16, జూన్ 2010, బుధవారం

సమస్యాపూరణం - 13

కవి మిత్రులారా,
నా బ్లాగు పట్ల మీరు చూపుతున్న ఆదరణకు ధన్యవాదాలు.
ఇక ఈ రోజు పూరణ కోసం నేనిస్తున్న సమస్య ....
శునకమ్మైనట్టి హరియె శుభముల నొసఁగున్.

18 కామెంట్‌లు:

 1. ఇనకులమున రాముడిగా
  జనకుని కూతురు మొగుడయి జన రంజకుడై
  జనులను కాచుట కొరకై
  శునకమ్మైనట్టి హరియె శుభముల నొసఁగున్.

  రిప్లయితొలగించండి
 2. తనరు త్రిపురములఁగూల్చగ
  అనికి చనెడి హరునకు హరి అమరెను తూపై
  వనజాక్షుఁడు శ్రీధరుఁడీ
  శు నకమ్మైనట్టి హరియె శుభముల నొసఁగున్!!

  నకము = బాణము
  ఈశు నకము = ఈశ్వరుని యొక్క బాణము

  (వివరణ: త్రిపురాసురల పైకి శివుడు యుద్ధానికి వెళ్తుంటే, హరి శివునికి బాణము గా మారెను. అటువంటి ఈశ్వరుని యొక్క బాణమైన హరి మనకు శుభములు ఇచ్చుగాక)

  రిప్లయితొలగించండి
 3. ఎక్కడో చదివిన గుర్తు.
  పూర్వము ఇద్దరు కవులున్నారు. వారిలో మొదటి కవి పేరు కృష్ణ మూర్తి (పూర్తి పేరు గుర్తు లేదు). రెండవ కవి పేరు గుర్తు లేదు. అయితే ఈ కవులిద్దరికి ఒకరంటే ఒకరకి పడదు.ఒకసారి ఇద్దరు ఒక సభలో తారస పడ్డారు. అప్పుడు రెండవ కవి అటుగా వెళ్తున్న ఒక కుక్కను చూసి "ఈ శునకము నిజముగా కృష్ణ మూర్తియే" అని అన్నాడట. ఇది తెలిసిన కృష్ణ మూర్తి గొడవ పడితే మీరు తప్పుగా విన్నారు.నేనన్నది "ఈశు - నకము" అనగా ఈశ్వరుని యొక్క బాణము. మిమ్మలని ఈశ్వరుని యొక్క బాణముతో గొప్పగా పోల్చాను అన్నాడట.

  అయితే నాకు "నకము" అనే పదము శబ్ధ రత్నాకరములోను, బ్రౌణ్యములోను కనపడ లేదు. తప్పయితే క్షమించ గలరు.

  రిప్లయితొలగించండి
 4. జనులను ఘనులను మునులను
  తన బలమున హింసఁజేయు దశకంఠునకున్
  జనకసుత హరునకసురే
  శునకమ్మైనట్టి హరియె శుభముల నొసఁగున్!!

  అకము = దుఃఖము
  అసుర +ఈశున్ +అకమ్ము +ఐనట్టి = అసురేశునకమ్మైనట్టి =రాక్షస రాజు దుఃఖమునకు కారణమైన

  (వివరణ: సీతను హరించి, సాధువులను హింసించే రావణుడు అనే రాక్షస రాజు యొక్క దుఃఖమునకు కారణమైన హరి మనకు శుభములు ఇచ్చుగాక)

  రిప్లయితొలగించండి
 5. కనియెన్ మోహినియై ఈ
  శునిఁ గూడియు హరి,హరిహర సుతునిన్.స్త్రీగా
  దనరున్నా శబరిగిరీ
  శునకమ్మైనట్టి హరియె శుభముల నొసఁగున్

  రిప్లయితొలగించండి
 6. జననమిడె తొల్లి శివుని వ
  లన అయ్యప్పకు, హరి తను లలనామణి మో
  హినియై ! ఆ శబరిమలే
  శున కమ్మైనట్టి హరియె శుభముల నొసగున్ !

  రిప్లయితొలగించండి
 7. రవి గారు !
  నా పద్య రచనలో ఎటువంటి భావాలు పలుకుతున్నాయో, మీ పద్య రచనలో కూడా ఆ భావాలే పలకడం చూస్తుంటే ... ఆశ్చర్యంతో బాటు ఆనందం కలుగుతుంది. నేను ’ వేటూరి ’ పై వ్రాసిన సీస పద్యం ( ’ చలన చిత్ర కవన ఛత్రపతి ’ అన్న నా పోస్ట్ చూడండి. ) లాంటిదే ఇప్పుడే మీ ’ ఒక పద్యం, కొన్ని పైత్యాలు ’ అన్న పోస్టులో చూసాను. ఇప్పుడీ సమస్యా పూరణం కూడా ఇద్దరమూ ’ అయ్యప్ప స్వామి ’ ఆధారంగా పూరించడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది.
  మీకు నా అభినందనలు. మీరు నన్ను మించిన పద్య కవిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 8. ఘన త్రిపురాసురులన్
  దునుమాడఁగఁ దగిన శరము దొరకని కతనన్
  జనసంక్షేమము కొఱ కీ
  శున కమ్మైనట్టి హరియె శుభముల నొసఁగున్.

  (జనసంక్షేమము కొఱకు + ఈశునకు + అమ్ము + ఐనట్టి హరియె)
  ఈశునకు = శివునకు
  అమ్ము = బాణం

  (ఘనులైన త్రిపురాసురులను చంపడానికి తగిన బాణం దొరకక పోవడంతో శివుని కోసం బాణంగా మారిన విష్ణువే మనకు శుభాల నిస్తాడు)

  రిప్లయితొలగించండి
 9. @ హరి దోర్నాల -
  హరి గారూ, పద్యం మంచి ధారాశుద్ధితో, నిర్దోషంగా నడిచింది. బాగుంది. కాని హరి శునకమెలా, ఎప్పు డయ్యాడు?

  @ జిగురు సత్యనారాయణ -
  సత్యనారాయణ గారూ, మీ పూరణలోని "నకము" శబ్దం శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు లోను లేదు. మీరు చెప్పిన కృష్ణమూర్తి కవి పద్యం ప్రఖ్యాతమే. ఆ పద్యమే నేనిచ్చిన సమస్యకు ప్రేరణ. దానిని గురించి నా బ్లాగులో "చమత్కార పద్యాలు" శీర్షికలో పోస్ట్ పెడుతున్నాను.
  మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.

  @ రవి -
  రవి గారూ, క్రొత్త భావంతో చక్కగా పూరించారు. అభినందనలు.

  @ డా. ఆచార్య ఫణీంద్ర -
  ఫణీంద్ర గారూ, మీ పూరణను వ్యాఖ్యానించే సాహసం చేయగలనా? మీకు నా శతసహస్ర వందనాలు.

  రిప్లయితొలగించండి
 10. @ఆచార్య ఫణీంద్ర గారు:
  అవునండి. నేనూ చాలా ఆశ్చర్యపడ్డాను. ఆనందంగానూ ఉంది. పద్యరచనలో నేనింకా విద్యార్థినే. మీ వంటి మహామహుల ఆశీస్సులే కావాలి.

  రిప్లయితొలగించండి
 11. కనగలవానికి నగుపడు
  కనగన్లేనట్టివారి కగుపడడెపుడున్,
  కనగా మనలన్ గాచెడు
  శునకమ్మైనట్టి హరియె శుభముల నొసఁగున్.

  (ఇందు గలడందు లేడను సందేహము వలదు... భావముతో పూరించాను)

  రిప్లయితొలగించండి
 12. "సుమిత్ర" గారూ,
  సర్వాంతర్యామి అయిన హరిని శునకంలో చూసారు, భేష్ ...

  రిప్లయితొలగించండి
 13. కండి శంకరయ్య గారు,

  పొరపాటే, కాని వేరే ఆలోచించలేక పోయాను.

  జనులను శునకంలా కాపలా కాచాడు అనే అర్థం లో వాడడానికి ప్రయత్నించాను.

  రిప్లయితొలగించండి
 14. "ఈశునకు + అమ్ము + ఐ" మాత్రమే నేనింతకు ముందు చదివిన విరుపు.
  "ఈశునకు + అమ్మ + ఐ" అని విరిచి "శబరి గిరీశునకు" అని పూరించడం చాలా బాగుంది!

  రిప్లయితొలగించండి
 15. భైరవభట్ల కామేశ్వరరావు గారూ,
  "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. మీరు నా బ్లాగును వీక్షించి నన్ను ధన్యుణ్ణి చేశారు.

  రిప్లయితొలగించండి
 16. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !

  01)
  ____________________________________

  ఇనుడతడె , సర్వప్రాణుల
  మనువాతడె; సర్వలోక - మంగళు డతడే !
  కనుగొనెద మెందు జూచిన !
  శునకమ్మైనట్టి హరియె - శుభముల నొసఁగున్ !
  ____________________________________
  మనువు = జీవము

  రిప్లయితొలగించండి
 17. విను త్రిపుర వధకు పరమే
  శున కమ్మైనట్టి వాని స్తుతులను జేయన్
  ఘన కరి మరి శబరి మలే
  శునకమ్మైనట్టి హరియె శుభముల నొసగున్ !

  రిప్లయితొలగించండి
 18. అనువుగ స్వర్గపు బాటను
  కనుమరుగవకుండ తాను కాలిని నడకన్
  చనగ యుధిష్ఠిరు చెంతను
  శునకమ్మైనట్టి హరియె శుభముల నొసఁగున్

  హరి = యముడు

  రిప్లయితొలగించండి