9, జూన్ 2010, బుధవారం

సమస్యాపూరణం - 6

రోజు పూరించవలసిన సమస్య -
శవము లేచి వచ్చె సంతసమున

18 కామెంట్‌లు:

  1. మా తాత గారి పూరణ;

    శుక్రు డెరుక పరచె సంజీవనీ విద్య
    కడుపులోనయున్న కచుని కంత
    కడుపు చీల్చి వచ్చి గురువును బ్రతికింప
    శవము లేచి వచ్చె సంతసమున!

    రిప్లయితొలగించండి
  2. తాత చుట్టు చేరె తనయు సంతానమ్ము
    చిన్ననాటి చేష్ట చెప్పుమనుచు.
    మనసు మురిసిపోవ మాటలందు తన శై
    శవము లేచి వచ్చె సంతసమున.

    ** సరదాగా మరొకటి;

    చిత్రగుప్తు గణన చెదరె నొక్క ఘడియ
    ఆయువుండి కూడ అమరుడయ్యె.
    కాలుడానతీయ కాలమ్ము కలిసొచ్చి
    శవము లేచి వచ్చె సంతసమున.

    రిప్లయితొలగించండి
  3. అవధులసలు లేని ఆటపాటలు జూచి
    చిలుక పలుకు లొలుకు చిన్ని పాప
    ముద్దు ముచ్చటగని మురియగ నాదుశై
    శవము లేచి వచ్చె సంతసమున

    రిప్లయితొలగించండి
  4. దీప్తి గారూ, మీ తాత గారు చెప్పిన భావం అద్భుతం. అయితే 1వ, 3వ పాదాలలో యతిదోషం ఉంది. నా సవరణ .... (మీకు కోపం రాదు కదా!)
    ఎరుక పరచె శుక్రుఁ డెరిగి సంజీవని
    కడుపులోననున్న కచునికంత
    కుక్షి జీల్చి వచ్చి గురువును బ్రతికింప
    శవము లేచి వచ్చె సంతసమున.

    రిప్లయితొలగించండి
  5. సుమిత్ర గారూ, రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. రవి గారూ, మీ పూరణ నా శైశవాన్ని కూడా గుర్తుకుతెచ్చింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. ఇక్కడ రాస్తున్న మహా మహులందరికీ పాదాభివందనం. సొంతంగా రాయలేకపోయినా..చదువుకుని కష్టపడి(ఇష్టపడి కూడా)అర్ధం చేసుకోగలిగేంత మాత్రం భాష అబ్బింది నాకు అదే చాలు.

    రిప్లయితొలగించండి
  8. రవి గారూ, మీరు రాసిందే ఛురికాబంధం. నేను రాసింది ఖడ్గబంధం. నిన్న చిత్రకవిత్వాన్ని గురించి ఒక వ్యాసం చదివాను. అందులో బంధకవిత్వాన్ని బొమ్మలతో వివరించారు. నేను రాసిన వరదశతకంలో అది ఖడ్గబంధమనే ఉంది.

    రిప్లయితొలగించండి
  9. మీరు వ్రాసిన పద్యం (పిడి ఉన్నది) కటాహక బంధం అని నేను చదివినట్టు గుర్తండీ. చిత్రకవిత్వాన్ని కూలంకషంగా వివరిస్తూ ఒకాయన సైద్ధాంతిక గ్రంథం ఒకటి వ్రాశారు. DLI లో ఉన్నదది. వీలున్నప్పుడు కాస్త వెతికిపట్టి చెబుతాను మీకు.

    రిప్లయితొలగించండి
  10. రవి గారూ, దయచేసి ఆ డి.యల్.ఐ లింకు ఇవ్వండి.

    రిప్లయితొలగించండి
  11. క్షమించాలి. రెండ్రోజులు ఊళ్ళో లేను. ఇది లంకె.

    http://www.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0051/832&first=1&last=494&barcode=2990100051827

    రిప్లయితొలగించండి
  12. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !

    అనాథ ప్రేతంలా వదిలెయ్య కుండా
    పద్ధతిగా దహన సంస్కారానికి
    తీసుకెళ్తుంటే :

    01)
    _____________________________________

    పాడె పైన నుంచి - పాతబట్టను మార్చి
    పూలు ,కాయ కొట్టి - పొగను పెట్టి
    పాడెనెత్తి , నడువ - పలువురు వెనకాల
    శవము లేచి వచ్చె - సంతసమున
    _____________________________________
    పూలు = పూలు , పూలదండలు
    కాయ = కొబ్బరి కాయ
    పొగ = అగరు ధూమము

    రిప్లయితొలగించండి
  13. ఆటలాడుచుండి అమ్మ పొత్తిళ్ళలో
    చిన్ని పాప నవ్వుచిందుచుండ
    మదికినింపుగూర్చెనదికనన్; నాదు శై
    శవము లేచి వచ్చె సంతసమున

    రిప్లయితొలగించండి
  14. పార్వతీశ్వర శర్మ గారూ,
    ఏనాటి సమస్య..? ఇంత పాత సమస్యను వెతికి పట్టుకుని శ్రేష్ఠమైన పూరణ చేసిన మీకు అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. జీవమున్న తల్లి జీవద మవ్వగా
    పాతి బెట్ట బూనె పాడు బుద్ధి
    దింపు గళ్ళ మందు దిగ్గున లేచేసి
    శవము లేచి వచ్చె సంతసమున!

    జీవద (శతృవు)

    రిప్లయితొలగించండి
  16. కాళ్ళ గుండెదన్ని కనులతోడుత నవ్వ
    మనుమడొకడు; తాతఁ దనిసి మురిసె!
    వెంటబడుచుచేయు వెక్కిరింతలను శై
    శవము లేచి వచ్చె సంతసమున!

    రిప్లయితొలగించండి
  17. మనుమరాండ్రువచ్చి, మనసారనవ్వించి
    రాటపాటలందు, నారవముల
    తాతమామ్మమదిని, తన్మయమంద, శై
    శవములేచివచ్చె సంతసమున

    రిప్లయితొలగించండి