14, జూన్ 2010, సోమవారం

సమస్యాపూరణం - 11

కవి మిత్రులారా, ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది .....
పుస్తకం బదేల హస్తమందు?

24 కామెంట్‌లు:

 1. భూర్జ తాళ పత్ర పుస్తకములుఁ దొల్లి.
  కాగి తంబు లొచ్చె గడిచి.నేడు
  హస్తభూషణముగ అంకోపరుండగా
  పుస్తకం బదేల హస్తమందు?

  అంకోపరి - లాప్ టాప్

  రిప్లయితొలగించండి
 2. శంకరయ్య గారూ,
  నమస్కారం. చాలామంది పద్యాలు పూర్తిగా అర్థం కావటం లేదూ, అర్థం కూడా వ్రాస్తే బాగుంటుంది --అవటా అని వ్రాస్తున్నారు. దీనికి నా సూచన ఒకటి. మనమే ప్రతి పద్యానికీ అర్థ తాత్పర్యాలూ గట్రా వ్రాసేస్తే చదువుకోవటానికి చాలా సులువుగా బాగానే ఉంటుంది, నిజమే -- కాని ఇది మంచి పద్ధతి కాదు అనేది నా అభిప్రాయం. ఎందుచేతనంటే ఒక పదానికి అర్థం తెలియనప్పుడు దాని అర్థం కష్టపడి నిఘంటువులలో వెదకి తెలిసికొంటే ఉండే ఆనందము వేఱు. ఆ అర్థం ఎక్కువకాలం పాటు మన మనస్సులో స్థిరంగా ఉండిపోతుంది. దీనికి నాకు తోచిన ఒక ఉపాయం చెపుతున్నాను. వీలైతే ఆచరించండి. అది అందరికీ ఉపయోగకరంగా కూడా ఉంటుందని నా ఊహ. మీరు మీ బ్లాగులో "ఆంధ్ర నిఘంటువు" కు ఓ లింకు నేర్పాటు చెయ్యండి. మీరనే కాదు అందరు బ్లాగరులూ కూడా వారి వారి బ్లాగులలో ఇలా ఏర్పాటు చేసుకోవచ్చును. నేను నా బ్లాగులన్నిటిలో ఈ సదుపాయాన్నుంచాను. దీని వలన మనమే కాకుండా మన పాఠకులు కూడా ఆ లింకులోనికి వెళ్ళి వారికి తెలియని పదాలకు అర్థాన్ని త్వరగా పొందగలుగుతారు. దీని వల్ల కలిగే లాభాలు. నిఘంటువుల వలని ఉపయోగం అందరికీ అందుబాటులోకి రావటం. మనకు కావలసిన అర్థమే కాకుండా ఒకే పదానికి ఉన్న ఇతర అర్థాలు కూడా అందరికీ సులువుగా అందుబాటులోకి రావటం. నిఘంటువులు అన్నీ అందరికీ పుస్తకరూపంలో అందుబాటు లో లేకున్నా అందరూ వాటివలని ఉపయోగాల్ని అందుకోగలగటం వగైరాలు. ఇంకా మెరుగైన మార్గాలు ఏమైనా ఉంటే సూచించండి. మనకు కావలసినది అందరికీ మనం ఉపయోగపడటం. ఈ సందర్భంగా ఆంధ్ర నిఘంటువును నెట్ కు అనుసంధానం చేసినవారికి మనం మన కృటజ్ఞతలు చెప్పుకోవయం ప్రాథమికంగా మన బాధ్యత అని తలుస్తాను నేను.

  రిప్లయితొలగించండి
 3. రవి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. "నరసింహ" గారూ,
  నా బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. మీ సూచన బాగుంది. అయితే నాకు బ్లాగులో లింకులు పెట్టగలిగే టెక్నికల్ నాలెడ్జ్ లేదు. మీరు ఆ విధానం చెప్తే దానిని ఆచరణలో పెడతాను. ఎప్పటికప్పుడు మీ సూచనలను, సలహాలను ఇస్తూ నన్ను ప్రోత్సహించ వలసిందిగా మనవి. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 5. ఆ.వె.
  మిద్దెనెక్కెనొకడు విద్దెల నెపమున
  చిత్తమదియుఁజూచు చెలువ సొగసు
  మస్తకంబునకును విస్తరించగలేని
  పుస్తకంబదేల హస్తమందు?

  (వివరణ: ఒకడు చదువు నెపముతో మేడ పైకి వెళ్లి ఎదిరింటి అమ్మాయికి "సైటు" కొడుతున్నాడు, అటువంటి వాడికి తలకెక్కని పుస్తకము చేతులో దేనికి?)

  రిప్లయితొలగించండి
 6. రవి గారు,
  మీ పూరణ బాగుంది. అంకోపరి ఉండగ పుస్తకమేల అనటం బాగుంది.

  రిప్లయితొలగించండి
 7. శ్రీ జిగురు సత్యనారాయణ గారూ,

  సరస భావోక్తితో సమస్యకు సుమధుర
  పూరణం బివ్వ నా బ్లాగు పుణ్యమెంత
  చేసుకున్నదొ? ధన్యుఁడఁ జేసినావు;
  జిగురు సత్యనారాయణ! చేతు నుతులు.

  రిప్లయితొలగించండి
 8. రవి గారూ,
  మీ పూరణ రెండవ పాదంలో "కాగితంబులొచ్చె" అన్నచోట కాగితంబులు + ఒచ్చె అని పదవిభాగం. ఒచ్చె అనే శబ్దం గ్రమ్యం. దానిని "కాగితములు వచ్చి" అని సవరిస్తే బాగుంటుంది కదా!

  రిప్లయితొలగించండి
 9. ఎల్ల గ్రంథ చయము 'నింటరునెట్టు'లో
  'క్లిక్కు' చేసినంత నొక్కపరిగ
  కనుల ముందు నిలిచి కామితములు తీర్చ-
  పుస్తకం బదేల హస్తమందు?

  రిప్లయితొలగించండి
 10. భూర్జ తాళ పత్ర పుస్తకములుఁ దొల్లి.
  కాగితములు వచ్చి గడిచి.నేడు
  హస్తభూషణముగ అంకోపరుండగా
  పుస్తకం బదేల హస్తమందు?

  శంకరయ్య గారు, మార్చాను. మీరిలా సూచనలందిస్తారని ఆశిస్తున్నాను. సత్యనారాయణ గారు, మీ పద్యాలు అలా జాలువారినట్టు ఉంటాయి. అద్భుతమైన ధార.

  రిప్లయితొలగించండి
 11. ఆచార్య ఫణీంద్ర గారూ,
  ముందుగా నా వందనాలను అందుకొనండి. నా బ్లాగులోకి మీ రాకతో ధన్యుడనయ్యాను. మీ ప్రోత్సాహం ఇలాగే కొనసాగించ వలసిందిగా మనవి. చక్కని పూరణ నందించారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 12. శంకరయ్య గారూ, నాకు కూడా కలనయంత్రం మీద పనిచెయ్యటం కొంచెం కష్టమైన పనే. నాకు తెలిసినంతవరకూ ప్రయత్నించి చెప్తాను. అలా చేసి చూడగలరు.
  మీ బ్లాగులోనికి sign in అవ్వండి. dash board click చెయ్యండి.తరువాత settings click చెయ్యండి. దానిలో comments అనేtab click చెయ్యండి. ఆ పేజీలో క్రిందకు వెళితే show word verification for comments అనే దానిలో ఉన్న no అనే బాక్సును సెలక్ట్ చేసుకొని చివరికి వెళ్ళి save బటన్ ను నొక్కండి. అక్కడికి ఓ పనవుతుంది.

  ఇక రెండోది. dash board కి వెళ్ళి lay out అనేది clickచెయ్యండి.add and arrange page elements అనే పేజీ open అవుతుంది. దానిలో add a gadget ను clickచెయ్యండి. అక్కడ open అయ్యేవాటిల్లో క్రిందకు వెళ్ళి link list ను click చెయ్యండి. then you write a name like లంకెల బిందెలు or any other name you like in the box named title.Then in the box named url, you write
  andhrabharathi.blogspot.com and in the box named name of blog you type ఆంధ్ర నిఘంటువు and then you click add link button. అప్పుడు on line dictionary అనేదోటి add అవుతుంది. అప్పుడు అక్కడ rename అనేది నొక్కి ఆంధ్ర నిఘంటువు అనేది టైపు చెయ్యండి. తరువాత ఆ పేజీలోని save button ను నొక్కి తరువాత view blog కు వెళ్ళండి. మీ బ్లాగులో లింకు ఏర్పడి ఉంటుంది. సరిగా చెప్పగలిగానో లేదో తెలియదు. ఓసారి ట్రై చేసి రిజల్టును తెలియజేయండి.

  రిప్లయితొలగించండి
 13. మస్తకమ్ము లోని మస్తిష్క మునుమించి
  హస్త భూషణముగ విస్తరించి
  అంక మందు నిలువ అంకోపరి యగుచు
  పుస్తకంబదేల హస్త మందు?

  రిప్లయితొలగించండి
 14. డా|| ఆచార్య ఫణీంద్ర గారూ,

  ఆచార్య ఫణీంద్రా! కవి
  తా చాతుర్యా! కరుణను దప్పక బ్లాగున్
  నీ చల్లని చూపులతో
  నా చిత్తమ్మలరఁ జూడు మని ప్రార్థింతున్.

  రిప్లయితొలగించండి
 15. నరసింహ గారూ,
  ధన్యవాదాలు. మీరు చెప్పినట్లుగా ప్రయత్నిస్తాను.

  రిప్లయితొలగించండి
 16. హరి దోర్నాల గారూ,
  మంచి పూరణ పంపించారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. వ్యాసపీఠమందు భాగవతమునుంచి
  వాసుదేవుకథలు పాడుచుండ
  మస్తకమును చెరచు నాస్తికవాదపు
  పుస్తకం బదేల హస్తమందు?

  రిప్లయితొలగించండి
 18. శంకరయ్య గారు!
  నీవే ఒక సత్కవివయి,
  నా వీక్షణ గోరుచు మరి నాపై యేలా
  ఈ విధి ఆదర మింతగ?
  నీ వినయము ముందు నింక నే ప్రణమిలెదన్!

  రిప్లయితొలగించండి
 19. శంకరయ్య గారు !
  వీలు చిక్కినప్పుడల్లా మీ బ్లాగును తప్పక చూస్తాను.
  సమయం చాలక, నా ’నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం’ బ్లాగు ద్వారా చేయాలనుకొన్న సాహిత్య సేవ చేయలేకపోతున్నాను. మీ ’శంకరాభరణం’ బ్లాగు ఆ లోటు తీరుస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీకు నా హార్దికాభినందనలు !

  రిప్లయితొలగించండి
 20. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !

  01)
  ______________________________

  గుట్టు తెలిసి కొనిన - యిట్టె కొట్టగవచ్చు
  వేళ్ళు బోర్డు మీద - వేగముగను
  నెట్టు నందు లిపిని - పెట్టు వారి కిలను
  పుస్తకంబదేల - హస్తమందు ?
  _______________________________
  బోర్డు = కీబోర్డు

  రిప్లయితొలగించండి
 21. వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి