15, మార్చి 2023, బుధవారం

సమస్య - 4367

16-3-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రోమంబుల కూరఁ జేయ రుచిగ భుజించెన్”
(లేదా...)
“రోమంబుల్ వడిఁ దెచ్చి వండినఁ గడున్ రుచ్యంబుగా మెక్కెనే”
(ఆముదాల మురళి గారి శతావధానంలో తిరువాయిపాటి చక్రపాణి గారి సమస్య)

19 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      భామామణి కందింపగ
      కామితమని యడవిపంది కలిమము పతియే
      సేమమనగఁ దొలగించియు
      రోమంబుల, కూరఁ జేయ రుచిగ భుజించెన్!

      శార్దూలవిక్రీడితము
      భామా! వేచితి నెంతయో నడవిదౌ పందిన్ భుజింపంగ,నా
      కామంబొప్పగ నేటికిన్ దొరికెనే కమ్మంగ వండ్డింపమన్
      శ్రీమంతున్ సతి యూరడించి మిగులన్ సేమానఁ దొల్గించియున్
      రోమంబుల్, వడిఁ దెచ్చి వండినఁ గడున్ రుచ్యంబుగా మెక్కెనే

      తొలగించండి
    2. సహదేవుఁడు గారు మీ యూహ మంచిదే.
      రోమంబుల కూర = రోమముల యొక్క కూర, లడాగమము.
      తొలఁగించియు /రోమంబులను : అన్న యర్థములో
      తొలఁగించియు /రోమంబులఁ గూర యనుట సాధువు.
      కాని సమస్యా పాదములో నరసున్న లేదు కదండి.
      మఱి కొందఱు కవులు కూడ నీ భావములోఁ బూరించిరి. న్యాయ సమ్మతము కాదు. ఇది నా భావము.

      తొలగించండి
    3. ఆర్యా! దయతో సమీక్షించినందులకు ధన్యవాదములు. తరుణోపాయము సూచింప మనవి.

      తొలగించండి
  2. భామామణిముడివేయుచు
    రోమంబుల,కూరచేయ రుచిగభుజించెన్
    నేమాత్రముశంకించక
    తామెచ్చుచుసహచరినట తాదాత్మ్యతతో

    రిప్లయితొలగించండి
  3. ప్రేమగ పతి దేవుని కై
    కోమలి శాకము నొకటిని కొనగా. నందున్
    సేమము కై తొలగించి యు
    రోమంబులు ::కూర జేయ రుచిగ భుజించెన్

    రిప్లయితొలగించండి
  4. శ్రీమంతుడు వేటాడి, శి
    లీముఖములతో శశముల రెంటిని చంపన్,
    ప్రేమగ నిల్లాలును, మృదు
    రోమంబుల కూరఁ జేయ రుచిగ భుజించెన్.

    శిలీముఖము-బాణము
    మృదురోమము-కుందేలు

    రిప్లయితొలగించండి
  5. శా.

    క్షేమంబే గద కూరగాయలఁ దినన్ క్షేత్రంబుఁ బండించెడిన్
    పాముల్ భోజనమందు వండి నమలున్ బక్వంబు నిష్టంబుగన్
    నేమంబున్ విడి ముండ్లపంది ములులన్ నేరంబుతో భుక్తిగా
    *రోమంబుల్ వడిఁ దెచ్చి వండినఁ గడున్ రుచ్యంబుగా మెక్కెనే.*

    రిప్లయితొలగించండి

  6. ప్రేమగ నత్తయె చెప్పగ
    జామాతయె వచ్చెనంచు సంతోషముతో
    స్వామియె తెప్పించిన పృథు
    రోమంబుల కూరఁ జేయ రుచిగ భుజించెన్.

    (పృథురోమము =పెద్దరోమాలు గల చేప)


    సామాన్యుండతగాడు కాదు మనకున్ జామాతయే కాదుటే
    ప్రేమాప్యాయత జూపగా వలయునే వేధింపకే నన్నికన్
    భామా! కోడిని మిత్రుడొక్కడిటకున్ బంపించె మారించుచున్
    రోమంబుల్ వడిఁ, దెచ్చి వండినఁ గడున్ రుచ్యంబుగా మెక్కెనే.

    రిప్లయితొలగించండి
  7. కామందుడు గొరిగె మెయిని
    రోమంబుల ; కూరఁ జేయ రుచిగ భుజించెన్
    సేమంబుగ నెరి లేకనె ,
    మేమందరమది గనుచు న మితముగ నవ్వన్

    రిప్లయితొలగించండి
  8. సామూహికభోజనముల
    నేమాత్రము వదలననుచు నిశ్చయమతియై
    గ్రామములో ముఖ్యులు బహు
    రోమంబుల కూరఁ జేయ రుచిగ భుజించెన్

    [బహురోమము - గొఱ్ఱె]

    రిప్లయితొలగించండి
  9. రామయ తన కూతురునిన్
    గ్రామంబున జూడనెంచి రయముగ నేగెన్
    జామాత యింటిలో బహు
    రోమంబుల కూరఁ జేయ రుచిగ భుజించెన్

    రిప్లయితొలగించండి
  10. చేమనుదెచ్చెనుశ్రీపతి
    భామయువండెనుతలపడిబంధురశ్రద్ధన్
    నీమంబునదీసిపొరను
    రోమంబుల, కూరయే
    రుచిగభుజించెన్

    రిప్లయితొలగించండి
  11. గోముగఁ బతి దేవుం డా
    వామాక్షి నవీన రీతి భార్యా మణియే
    ప్రేమగ శాదమ్ముల భూ
    రోమంబుల కూరఁ జేయ రుచిగ భుజించెన్

    భామల్ మెచ్చ భృశమ్ము పాకమును విభ్రాంతాత్మలై నిత్యమున్
    క్షేమం బీయఁగ నెంచి భోక్తలకు వీక్షింపంగ మందంచు నా
    వామున్ శక్తి యుతమ్ము నెమ్మి విభుఁడే, స్వాస్థ్యార్థమై వండు వా
    రోమంబుల్ వడిఁ దెచ్చి వండినఁ గడున్ రుచ్యంబుగా మెక్కెనే

    [వండు వారు + ఓమంబుల్ = వండు వా రోమంబుల్]

    రిప్లయితొలగించండి
  12. నీమంబుల్ కులసాంప్రదాయముల తా నీరంబులో ముంచుచున్
    గ్రామంబుంజని భూసురుండు కడు విభ్రాంతమ్ముగా మిత్రులన్
    ఆమంత్రించియు భోజనంబునకు తానయ్యారె చింబున్, వినా
    రోమంబుల్, వడిఁ దెచ్చి వండినఁ గడున్ రుచ్యంబుగా మెక్కెనే

    రిప్లయితొలగించండి
  13. కం॥శ్రీమంతుని యింటఁ గుదిరె
    సామంతుఁడుగఁ దన వంట చతురతఁ జూపన్
    గామందు తెలుపఁగ వినా
    రోమంబులఁ గూరఁ జేయ రుచిగ భుజించెన్

    శా॥ సామాన్యంబుగ వంటఁ జేయఁ రుచిగన్ సాధ్యమ్ముఁ గాదయ్యరో
    శ్రీమంతుండటు ప్రాభవమ్ముఁ దెలుపన్ జేకొన్న యావంటల
    య్యే మాంసాదులఁ జక్కగాను జవితో నిట్టుల్ దొలంగించుచున్
    రోమంబుల్ వడిఁ దెచ్చి వండినఁ గడున్ రుచ్యంబుగా మెక్కెనే

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.

    మామయె దుకాణమున గొని
    కోమలికి ఝషములనివ్వ కూర కొఱకునై
    నీమముగా తొలగించియు
    రోమంబుల;కూరఁజేయ రుచిగ భుజించెన్.

    రిప్లయితొలగించండి