30, జులై 2024, మంగళవారం

సమస్య - 4837

31-7-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నిప్పుఁ ద్రొక్కి కోఁతి నిజముఁ బలికె”

(లేదా...)

“నిప్పును ద్రొక్కి వానరము నిష్ఠగఁ బల్కెను సత్యవాక్యముల్”

(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)

14 కామెంట్‌లు:

  1. తప్పలెన్నొ చేసి తప్పించుకొనితిర్గు
    కోతి చేష్టలున్న భీతి జనుని
    యొప్పకొనగ తప్పు నిప్పుముందుంచగా
    నిప్పు ద్రొక్కి కోతి నిజము బలికె

    రిప్లయితొలగించండి
  2. అప్పులెన్నొ చేసి యాడంబరాలతో
    బ్రతుకు వాని బ్రతుకు చితికి తుదకు
    నప్పు నిప్పటంచు నావేదన పడుచు
    నిప్పుఁ ద్రొక్కి కోఁతి నిజముఁ బలికె.


    అప్పులు జేయువారలకె యందును సౌఖ్యము లంచు భూరిగా
    నప్పులు చేసి బాధపడెడర్భకు డొక్కడు చెప్ప నిట్లుగా
    నప్పది నిప్పుతో సమము హానిని గూర్చుననన్, సఖుండనెన్
    నిప్పును ద్రొక్కి వానరము నిష్ఠగఁ బల్కెను సత్యవాక్యముల్.

    రిప్లయితొలగించండి

  3. ఆటవెలది
    మారుతిగఁ గని కుజ మానవతియనుచు,
    'వానర సఖులకు వివరమటంచు',
    రామమూర్తి కోర సేమముగ మెరయ
    నిప్పుఁ ద్రొక్కి, 'కోఁతి నిజముఁ బలికె'

    ఉత్పలమాల
    ' చెప్పుచు హన్మ మారుతిగ సీతను మానవతీలలామగన్' ,
    తప్పదటంచు రాముఁడట దారనె యగ్ని పరీక్షఁ గోరఁగన్
    జప్పున దూకియున్ మెరసి సాధ్విగఁ దేలఁగ గుండమందునన్
    నిప్పును ద్రొక్కి, 'వానరము నిష్ఠగఁ బల్కెను సత్యవాక్యముల్'

    రిప్లయితొలగించండి
  4. ఇంత తెలివియుండ నేమిఫలితమయ్య
    నిప్పుఁ ద్రొక్కి కోఁతి నిజముఁ బలికె
    ననగ , నెంత కల్ల యనునదెరుగకుండ
    నమ్ముజనుల జూడ నవ్వు బుట్టు

    రిప్లయితొలగించండి
  5. నిప్పు తొక్క కోతి నిలు వెల్ల వణ కుచు
    బాధ పడును గాని పలుక బోదు
    చెప్పు కొనుట కైన సిగ్గగు నెచ్చట
    నిప్పు ద్రొ క్కి కోతి నిజము బలికె?

    రిప్లయితొలగించండి
  6. తప్పులు చేయువారలకు తప్పవు తిప్పలు, దెప్పరమ్మునన్
    ముప్పునతిక్రమించి శుభముంబడయన్దగు రీతి జేయునా
    తప్పులు యొప్పులౌననుచు ద్రావిన మైకమునందు సొక్కుచున్
    నిప్పును ద్రొక్కి వానరము నిష్ఠగఁ బల్కెను సత్యవాక్యముల్

    రిప్లయితొలగించండి
  7. తప్పుఁజేయ నీకు తప్పవు తిప్పలు
    దెప్పరమ్ములందు తప్పుసేయ
    తప్పనిసరిగాన తప్పుకాబోదని
    నిప్పుఁ ద్రొక్కి కోఁతి నిజముఁ బలికె

    రిప్లయితొలగించండి
  8. తప్పదారిబట్టి తనరారు నేతలన్
    గోతులనగనొప్పు కోపువాఱు
    'మీట మీటుచుంటి నోటమి యేలనో'
    నిప్పుఁ ద్రొక్కి కోఁతి నిజముఁ బలికె

    తప్పుడు మార్గమెంచుకొను దౌష్ట్యపు నేతలు కోతులే కదా
    నిప్పును ద్రొక్కి వానరము నిష్ఠగఁ బల్కెను సత్యవాక్యముల్
    'చప్పున నొక్కు చుంటి గద సంపద పంచెడు మీట మేటిగా!
    ఇప్పటి నాపరాజయము నెందుకు కూర్చిరొ యమ్మలక్కలే?'

    రిప్లయితొలగించండి
  9. పరులఁ గాంచి నేర్చుఁ బన్నుగ విబుధుండు
    మూర్ఖుఁ డనుభవించి మునుపు నేర్చుఁ
    జక్క నైన మాట త్రొక్కఁ గాలు ననుచు
    నిప్పుఁ ద్రొక్కి కోఁతి నిజముఁ బలికె


    ఎప్పటి కేది మంచి దగు నింపుగ నయ్యది సేయ నెంచుచుం
    జప్పునఁ గొర్కి నాలుకను శాంతి వహించి యొకింత యంతటన్
    ముప్పు నెఱింగి డెందమున బోరన గెంతుచు వింత సుంత క
    న్నిప్పును ద్రొక్కి వానరము నిష్ఠగఁ బల్కెను సత్య వాక్యముల్

    [కన్ను + ఇప్పును = కన్నిప్పును ; కన్ను విప్పును]

    రిప్లయితొలగించండి
  10. ఆ.వె:అగ్రజునకు ధర్మ మాచరింప దెలిపి
    తమ్ముడిట్లు పలికె "దానవేంద్ర!
    సీత నింక వదల సేమమౌ చెనటి యై
    నిప్పుఁ ద్రొక్కి కోఁతి నిజముఁ బలికె”
    (రావణుని తో విభీషణుడు-ఆ కోతి అల్లరి దైనా నిప్పు తొక్కిన దైనా నిజమే చెప్పింది.సీతని వదిలెయ్యటమే క్షేమం. )

    రిప్లయితొలగించండి
  11. ఉ:తప్పొకయింత లేకయును,దారుణశీల పరీక్ష పేరిటన్
    మెప్పులు బొంది సేమముగ మృత్యువు నొందక సీత నిల్వగా
    నిప్పును ద్రొక్కి, వానరము నిష్ఠగఁ బల్కెను "సత్యవాక్యముల్
    చెప్పెగ యగ్నిదేవుడును సీతను సాధ్వి యటంచు రాఘవా!"
    (వానరము=హనుమంతుడు.సీత నిప్పులు తొక్కి బైట పడింది కనుక అగ్నిదేవుడు సీతను గూర్చి సత్యవాక్యం చెప్పినట్టు అన్నాడు)

    రిప్లయితొలగించండి
  12. తప్ప త్రాగ దేహ మప్పడమగుటన
    నేమి చేయలేక మోము దించి
    మౌన దీక్ష తోడ మారుపలుకఁడాయె
    నిప్పుఁ ద్రొక్కి కోఁతి నిజముఁ బలికె

    రిప్లయితొలగించండి
  13. దాశరథుల చేత తప్పదు మృత్యువ
    టంచు నింక నెరుగు మయ్య మదిని
    తోక కాల్చినంత తొలగదు చావని
    నిప్పు తొక్కి కోతి నిజము పలికె

    చెప్పగ నా జటాయువును చేరెను సంద్రము దాటి లంకనే
    నొప్పుగ చేరి గాంచెనట నుర్విజ నాతరుమూలమందునన్
    నిప్పును పెట్టుమంచనుచు నీల్గెడు రక్కసురావణాసురున్
    నిప్పును ద్రొక్కి వానరము నిష్ఠగఁ బల్కెను సత్య వాక్యముల్”*

    రిప్లయితొలగించండి