6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4874

7-9-2024 (శనివారం)

కవిమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు!

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నాకు నచ్చనివాఁడు వినాయకుండు”

(లేదా...)

“నాకు వినాయకుండు గడు నచ్చనివాఁడని మ్రొక్కఁ బోనిఁకన్”

14 కామెంట్‌లు:

  1. తల్లిదండ్రులు నేర్పిన ధర్మమనుచు
    రోజు కైదు సారులు తా నమాజు చేయు
    మహ్మదీయవంశములోని మగువ యామె
    నాకు నచ్చనివాఁడు వినాయకుండు.

    *(ఆమెనా ముస్లిం వనిత మహమ్మదు ప్రవక్త తల్లిపేరదే)*

    రిప్లయితొలగించండి
  2. డా బల్లూరి ఉమాదేవి

    బాలికలనమ్ము కొనుచును బ్రతుకు వాని
    వావి వరుసలు వీడుచు వనితలనిల
    కోరు వానిని శిక్షింప గోరకున్న
    *"నాకు నచ్చనివాఁడు వినాయకుండు”*






    రిప్లయితొలగించండి
  3. ఈ సారైనా పరీక్షలో నెగ్గకుంటే.....


    తేటగీతి
    నిన్ను మ్రొక్కక యేనాడు నేనులేను
    వ్రాసితినయ పరీక్షను పదవసారి
    నేటికైనను నెగ్గింప నెగడవేని
    "నాకు నచ్చనివాఁడు వినాయకుండు!"


    ఉత్పలమాల
    శోకము వీడ వ్రాసితిని స్రుక్కుచు సోలుచు నే పరీక్షలన్
    జేకుఱి వచ్చువాడవని చేసి నమస్సులు శైలజాసుతా!
    వీఁకనొసంగవేని దయ వేవురు నిందల నాడిపోసినన్
    "నాకు వినాయకుండు గడు నచ్చనివాఁడని మ్రొక్కఁ బోనిఁకన్"

    రిప్లయితొలగించండి
  4. నాకములోని వారికిని నందము పంచెడు శూర్పకర్ణుడే
    *నాకు వినాయకుండు, గడు నచ్చనివాఁడని మ్రొక్కఁ బోనిఁకన్”*
    బాకులు గ్రుచ్చునట్లుగను భాషణముల్సతతమ్ముచేయుచున్
    శోకముగూర్చురీతిగనుచుల్కనచేసెడివారికెప్పుడున్

    రిప్లయితొలగించండి
  5. తే॥భక్తి తత్వము శూన్యము శక్తి యెల్ల
    విగ్రహములందముగఁ దీర్చు ప్రీతి యొకటె
    ముక్తి కలుగునె చూడఁగ భక్తిలేమి
    నాకు నచ్చని వాఁడు వినాయకుండు

    ఉ॥ శ్రీగణనాథ సర్వజన శ్రేయముఁ గనవొ యంచు వేడరే
    సోకులఁ జేసి విగ్రహము శోభగఁ గూర్చెడి స్పర్ధ మాత్రమే!
    నాకట భక్తి శూన్యమని నమ్మక మంతయుఁ దగ్గి పోవఁగన్
    నాకు వినాయకుండు గడు నచ్చని వాఁడని మ్రొక్కఁ బోనికన్

    రిప్లయితొలగించండి
  6. శ్రీకర కారుడై జనుల చింతల దీర్చెడి రూపమయ్యదే
    నా కులదైవమంచునిక నమ్మితి నిచ్ఛిత దైవమాతడే
    నాకు వినాయకుండు గడు, నచ్చనివాఁడని మ్రొక్కఁ బోనిఁకన్
    గాకుల బోలినట్టి యనగారులెవండును గానవచ్చినన్.

    రిప్లయితొలగించండి
  7. అమ్మ చేసిన కుడుములనన్నికూడ
    నతనికే నిడె నైవేద్యమనుచు, గనుక
    నాకు నచ్చనివాఁడు వినాయకుండు
    చివరకు ప్రసాదముగ వీడ చింత దొలగె

    రిప్లయితొలగించండి
  8. పూలు పత్తిరిఁ గొనితెచ్చి పూజచేసి
    వరము లిమ్మని వేడెద వక్రతుండ!
    నేను కోరు రీతిని కోట్ల నీయకున్న
    నాకు నచ్చనివాఁడు వినాయకుండు

    ఆకులు పూలుతెచ్చితిని హాయిగ నీకిడి పూజ సల్పితిన్
    వేకువ జాముఁ మేలుకొని వేడుక మీరగ మ్రొక్కుకొంటినే
    పైకము కోట్లుగా పడయు భాగ్యము నాకిక కల్గకున్నచో
    నాకు వినాయకుండు గడు నచ్చనివాఁడని మ్రొక్కఁ బోనిఁకన్

    రిప్లయితొలగించండి
  9. నాయకుల యందు గలడు వి నాయకు o డు
    స్వార్థ బుద్ధి తో జీవించు వ్యర్థ జీవి
    పరుల పీడించి బాధించు వాడు గాన
    నాకు నచ్చని వాడు వినాయ కుండు

    రిప్లయితొలగించండి
  10. విఘ్నవారణ మొనగూర్చు వేల్పటంచు
    దయను భక్తుల బ్రోచెడి దైవమంచు
    నమ్మి కొలిచిన నాయాశ వమ్ము జేయ
    నాకు నచ్చనివాఁడు వినాయకుండు

    రిప్లయితొలగించండి
  11. శ్రీకరుఁడంచు భక్తులకు శ్రేయముగూర్చునటంచు మ్రొక్కగన్
    శోకవిదారకుండు ననుశోచనమున్గడదేర్చు దైవమై
    యాకలి దీర్చునంచు కడు నాశగ వేడిన మిన్నకుండినన్
    నాకు వినాయకుండు గడు నచ్చనివాఁడని మ్రొక్కఁ బోనిఁకన్

    రిప్లయితొలగించండి
  12. ఆస్తికు నడుగఁ బల్కునె యాతఁ డిట్లు
    నాస్తికు నడుగ వాఁ డిట్లనంగ నేర్చు
    గొంక కిసుమంతయు నెడంద శంక యేల
    నాకు నచ్చని వాఁడు వినాయకుండు


    ఈ కలి కాలమందుఁ గన నెవ్వరి నమ్మఁగ రాదు మిత్రతం
    బ్రాకట మైన రీతిఁ గొలువంగ నరాళికి సత్యసంధుఁడై
    వీఁకను నాయకుం డొసఁగుఁ బృథ్విని రక్షణ మెల్ల వేళలన్
    నాకు వినాయకుండు గడు నచ్చని వాఁడని మ్రొక్కఁ బోనిఁకన్

    [వి నాయకుఁడు = నాయకుఁడు లేని వాఁడు]

    రిప్లయితొలగించండి
  13. తే.గీ:పూజయంద్రు,తలంట్లను బోయుచుంద్రు
    భోజనము జాగు, చిరుతిండ్లు బొక్క నీరు
    చంపుచుంద్రు వినాయకు చవితి యంచు
    నాకు నచ్చనివాఁడు వినాయకుండు
    (పూజ అయ్యే దాకా ఏమీ తినద్దంటే ఒక పిల్ల వాడి గోల.వినాయకచవితి వారి సమాసం కనుక వినాయకు చవితి అన్నాను.)

    రిప్లయితొలగించండి
  14. ఉ:నాకు బ్రథాన దైవ మని నమ్మి గణేశుని దెచ్చి వెట్టగా
    మైకుకు గోల యయ్యె,నిది మాకు నొకానొక రాజకీయ మం
    చాకుల మీకుల మ్మనుచు నర్వగ దేవుడు వారి మార్చునే!
    నాకు వినాయకుండు గడు నచ్చనివాఁడని మ్రొక్కఁ బోనిఁకన్”
    (వినాయక మంటపం పెడితే నానా రాజకీయాలు ,తగవులు వచ్చాయి.దేవుడు తీరుస్తాడా?అని మానేసాడు.)

    రిప్లయితొలగించండి