21, జూన్ 2010, సోమవారం

సమస్యాపూరణం - 17

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ...........

సుకవు లెంద రున్నను మేలు కుకవి యొకఁడు.

20 కామెంట్‌లు:

  1. కుకవి లేకున్న గుర్తింపు సుకవి కేది?
    దృష్టి(దిష్టి) బొమ్మయె యింటికి పుష్టి గాదె?
    పండితశ్రేష్ఠు లొప్పెడి నిండు సభను
    సుకవు లెంద రున్నను మేలు కుకవి యొకఁడు.

    ఆర్యా! ఈనాటి నా సమస్య పూరణార్థ మీ ముందుంచుతున్నాను.

    రాముని జంపి రావణుఁడు రాజ్యమనేలె సుఖింపనెల్లరున్.

    రిప్లయితొలగించండి
  2. కుకవి బాధ మనకు లేదు కొంతయైన
    అస లెపుడు కొంటిమి గనుక అతడి రచన!
    చూడ, సన్మానముల ఖర్చు సుంత లేదు
    సుకవు లెంద రున్నను మేలు కుకవి యొకఁడు

    రిప్లయితొలగించండి
  3. సరస సాహితీ సభలోన మురిపముగను
    సుకవు లెంద రున్నను మేలు, కుకవి యొకఁడు
    చేరిన రసభంగమగును చేటుఁగలుగు
    పాల కుండలో లవణము పడిన రీతి!!

    రిప్లయితొలగించండి
  4. ఉత్పల మాల:
    పాముల వోలె ద్వేషమును బాయని హైందవ శత్రు సంఘముల్
    పామర బుద్ధి విజ్ఞతలు పాచిన నాస్తిక హేతు వాదముల్
    బూమెలుఁజూప మూర్ఖముగ భూరిగ తీసిన చిత్రమందునన్
    రాముని జంపి రావణుఁడు రాజ్యమనేలె సుఖింపనెల్లరున్!!

    రిప్లయితొలగించండి
  5. @ చింతా రామకృష్ణారావు గారు,
    @ చదువరి గారు,
    @ జిగురు సత్యనారాయణ గారు,

    ఒకరిని మించిన వారు మ
    రొకరై పోటీ పడి మధురోక్తుల తోడన్
    సకల జనామోదముగా
    చకచక పూరణలు పంపు చతురులు మీరల్.

    రిప్లయితొలగించండి
  6. జిగురు సత్యనారాయణ గారూ,
    చింతా వారిచ్చిన సమస్యకు మంచి పూరణ నందించారు. రావణ్ (విలన్) సినిమా చూసారా? అందులో రావణుడే హీరో అట కదా! నేనైతే ఇప్పుడే చూడను. అందరూ బాగుందంటే ఎప్పుడో వీలును బట్టి చూస్తాను. రాముణ్ణి దుష్టునిగా చూసే విషసంస్కృతి క్రమంగా వ్యాపిస్తోంది. పాపము శమించు గాక!

    రిప్లయితొలగించండి
  7. శంకరయ్య గారు,
    రావణ్ (విలన్) సినిమా చూడలేదండి. చూసే ఉద్దేశ్యము లేదు. కాని Review చదివినాను. మీరు ఊహించినట్టుగనె, ఆ Review నే ఈ పూరణకు స్పూర్తి.

    రిప్లయితొలగించండి
  8. వాద్యముల హోరు, ఇంగ్లీషు పదము జోరు,
    బూతు పాటల చేతను మోత మోగు
    చేటు తెలుగుచలనచిత్ర సీమయందు
    సుకవులెందరున్నను మేలు కుకవి యొకఁడు.

    రిప్లయితొలగించండి
  9. సత్యనారాయణ గారి పూరణ అత్యద్భుతం.వారికి ధన్యవాదములు.
    ఇక నేను కూడా పూరణ చేయ గలగాలి కదా!
    ప్రయత్నిస్తాను. చూడండి.

    ఏమని చెప్పుదున్?కల.మునీంద్రునిపోలిన వాఁడు లోకులన్
    కామ పిశాచియై జనులు గానని యట్టుల దుష్టచేష్టలన్
    భామలపాడుచేయఁగని పాపముఁగాంచక;పట్టి; రాకుమా
    రా!మునిఁజంపిరావణుఁడు రాజ్యమనేలె సుఖింపనెల్లరున్.

    రిప్లయితొలగించండి
  10. మెచ్చుకున్న వారెల్లరు ముచ్చులనఘ!
    తిట్టిపోసిన వచ్చును గట్టి కవిత!
    కుకవి నిందలు లేనట్టి సుకవులరుదు!
    సుకవు లెంద రున్నను మేలు కుకవి యొకఁడు

    రిప్లయితొలగించండి
  11. మెచ్చుకున్న వారెల్లరు ముచ్చులనఘ!
    తిట్టిపోసిన వచ్చును గట్టి కవిత!
    కుకవి నిందలు లేనట్టి సుకవులరుదు!
    సుకవు లెంద రున్నను మేలు కుకవి యొకఁడు

    రిప్లయితొలగించండి
  12. రవి గారూ,
    ఇప్పటి చిత్రసీమలో సుకవుల కంటె కుకవికే గురింపు, గౌరవం. పూరణ బాగుంది. నెనరులు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది.

    మీ కిదియె స్వాగతమ్ము శ్రీ టేకుమళ్ళ
    వెంకటప్పయ్య! మీరు పంపించినట్టి
    పూరణము నన్ను మెప్పించె; ముదము గలిగె;
    క్రమముగా నాదు బ్లాగును గనఁగ వినతి.

    రిప్లయితొలగించండి
  14. జిగురు సత్యనారాయణగారి ఉత్పలమాల పద్యానికి అర్ధం చెప్పరా..దయచేసి..

    రిప్లయితొలగించండి
  15. స్వాతి గారు,
    నా పూరణకు అర్థము:-
    హిందూ మతము పై శత్రుత్వము పూని, ద్వేషాన్ని వదిలిపెట్టక పాములు వలె విషాన్ని చిమ్మే వారు, నీచమైన బుద్ది కలిగి పాచి పట్టిన పనికి మాలిన నాస్తిక హేతువాదములు చేసే వారు, మూర్ఖత్వము తోటి వంచనతోటి గొప్పగా తీసిన సినిమాలో , "అందరు సంతోషపడే విథముగా రావణుడు రామున్ని చంపి రాజ్యమేలాడు".

    రిప్లయితొలగించండి
  16. జిగురు సత్యనారాయణ గారూ, ఆ సినిమాలోనూ రాముడే రావణుని చంపుతాడు. నాకూ ఇదే ఆలోచన వచ్చింది. నేను వ్రాసిన పూరణ.

    రాముని బంట్లు ముష్కరులు రావణుడా సినిమాకు నాయకుం
    డేమి వినాశ కాలమిది ఈ సినిమా కథ ప్రేరణమ్ముగా
    ఢీమని వ్రాశె మూర్ఖుడొక ధీటగు నో కథ యందు చూడగా
    రాముని జంపి రావణుఁడు రాజ్యమునేలె సుఖింపనెల్లరున్

    రిప్లయితొలగించండి
  17. పునరుక్తి ధోషాన్ని సవరించాను. అన్నట్టు, అది రామాయణాన్ని పోలిన నేటి కాలపు కథ. మణి రత్నం దర్శకత్వం వహించాడు. ఎందుకో మరి రావణుని పాత్రదే కరెక్టన్నట్లు చూపించాడు.

    రాముని బంట్లు ముష్కరులు రావణుడా సినిమాకు నాయకుం
    డేమి వినాశ కాలమిది ఈ సినిమా కథ ప్రేరణమ్ముగా
    ఢీమని వ్రాశె మూర్ఖుడొక ధీటయినట్టి యుదంత మందులో
    రాముని జంపి రావణుఁడు రాజ్యమునేలె సుఖింపనెల్లరున్

    రిప్లయితొలగించండి
  18. @ జిగురు సత్యనారాయణ -
    పద్యానికి వివరణ ఇచ్చినందుకు ప్రణీత స్వాతి పక్షాన ధన్యవాదాలు.

    @ ప్రణీత స్వాతి -
    సత్యనారాయణ గారి వివరణ చూసారు కదా. ఇప్పుడు సంతోషమేనా?

    @ ఫణిప్రసన్న కుమార్ -
    మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. సత్యనారాయణ గారూ చాలా చాలా థాంక్సండీ.

    రిప్లయితొలగించండి
  20. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ________________________________

    నేటి సినిమాల యందిది - నిజము జూడ
    బూతు వ్రాసిన వాడెగా - చేతి నిండ
    ధనము, కీర్తిని , బొందిట - తనివి జెందు !
    సుకవు లెంద రున్నను మేలు - కుకవి యొకఁడు !
    ________________________________

    రిప్లయితొలగించండి