20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4888

21-9-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“భార్య భర్తగా వఱలెను భారతమున”

(లేదా...)

“భార్యయె భర్తగా వఱలె భారతమందున భాగ్యరాశిగన్”

8 కామెంట్‌లు:

  1. వనితవిద్యనుబొందెన వారితముగ
    జీవనోపాధికొఱకునై తేజ మంది
    పోషణంబునముందుండె పొలతిఁజూడ
    భార్య భర్తగా మఱలెనుభారతమున

    రిప్లయితొలగించండి
  2. కార్యమునందుదాసియట, కైదువుబట్టెగఝాన్సిలక్ష్మియై
    ఆర్యగవేదభూమినడయాడెనువిద్యలరాణితానయై
    శౌర్యపరాక్రమంబులను సాధనఁజేసెగ జీవనంబుకై
    భార్యయెభర్తగావఱలె భారతమందునభాగ్యరాశియై

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    ఇందిరా ప్రియదర్శినిదెంత శక్తి!
    తండ్రి నెహ్రూ తదుపరి ప్రధానియయ్యె!
    లోకము నుతింప నేలి ఫిరోజు గాంధి
    భార్య, భర్తగా వఱలెను భారతమున!

    ఉత్పలమాల
    ఆర్యుడు నెహ్రు దేశమున నందరు నొప్ప ప్రధానిపీఠమున్
    ధైర్యము నుప్పతిల్లఁ గొని ధన్య చరిత్రుడునయ్యె మీదటన్
    శౌర్యము గల్గ నిందిర ప్రశాసనమంది ఫిరోజు గాంధికిన్
    భార్యయె, భర్తగా వఱలె భారతమందున భాగ్యరాశిగన్!

    రిప్లయితొలగించండి
  4. పాళియాడి ముందెవ్వరు పరజితులని
    ధర్మ సందేహమడిగిన దరుణినిగన
    ధర్మమునెపుడు పాటించు ధర్మ రాజు
    భార్య , భర్తగా వఱలెను భారతమున

    రిప్లయితొలగించండి
  5. తే॥ తల్లియును దండ్రియును గాఁగ ధైర్యముఁ గని
    కృష్ణుఁడండ నొసఁగఁ బెంచె కృపను కుంతి
    భర్త పాండురాజు చనఁగఁ బాండవులను
    భార్య భర్తగా వఱలెను భారతమున

    ఉ॥ భార్యయె భర్తగా వఱలె భారతమందున భాగ్యరాశిగన్
    ధైర్యము తోడఁ బాండవులఁ దల్లియుఁ దండ్రియునై భరించుచున్
    శౌర్యుఁడు పాండురాజటులఁ జావును బొందఁగఁ గుంతిదేవియే
    కార్యము లెల్ల చూచుచును గావఁగఁ గృష్ణుఁడె యెల్లవేళలన్

    (కుంతి పాండవులను పాండురాజు బ్రతికి యుంటే పెంచు రీతిగానే పెంచింది అని అండి)

    రిప్లయితొలగించండి
  6. జరుగ రానట్టి సంఘటల్ జరిగి భర్త
    బ్రతుకు బండిని లాగుట భార మైన
    భార్య భర్తగా వరలెను భారత మున
    నొంటరిగ మోయ బరువుల నోర్పు తోడ

    రిప్లయితొలగించండి
  7. తే.గీ.॥
    భరత సంస్కృతి నేర్పిన పాఠములను
    వల్లెవేయుచు తనభర్త వైద్యమునకు
    తానె కాయకష్టము జేసి ధనము కొఱకు
    భార్య భర్తగా వఱలెను భారతమున

    ఉత్పలమాల:
    శౌర్యముఁజూపి భర్త తన సత్త్వముఁ బాసెను దేశరక్షకై
    ధైర్యము వీడకన్ మదిని తానొక పూరుషుడట్లు మారి యా
    భార్య కుటుంబ భారమును పట్టుదలన్ వహియించెఁ జూడగన్
    భార్యయె భర్తగా వఱలె భారతమందున భాగ్యరాశిగన్

    రిప్లయితొలగించండి
  8. సూర్యునివలె పిసాళించె సుందరాంగి
    ధైర్య లక్ష్మిగ తనరారె తలిరుబోడి
    కార్యములనెల్ల సాధించి గడన చేసి
    భార్య భర్తగా వఱలెను భారతమున

    ఆర్యుల కట్టుబాట్లువిడె నంబురుహాక్షి గడించి చూపగా
    శౌర్యము సంతరించి తన శక్తిని యుక్తినిచూపు కాంతగా
    కార్యము చక్క బెట్టుటకు కష్టము లెల్లభరింప సిద్ధమై
    భార్యయె భర్తగా వఱలె భారతమందున భాగ్యరాశిగన్

    రిప్లయితొలగించండి