9, సెప్టెంబర్ 2024, సోమవారం

సమస్య - 4877

10-9-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్పందన లేనట్టి జనులు వ్యర్థులు గనఁగన్”
(లేదా...)
“స్పందనలేని వ్యక్తులకు పంపుట వ్యర్థము పద్యముల్ కవీ”
(వైద్యం వేంకటేశ్వరాచార్యులకు ధన్యవాదాలతో...)

17 కామెంట్‌లు:

  1. కందం
    విందొనరించు కవిత్వము
    సిందులు వేసెడు నడకను జేపడినంతన్
    సుందరమను, సుమధురమను
    స్పందన లేనట్టి జనులు వ్యర్థులు గనఁగన్


    ఉత్పలమాల
    విందొనరన్ గవిత్వము నపేక్ష ఫలించ నలంకృతుల్ మనన్
    జిందులు వేసెడున్ నడకఁ జేపడునట్లుగ నల్లువాడ వీ
    వందరి కిన్ శుభాలమర నంపుదె! యెందరికర్థమౌ? పునః
    స్పందనలేని వ్యక్తులకు పంపుట వ్యర్థము పద్యముల్ కవీ!

    రిప్లయితొలగించండి
  2. బందుగులందరు గూడిన
    సందడి యందున కవితలు జక్కగ జెప్పన్
    కందమునెంచిన గూడను
    స్పందన లేనట్టి జనులు వ్యర్థులు గనఁగన్

    రిప్లయితొలగించండి

  3. అందరికర్థమగునటుల
    సుందరముగ వ్రాసి నంత చూపుచు మెప్పున్
    అందముగానున్నదనెడి
    *“స్పందన లేనట్టి జనులు వ్యర్థులు గనఁగన్”*



    రిప్లయితొలగించండి
  4. కం॥ ఎందరొ కృంగఁగఁ గన్నుల
    ముందర మునుగుచు వరదల ముంపు కరాళిన్
    విందులు వినోదమనుచును
    స్పందన లేనట్టి జనులు వ్యర్థులు గనఁగన్

    ఉ॥ డెందము మానసమ్ము నటు టెంకణమొనర్చి యాస్వదించుచున్
    బొందఁగఁ బద్య ధారలను మోదము మెచ్చరె కావ్యకర్తలున్
    జిందులఁ ద్రావి వేయుచును జేతన మొందని మొద్దు వాండ్రకున్
    స్పందన లేని వ్యక్తులకుఁ బంపుట వ్యర్థము పద్యముల్ కవీ

    టెంకణము నమస్కారము నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి

  5. అందమగు కావ్య మనుచును
    మందుల కేల వినిపింప మాన్యుడ వినరా
    యందలి బాగోగులపై
    స్పందన లేనట్టి జనులు వ్యర్థులు గనఁగన్.



    చందురుడీను చందిరిక చల్లదనమ్ము నెరుంగబోరు శ్రీ
    గంధపు సౌరభమ్ముల నిగారము మెచ్చని మంకుబోతులా
    సుందరమైన కావ్యమున సోయగమున్ గమనించి ధీటుగా
    స్పందనలేని వ్యక్తులకు పంపుట వ్యర్థము పద్యముల్ కవీ.

    రిప్లయితొలగించండి

  6. బందుగు లందరొక్కటయి పట్టిరి పద్యపు పోటి పెట్టుటన్
    సందడి చేయుచుండగనె చక్కగనక్కడి యంకురా ర్పణన్
    కందమునెంచి నేనచట కైతను వ్రాయుచు నుండ సుంతయున్
    స్పందనలేని వ్యక్తులకు పంపుట వ్యర్థము పద్యముల్ కవీ

    రిప్లయితొలగించండి
  7. చందనచర్చ సల్పినటు చారల గాడిదలొక్కవందకున్,
    సుందరకామినీమణులు సొక్కగ వ్యంధులఁజేరినట్లు, శీ
    తేందుమనోజ్ఞచంద్రికలు జృంభణ కానను గ్రాలుభంగియున్
    స్పందనలేని వ్యక్తులకు పంపుట వ్యర్థము పద్యముల్ కవీ!

    రిప్లయితొలగించండి
  8. కొందరు స్పందింతురు మరి
    కొందరు వినిమిన్నకుంద్రు కూర్చిన కృతులన్
    సుందరమౌ పద్యముఁ విని
    స్పందన లేనట్టి జనులు వ్యర్థులు గనఁగన్

    కొందరు చూపె స్పందనము గోఘృత పాయస మన్నరీతిగా
    కొందరు చూపె స్పందనము కోకిల పంచమగీతి రీతిగా
    సుందరమైన కావ్యమున శోభిలు భావన లెన్నగల్గినన్
    స్పందనలేని వ్యక్తులకు పంపుట వ్యర్థము పద్యముల్ కవీ

    రిప్లయితొలగించండి
  9. కందం:
    డెందమమందానందము
    నొందునొరులు మెచ్చగవిని యుక్తఁపు కవితల్
    సుందరమగు పద్యమునకు
    స్పందన లేనట్టి జనులు వ్యర్థులు గనఁగన్

    ఉత్పలమాల:
    అందముగా కవిత్వమును హాళిగ జెప్పిన సత్కవీంద్రునిన్
    స్పందనతోడ మెచ్చుకొన పర్వముగా దలబోయు నెన్నడున్
    సుందరమైన పద్యముల సుంతయు మెచ్చక మిన్నకున్న నా
    స్పందనలేని వ్యక్తులకు పంపుట వ్యర్థము పద్యముల్ కవీ

    రిప్లయితొలగించండి
  10. ఎందుం గని విని యెఱుఁగని
    చందంబు ప్రబలఁ గడింది క్షామము దేశం
    బంద విపత్తును గించి
    త్స్పందన లేనట్టి జనులు వ్యర్థులు గనఁగన్


    అందముఁ జూచి మెచ్చ జననాంధున కెవ్విధి శక్య మిద్ధరన్
    బృందపుఁ గేఁకలం జెవిటి భీతిని సంతస మేని నందునే
    ముందున కేఁగి తిట్టినను మూఁగ యెఱుంగునె మాఱుపల్క నే
    స్పందన లేని వ్యక్తులకుఁ బంపుట వ్యర్థము పద్యముల్ కవీ

    రిప్లయితొలగించండి
  11. కం:వందల ఇడుములు సంఘము
    నందుండగ వాని గనక నవధానములే
    యంద మనుచు సంఘము నెడ
    స్పందన లేనట్టి జనులు వ్యర్థులు గనఁగన్”
    (అవధానాల పట్ల ఈ విమర్శ నే నొక్కణ్నే కాక చాలా మంది చేస్తారు కనుక నా ఒక్కడి మీదే ఎవరూ కోపం తెచ్చుకో వద్దని మనవి.)

    రిప్లయితొలగించండి
  12. ఉ:"అందము వచ్చెనో!రచన యందున లోపము వచ్చెనో!" యటం
    చందరకున్ కవిత్వముల నంపకు "బా"గనుటో,"యిదేమి నీ
    బొంద" యటంచునో పలుక బూనిన నీకొక మేలు కాని యే
    స్పందనలేని వ్యక్తులకు పంపుట వ్యర్థము పద్యముల్ కవీ”

    రిప్లయితొలగించండి
  13. కందము లందు పద్యములు కమ్మగ వ్రాయుచు పుస్తకమ్ములన్
    అందముగానుకూర్చుచునుఆదరమొప్పగ ప్రేమ పొంగగా
    ముందుగచూడమంచునతిమోదముతోడసమీక్షకంచు నే
    *“స్పందనలేని వ్యక్తులకు పంపుట వ్యర్థము పద్యముల్ కవీ”*

    రిప్లయితొలగించండి
  14. సుందర సురుచిర పద్యము
    నందము గా నల్లి నప్పుడా నంద ముగా
    మంద మతు లైన వారలు
    స్పందన లేనట్టి జనులు వ్యర్థులు గన గన్

    రిప్లయితొలగించండి
  15. అందముఁ గలిగెడు పద్యము
    కందముగాఁజెప్పుచుంద్రు కవివరులిలలో
    విందుగ వ్రాయగ పద్యము
    స్పందన లేనట్టి జనులు వ్యర్థులు గనఁగన్”

    రిప్లయితొలగించండి
  16. విందురుకొంతమందిరివివీనుల సోకవుగాని శీర్షమున్
    బందుగణంబులందరును బాగుగ చూడగ నూపుచుందురే
    డెందము లేకవారలకు డీల్పడి దిక్కులు చూచుకావుతన్
    స్పందనలేని వ్యక్తులకు పంపుట వ్యర్థము పద్యముల్ కవీ

    రిప్లయితొలగించండి