1, సెప్టెంబర్ 2024, ఆదివారం

సమస్య - 4870

2-9-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“జ్వరము పీడింపఁ జన్నీటి స్నానమొప్పు”

(లేదా...)

“జ్వరతప్తాంగుఁడు స్నానమాడఁగవలెన్ జన్నీట ముప్రొద్దులున్”

15 కామెంట్‌లు:


  1. దీక్షలో నుంటిననుచు నుదితిన నిటుల
    స్నానమాచరింతు ననుచు సాగనేల
    వలదది ప్రమాదమన వినవలయు, నెటుల
    జ్వరము పీడింపఁ జన్నీటి స్నానమొప్పు?


    సరియౌ భేషజ మిచ్చువాడనను విశ్రావమ్ము నే పొందితిన్
    మరి సంతాపమదేల మానుమిక నీమాత్రన్ సకాలమ్ము నో
    వరికిన్ వేసినచాలు రేపకడకే స్వాస్థ్యమ్మె చేకూరగన్
    జ్వరతప్తాంగుఁడు స్నానమాడఁగవలెన్ జన్నీట ముప్రొద్దులున్.

    రిప్లయితొలగించండి
  2. స్కంధమరుదుగ వేడెక్కు జ్వరము వోలె
    పలు రకములగు సాకుల వలన , నటులె
    కంటకునిపయి కోపము కతన వచ్చు
    జ్వరము పీడింపఁ జన్నీటి స్నానమొప్పు

    రిప్లయితొలగించండి
  3. తే॥ జ్వరము తోడ నుష్ణోగ్రత సరసర యెగి
    యునని వైద్యులు తెల్పిరి యుక్తిఁ గనవొ
    జ్వరపు తీవ్రతఁ జన్నీటి స్నానమడఁచు
    జ్వరము పీడింపఁ జన్నిటి స్నానమొప్పు

    మ॥ ఎరుగన్ దాపము హెచ్చు చుండును గదా యెవ్వారి కైనన్ గనన్
    జ్వరమారీతిగ తీవ్రమై చనినచో స్నానమ్ము చన్నీటితో
    వరమౌ నప్పుడు నంచుఁ దెల్పిరి గదా వైద్యుల్ సెకల్ తగ్గఁగన్
    జ్వరతప్తాంగుఁడు స్నానమాడగవలెన్ జన్నీట ముప్ప్రొద్దులన్

    చన్నీటితో శరీరమెలాగూ తుడుచుకోవాలి కదండి దానికంటే కొద్దిగా అధికంగానండి. వణుకు లేకుంటే నండి

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    తల్లిగారింట కాన్పుకుఁ దరుణివెడల
    నేకపత్నీవ్రతమ్మున నింటనుండ
    తాళలేనట్టి విరహాన తాపమనెడు
    జ్వరము పీడింపఁ జన్నీటి స్నానమొప్పు


    మత్తేభవిక్రీడితము
    తరుణీరత్నము గాన్పుకున్ జనఁగ స్కందాంశమ్ము జన్మించెడున్
    స్మరణన్ భర్తయె యింటనుండ విరహమ్మై యేకపత్నీవ్రతా
    నురతుండై సతి స్వప్నసుందరిగ మేనున్దాక రేకెత్తెడున్
    జ్వరతప్తాంగుఁడు స్నానమాడఁగవలెన్ జన్నీట ముప్రొద్దులున్

    రిప్లయితొలగించండి
  5. వేశ్య:
    మధురవాణితో విప్రనారాయణుని గెల్చెదనని పందెము పెట్టుటకు ముందు దేవదేవి స్వాతిశయము:

    ధరణీదేవకులోత్తముండయిన, వేదగ్రీవుడైనన్, క్వచిత్
    సురవేశ్యాగణసంగతుండయిన, యాసుత్రాముడైనన్, మదీ
    యరతీసన్నిభదేహశోభఁ గని మోహభ్రాంతి నౌ మన్మథ
    జ్వరతప్తాంగుఁడు, స్నానమాడఁగవలెన్ జన్నీట ముప్రొద్దులున్!

    రిప్లయితొలగించండి
  6. లాక్షణికుడై యెఱిగి జ్వరలక్షణములు
    వైద్యు డిచ్చునౌషధమును వాడమనుచు
    తలిరువిలుకాని బాణపు ములుకు తగిలి
    జ్వరము పీడింపఁ జన్నీటి స్నానమొప్పు

    జ్వరమే సంభవమైన వేళ రయమున్ వైద్యమ్ము నందింపుమా
    సరియౌ కారణమున్ గ్రహింప వలయున్ సంతృప్తితో నెన్నుచున్
    విరహావేశము పెచ్చరిల్లి మరులే పీడింపగా మన్మథ
    జ్వరతప్తాంగుఁడు స్నానమాడఁగవలెన్ జన్నీట ముప్రొద్దులున్

    రిప్లయితొలగించండి
  7. వీరు వారను భేదమ్ము వీడి యకట
    దారుణమ్ముగఁ జెలరేగి తనువు నందు
    మూరి నిత్యమ్ము నిర్దయ మారు మేటి
    జ్వరము పీడింపఁ జన్నీటి స్నాన మొప్పు


    ఖర ఖద్యోత కరప్రభా జ్వలిత మార్గక్షిప్త మూర్ధుండు దు
    స్తర తప్తాంగుఁడు సేర నొప్పుఁ గద వృక్షచ్ఛాయ నింపారఁగా
    విరహాగ్నిం దగ నార్ప నెంచిన మహోద్విగ్నప్రకోపాంగజ
    జ్వర తప్తాంగుఁడు స్నాన మాడఁగ వలెం జన్నీట ముప్రొద్దులున్

    రిప్లయితొలగించండి
  8. క్రొత్తగా బెండ్లియాడిన కువలయాక్షి
    భర్తనెడబాసి యొంటిగా బ్రతుకజొచ్చె
    వెలది పతినెడబాయఁగ విరహమనెడు
    జ్వరము పీడింపఁ జన్నీటి స్నానమొప్పు

    రిప్లయితొలగించండి
  9. తరుణిన్ జూచినదాది మానసమునన్ దాపమ్ము పొంగారగా
    విరహంబగ్గలమయ్యె మన్మథుడు నిర్భీతిన్ మిటారించనా
    విరహజ్వాలలు విస్తరించి తనువున్ వేధించె, తథ్యంబుగా
    జ్వరతప్తాంగుఁడు స్నానమాడఁగవలెన్ జన్నీట ముప్రొద్దులున్

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:జ్వరము రాగ నాయుర్వేదశాస్త్రవిధిన
    స్నాన మొనరింప రాదంద్రు,దీని నొప్ప
    దాంగ్లవైద్యమ్ము మారుగ నచట హెచ్చు
    జ్వరము పీడింపఁ జన్నీటి స్నానమొప్పు
    (జ్వరం వస్తే స్నానం వద్దనేది మన సంప్రదాయమే కానీ అల్లోపతి లో స్నానం చెయిస్తారు.ఐస్ గడ్డలు కూడా పెడతారు.)

    రిప్లయితొలగించండి
  11. మ:అరరే!యీ నడుమన్ కదా!ఒక వివాహంబయ్యే నీ యబ్బికిన్
    సరియౌ చక్కని చుక్కతో నదియే సంసారమ్ము లో జేరదే!
    దరిలో లేదట కొల్వు దాని కిక నీ దౌర్భాగుడౌ కామనా
    జ్వరతప్తాంగుఁడు స్నానమాడఁగవలెన్ జన్నీట ముప్రొద్దులున్”

    రిప్లయితొలగించండి
  12. వైద్యు సలహాను బాటించి వాంఛ వదలి
    స్నాన పానమ్ము నందున చక్క నైన
    పద్ధతుల నెల్ల ననుస రిం పంగ నెటు ల
    జ్వరము పీడీంప చన్నీటి స్నాన మొప్పు?

    రిప్లయితొలగించండి
  13. దీక్షయందుండ రోగము తెలియాగానె
    స్నాన మాచరించినయెడ నయము కాదు
    తీవ్రతనుబట్టి చేసిన దిగును వేడి
    జ్వరము పీడింపఁ జన్నీటి స్నానమొప్పు

    రిప్లయితొలగించండి
  14. “జ్వరతప్తాంగుఁడు స్నానమాడఁగవలెన్ జన్నీట ముప్రొద్దులున్
    జ్వరతప్తాంగుని దేహమున్మిగుల నీరంబంత వ్యాపించుటన్
    గరమున్శీతలమై శవాకృతిని నారాటంబుతోనుండగాఁ
    దరుణుల్ సేవలుసేయగామదిని నార్ద్రంబంది చింతించినే

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఆలి పుట్టింట నుండ నాషాఢ మందు
    భర్త విరహ వేదన చెంది,భార్యతోడ
    గడపిన క్షణములున్ వచ్చి జ్ఞప్తి,కామ
    జ్వరము పీడింపఁ జన్నీటి స్నానమొప్పు.

    రిప్లయితొలగించండి