4, సెప్టెంబర్ 2024, బుధవారం

సమస్య - 4872

5-9-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పద్యము శైలీరమ్యతను వీడి సంతుష్టి నిడున్”

(ఛందోగోపనం)

(లేదా...)

“శైలీరమ్యత లేని పద్యమె మనస్సంతుష్టిఁ జేకూర్చెడిన్”

13 కామెంట్‌లు:

  1. ఏలొకొ వ్రాయఁగ పద్యము
    శైలీరమ్యతను వీడి, సంతుష్టి నిడున్
    శైలిని విడనాడక నను
    శీలనమున శబ్దభావ శేముషి గదురన్

    రిప్లయితొలగించండి
  2. నాలుగు దినములు నేర్వగ
    మేలగు ఛంద స్సు రీతి మెలపుగ వ్రాయన్
    బాలుడు రచించు పద్యము
    శైలీరమ్యతను వీడి సంతుష్టి నిడున్

    రిప్లయితొలగించండి
  3. కేలీ విలాసమందున
    మేలిమితోనంబుజాక్షి మెయిమఱపున తా
    నాలాపించిన పద్యము
    శైలీరమ్యతను వీడి సంతుష్టి నిడున్.


    ప్రాలేయాంశువు పూర్ణమాసి నిశిలో రమ్యంబుగా వెల్గి చం
    ద్రాలోకమ్మును కాచుచుండగను భార్యాభర్త లానం దమున్
    కేలిన్ మున్గిన వేళ మైమరపు సంకేతమ్ము గా పాడెడిన్
    శైలీరమ్యత లేని పద్యమె మనస్సంతుష్టిఁ జేకూర్చెడిన్.

    రిప్లయితొలగించండి
  4. కందం
    శ్రీలోలుని భాగవతము
    మూలము శ్రీరాముఁడనఁగ పోతన వ్రాయన్
    మేలుగ, తేలునె పద్యము
    శైలీరమ్యతను వీడి, సంతుష్టి నిడున్


    శార్దూలవిక్రీడితము
    మాలాధారుని విష్ణుమూర్తి కథలన్ మన్నించి శ్రీరామునిన్
    భూలోకమ్మున వ్రాయభాగవతమున్ బోతన్నకాదేశమై
    'లీలామానస చోరునిన్ మదిని కీర్తింపంగ' ,ప్రాప్తించునే
    శైలీరమ్యత లేని పద్యమె, 'మనస్సంతుష్టిఁ జేకూర్చెడిన్! '

    రిప్లయితొలగించండి
  5. కాలమ్మేగతి మారిపోయెనకటా కన్పట్టె కావ్యంబులన్
    శైలీరమ్యత లేని పద్యమె, మనస్సంతుష్టిఁ జేకూర్చెడిన్
    వాలాయమ్ముగ భావయుక్త పదముల్ పద్యమ్ములన్ గూర్చుచున్
    శైలీరమ్యత ప్రోదిగా కవివరుల్ సత్కావ్యముల్ వ్రాయగన్

    రిప్లయితొలగించండి
  6. కం॥ హేలగ పద్యము లల్లుచు
    మేలిమి కృతులను బొదవఁగ మేటి కవులిలన్
    బాలసుఁడు నుడువుఁ బద్యము
    శైలీ రమ్యతను వీడి సంతుష్టి నిడున్

    శా॥ ఏలా మూర్ఖపు పల్కులీ విధముగా, నేధూర్తుఁడీ రీతిగాఁ
    బ్రేలన్ జాటుచుఁ గూర్చెనో మదిరనే పీల్చంగ మత్తెక్కెనో
    గోలన్ జేయుచు జ్ఞానహీనతనిటుల్ ఘోషించగా నెట్టులన్
    శైలీ రమ్యత లేని పద్యమె మనస్సంతుష్టిఁ జేకూర్చెడిన్

    రిప్లయితొలగించండి
  7. లీలా కృష్ణుని చేష్టలు
    కోలాటపు నాట్యమిచ్చు కోలాహలమున్
    దూలుచు వ్రాసిన పద్యము
    శైలీరమ్యతను వీడి సంతుష్టి నిడున్

    లీలామానుష వేషధారి సలిపే లేఁబ్రాయ కృత్యంబులున్
    గోలాటంబున గుంపులోన కలిగే కోలాహలోత్సాహముల్
    నీలాకాశముపైనఁ దేలు మొగులున్ నిస్సిగ్గు బూతాటమై
    శైలీరమ్యత లేని పద్యమె మనస్సంతుష్టిఁ జేకూర్చెడిన్

    రిప్లయితొలగించండి
  8. లీల నిట యౌగపద్యము
    రాలఁగ వదనమ్ము నుండి శ్రమ నెల్లం బే
    రోలగము నందుఁ బద్యము
    శైలీరమ్యతను వీడి సంతుష్టి నిడున్

    [శైలీ రమ్యతను = శైలీ రమ్యతచే; శ్రమ నెల్లను వీడి]


    ఈ లా గెవ్వరు పల్క నేరరు గదా యే మయ్యె నీ ప్రజ్ఞయే
    యేలా పల్కెదు వీ విధంబు నిది కాదే పద్య రాజం బహో
    యాలోకింపఁగ నీ వెడంద నొక పర్యాయమ్ము వీక్షింపుమా
    శైలీ రమ్యత లేని పద్యమె? మనస్సంతుష్టిఁ జేకూర్చెడిన్

    రిప్లయితొలగించండి
  9. (1)కం:బాలుని గా ప్రథమమ్మున
    తేలిక పదములను వెట్టి తెలిసిన విషయ
    మ్మే లిఖియించగ పద్యము
    శైలీరమ్యతను వీడి సంతుష్టి నిడున్”
    (చిన్నతనం లో నేను మొదట వ్రాసిన పద్యం పాండిత్యం,విషయపరిజ్ఞానం లేకున్నా ,శైలి లో రమ్యత లేకున్నా ఒక సంతృప్తి నిస్తూ ఉంటుంది.తొలి పద్యం కనుక.)

    (2)శా:మేలౌ తాత్త్వికభావముల్ గలిగి,గంభీరమ్ముగా నుండి,య
    ర్థాలంకారము గల్గి, పాఠకుని విద్యన్ బెంచ జాలంగ పు
    ష్పాలన్ బోలక రాల బోలు పదముల్ వ్రాలంగ నే కొంతయో
    శైలీరమ్యత లేని పద్యమె మనస్సంతుష్టిఁ జేకూర్చెడిన్”
    (గొప్ప భావాలు,గంభీరత,మంచి అలంకారము ఉంటే ఆ పద్యం లో కొంత శైలీ సౌందర్యం లేకున్నా సంతృప్తి నిస్తుంది.శుష్క పాండిత్యం కాదు కనుక.శైలీ రమ్యత ఒక్కటే కొలత కాదు.)




    రిప్లయితొలగించండి
  10. కాలాను గుణము గాగను
    లీలా మాత్రముగ దైవ లీలల నెల్లన్
    పేలవమైనను పద్యము
    శైలీ రమ్యతను వీడి సంతుష్టి నిడున్

    రిప్లయితొలగించండి