22, నవంబర్ 2022, మంగళవారం

సమస్య - 4257

23-11-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాలె జనావళికి నరకవాసమ్ము నిడున్”
(లేదా...)
“పాలే సర్వజనాళికిన్ నరకసంప్రాప్తిన్ వెసం గూర్చెడిన్”

39 కామెంట్‌లు:

 1. తాలుక తనమున ధనమును
  బేలల వంచించిపొంద వృజినమ్మదియే
  చాలిక దుష్కృతములు, పా
  పాలె జనావళికి నరకవాసమ్ము నిడున్.

  రిప్లయితొలగించండి
 2. కందం
  శ్రీలలరగఁజేసిన పు
  ణ్యాలే సులభముగ స్వర్గమందగఁజేయున్
  హేలగ నొనరించిన, పా
  పాలె జనావళికి నరకవాసమ్మునిడున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శార్దూలము
   శ్రీలింపొందగఁజేయునట్టి సుకృతాలే చేర్చుగా పుణ్యలో
   కాలన్ సందియమొందనేల?యకటా!గర్వాంధతంగ్రూరులై
   యాలోచించక ముందువెన్కలనహో!యన్యాయముల్ సేయ, పా
   పాలే సర్వజనాళికిన్ నరక సంప్రాప్తిన్ వెసంగూర్చెడిన్.

   తొలగించండి
  2. మీ రెండు పూరణ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 3. కందం
  తాలిమి దైవ సమానము
  మేలొనగూర్చును సతమ్ము మేదినిపై కో
  పాలొనరుచు కార్య కలా
  పాలె జనావళికి నరకవాసమ్ము నిడున్

  శార్దూలవిక్రీడితము
  కూలందోయును బుద్ధి విజ్జతల సంక్షోభంపు మూలమ్మగున్
  దూలింపంగ విచక్షణన్ జెలగెడున్ దోషమ్మహమ్మౌచు ని
  ర్మూలింపంగను నిన్నధోగతి పడన్ద్రోయున్ బ్రకోపంపు కో
  పాలే సర్వజనాళికిన్ నరకసంప్రాప్తిన్ వెసం గూర్చెడిన్

  రిప్లయితొలగించండి

 4. కాలంబెంతయొ మారెనంచు సుఖ భోగార్థుండవై ద్రాబవై
  మూలంబొక్కటె లోకమందు ధనమే ముఖ్యంబ టంచున్ సదా
  స్ఖాలిత్యమ్ములొనర్చుచున్ విభవమున్ సాధించ బోకంటి, పా
  పాలే సర్వజనాళికిన్ నరకసంప్రాప్తిన్ వెసం గూర్చెడిన్.

  రిప్లయితొలగించండి
 5. జాలిని చూపక పరులను
  కూలీలుగచూచితిట్టు కూళుల గనుచున్
  తాలిమినశించనిడుశా
  “పాలె జనావళికి నరకవాసమ్ము నిడున్”*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వాట్సప్ సమూహంలో నా వ్యాఖ్యను చూడండి.

   తొలగించండి
 6. జాలియు సుంతయు లేకను
  పాలసు లై చేయ రాని పనుల నొన ర్పన్
  కాలుని లోకమ్మున పా
  పాలె జనావళి కి నరక వాసమ్ము నిడున్

  రిప్లయితొలగించండి
 7. ఆలు మగలిరువురి నడమ
  గాలిడి చక్కన చగు వారి కాపురమందున్
  జీలికకై చేసెడి పా
  పాలె జనావళికి నరకవాసమ్ము నిడున్

  రిప్లయితొలగించండి
 8. ఏలో ద్రోహపు చింతన
  మేలో పెఱవారిఁజూచి యేడ్చుట భువిలో
  మేలొనగూర్చని యీ లో
  పాలె జనావళికి నరకవాసమ్ము నిడున్

  రిప్లయితొలగించండి
 9. ఆలోచింపక సుంతయుఁ
  గాలుని దండనము లెడఁదఁ గాపురుషు లిలన్
  లోలు లయి యొనర్చెడు పా
  పాలె జనావళికి నరక వాసమ్ము నిడున్

  ఏ లీలన్ భగవంతుఁ డిద్ధరణి నేయే రీతులన్ జీవులం
  బాలింపంగఁ దలంచు నవ్విధములన్ వర్తిల్ల నొప్పుం జుమీ
  యీలోకమ్మునఁ బాప కారకములౌ యీ దౌష్ట్యచింతౌఘ కూ
  పాలే సర్వ జనాళికిన్ నరక సంప్రాప్తిన్ వెసం గూర్చెడిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   (మీ టైం టేబుల్ మారినట్టుంది!)

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
   అవునండి. ఇప్పుడు నేను మా యమ్మాయి సౌజన్య వద్ద సిడ్నీ (ఆస్ట్రేలియా) లో నున్నాను. 3 నెలల వఱకు. ఇప్పు డిక్కడ సమయము మధ్యాహ్నము 12.36.

   తొలగించండి
  3. సంతోషం... మీ టైం తప్పలేదు... మాటైమే మారిందన్నమాట!

   తొలగించండి
 10. చాలామోసము సేయుచున్ బొలుపుగా
  సంపాదనంబెంచుచున్
  గోలాహాలము జేయుచున్ మనుజులన్
  గ్రూరంగ హింసించుచున్
  మేలుంజేయక నేరికిన్ సతతమున్ మిన్నంట
  గా జేయు పా
  పాలే సర్వజనాళికిన్ నరక సంప్రాప్తిన్
  వెసన్ గూర్చెడిన్

  రిప్లయితొలగించండి
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వదలి'ని 'ఒదలి' అనరాదండీ.. "జాలి వదలి/జాలిని విడి" అనవచ్చు.

   తొలగించండి
  2. ధన్యవాదాలు గురువుగారు.

   కందం
   జాలివదలి జనజీవన
   శైలిని ఛిద్రము సలిపెడి శఠ దళములు చే
   మేలెరుగని కార్య కలా
   పాలె జనావళికి నరకవాసమ్ము నిడున్

   తొలగించండి
 12. సమస్య: పాలే సర్వజనాళికిన్ నరకసంప్రాప్తిన్ వెసం గూర్చెడిన్
  శా: లీలామానుష రూపుడై కలుగు నా శ్రీ నాథుఁ కీర్తింపరే
  కాలమ్మంతయు నెంచుచున్ దురితమౌ కార్యమ్ములన్ జేయుచున్
  మేలున్ జేయక మానవాళి కిల సొమ్మే ముఖ్యమై చేయు పా
  పాలే సర్వజనాళికిన్ నరకసంప్రాప్తిన్ వెసం గూర్చెడిన్

  రిప్లయితొలగించండి
 13. కాలంబెంతగ మారినన్ జగతిపై కార్పణ్యముల్ కుట్రలున్
  మేలౌ రీతులటంచు నెంచి మితులన్ మీఱంగ గర్వాంధులై
  యేలన్ జూచెడి వారలన్ మిగుల శ్లాఘించంగ నవ్వారి పా
  పాలే సర్వజనాళికిన్ నరకసంప్రాప్తిన్ వెసం గూర్చెడిన్

  రిప్లయితొలగించండి
 14. ఆలన బాలనఁ జేసెడు
  నాలిని బాధించఁ గలుగు నాపద లెన్నో
  స్త్రీలను హింసించిన పా
  పాలె జనావళికి నరక వా సమ్ము నిడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విలువలు మానిన విద్యయు
   నలవోకగ యమితనీతి నలుపెరుగనే
   తెలపుచు జేయక తగుపా
   పాలెజనావళికి నరకవాసమ్మునిడున్.

   తొలగించండి
 15. శా.

  గోలోకంబున రాధ శాపమునిడెన్ గోపన్ సుదామున్ వరున్
  సాలోక్యంబుగ శంఖచూడుని గొనెన్ సంసేవ్యు బృందాపతిన్
  వ్రేలార్చెన్, దులసీ దళంబు తరపున్ బిద్దెన్, ఘటిల్లాపసో
  *“పాలే సర్వజనాళికిన్ నరకసంప్రాప్తిన్ వెసం గూర్చెడిన్”*

  రిప్లయితొలగించండి
 16. ఆలుం బిడ్డలఁ జూడ కెప్పుఁడు సతీ వ్యామోహ మందుండు పా
  పాలే సర్వజనాళికిన్ నరకసంప్రాప్తిన్ వెసం గూర్చెడిన్
  వేలా పాలలు లేక నిత్యము సురా పేయమ్ము పాపమ్ము నౌ
  మేలుంజేయదు రమ్య! నేర్వుమిక
  సూ మీ రంగ యత్నించు మా

  రిప్లయితొలగించండి

 17. పిన్నక నాగేశ్వరరావు.

  బాలికలను చెఱపట్టుచు
  తేలికగా హత్యచేయు తెంపరులు భువిన్
  వేలుగ నొనరించెడు పా
  పాలె జనావళికి నరకవాసమ్ము నిడున్.

  రిప్లయితొలగించండి