4, సెప్టెంబర్ 2022, ఆదివారం

సమస్య - 4182

5-9-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నేఁ గుబుద్ధిని నీచుఁడ నింద్యుఁడఁ గద”
(లేదా...)
“నేను గుబుద్ధినిన్ బరమనీచుఁడ నింద్యచరిత్రుఁడన్ గదా”

23 కామెంట్‌లు:


 1. కాగి తంబున వ్రాసెను గాంతుఁడొకఁడు
  నేఁ గుబుద్ధిని నీచుఁడ నింద్యుఁడఁ గద
  చూచి నవ్వుచు నిట్లనె సోమిదమ్మ
  యేమి పలుకులు బలుకఁగ యేమి యాయె?

  రిప్లయితొలగించండి
 2. తేటగీతి
  ఔర!చిత్రంబు కద,కవి భారవి కథ
  తండ్రినే చంపఁబూనియు తత్తరమున
  "నేఁగుబుద్ధిని నీచుఁడ నింద్యుఁడ గద
  నన్ను శిక్షించుడ"ని ప్రార్థనంబుఁజేసె.

  రిప్లయితొలగించండి
 3. ఎన్నికలలోన గెల్చిన వన్నెకాడు
  మంత్రి వర్యునిగ ప్రమాణమాచరించు
  నపుడు యెడదలో వినవచ్చె నాత్మఘోష
  'నేఁ గుబుద్ధిని నీచుఁడ నింద్యుఁడఁ గద'

  రిప్లయితొలగించండి
 4. నిత్యము జనుల కోర్కెలు నెరపుటకయి
  లక్షణమయినట్టి పరిపాలన నిడినను ,
  యెదుటి పక్షపు వారల యీక్షణమున
  నేఁ , గుబుద్ధిని నీచుఁడ నింద్యుఁడఁ గద

  రిప్లయితొలగించండి
 5. కానక గంటి నిన్ను రవి! గారణ మేమిర! మాట లిట్లుగా
  నేను గుబుద్ధినిన్ బరమనీచుఁడ నింద్యచరిత్రుఁడన్ గదా
  మానుము పల్కగా నటుల మాకుల రత్నము నీవగాదె! యీ
  జానెడు పొట్ట నింపుటకుఁ జాలదె? సాలుకు వంద డాలరుల్

  రిప్లయితొలగించండి

 6. (యుద్ధ భూమిలో మరణావస్తలో నున్న కర్ణుని చెంతకు జేరిన కృష్ణునితో కర్ణుడాడిన మాటలుగా......)

  శకుని మాయజూదము నాడు సమయమంద
  ధర్మ వర్తనులను జేరి ద్రాబ నైతి
  ముదిత వలువలూడ్చగ నోరు మెదపకుంటి
  ప్రదిగ కీర్తిని బొందిన ఫలిత మేమి
  నేఁ గుబుద్ధిని నీచుఁడ నింద్యుఁడఁ గద.


  దానగుణుండవంచు విబుధానులు నన్ను నుతింపనేమి నే
  హీనులధర్మ వర్తనుల హేయపు చేష్టల బ్రోత్సహించుచున్
  కేనపు జూదమాడు తరి క్రించుల పక్షము జేరి యచ్చటన్
  మానిని వల్వలూడ్చగను మౌనము బూనితి గాదె గాంచగన్
  నేను గుబుద్ధినిన్ బరమనీచుఁడ నింద్యచరిత్రుఁడన్ గదా.

  రిప్లయితొలగించండి
 7. దానవ దుష్ట బుద్ధి గొని ధాత్రిని జేసితి
  హీన కార్యముల్
  నేను గుబుద్ధినిన్ పరమ నీచడ నింద్య చరిత్రుడన్ గదా
  మానసమందులేదు దయ మానవ జాతి
  కలంకితుండ నన్
  నా నెపముల్ సహించి గణనాయక
  మ్రొక్కద బ్రోచు రక్షకా!

  రిప్లయితొలగించండి
 8. లక్ష్మణ విలాపము

  మానవతీ లలామయగు మాతను సీతను కాననమ్ములన్
  పూనిక వీడిరమ్మనుచు పూజ్యుడు రాఘవు డానతీయగా
  దీనుడనైతి! నేవిధిని దేవిని వీడెద నిండుగర్భిణిన్?
  ప్రాణము పోవమేలుగద వాస్తవ మీమెకు దెల్పజాలనే!
  నేను కుబుద్ధినిన్ బరమ నీచుడ నింద్యచరిత్రుడన్
  గదా!

  రిప్లయితొలగించండి
 9. అర్జునుడు శ్రీకృష్ణునితో...

  తానటు కన్నతండ్రివలె తమ్ములఁ నెమ్మిక జూపి పెంచెనే!
  కానక కన్నుమిన్ను, తెగ గాండివ దూషణ సేసినంత, నేఁ
  బూనిక తోడ దూఱితిని పూర్వజుఁ నోర్వక, దీనబాంధవా!
  నేను గుబుద్ధినిన్ బరమనీచుఁడ నింద్యచరిత్రుఁడన్ గదా!

  నెమ్మిక-ప్రేమ,
  దూఱుట-తిట్టుట
  పూర్వజుడు-అన్న
  దీనబాంధవా-కృష్ణ

  రిప్లయితొలగించండి
 10. ప్రాయ మందున జేసిన పాడు పనులు
  ముదిమి యందున గదలాడి ముసురు కొనగ
  నాత్మ ఘోషలు వినుచు దా ననియె నిట్లు
  నే గుబుద్ధి నీచుడ నింద్యు డ గద

  రిప్లయితొలగించండి
 11. తేటగీతి
  సాగి సత్యపథమున త్రిశంకు కొమర!
  విజయమందితె కఠినంపు వెతలఁ ద్రోయఁ
  గర్కశుఁడన లోకంబునఁ గౌశికునిగ
  నేఁ గుబుద్ధిని నీచుడ నింద్యుఁడఁ గద!

  ఉత్పలమాల
  మానిత! సత్యదీక్షఁగొని మారవుగా వెతలందు జిక్కినన్
  సూనుని, దారనున్ వదలి స్రుక్కుచునుండి త్రిశంకునందనా!
  దీనతఁ గెల్చితే, జగపు దృష్టిని నిన్నడగించుఁ గౌశికున్
  నేను గుబుద్ధినిన్ బరమనీచుఁడ నింద్యచరిత్రుఁడన్ గదా!

  రిప్లయితొలగించండి
 12. *ఆధారం : భాగవత సప్తాహ పారాయణ మహిమ, గోకర్ణోపాఖ్యానము, ఆత్మదేవ, దుంధులి, దుంధుకారుల వృత్తాంతము:*

  ఉ.

  మేనును నాత్మదేవు దయ, మెచ్చిన దుంధులి తోడబుట్టుచే
  దానమె, మిండగాని వలె దస్యుడనైతిని దుంధుకారినే
  పీనుగనౌ, వినంగ గయ పిండము నగ్రజు డిచ్చె సాంత్వమున్
  *నేను గుబుద్ధినిన్ బరమనీచుఁడ నింద్యచరిత్రుఁడన్ గదా*

  రిప్లయితొలగించండి
 13. తండ్రి దశరథు దూషింప తగదు నాకు
  నే గుబుద్ధిని నీచుడ నింద్యుడ గద
  యన్న క్షమింపు నన్ను రామన్న, యనుచు
  వేడె లక్ష్మణుండగ్రజు వినయమొప్ప.

  రిప్లయితొలగించండి
 14. మంచి చెడ్డ లెరుగను నే మంద మతిని
  నే గుబుద్ధిని నీచుడ నింద్యుడ గద
  నేరమెంచవలదు, రామ, నిగమవేద్య
  నన్ను గావంగ వేడెద ననవరతము.

  రిప్లయితొలగించండి
 15. చేసిన యుపకారమ్ములఁ జింత సేయ
  వీవు గుర్తుండుఁ జేయని వెల్ల నీకు
  నీదు దోషము లెంచిన నిర్భయముగ
  నేఁ గుబుద్ధుఁడ నీచుఁడ నింద్యుఁడఁ గద

  నే నొనరించితిం బనులు నెమ్మిఁ దలంచి పరోపకారమున్
  దానము లర్థి సంతతికిఁ దప్ప కొసంగితి నీతి వీడ లో
  కానఁ జరింతు ధర్మమునఁ గావున నైతిని యిజ్జగమ్మునన్
  నేను గుబుద్ధుఁడం బరమ నీచుఁడ నింద్య చరిత్రుఁడంగదా

  రిప్లయితొలగించండి
 16. నాథు నామంబు నతిభక్తి నాల్క నిలిపి,
  తూచె శ్రీకృష్ణు రుక్మిణి తులసి తోడ,
  నే గుబుద్ధిని నీచను నింద్యను గద
  యనుచు సత్యభామ వగచె నహము తొలగె.

  రిప్లయితొలగించండి
 17. నే గుబుద్ధిని నీచను నింద్యను గద
  తగునె లక్ష్మణు దూషింప తామసమున
  ఫలితమీయక పోవునే పాప కర్మ
  యనుచు దీనయై విలపించె నవని జాత

  రిప్లయితొలగించండి
 18. నీదు మంచినిఁగోరి నే నీతిఁ గరుప
  నన్ను ద్వేషింప బూనుట న్యాయమగునె
  కడకు నీయూహ లందునఁ గనఁగ నిపుఁడు
  నేఁ గుబుద్ధిని నీచుఁడ నింద్యుఁడఁ గద

  రిప్లయితొలగించండి
 19. కానగలేవు బాలుడవు కల్ల నిజంబులు మంచిచెడ్డలన్
  గాన నినున్ సదాచరణ గామిగఁజేయఁగ బూనుటొప్పు; పా
  పానల కీలలన్ బొనలు పాపడివౌట సుబోధ జేయగా
  నేను గుబుద్ధినిన్ బరమనీచుఁడ నింద్యచరిత్రుఁడన్ గదా

  రిప్లయితొలగించండి
 20. కన్నవారల మాటలు కడకు నెట్టి
  ధనము నార్జించనెంచుచు తగని పనులు
  చేసి కడు దూర మైతిని స్నేహితులకు
  “నేఁ గుబుద్ధిని నీచుఁడ నింద్యుఁడఁ గద”

  రిప్లయితొలగించండి
 21. వీనుల విందుగా నెపుడు పెద్దల మాటల నాలకించకన్
  మానవసేవ ముఖ్యమని మానుగ పల్కుచు దుష్ట బుద్ధితో
  నేనిట నాచరించితిని నేమము తప్పి యనేక కార్యముల్
  నేను గుబుద్ధినిన్ బరమనీచుఁడ నింద్యచరిత్రుఁడన్ గదా”

  రిప్లయితొలగించండి
 22. జన్మ మెత్తిన కులమెద్ది జనకు డెవరు
  అమ్మ కెవరయ్య యుద్ది యీ యన్వయమున
  గుణనిధియనుట యే గాని కుత్సి తుండ
  “నేఁ గుబుద్ధిని నీచుఁడ నింద్యుఁడఁ గద”
  (చివరి రోజులలో గుణనిధి పశ్చాత్తాపం)
  కడయింటి కృష్ణమూర్తి..గోవా..5-9-22

  రిప్లయితొలగించండి
 23. నేనుగ జన్మమెత్తుటకు నేమి తపమ్ముల నయ్య జేసెనో
  కానక కన్నబిడ్డనని కంటికి ఱెప్పయి గాచెతల్లియున్
  నేనొక దుష్టమార్గమున నేగితి నెయ్యము లొంటనాటకన్
  నేను గుబుద్ధినిన్ బరమనీచుఁడ నింద్యచరిత్రుఁడన్ గదా
  (చివరి రోజులలో నిగమ శర్మపశ్చాత్తాపం)
  కడయింటి కృష్ణమూర్తి.

  రిప్లయితొలగించండి