2, జులై 2024, మంగళవారం

సమస్య - 4809

3 -7-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మాన్యులుండరు కోటబొమ్మాళిలోన”

(లేదా...)

“కోటబొమ్మాళి పురమ్ములో నకట మాన్యుఁ డొకండును గానరాఁడు పో”

(మొన్న కోటబొమ్మాళి శతావధానంలో నా సమస్య)

30 కామెంట్‌లు:

  1. శివునినెలవది చూడగాశిల్పమందు
    పౌరుడెవడుండు పెద్దగా భవునియెదుట
    పరముడీశుని కాదనుపాలకుండు
    మాన్యులుండరుకోటబొమ్మాళిలోన

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. తేటగీతి
      ద్విగళఁపు శతావధానము విందు సేయ
      వినగబోవఁగ సాహితీ ప్రియులు సభకు
      విపణి నిత్యావసరముల విధులఁ దప్ప
      మాన్యులుండరు కోటబొమ్మాళిలోన!

      ఉత్పలమాల
      వేళకు ముందరే ద్విగళ వేది వధానపు వేడ్కలై సభా
      పాళిక జేర పండితులు వారల వీడక వెంట నూరు స
      మ్మేళన ప్రాంగణమ్మనగ మెచ్చగఁ జేర సుమారు కోటబొ
      మ్మాళి పురమ్ములో నకట మాన్యుఁ డొకండును గానరాఁడు పో!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  3. కూళురు కారు మెచ్చదగు కోవిదు లుండెడి ప్రాంతమయ్యదే
    మూలము లోననెచ్చట ప్రబుద్ధుల గోష్టుల నిర్వహించినన్
    వేళకు చేరువారలట ప్రీతిగ నప్పుడు చూడ కోటబొ
    మ్మాళి పురమ్ములో నకట మాన్యుఁ డొకండును గానరాఁడు పో.

    రిప్లయితొలగించండి
  4. పండితులవధానులు గల పట్టణమ్ము
    నిత్య సాహిత్య సభలతో నిగిడెనాడు
    నేడు పేరువొందినమిగుల నిర్మలంపు
    మాన్యులుండరు కోటబొమ్మాళిలోన!

    రిప్లయితొలగించండి
  5. సన్నిధములోన పండిత సభలె యున్న
    వేళ మీరక నేగెడు విజ్ఞులెల్ల
    దాపున నవధాన మనుచు తరలి పోగ
    మాన్యులుండరు కోటబొమ్మాళిలోన.

    రిప్లయితొలగించండి
  6. గౌర వింతురు బుధులను ఘనము గాను
    సాహితీ సభ లన్న చో చాల ప్రీతి
    తెలుగు. పోషింతు రే కాని తెగడు నట్టి
    మాన్యు లండరు కోట బొ మ్మాళి లోన

    రిప్లయితొలగించండి
  7. తే॥ మాన్యులుండఁగఁ గోటబొమ్మాళి లోన
    నడచె ద్విగళ శతావధానమచటఁ గద
    ములుకుల వలెఁ గ్రుచ్చుకొనద పలుక నిటుల
    మాన్యులుండరు కోటబొమ్మాళిలోన

    ఉ॥ పాళముమీఱు పాటవముఁ బ్రాభవమొందిన మాన్యశ్రేష్ఠులై
    పాళముమీఱ కైతలను భావము మీరఁగఁ బ్రోత్సహించఁగన్
    హేళనఁ జేయ రాదనెద హేలగ నిట్టులఁ బల్కి కోటబొ
    మ్మాళి పురమ్ములో నకట మాన్యుఁ డొకండును గానరాఁడుపో

    పాళముమీఱు అమితమగు (నిఘంటువు సహాయమండి)

    నిజానికి నాకు ఛందో గోపనము అర్థము కాలేదండి. ఇతరులు వ్రాసిన పిదపనే అర్థమైనదండి. మానిని 22 అక్షరాల పద్యము కదండి అలాగ 23 అక్షరాల పద్యము కొరకు వెతుకుచుంటినండి. కనుక నాపద్యము బాగుంటే శ్రేయము వారికి తప్పులుంటే నాకండి.

    రిప్లయితొలగించండి
  8. పంటలు పరిశ్రమల తోడ వరలు చుండి
    మండలము నంత టికి దలమానికమయి
    దొరయుచుండు కాలమునందు దుష్టపు జన
    మాన్యులుండరు కోటబొమ్మాళిలోన

    రిప్లయితొలగించండి
  9. మంచివారు పలువురసామాన్య జనులు
    పొడవడుదురు కనుంగొన నడుగడుగునఁ
    దుదకు పురవీధులందున వెదకిన నవ
    మాన్యులుండరు కోటబొమ్మాళిలోన

    వేళకు చేరుకొంద్రు పురపెద్దలు పిల్లల వారి యింటికిన్
    దాళమువైచి వేదికకు తామవధానము చూడ గోరుచున్
    బాళెము మొత్తమున్ దరలి వచ్చిన వేళను చూడ కోటబొ
    మ్మాళి పురమ్ములో నకట మాన్యుఁ డొకండును గానరాఁడు పో

    రిప్లయితొలగించండి
  10. సజ్జనులఁ గూడి యుందురు శాంత మూని
    యేమఱక యుందురు సతమ్ము తాము సేయు
    కర్జముల వీడ రెన్నఁడు దుర్జన గణ
    మాన్యు లుండరు కోటబొమ్మాళి లోన


    మే లొనరించు నేత లిట మించి వసింపఁగఁ బట్టణంపు స
    త్పాలన ముండ నింపుగను బండిత శూన్యుల నేరిఁ గాంచ మీ
    నేలను నేర నైతిఁ గడు నేర్పు గడింపని వాఁడు గోటబొ
    మ్మాళి పురమ్ములో నకట మాన్యుఁ డొకండును గానరాఁడు పో

    రిప్లయితొలగించండి
  11. వేలకొలంది సత్కవులు వెల్గులు నింపిన యాంధ్ర భూమియం
    దేలొకొ మాన్యవర్యులకు నెద్దడి యేర్పడె? నమ్మశక్యమే?
    మేలములాడనేలనిటు? మీరెటులన్ వచియింత్రు కోటబొ
    మ్మాళి పురమ్ములో నకట మాన్యుఁ డొకండును గానరాఁడు పో?

    రిప్లయితొలగించండి
  12. తే.గీ:మహితు లెందరో కలరు, ధర్మమ్ము కొరకు,
    దైవభక్తికి నిలతురు,దాని దిట్టు
    వారి దిట్ట రచ్చట ప్రతి బల్క నట్టి
    “మాన్యులుండరు కోటబొమ్మాళిలోన”*
    (అక్కడ ధర్మాత్ములున్నారు.వారిని తిట్టే వాళ్లు ఉన్నా వారికి సమాథానా లివ్వటానికి ఆ మాన్యులు అక్కడ నిలబడనే నిలబడరు. )

    రిప్లయితొలగించండి
  13. ఉ:కేళుల గాని,సైన్యభుజకీర్తుల గాని,వధాన విద్య యన్
    కేళిన గాని,భాగవత కీర్తన లందున గాని పొందు నా
    ఖ్యాళులు కాక పల్కుబడి నందిన మాన్యత తోడ కోటబొ
    మ్మాళి పురమ్ములో నకట మాన్యుఁ డొకండును గానరాఁడు పో”
    (ఏదో ఒక రంగం లో పేరు గడించిన మాన్యులే కానీ కేవలం పలుకుబడి వల్ల మాన్యు లైన వారు కోట బొమ్మాళి లో లే రని.మాన్యులలో కూడా విద్య వల్ల మాన్యు లైన వారు కేవలం డబ్బు,పలుకుబడి వల్ల మాన్యు లైన వారు అనే భేదం ఉంటుంది. )

    రిప్లయితొలగించండి
  14. తేనెలూరెడు మాటల తెలుగు భాష
    విభవము దశదిశలలోన వెలుగుచుండ
    పలుచనగ జేసి యిట్లన బాడియగునె
    మాన్యులుండరు కోటబొమ్మాళిలోన

    రిప్లయితొలగించండి
  15. పరుల నెప్పుడు హింసించు పాతకుండు
    దుష్ట పాలనఁజేసెడు ధూర్త జనుడు
    సత్యమాడుట నేర్వని సఖులు దప్ప
    మాన్యులుండరు కోటబొమ్మాళిలోన

    రిప్లయితొలగించండి
  16. వేళకు రారె యెప్పుడును వీధుల వెంబడి తిర్గుఁగోటబొ
    మ్మాళి పురమ్ములో నకట మాన్యుఁ డొకండును గానరాఁడు పో
    యూలల నూదుకొందుచును నొక్కరి కొక్కరు గోలసేయుచున్
    గాలము వెళ్ళబుచ్చెదరు కాపురుషున్వలెఁ జూడనచ్చటన్

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ద్విగళపు శతావధానమున్ వినుట కనుచు
    మాన్యులంద రచటి కేగ మానితముగ
    పట్టణమ్మున సామాన్య ప్రజలె గాని
    మాన్యులుండరు కోటబొమ్మాళి లోన.

    రిప్లయితొలగించండి
  18. చేరుచునొకచో నాడుచు చీట్లపేక
    కాలము గడుపువారలె గ్రామ ముందు
    మాన్యులుండరు, కోటబొమ్మాళి లోన
    కాన రారెచటకవులు కానివారు

    రిప్లయితొలగించండి