17, మార్చి 2022, గురువారం

సమస్య - 4023

18-3-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యమమహిష ఘంటికానాద మది ప్రియంబు”
(లేదా...)
“కాలుని దున్నపోతు మెడగంటల సవ్వడి శ్రావ్యమౌఁ గదా”

14 కామెంట్‌లు:


  1. సకల శాస్త్రాలనెఱగిన శాస్త్రి యతడు
    చావు పుట్టుకలనునవి సహజ మనుచు
    నమ్మినట్టి స్థితప్రజ్ఞున కిల గాంచ
    యమమహిష ఘంటికానాద మది ప్రియంబు.

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    దేవదేవుండు సంధికై తెలుప వినక
    తగ్గబోమంచు రారాజె యెగ్గులొలికె
    దాపురించగ పోగాలమీ పగిదిని
    యమమహిష ఘంటికానాద మది ప్రియంబు

    ఉత్పలమాల
    ఆలమునందు పాండవుల నార్కులునే పదివేలురైనయున్
    గూలుపఁ జాలరంచుఁ దగఁ గోపకిశోరుఁడు సంధిఁజూపఁ బో
    గాలము దాపురించెనన కౌరవులొప్పిరె? కానికాలమై
    కాలుని దున్నపోతు మెడగంటల సవ్వడి శ్రావ్యమౌఁ గదా!

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    రాజరాజు ,కృష్ణుని మాట ,రాయ బార
    ము పెడచెవిన బెట్టి బవరమునకు బోయె
    వంశ నాశన కారక వ్యక్తి మదికి
    యమ మహిష ఘంటికా నాదమది ప్రియంబు.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  4. వంకదారులయానంబుపాలబడగ
    నరునిబ్రతుకుునతుకులనావయయ్యె
    పుణ్యపాపంబులెంచకపూనికనగ
    యమమహిషఘంటికానాదమదిప్రియంబు

    రిప్లయితొలగించండి
  5. చేలములూడ్చికౌరవులుచేడియద్రౌపదిభంగపర్చిరే
    వాలమునిప్పుపెట్టియటరావణుడెంచెనధర్మమార్గమున్
    కాలముదాపురింపనరకాధముడంతటవిఱ్ఱవీగెనే
    కాలునిదున్నపోతుమెడగంటలసవ్వడిశ్రావ్యమౌనుగా

    రిప్లయితొలగించండి

  6. చాలిక జీవితమ్మనుచు శాంతనవుండట యంపశయ్యపై

    కేలుల మోడ్చి మొక్కి ఘన కృష్ణుని గాంచి వచించెనిట్లు నా

    లోలువ తీరె నేనిక ఫలోదయ మేగెద నాలకింపగన్

    గాలుని దున్నపోతు మెడ గంటల సవ్వడి శ్రావ్యమౌ గదా

    రిప్లయితొలగించండి
  7. పాడు జీవిత మును రోసి బాధ పడుచు
    నెదురు చూచుచు నుండె గా నిష్ఠ పడుచు
    చావు కొఱకు దా నెపు డ ది జరుగునన గ
    యమ మహిష ఘంటి కా నాద మది ప్రియంబు

    రిప్లయితొలగించండి
  8. వైద్యులకవగతము గాక వత్సరముల
    బ్రక్కనగల వారినిగూడ బాధవెట్టి
    వేల తగ్గక జావుకు వేచి యుండ
    యమమహిష ఘంటికానాద మది ప్రియంబు

    రిప్లయితొలగించండి
  9. చరమదశయందు మ్రగ్గుచు శయ్యమీద
    బ్రతుకుపైనాశ యడుగంటి వ్యాధితుండు
    మరణయాతన పడుతున్న తరుణమందు
    యమమహిష ఘంటికానాదమది ప్రియంబు

    రిప్లయితొలగించండి
  10. ఒడలు వార్ధక్యమువలన వడలిపోయి
    బక్క చిక్కిన దేహంబు భారమవగ
    కాటికేగు విరక్తుని కర్ణములకు
    యమ మహిష ఘంటికానాద మది ప్రియంబు

    రిప్లయితొలగించండి
  11. కాలును చాచి కూర్చునెను కాటికి చూపుచు రోగగ్రస్థుడై
    కాలము శేష మించుకయె కాన్సరు రోగ మడంచె నాయువున్
    కూలెను జీవితేచ్ఛ యిక క్షోభ భరింపగజాల డిప్పుడా
    కాలుని దున్నపోతు మెడగంటల సవ్వడి శ్రావ్యమౌఁ గదా||

    రిప్లయితొలగించండి
  12. వేలకువేలు రూప్యములు వెజ్జునకర్పణజేసి యాశతో
    కాలము వెళ్ళబుచ్చినను గానక స్వస్థత యించుకేనియున్
    చాలును జీవితమ్మనుచు శాశ్వతనిద్రను గోరు రోగికిన్
    కాలుని దున్నపోతు మెడగంటల సవ్వడి శ్రావ్యమౌఁ గదా

    రిప్లయితొలగించండి
  13. మూలుగు వానికిన్ ముదిమి పూర్తిగ నిండియు రోగబాధచే
    కాలముతోడ నిత్యమును ఘర్షణ జేసెడు
    వృద్ధ జీవికిన్
    చాలనిపించి జీవితము సత్వర మంతము
    కోరువారికిన్
    కాలుని దున్నపోతు మెడగంటలు మిక్కిలి
    శ్రావ్యమౌ గదా

    రిప్లయితొలగించండి
  14. ప్రకృతి జనియించు నట్టి శబ్దమ్ము లెల్ల
    జనుల చెవులఁ బడ్డఁ కలుగు సంతసమ్ము
    నేను వచియించు చుండఁగ నీకు సంశ
    యమ మహిష ఘంటికానాద మది ప్రియంబు


    కాలుని దర్శనం బయినఁ గానఁగ నోపరు వారు లోకులం
    గాలునిఁ గాన కున్న మఱి కాలుని దున్నఁ గనంగ శక్యమే
    యేల వచింప నీ పగిది నేరు నెఱుంగని యట్టి మాటలం
    గాలుని దున్నపోతు మెడగంటల సవ్వడి శ్రావ్యమౌఁ గదా

    రిప్లయితొలగించండి