27, సెప్టెంబర్ 2022, మంగళవారం

సమస్య - 4203

28-9-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సారా త్రాగక రచనను సాగింతు నెటుల్”
(లేదా...)
“సారా త్రాగక పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్”

20 కామెంట్‌లు:

  1. కందం
    వారిజ లోచన గనబడ
    శారద నవరాత్రి వేళ చక్కదనంబున్
    కోరిక మీరగ, నామన
    సారా త్రాగక రచనను సాగింతు నెటుల్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  2. ఔరా రసామృతము మన
    సారా త్రాగక రచనను సాగింతు నెటుల్
    శ్రీరామా నీవు చెపుమ
    దారా పుత్రాదు లిచట దగ్గర యుండన్

    రిప్లయితొలగించండి
  3. కందము
    ఔరా!భాగవతంబును
    భారత రామాయణాది బహుకావ్య రసా
    సారంబునెల్ల నేన్ మన
    సారా త్రాగక రచన సాగింతునెటుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలము
      ఏరా!మిత్రమ!మూర్తి!పద్యమెటులన్ హేలన్ లిఖించందగున్
      ఔరా!చెప్పుమటన్నఁజెప్పితిని కావ్యంబుల్ పఠింపంగ,తత్
      సారంబెల్ల సుధారసంబుగను నాస్వాదించియున్ నేను, వ్రా
      సారా!త్రాగక పద్యలేఖనమెటుల్ సాగింతుఁగావ్యంబుగన్.

      తొలగించండి
  4. సారపు పురాణ కావ్యము
    లారసి యు జదువుచు నందలమృత పు రసమున్
    కోరిక తో రుచి గా మన
    సారా త్రాగక రచనను సాగింతు నెటుల్?

    రిప్లయితొలగించండి

  5. చేరి పలుకు తొయ్యలి యా
    భారతి పదపంకజముల పై వ్రాలుచు పూ
    త్కారి కరుణ రసమును మన
    సారా త్రాగక రచనను సాగింతు నెటుల్.

    రిప్లయితొలగించండి
  6. శా.

    శ్రీరామున్ దలపంగఁ జాలు రుచియే సీతమ్మ దాక్షిణ్యమున్
    మారేడాకులతోఁ బినాకి తనివిన్ మందస్మితమ్మున్ గనున్
    భీరుండన్ రచనామృతమ్ము వరమున్ బ్రీతిన్ మదీయంబు, హం
    *సా ! రా ! త్రాగక పద్య లేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్.*

    రిప్లయితొలగించండి
  7. మీరడుగగ వెనువెంటనె
    గౌరవమొసగుచు తలచితి కవితలు వ్రాయన్
    నేరుగ తేనీరును మన
    సారా త్రాగక రచనను సాగింతు నెటుల్

    రిప్లయితొలగించండి
  8. ఔరా! కన్నుల విందగు
    నా రాకాచంద్రు సౌరు నానందముగా
    కోరిక తీరగ నా మన
    సారా త్రాగక రచనను సాగింతు నెటుల్

    రిప్లయితొలగించండి

  9. ధారాళంబుగ సాహితీ కృతుల కాధారంబుగా నిల్చు సం
    ధ్యారాముం బ్రియపత్ని శుక్లయగు విద్యాదేవినిన్ భక్తితో
    నారాధించిన తీర్థమియ్యదియె జ్ఞానార్థుండవైనట్టి వ
    త్సా! రా! త్రాగక పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్.

    రిప్లయితొలగించండి
  10. సారా త్రాగక పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునుం
    బౌరా! ద్రాగుఁడు పీక నిండుగ నికన్ హ్లాదంబునొందంగ గా
    శ్రీరామాయని దైవపు నతుల్ సాకార మొందంగ గా
    వీరా వేశముఁ దోడ వ్రాయుడు దగున్ బేరాసఁ గావ్యంబుకున్

    రిప్లయితొలగించండి
  11. తీరిక లభించి నాదరి
    జేరిన నాహృదయరాజ్ఞి చేతనిడిన తే
    నీరే తృప్తినిడగ మన
    సారా త్రాగక రచనను సాగింతు నెటుల్

    రిప్లయితొలగించండి
  12. ఔరా పున్నమి చంద్రు కౌముది మనస్సానంద సంధాతగా
    నీరాత్రంబున నేత్రపర్వముగ నా కీవిన్ ప్రసాదించగా
    నేరీతిన్ గమకించి కావ్య రచనమ్మీ రేయి గావింతునా
    సారా త్రాగక, పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్?

    రిప్లయితొలగించండి
  13. కందం
    శ్రీరంజిల్లగ మ్రొక్కుచు
    ధారాళమ్ముగఁ గవనము దరిజేరఁగ సా
    కారమగు భావసుధ మన
    సారా త్రాగక రచనను సాగింతు నెటుల్?

    శార్దూలవిక్రీడితము
    శ్రీరంజిల్లగ మ్రొక్కుచున్ హృదిఁ బ్రవేశింపంగ వాత్సల్యమై
    ధారాళంపు కవిత్వమాధురుల సంధానింప మన్నించి సా
    కారమ్మొందగఁ జేయ బావసుధలన్ గాక్షింప, వైకుంఠ వా
    సా! రా! త్రాగక పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్

    రిప్లయితొలగించండి


  14. నీరజనాభుని చరితము
    తీరుగపోతన్న వ్రాసె తీయని తెలుగున్
    భూరమణుని నామసుధా
    సారాత్రాగకరచననుసాగింతునెటుల్

    రిప్లయితొలగించండి
  15. శ్రీరామనామసుధమన
    *సారాత్రాగకరచననుసాగింతునెటుల్*
    తారకమంత్రంబదియే
    నారసనాగ్రముననిల్చి ననునడిపించున్

    రిప్లయితొలగించండి
  16. సారాచార విచారముల్ దెలియగా సర్వోన్నతంబైన భా
    షారాణిన్ వినుతించనైతి మొదటన్ సత్యంబు నేనెర్గకన్
    నేరంబాయెను శారదా! భగవతీ! నీ నా
    మపుందేనె మ
    న్సారా త్రాగక పద్య లేఖన మొటుల్ సాగింతు కావ్యంబునన్

    రిప్లయితొలగించండి
  17. మారాము సేయ నేలయ
    నీరమ్మును, జూడ కుండ నిను మార నిభా
    కారా! మన్నగర నివా
    సా! రా, త్రాగక రచనను సాగింతు నెటుల్

    పారంబుం గన నట్టి సంతసమునన్ వాక్యమ్ము లంచత్సు ధా
    గారమ్ముల్ వచియించు చుండి సరసం గర్పూర తాంబూలముల్
    నారీరత్నము లీయఁ బేయములుఁ బ్రజ్ఞా పాండితీ గంధవ
    త్సారా! త్రాగక పద్య లేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్

    రిప్లయితొలగించండి
  18. వీరావేశము కలుగగ
    నేరీతిగనైన కవిగ నిలువగ దేవీ
    కోరితి పద్యరసము,మన
    సారా త్రాగక రచనను సాగింతు నెటుల్”

    రిప్లయితొలగించండి
  19. తీరౌ రీతిని విద్యఁ గ్రోలగను వాగ్దేవీ! కృపన్ గోరెదన్
    కారుణ్యమ్మును జూపి నీవు ధృతితో కంఠమ్మునన్ నిల్వుమా
    తోరమ్మౌగతి నీదు నామసుధ సంతోషమ్ముతోడన్ వచః
    సారా! త్రాగక పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్

    రిప్లయితొలగించండి