16, సెప్టెంబర్ 2024, సోమవారం

సమస్య - 4884

17-9-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నములన్ వద్దన్న నలిగి ననుఁ దిట్టిరయో”
(లేదా...)
“నములన్ వద్దని చెప్పఁ గోపమున నిందావాక్యముల్ వల్కిరే”


12 కామెంట్‌లు:

  1. స్వానుభవమునఁ జాటు నా సందేశమిదే!

    కందం
    అమలమనన్ శాఖాహా
    రములగొనుచు శాఖలోన రాణించితినే!
    విముఖత మాంసము మధుపా
    నములన్ వద్దన్న నలిగి ననుఁ దిట్టిరయో!

    మత్తేభవిక్రీడితము
    అమలమ్మంచును శాఖలో మనుచు శాఖాహారముల్ గొంటి నే!
    ప్రముఖుల్ సైతము తప్పుకాదనుచు, నే వారింపగానెంచ, దో
    సము నాదన్న విధంబుగన్ గనుచు, మాంసాహారముల్ మద్యపా
    నములన్ వద్దని చెప్పఁ, గోపమున నిందావాక్యముల్ వల్కిరే!

    రిప్లయితొలగించండి

  2. స్వములేని వారల యని
    ష్టము తీర్చెదనని దలంచి సంపదనా మ
    ల్లమడుల పాల్జేసెడి దా
    నములన్ వద్దన్న నలిగి ననుఁ దిట్టిరయో.


    స్వము లేదంచు బికారులెల్లరులు నీ సాయమ్ము నే కోర స్వా
    ర్థము నేవీడి పరోపకారమని నీ తాహత్తునే మీరుచున్
    మమకారమ్మది మానవత్వమని సమ్మానించి నీవిచ్చు దా
    నములన్ వద్దని చెప్పఁ గోపమున నిందావాక్యముల్ వల్కిరే.

    రిప్లయితొలగించండి
  3. కం॥ తమకటు లాభముఁ గాంచఁగ
    గమనమిడెడి వారు పరుల కష్టములందున్
    సుమతినిఁ గనఁగను నీటిని
    నమలన్ వద్దన్న నలిగి ననుఁ దిట్టిరయో

    మ॥ తమకేమాత్రము లాభమున్న జనులత్యంతాదరమ్మొప్పఁగన్
    సమయస్ఫూర్తినిఁ బొంది త్రిమ్మరుటయున్ సామాన్యమే ధాత్రిలోఁ
    దమ స్వార్థమ్మును వీడి సేవఁ గన సద్భాగ్యమ్మయా తోయమున్
    నమలన్ వద్దని చెప్పఁ గోపమున నిందావాక్యముల్ వల్కిరే!

    నీళ్ళునమలు ను విడగొట్టి నీటిని అని తోయమున్ అని వ్రాసానండి. మరి అది ఒప్పిదమో నిషిద్ధమో తెలియదండి

    నమలు నములు రెండూ వాడుకలో ఉన్నందున నమలు వాడినానండి.
    త్రిమ్మరు వ్యవహరించు నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి
  4. కమనీయమైన తెలుగున
    నమర్చ కుండగ పదముల కర్థమెరుగకన్
    తమరు సలుపు యనుసంధా
    నములన్ వద్దన్న నలిగి ననుఁ దిట్టిరయో

    రిప్లయితొలగించండి
  5. క్రమముగ ను పాన శాల యె
    ప్రమ దము గలిగించు ననుచు పలికెడు వారే
    తమమున మున్గగ సుర పా
    నములన్ వద్దన్న నలిగి నను ది ట్టి ర యో

    రిప్లయితొలగించండి
  6. సమయంబాసన్న మయిన
    తమకముతో నక్రమముగ దారుణరీతిన్
    సముపార్జించు విధివిధా
    నములన్ వద్దన్న నలిగి ననుఁ దిట్టిరయో

    కమనీయంబుగ గద్దెదక్కి తమలో కక్కుర్తి పెంపొందగా
    తమ ప్రాధాన్యత నీతిబాహ్యమవగా తత్కాలమున్ బ్రాజ్ఞులే
    సముపార్జించుటకై విడంబనముతో సంపూర్ణమౌ సంవిధా
    నములన్ వద్దని చెప్పఁ గోపమున నిందావాక్యముల్ వల్కిరే

    రిప్లయితొలగించండి
  7. విమలనదీజలమున స్నా
    నముఁజేసినఁగలుగుశుద్ధి నందమొదవు నీ
    రము కలుషంబగుటను స్నా
    నములన్ వద్దన్న నలిగి ననుఁ దిట్టిరయో

    రిప్లయితొలగించండి
  8. విమలోత్కర్ష నదీజలంబుల జనుల్ వేమారు సుస్నాతులై
    యమలంబై దనరార నెమ్మియగు తోయంబందు మాలిన్యముల్
    యమితంబైన కతంబునన్ తగదు శ్రేయంబెంతయుం గాదు స్నా
    నములన్ వద్దని చెప్పఁ గోపమున నిందావాక్యముల్ వల్కిరే

    రిప్లయితొలగించండి
  9. మమతలఁ బెంచెడు విధముగ
    సముదమ్ము సతము వచింపఁ జను నిత్యాన
    ర్థము లైన యీ వృథా కథ
    నములన్ వద్దన్న నలిగి ననుఁ దిట్టిరయో


    తమకం బేలను మూడుపొద్దు లిటులం దానమ్ములం దాలకిం
    పుమ నా మాటలు మాను మిన్నెఱి తలంపుల్ నా వచింపంగ వా
    రు మరల్పంగఁ దలంచి నన్ను, జెడు నారోగ్యమ్ము చన్నీటి స్నా
    నములన్ వద్దని చెప్పఁ, గోపమున నిందావాక్యముల్ వల్కిరే

    రిప్లయితొలగించండి
  10. సమయముగాదిదివినుమా
    క్రమముగ మానుమనవినక కఠినుడ వగుచున్
    నములుచు పొగాకు విడుపా
    *"నములన్ వద్దన్న నలిగి ననుఁ దిట్టిరయో”*





    రిప్లయితొలగించండి
  11. కమనీయంబుగ మట్టితోడనిలవిఘ్నాధీశురూపమ్ములన్
    రమణీయంబుగ చేసిపూజలనహోరా త్రంబులన్ గెంతుచున్
    క్రమమున్ వీడుచు మూర్ఖులై సతతమర్థంబేమియున్ లేక పా
    నములన్ వద్దని చెప్పి గోపమున నిందా వాక్యముల్ పల్కిరే

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    అమృతమని హితుల తోడను
    అమితముగా త్రాగుచున్న నాతని సుతునిన్
    తమకము వీడమనుచు పా
    నములన్ వద్దన్న నలిగి ననుఁ దిట్టిరయో!

    రిప్లయితొలగించండి