26, జూన్ 2010, శనివారం

సమస్యాపూరణం - 21

కవి మిత్రులారా,
వారాంతాలలో వృత్తంలో సమస్య ఇవ్వాలనుకున్నాం కదా! ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
వాడిన పువ్వులే తగును వారిజనేత్రుని నిత్యపూజకున్.

25 కామెంట్‌లు:

 1. వీడదు విష్ణు సన్నిధిని, వేడదు శ్రీకరు భోగభాగ్యముల్
  చూడదు మర్త్యులెవ్వరిని, చూడికుడుత్త నిమీలితాక్షియై,
  పాడదె యొండు గానములు, వాడదె యొండొక పూలమాల, తా
  వాడిన పవ్వులే తగును వారిజ నేత్రుని నిత్యపూజకున్

  ==

  గోదాదేవి గా ప్రసిధ్ధి చెందివ వైష్ణవ భక్తురాలు చూడికుడుత్త నాచ్చియార్, ఆవిడకే ఆముక్తమాల్యదాను నామాంతరమున్నది.

  రిప్లయితొలగించండి
 2. గిరి గారూ,
  "శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం. నేనూహించిన విధంగానే ఆముక్తమాల్యదను విషయం చేసి సమస్యను పూరించారు. అభినందనలు. మీ బ్లాగు "మద్భావజాలావిష్కృతి" చూసాను. బాగుంది. వూకదంపుడు గారడిగినట్లు మీ బ్లాగును కూడలి, హారం లలో చేర్చలేదా?

  రిప్లయితొలగించండి
 3. బాగున్నాయండీ సమస్యలూ, పూరణలూనూ. నాకు పద్యంపై అసలు పట్టు లేదు, ఉంటే నేనూ ఓ చేయి వేద్దును.
  శుభం
  భాస్కర్ రామరాజు

  రిప్లయితొలగించండి
 4. భాస్కర్ రామరాజు గారూ!
  మీరు http://www.tekumalla-venkatappaiah.blogspot.com చూడండి.అలాగే కంది శంకరయ్య గారి బ్లాగు ఫాలో అవుతూ ఉండండి.

  రిప్లయితొలగించండి
 5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 6. వీడని భక్తితోడ గుడి వాకిట నిల్చుని యుండగా, దొరా!
  వీడక వర్షమున్ గురిసె వీనులు గుయ్యని మోగగా..నహో..
  పాడయె పూవులున్ దడసి, పాపము వచ్చును! దారిలేదు, నా
  వాడిన పువ్వులే తగును వారిజ నేత్రుని నిత్య పూజకున్.

  రిప్లయితొలగించండి
 7. రవి గారూ,
  పద్యం బాగుంది. కాని అర్థమే కాస్త సందిగ్ధంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 8. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ, అద్భుతమైన పూరణ.

  వాడి నట్టి పూల వారిజాక్షున కిచ్చు
  కారణమ్ముఁ జెప్పు పూరణమ్ము
  భేషు టేకుమళ్ళ వెంకటప్పయ్య మీ
  ప్రతిభ కివియె నాదు వందనములు.

  రిప్లయితొలగించండి
 9. గిరి గారూ,

  పూలను మాలగఁ గూర్చియు
  వీలుగఁ దన తలను ముడిచి పిదపన్ మురళీ
  లోలున కిచ్చిన గోదా
  బాలిక విషయమును చెప్పు ప్రాజ్ఞుఁడవు; గిరీ!

  రిప్లయితొలగించండి
 10. ఓరి బావా! నీ బ్లాగును పూర్తిగా చూడడం ఈనాటికి వీలయింది. నిజంగా చాలా బ్లాగుంది. నాకు కూడా పాల్గొనాలని వుంది. కాని సాహిత్యపరిజ్ఞానం లేకపాయె. పాత సినిమాల ముచ్చట్లు చెబుదామంటె నాకేమో నిన్నటి మొన్నటి విషయాలే గుర్తుండి చావదు. నువ్విచ్చే సమస్యలు మీ కవిమిత్రులు చేసే పూరణాలూ చుస్తున్నా చేసేదేమీలేక.
  మధుసూదన్ కాసర్ల

  రిప్లయితొలగించండి
 11. గిరి గారి పద్యము పోతన పద్యము లాగా హాయిగా సాగింది.
  వెంకటప్పయ్య గారి పూరణ, రవి గారి పూరణ చక్కగా ఉన్నాయి.

  రవి గారి పూరణలో, "శరా దాడిని" అనే పదము దుష్ట సమాసమేమోనని అనుమానము. శబ్ద రత్నాకరము "శర" శబ్దము హ్రస్వ అకారాంతమని చెబుతుంది.

  రిప్లయితొలగించండి
 12. వేడుకఁగల్గగా జడకు వీలుగ పెట్టగ దైవ పూజకున్
  వాడిన పువ్వులే తగును; వారిజనేత్రుని నిత్యపూజకున్
  వీడని భక్తి భావమున ప్రీతిగ కోయుము పుష్ఫ గుచ్ఛముల్
  చేడియలార! రండిపుడు శ్రీహరి బ్రోచును మిమ్మునెల్లరున్!!

  రిప్లయితొలగించండి
 13. సత్యనారాయణ గారు, శంకరయ్యగారు, కొంచం మార్చాను, గమనించగలరు.

  వాడిగఁ బాణముల్ విడచి వైరిగ మారిన పంచబాణునిన్
  దాడినిఁ దిప్పిగొట్టుటకు తల్పమునందు ప్రసూనముల్ సదా
  పాడిగఁ గూర్చి దంపతులు పైడిగఁ యాడెడి కౌతుకంబుచే
  వాడిన పువ్వులే తగును, వారిజనేత్రుని నిత్యపూజకున్.

  రిప్లయితొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 15. రవి గారు,
  మీరు చేసిన మార్పు బాగుంది.

  మన్మధున్ని ఇలా పూజించాలా? తెలుసుకోదగ్గ విషయమే!! :-)

  రిప్లయితొలగించండి
 16. జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

  రవి గారూ,
  సవరించిన తర్వాత ఇప్పుడు మీ పద్యం బాగుంది.

  రిప్లయితొలగించండి
 17. బావా! నీ బ్లాగులో కేవలం సాహిత్యపరమైన అంశాలే కాకుండా నా లాంటి మామూలు వాళ్ళుకూడా పాల్గొనేలా ఈ క్రింది అంశాలనుకూడా ప్రవేశపెడితే ఇంకా సామాన్యజనంలోకి చొచ్చుకుపోతుందని నా అభిప్రాయం:
  1. ప్రస్తుతం ఉన్న రాజకీయ సామాజిక అంశాలపై పేరడీలు
  2. తెలుగు సామెతలపై వివరణాత్మకమైన వ్యాఖ్యలు.
  3. తెలుగు పొడుపు కథలు - వివరణ.
  4. సమకాలీన గేయాలు - పాటలు
  5. జానపద గేయాలు

  రిప్లయితొలగించండి
 18. శంకరయ్య గారు,
  మధ్భావజాలావిష్కృతిని కూడలి, హారాలలో చేర్చలేదు. ఈ మధ్య ఇతర వ్యాపకాల వల్ల బ్లాగుల మీద దృష్టి సారించడం కష్టతరమవుతోంది. ఇదిగో, ఇప్పుడు మీ నిత్యపూరణ సవాళ్ళ వల్ల మళ్ళీ బ్లాగులవైపు చూస్తున్నాను.

  పూరణ మీరు ఊహించినట్టుగానే ఉన్నందుకు సంతోషం.

  సత్యనారాయణ గారు, ధన్యవాదాలు.

  గిరి

  రిప్లయితొలగించండి
 19. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  తనను పువ్వులు తీసుకొని రమ్మని చెప్పి దూరంగా పంపి
  తాను వచ్చే సరికే సమాధి యందు ప్రవేశించిన శ్రీమద్విరాట్
  పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని తలచు కొంటూ సమాధికి
  తల కొట్టు కుంటూ , తను తెచ్చిన వాడిన పువ్వులనే సమాధిపై
  నుంచి ఒక్కసారి కనుపించమని సిద్ధయ్య ప్రార్థించిన సందర్భం :
  01)
  _____________________________________________

  వాడిన పువ్వులే తగును - వారిజనేత్రుని నిత్య పూజకున్!
  వీడితి వయ్యయో! గురుడ - వేదన జెందెడు నీదు శిష్యుపై
  వాడెన ? ప్రేమ !నిన్నిపుడు - ప్రార్థన జేసెద జూడుమంచు, తా
  వాడగ రక్తమే నుదుట - వాల్చె,శిరమ్ము సమాధి పైననే !
  _____________________________________________

  రిప్లయితొలగించండి
 20. వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. పోడిమి మీర భక్తులకు భోగము నందును దైన్యమందునన్
  బాడుగ కొంపలందునను భక్తిని శ్రద్ధను దేవతార్చనున్
  వాడుక వీడకుండగను వందల యేండ్లుగ తాత తండ్రులున్
  వాడిన పువ్వులే తగును వారిజనేత్రుని నిత్యపూజకున్

  రిప్లయితొలగించండి
 22. వేడుచురంగనాథునిల ,వేడుకతో సుమమాలదాల్చుచున్
  పోడిమి యద్దమందు ,తనువూహలదేహముగాంచినంతటన్
  పాడుచునాడుచూన్ మిగులభక్తిని ,రంగనికిచ్చిగొల్చెనా
  *వాడినపూవులే ,తగునువారిజనేత్రునినిత్యపూజకున్*

  రిప్లయితొలగించండి
 23. వేడెద దివ్య నామములు వేలుగ చిత్తము మానకుండగన్
  తోడగు శ్రీహరే యనుచు తోచిన యట్లుగ భక్తినెల్లగన్
  వీడని సంతసంబులును విఘ్నము బాపెడు సామివంచు నే
  *వాడిన పువ్వులే తగును వారిజనేత్రుని నిత్యపూజకున్*

  రిప్లయితొలగించండి