28, మే 2024, మంగళవారం

సమస్య - 4777

29-5-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సమస్యలే జీవితమున సౌఖ్యప్రదముల్”
(లేదా...)
“మానవ జీవితమ్మున సమస్యలె సర్వ సుఖప్రదమ్ములౌ”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

19 కామెంట్‌లు:

  1. తానొకనీతిమార్గమునుతర్కమునందునజూడవచ్చుగా
    ఆనగృహస్థుడేపిదపయానముసాగగయోగియౌనులే
    పూనికకంటకంబులనుపూవులయట్టులచూచుచోమదిన్
    మానవజీవితమ్మునసమస్యలెసర్వసుఖప్రదమ్ములౌ

    రిప్లయితొలగించండి
  2. కందం
    నిమిష నిమిషమ్ము పెరుగుచు
    సమస్యలు భయమొనరించు, సాధింప నుపా
    యముగన్ బోరిన వీడెడు
    సమస్యలే జీవితమున సౌఖ్యప్రదముల్!


    ఉత్పలమాల
    దీనులుగన్ సమస్యలకధీనులు నౌచు ప్రజాలి కుందుటే
    మానక యుండ నేర్చిరన మారునె జీవితమెన్నడేనియున్?
    బూనికతో నుపాయముగఁ బోరిన మోదమొసంగ వీడుచున్
    మానవ జీవితమ్మున సమస్యలె సర్వ సుఖప్రదమ్ములౌ!

    రిప్లయితొలగించండి
  3. అమరని జీవితమందున
    సమస్యలే యణువణువున సంఘర్షణలే
    సమయానికి సవరించిన
    సమస్యలే జీవితమున సౌఖ్యప్రదముల్

    మానవ జీవితమ్మున సమస్యలు ముప్పిరిగొన్న వేళలో
    దీనుని వోలె లోబడక దిట్టతనంబున శక్తు లొడ్డుటన్
    మానక మంచియత్నమున మార్కొని వేగ పరిష్కరించినన్
    మానవ జీవితమ్మున సమస్యలె సర్వ సుఖప్రదమ్ములౌ

    రిప్లయితొలగించండి

  4. శ్రమ యారోగ్య రహస్యము
    శ్రమయే దీర్ఘాయు వనెడి సజ్జన శ్రేష్ఠుల్
    విమలమతులైన వారికి
    సమస్యలే జీవితమున సౌఖ్యప్రదముల్.


    వానలు మండుటెండవెను వచ్చిన హర్షము నిచ్చు నట్లుగా
    మౌనము రాజ్యమేలుతరి మానసమున్ మురిపించు గానమే
    వీనుల విందుజేయదె వివేకము తోడ పరిష్క రించినన్
    మానవ జీవితమ్మున సమస్యలె సర్వ సుఖప్రదమ్ములౌ.

    రిప్లయితొలగించండి
  5. తమివేళ తొమ్మిదవగనె
    గమకమగు సమస్య నొకటి కందివరులిడన్
    అమరి తలపించు నెప్పుడు
    సమస్యలే జీవితమున సౌఖ్యప్రదముల్

    రిప్లయితొలగించండి
  6. కం॥ సమముగ సమస్య లీభువి
    సమ పరిహారముఁ గనుఁగొను సాధ్యత నేర్పున్
    విమల మతుల నొనరించుచు
    సమస్యలే జీవితమున సౌఖ్యప్రదముల్

    ఉ॥ మానవ జీవితమ్మున సమస్యలు నేర్పవ గొప్ప పాఠముల్
    దీనతఁ బాపు సంయమముఁ దేఁకువ స్థైర్యముఁ బెంచు యోగ్యతన్
    బూనుచు నాసమస్యలిలఁ బొందిక తోడను ద్రుంచ నేర్వఁగన్
    మానవ జీవితమ్మున సమస్యలె సర్వ సుఖప్రదమ్ములౌ

    రిప్లయితొలగించండి
  7. సుమధుర భావమున మనుచు
    క్రమముగ జనియించు వివిధ కాంక్ష ల నెల్లన్
    ప్రమద ము న దీర్చు కొన నా
    సమస్య లే జీవి తమున సౌఖ్య ప్రదమౌ

    రిప్లయితొలగించండి
  8. కం:తమ పరివార సమస్యలు,
    తమకున్ తలనొప్పి బెంచ,దలచుచు దిగులున్,
    శ్రమ యేల?శంకరార్యుల
    సమస్యలే జీవితమున సౌఖ్యప్రదముల్”

    రిప్లయితొలగించండి
  9. ఉ:మానవజీవితమ్మున సమస్యలు కాలము,దూరముల్,రుజల్
    వానిని దీర్చు మార్గములు వచ్చెను శాస్త్రము తోడ,నే డవే
    మానవ జీవితమ్మున సమస్యలె? సర్వ సుఖప్రదమ్ములౌ”
    వానిని శాస్త్రవేత్త లిడ బాథలు తగ్గెను మానవాళికిన్.

    రిప్లయితొలగించండి
  10. సమరసముగ నరమరలకు
    సమయమునకు తగినరీతి స్పందించుచు నో
    రిమి జూపఁగతగు నపుఁడా
    సమస్యలే జీవితమున సౌఖ్యప్రదముల్

    రిప్లయితొలగించండి
  11. మానసమందు నెట్టియనుమానము నూన్చక మానితమ్ముగా
    పూనికతో సమస్యలను బొల్పుగ డీకొను దీక్షబూనగన్
    కానిదిలేదు మానవుల కామితముల్ నెరవేరు నారయన్
    మానవ జీవితమ్మున సమస్యలె సర్వ సుఖప్రదమ్ములౌ

    రిప్లయితొలగించండి
  12. సమయోచితముగసాగుచు
    సమాజమునజనములున్న జరుగును మేలున్
    సమరస భావముతో చన
    సమస్యలేజీవితమున సౌఖ్య ప్రదమ్ముల్


    రిప్లయితొలగించండి
  13. మ్రానుల నీడఁ పల్లవము మాయును మొక్కలు నెండనేపులౌ
    సానఁ బడంగ రాయి సొగసైతళుకీను శ్రమంబుగాదే సో
    పానము మీఱనడ్డులటుపై గడిలేక గడించవచ్చునే
    మానవ జీవితమ్మున సమస్యలె సర్వసుఖప్రదమ్ములౌ

    రిప్లయితొలగించండి
  14. విమ లాంతరంగమున ధై
    ర్యము నూని నిలువఁ దొలంగు నఖిల సమస్యల్
    సమయస్ఫూర్తి పరిష్కృత
    సమస్యలే జీవితమున సౌఖ్యప్రదముల్


    ఈ నర జన్మమే నిలయ మెన్నఁగ ధాత్రిని దుఃఖ రాశికిన్
    దాని నెదిర్చి నిల్వఁగ ముదమ్ము ఘనమ్ముగఁ గల్గు నిద్ధరం
    గానక యుత్తరించు గతిఁ గష్టము లందు విచార మందుటన్
    మానవ? జీవితమ్మున సమస్యలె సర్వ సుఖప్రదమ్ములౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్య పైపూరణలు నా email కు వచ్చినపుడు తొలుత ఆంగ్లములో చాలా గమ్మత్తుగా ఉంటాయి. Show original click చేస్తే తెలుగు వస్తుంది. కానీ మీ పద్యము యొక్క ఆంగ్లానువాదములో తమిళు కూడ చేరింది ”ముద్దు ముదూన్ ముక్కూ కునూ త్తూన్దార్” అని ఉంది తమిళులో మధ్యలో ఏ భాషకు చేరనివి కూడ కొన్ని ఉన్నాయండి . నా తమిళు LKG level అండి. కొంత తప్పుగా చదివి యుండవచ్చు.

      తొలగించండి
    2. నాపద్యములను వీక్షించి నందులకు సంతోషమండి.

      తొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    క్రమ జీవనమున సాగుచు
    సమస్యలఁ పరిష్కరించ శ్రమ లెక్కిడకన్
    సమమన్ని యనెడు వానికి
    సమస్యలే జీవితమున సౌఖ్యప్రదముల్.

    రిప్లయితొలగించండి
  16. ఉ.

    దానము చేత పాపములు దగ్ధము చేసిరి పుణ్యమూర్తులే
    గానము జేసి దైవమును గాంచిరి శాస్త్రులు భక్తి మార్గమున్
    మానము గూర్చి దేహమిడి మాన్యులు చేరిరి స్వర్గలోకమున్
    *మానవ జీవితమ్మున సమస్యలె సర్వ సుఖప్రదమ్ములౌ.*

    రిప్లయితొలగించండి