1, ఫిబ్రవరి 2025, శనివారం

సమస్య - 5021

2-2-2015 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముని తనయుఁ డగుచు భృగురాముఁడు పుట్టెన్”
(లేదా...)
“రాముని పుత్రుఁడౌచు భృగురాముఁడు పుట్టెనటంద్రు పండితుల్”

23 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
సేమముఁ జూడఁగ ధరణిఁ ద్రి
రాముల యవతారమెత్తె ప్రణుతుల హరియే!
యా మౌని రేణుకా హృ
ద్రాముని తనయుఁ డగుచు భృగురాముఁడు పుట్టెన్

ఉత్పలమాల
సేమముఁ జూడగన్ ధరను శ్రీహరి పుట్టె త్రిరాము లౌచుఁ దా
నీమము తప్పువారలకు నేర్పగ సత్యము దివ్యనాముడై
యా ముని ధ్యాన నిష్ఠుఁడన నచ్యుతుఁడెంచఁగ రేణుకాంబ హృ
ద్రాముని పుత్రుఁడౌచు భృగురాముఁడు పుట్టెనటంద్రు పండితుల్

BMahalakshmi చెప్పారు...

ఏమఱపాటునులేకను
జమదగ్నిజనకుననుమతి జననినినరకెన్
ఏమిదియనిప్రశ్నింపక
రామునితనయుడనుచుభృగురాముఁడుపుట్టెన్

విరించి చెప్పారు...


భూమిని మూకమ్మాదిగ
వామనుడై పుట్టినట్టి బలిబంధనుడే
యా ముని జమదగ్ని సుతుడు
రా! ముని తనయుఁ డగుచు భృగురాముఁడు పుట్టెన్


క్షేమము గూర్చు వాడతడు శిష్ఠుల బ్రోచుచు ధర్మరక్షకై
భూమిని బుట్టె పల్మరులు మూకము కూర్మము నారసింహుడున్
వామను డైనవాడె బలిబంధనుడే జమదగ్ని పుత్రుడౌ
రా, ముని పుత్రుఁడౌచు భృగురాముఁడు పుట్టెనటంద్రు పండితుల్.

Sitharamayya Solasa చెప్పారు...

కామనుడగు లవుడు వెలసె
రాముని తనయుడగుచు ; భృగురాముఁడు పుట్టెన్
భామిని రేణుక సుతునిగ ,
నామె తలనరికెను తండ్రి యానతిపైనన్

M.B.G.TILAK చెప్పారు...

భూమిపయిన వెలసెను భృగు
రాముడు మునుముందుగ రఘు రామునికంటెన్
భామామణి రేణుక కౌ
రా! ముని తనయుఁ డగుచు భృగురాముఁడు పుట్టెన్

భూమిపయిన్ జనించిరట ముఖ్యులు శ్రేష్టులు శక్తిమంతులున్
రాముని కంటెముందు భృగురాముడు పుట్టెను భూతలంబునన్
గామిత నంతతిన్ బడయు క్షత్రియ పుత్రిక రేణుకాంబ కౌ
రా! ముని పుత్రుఁడౌచు భృగురాముఁడు పుట్టెనటంద్రు పండితుల్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

రాముల లో భృగు రాముని
పామరుడు దెలు పగ గోర పండితుడనె తా
రామా యణ ము ను విను పో
రా! ముని తనయుడగుచు భృగు రాముడు బు ట్టెన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

భూమిని రామచంద్రునిగఁ బుట్టిన శ్రీహరి తానె రేణుకా
భామకు పుత్రుఁడై పుడమిఁ భార్గవరామునిగా జనించె తా
నీమముగా వధింప ధరణీసులనెల్లర రేణుకాంబ హృ
ద్రాముని పుత్రుఁడౌచు భృగురాముఁడు పుట్టెనటంద్రు పండితుల్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:ఏమా కాఠిన్య మ్మౌ
రా!ముని తనయుఁ డగుచు భృగురాముఁడు పుట్టెన్”
భూమిని గల రాజుల పై
నే మాత్రము కరుణ లేదె ఈ విప్రునకున్!

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:రాముడు,గృష్ణు డాది గల రాజులె దేవత లైరి నేటి ,"కౌ
రా! "ముని పుత్రుఁడౌచు భృగురాముఁడు పుట్టె నటంద్రు పండితుల్,
భూమిని విప్రవంశమున బుట్టిన యా యవతార మూర్తినిన్
ప్రేమగ గొల్తుమం చనిరి విప్రులు బ్రాహ్మణ సంఘ చర్చలన్.
(రాముడు,కృష్ణుడు అనే రాజులనే మనం దేవుళ్లుగా పూజించాలా? మన బ్రాహ్మణ క్యాస్ట్ లో పరశురాముణ్ని మనం పూజిద్దాం అన్నారు బ్రాహ్మణ సంఘం లో బ్రాహ్మణులు.ఈ మధ్య కాలం లో అన్నిటి లోనూ కులాల ప్రసక్తి వస్తోంది.)

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

భూమిని జన్మించెనుహరి
రామునిగా సాధుజనుల రక్షణ చేయన్
భీమముగా రేణుక హృ
ద్రాముని తనయుఁ డగుచు భృగురాముఁడు పుట్టెన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

భూమిజకు పుట్టెను లవుడు
రామునికి తనయుడగుచు;భృగురాముడు
పుట్టెన్
కోమలి రేణుక తల్లికి
యా ముని జమదగ్ని తండ్రి కాశ్రమమందున్.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...


భూమిని లవుడుదయించెను
రాముని తనయుఁ డగుచు, భృగు రాముఁడు పుట్టెన్”*
కామినిమణి రేణుకకును
నాముని జమదగ్నిసుతుగనాశ్రమమందున్

Srigiri Nilayam చెప్పారు...

" ; "ని చక్కగా వాడుకున్నారు !!

Srigiri Nilayam చెప్పారు...

రాముని తనయుడు కాస్తా ముని తనయుడు అయ్యాడు :-)