట
  లంచమునకు రాచగద్దె లభియించుఁ గదా

  రిప్లయితొలగించండి
 6. మంచిగ హామీ లొసగుచు
  సంచులతో ధనము బంచి జయమును బొందున్
  కొంచక కాకా పట్టియు
  లంచమునకు రాచ గద్దె లభియించు గదా !

  రిప్లయితొలగించండి
 7. సంచులతో నల్లధనము
  నించుకయును సిగ్గులేకనిచ్చుచు ప్రజలన్
  వంచనచేయు కుమతులకు
  లంచమునకు రాచగద్దె లభియించుఁ గదా

  రిప్లయితొలగించండి
 8. సంచితపాపమున్ ప్రజకు సంచులలో గొనితెచ్చి పంచుచున్
  వంచనచేసి గద్దెలను స్వంతమొనర్పగ జూచునట్టి వా
  రించుకయేని సిగ్గిలక నీప్సిత సిద్ధికి నడ్డదారులన్
  లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజపీఠమే

  రిప్లయితొలగించండి

 9. ఎంచడెవండును నేతల
  మంచితనంబును, విరివిగ మద్యము ధనమున్
  బంచినను చాలు నిల నా
  లంచమునకు రాచగద్దె లభియించుఁ గదా!
  మంచికి లేవు రోజులను మాన్యుల మాటలు సత్యమే సుమీ

  వంచన జేయ నాయకులు పాలకులై వెలుగంగ నెంచుచున్

  బంచెడు మద్యమున్ ధనము వద్దనకుండ జనాళి స్వార్థమున్

  లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజపీఠమే.

  రిప్లయితొలగించండి
 10. పంచను చేరి నాయకుల ప్రస్తుతి చేయుచు దండిసొమ్ములన్
  పంచుచు వోట్లు పొందుచు, వ్యవస్థల దన్నును దొడ్డిదారిలో
  గాంచుచు నున్న నాకుటిల కర్కశ చిత్తుడు, వక్ర మార్గమున్
  లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజపీఠమే

  రిప్లయితొలగించండి
 11. కందం
  మంచిగ కోరు ధనేతర
  లంచమునకు రాచ గద్దె లభియించు గదా!
  ఇంచుక ప్రణమిల్లినచో
  సంచలన మహిమల దొంగ స్వాముల చెంతన్.

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.
  (రాజకీయ నాయకులు -దొంగ స్వాముల లీలల సందర్భంగా)

  రిప్లయితొలగించండి
 12. కంచెయె మేసినట్టు లధికారి ప్రజా ధనమున్ హరించుచున్
  పంచుచు నట్టి సొమ్ములను పాలక పక్షపు పోషణమ్ముకై
  వంచన తోడ నేలికల ప్రాపున చేరెను నేతయై భళా !
  లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజ పీఠమే!

  రిప్లయితొలగించండి
 13. పంచగ సొమ్మును నోట్లకు
  నంచిత ముగనుగె లిపింత్రు హర్షము తోడన్
  పంచగ మంతిరి పదవిని
  లంచమునకు రాచగద్దె లభియించుగదా

  రిప్లయితొలగించండి
 14. అంచితముగ మన్నన జన
  సంచయ మిచ్చిన వరించి సద్గుణ రాశిన్
  మించి నిలువ నాశ పడక
  లంచమునకు రాచ గద్దె లభియించుఁ గదా


  లంచము వేలు వే లొసఁగి రాజ్యము దక్కినఁ గోట్ల కోట్లనున్
  మించి గడింప కుండుటకు మేదిని వెఱ్ఱులె వార లక్కటా
  యించుక శంక నూనకయె యెన్నిక లప్పుడు నేత లీయఁగా
  లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజ పీఠమే

  రిప్లయితొలగించండి
 15. ఎంచగ నాయకా గణము లెన్నిక లప్పుడు
  స్వార్థ బుద్ధితో
  బంచును డబ్బు మద్యమును బంచను
  గుత్రిమమైన మ్రొక్కులున్
  వంచన భావ నాయకుల వస్తువులంగొను
  నట్టి యోటరుల్
  లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కను
  రాజపీఠమే.

  రిప్లయితొలగించండి
 16. లంచము లెక్కువాయెనిల లంచము లేనిది జర్గవేవియున్
  లంచములోటు వేయుటకు లంచముదైవము జూడగోరినన్
  లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజపీఠమే
  లంచము లేని శాఖలిట లక్ష్మణ! కానవు నీవెఱుంగవే!

  రిప్లయితొలగించండి