29, సెప్టెంబర్ 2024, ఆదివారం

సమస్య - 4897

30-9-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శ్రీసతీమనోహారియౌ శ్రీగళుండు”

(లేదా...)

“శ్రీతరుణీమనోహరుఁడు శ్రీగళుఁడే యన శంక యేలనో”

17 కామెంట్‌లు:

  1. బ్రహ్మ సరస్వతీ దేవితో:

    తేటగీతి
    నీతి మఱచి సుత విన జామాతఁ దెగడ
    దక్షయజ్ఞాన గుండాన దహనమౌచు
    పార్వతిగ మరుజన్మను ప్రభవమొంద
    శ్రీ! సతీ మనోహారియౌ శ్రీగళుండు

    ఉత్పలమాల
    భూతగణాధిపున్ జగతిఁ బ్రోవఁగ క్ష్వేళము గ్రోళమంచనన్
    నైతిక ధర్మమంచువిని నర్మిలి మ్రింగుచు సర్వమంగళన్
    ప్రీతిగనన్ త్రయంబకుడు విశ్వము మెచ్చననుంగు గౌరికిన్
    శ్రీ! తరుణీ! మనోహరుఁడు శ్రీగళుఁడే యన శంక యేలనో?

    రిప్లయితొలగించండి
  2. వివరముగ దెలిపెద విను , విష్ణు మూర్తి
    శ్రీసతీమనోహారియౌ ; శ్రీగళుండు
    పర్వతసుత చాముండికి భర్త యగును
    వలను గాని యాలోచన వలదు నీకు

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. తే॥ పాలసంద్రమందునఁ బుట్టి పచ్చవలువ
      దారిని వలచి యిందిర తనర నతఁడు
      శ్రీసతీమనో హారియౌ, శ్రీగళుండు
      శైల సుత కోరి యడుగఁగ సందుకొనెను

      ఉ॥ త్రాతగ విష్ణుమూర్తి యటు త్రచ్చుచు నుండఁగ దేవదానవుల్
      చేతనతో సుధన్ బడయ శ్రీ జనియించఁగ శ్రీనిఁ జేకొనన్
      శ్రీతరుణీ మనోహరుఁడు, శ్రీగళుఁడే యన శంక యేలనో
      మాతృక మెచ్చఁ గైకొనెను మన్నన సేయుచుఁ బొంగ దేవతల్

      త్రాత కాచువాడు త్రచ్చు చిలుకు మధించు మాతృక పార్వతి నిఘంటువు సహాయమండి

      శ్రీగళుడు కాకుండా శ్రీ లక్ష్మి అనే అర్థమే తీసుకున్నానండి
      తేటగీతి చివరిపాదములో యతి దోషమైనందున సవరించానం

      తొలగించండి
  4. భక్తితో చేసి తపమును పడసి పతిగ
    సగము మేనయ్యె హరునకు సంతసాన
    ఫాలనేత్రుడుమెచ్చగాభార్యయయ్యె
    *శ్రీసతీమనోహారియౌ శ్రీగళుండు”*

    రిప్లయితొలగించండి
  5. పోతన గారి గ్రంధమును పూర్తిగ సాధన చేయుటందునన్
    కోతలరాయులైన తన కొంపకు పచ్చిన వారియందునన్
    భ్రాతనుబిల్చి చెప్పుమన పాటిగ నేర్వక పల్కెనిట్టులన్
    శ్రీతరుణీమనోహరుఁడు శ్రీగళుఁడే యన శంక యేలనో”

    రిప్లయితొలగించండి
  6. క్షీర సాగర మథనము చేయు నపుడు
    వెలసి వెన్నుని భర్తగా స్వీకరించె
    శ్రీ! సతీమనోహారియౌ శ్రీగళుండు
    లోక రక్షకై గరళము స్వీకరించె

    బ్రాతిగ పాలసంద్రమును ద్రచ్చిరి దైత్యులఁ గూడి వేల్పులే!
    ఆ తవిషమ్మునందడరు హాలహలంబును మ్రింగె భర్గ్యుడే!
    ఆ తరుణంబునన్ వెలసి యాహరికిన్ సతియైన కాంతయే
    శ్రీ! తరుణీ! మనోహరుఁడు శ్రీగళుఁడే యన శంక యేలనో!

    రిప్లయితొలగించండి
  7. బూతిగ మార మన్మథుడు భూధరరాజ తనూజ నిష్ఠురం
    బౌ తపమాచరించి ఘనుడౌ పరమేశుని మెప్పునొంది తా
    బ్రాతిగ పెండ్లియాడె నెలరాజధరున్ గద! యట్టి మానినీ
    శ్రీతరుణీమనోహరుఁడు శ్రీగళుఁడే యన శంక యేలనో!!

    రిప్లయితొలగించండి
  8. తే.గీ:పాల సంద్రపు మథనాన భాగ్య మబ్బి
    మనువు కుదిరిన దెవరికే మనుమరాల?
    విసము ద్రావిన యా దైవ వీరుడెవరు?
    శ్రీసతీమనోహారియౌ, శ్రీగళుండు”
    (క్రమాలంకారము లో ప్రశ్నోత్తరి.)

    రిప్లయితొలగించండి
  9. శేషశయనుఁడు శ్రీహరి చిన్మయుండు
    శ్రీసతీమనోహారియౌ, శ్రీగళుండు
    తనువుసగమిచ్చి గిరిజకు ఘనతనొందె
    హరిహరులు జూచిరి సతుల హార్దముగను

    రిప్లయితొలగించండి
  10. భాతిగ శేషతల్పమున పాదములొత్తెడు పత్ని సేవలో
    నాతతనిష్ఠతో హరుని ధ్యానమునందుననుండు నెవ్వరో?
    భూతలమందు భక్తులకు ముక్తినొసంగెడు దైవమెవ్వరో?
    శ్రీతరుణీమనోహరుఁడు, శ్రీగళుఁడే యన శంక యేలనో!

    రిప్లయితొలగించండి
  11. ఉ:"మీ తప మెట్టి దేవునకొ మీరలె దెల్పు" డంటంచు బల్క శ్రీ
    మాత హసించుచున్ రమకు మాన్ పగ శంకను భక్తిపూర్ణుడై
    శ్రీతరుణీమనోహరుఁడు "శ్రీగళుఁడే" యన శంక యేలనో
    యీ తరమందు భక్తులకు నీశ్వరకేశవ వైర మేలనో!
    (ఒక కథ ఉన్నది."మీరే గొప్ప దైవం కదా! మీ తపస్సు ఎవరి గురించి? అని లక్ష్మీ దేవి శ్రీ మహావిష్ణువును అడిగితే "అది శివుని గూర్చి" అని శ్రీ మహా విష్ణువు చెప్పినట్లు.)

    రిప్లయితొలగించండి
  12. డెందము పులకరించును నంది వాహ
    నుఁ గని నంత నుప్పొంగును మగువ! ముదము
    సందియం బేల మాధవి! యిందు నాదు
    శ్రీసతీ! మనోహారి యౌ శ్రీగళుండు


    ఆతత సత్తపో నియమ మద్రి తటమ్మున నూని చేసి సం
    ప్రీతి మనోరథం బది ఫలింపఁగ భర్తగఁ బొంది నట్టి యా
    నాతుక గౌరి శీత నగ నందన గోరిన వాఁడు మంగళ
    శ్రీ తరుణీ మనోహరుఁడు శ్రీగళుఁడే యన శంక యేలనో

    రిప్లయితొలగించండి
  13. చేతము నందు నొప్పుగనుజీవుల కెల్లను దిక్కునీవగా
    పాతకహారియంచునినుభక్తులుమానుగ కొల్చుచుండగా
    ప్రీతినిగూర్చగా ప్రజకు వేడుక తోడను సిద్దమౌ సదా
    *శ్రీ తరుణీమనోహరుడు శ్రీగళుడేయనశంకయేలనో*

    రిప్లయితొలగించండి
  14. భుజగ శయను డు లోకాల బ్రోచు వాడు
    శ్రీ సతీ మనో హా రి యో :: శ్రీ గళు o డు
    గరళ మును మ్రింగి రక్షించి ధరణి నెల్ల
    గౌరి కి మనోహరు o డ య్యె కమ్ర ముగను

    రిప్లయితొలగించండి