17, నవంబర్ 2022, గురువారం

సమస్య - 4252

18-11-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మల్లెలు గన నల్లనయ్యె మాలల నల్లన్”
(లేదా...)
“మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ వింతగన్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధాన సమస్య)

19 కామెంట్‌లు:

 1. :నల్లని కన్నయ్య ముడికి
  మల్లెలహారమునుకట్టమదిలో నెంచన్
  నల్లని దారము తోడను
  మల్లెలు గన నల్లనయ్యె మాలలనల్లన్

  రిప్లయితొలగించండి
 2. కందం
  అల్లన నబ్రక దబ్రని
  కళ్ళెదుటనె మాయలెన్నొ గారడి వాఁడే
  యెల్లరు మెచ్చగ జేసెను
  మల్లెలు గన నల్లనయ్యె మాలలు నల్లన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్పలమాల
   అల్లన నైంద్రజాలికుఁడు 'నబ్రకదబ్ర'యటంచు బల్కగా
   పిల్లియు మూషికంబయెను, పెంకులు నాణెములయ్యె, నీరముల్
   దెల్లని పాలునయ్యె సుదతీమణులెల్లరు జూచుచుండగా
   మల్లెలు నల్లబాఱినవి మాలలు గ్రుచ్చెడి వేళ వింతగన్.

   తొలగించండి
 3. చెల్లెలు బెండ్లి మిక్కిలి సుసంపద గల్గిన
  వానకిచ్చియు
  న్నెల్లరు మెచ్చ జేయగ దనెంతయొ సంతస
  మొందుచుండగా
  నల్లన లేచిపోయినది యామె వరించిన
  పిల్లగానితో
  మల్లెలు నల్ల బారినవి మాలల నల్లెటి వేళ వింతగన్

  రిప్లయితొలగించండి
 4. కల్లలు గాదిది నమ్ముడు
  చెల్లును నాకిది యనుచును చిత్రము గాగన్
  జల్లగ విబూది నయ్యె డ
  మల్లెలుగన నల్ల నయ్యె మాలలnallan

  రిప్లయితొలగించండి

 5. వల్లభుడే పొగిడె సతిని
  వెల్లివిరియ నీ నగవది ప్రేయసి వినవే
  తెల్లని కాంతి నలుదెసల
  మల్లెలు గన నల్లనయ్యె మాలల నల్లన్.


  ఉల్లములోన రేగు మధురోహల తో సతి నవ్వఁ గాంచుచున్
  వల్లభుడే వచించె ప్రియభామిని నీ దరహాసమీనెడిన్
  దెల్లని కాంతి చూడు నలు దిక్కుల ధీటుగ విస్తరింపగన్
  మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ వింతగన్.

  రిప్లయితొలగించండి
 6. ఉ.

  గొల్లలు సాంబునిన్ బడతిఁ గోమల గర్భవతిన్ సృజించగా
  తల్లియునంచునా మునులఁ దర్కముఁ జూలున బిడ్డ లింగమున్
  దెల్లముఁ జేయ, శాపమిడఁ దెడ్డగు రోకలి పుట్టు, వేషికిన్
  *"మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ వింతగన్”*

  .

  రిప్లయితొలగించండి
 7. ఉల్లము పొంగెను దెల్లని
  మల్లెలు గన ; నల్లనయ్యె మాలల నల్లన్
  పిల్లల చేతుల కాకకు,
  ఎల్లరు దానిగని వగచిరెంతయు బాధన్

  రిప్లయితొలగించండి
 8. ఎల్లలు దాటి జీవనము నిక్కటు లెవ్వియు జెప్పబోడు, దా
  నుల్లము నందు బెన్మిటి సమున్నత రీతి వెలుంగుచుండ, సం
  ఫుల్లసరోరుహాక్షి తన ముచ్చట దీరక రేచకమ్ముతో
  మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ వింతగన్.

  రిప్లయితొలగించండి
 9. అల్లన వేణువునూదుచు
  నల్లని కన్నయ్య రాక నందకులమునం
  దెల్లరు కొందలమొందిరి
  మల్లెలు గన నల్లనయ్యె మాలల నల్లన్

  రిప్లయితొలగించండి
 10. కల్లయు కపటపు రూపున
  చల్లగ కృష్ణుని వధించు సంకల్పముతో
  మెల్లగ పూతన చనియెన్
  మల్లెలు గన నల్లనయ్యె మాలల నల్లన్

  చల్లనిగాలిలోనడరు చందన సౌరభ నిబ్బరంబునన్
  తల్లియశోద గేహమున తన్మయరూపుడు పవ్వళింపగా
  నల్లనికృష్ణునిన్ దునుమ నాడొక రక్కసి పూతనేచనెన్
  మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ వింతగన్

  రిప్లయితొలగించండి
 11. కందం
  అల్లన రణమన గుండియ
  ఝల్లనె! కుంకుమ నొసటను జారెన్! మదిలో
  దల్లడమందితి స్వామీ!
  మల్లెలు గన నల్లనయ్యె మాలల నల్లన్!

  ఉత్పలమాల
  అల్లన తమ్మిమొగ్గరము నద్భుతరీతి జయింతునంచనన్
  ఝల్లనె గుండె యో ప్రభువ! జారెను కుంకుమ బొట్టునందునన్!
  దల్లడమందితిన్ మిగులఁ దప్పదటంచును సాగనెంతురే?
  మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ వింతగన్!

  ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

  రిప్లయితొలగించండి
 12. పెల్లుగ వేడి గాడ్పులతొ వేసవి యెండల యార్భటంబునం
  దెల్లరు తల్లడిల్ల నరుదెంచె నభంబున పద్మబంధు డే
  యెల్లలులేని యూష్మమున నెంతయు భీతిలిరెల్ల జీవులున్
  మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ వింతగన్

  రిప్లయితొలగించండి
 13. కందం
  ఎల్లలు లేనిప్రేమది
  వెల్లివిరియ గంపెడు విరి వెల్లువ తెచ్చెన్
  మెల్లగ శ్రమవారలకున్
  మల్లెలు గన నల్లనయ్యె మాలల నల్లన్.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 14. అల్లదె చూడుమ సుమలత!
  మల్లెలు గన నల్లనయ్యె మాలల నల్లన్
  అల్లగ నల్లని దారము
  తెల్లటి యారంగు నదియ తిపురుగొ నంగన్

  రిప్లయితొలగించండి
 15. పెల్లుగఁ బతి పయి రాగం
  బుల్లసిలఁగఁ బద్మ నేత్ర కొక్కుమ్మడినిం
  దల్లడిలఁగ విరహాగ్నికి
  మల్లెలు గన నల్ల నయ్యె మాలల నల్లన్

  నల్లని వాని చెల్లె లట నారుల నెంచఁగ నీల రత్నమే
  చల్లని వేళ నింపొదవఁ జక్కఁగ హెగ్గడికత్తె కృష్ణ సం
  ఫుల్ల సరోజ నేత్ర పువుఁ బోడి విరాట సతీ గృహమ్ములో
  మల్లెలు నల్లవాఱినవి మాలల నల్లెడి వేళ వింతగన్

  రిప్లయితొలగించండి
 16. మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ వింతగన్
  అల్లదె దృష్టిదో షమున నార్యుల వారికి యట్లు తోచె, నా
  మల్లెలు నల్లగా నెపుఁడు మారవు తెల్లటి రంగు తోడనే
  కళ్ళకు కానిపించుసుమ కాంచుము గీత!త దేక దృష్టితో

  రిప్లయితొలగించండి
 17. ఉల్లములోన చేరి మరుడూష్మముఁ బెంచుచు చెంగలించగా
  చల్లని రాత్రివేళను శశాంకుడు మిన్నున చేరి వెన్నెలన్
  చల్లుచు నుండగా తనువు సంజ్వరముద్భవమై కరమ్ములన్
  మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ వింతగన్

  రిప్లయితొలగించండి