29, జూన్ 2010, మంగళవారం

చమత్కార పద్యాలు - 7

"గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్"
17వ శతాబ్దంలో మోచర్ల సోదరులుగా పేరుపొందిన కవులు వెంకన్న, దంతప్పలు. వీరి నివాసం నెల్లూరు జిల్లాలో తెట్టు గ్రామం. వేజెళ్ళ సంస్థానంలో ప్రసిద్ధి పొదిన కవులు వీళ్ళు. వీరి పేరుతో వందకు పైగా చాటు పద్యా లున్నాయట. సమస్యాపూరణంలో దిట్టలు వీళ్ళు. ఎవరో దత్తప్పకు "గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్" అనే సమస్యను ఇచ్చారట. ండ్ర అనే దుష్కర ప్రాసతో పద్యం చెప్పడం చాలా కష్టం. దానిని దత్తప్ప పూరించిన పద్యం చాలా ప్రసిద్ధం. 

ఉండ్రా యోరి దురాత్మక!
యిండ్రా ప్రాసమ్ము కవుల కియ్యఁ దగున? కో
దండ్రాము పదము సోకిన
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్.


దీనికి నా పూరణ -
ఎండ్రి వలె నడచువా రెన
మండ్రు కలిసి యెత్తి తమదు మస్తకముల పె
క్కండ్రు మది మెచ్చి చూడఁగ
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్.

22 కామెంట్‌లు:

 1. బావుందండి. చాలా రోజులుగా వెతికాను, ఈ పద్యం ఎక్కడిదని. నా ప్రయత్నమూ ఒకటి.

  తండ్రీ! నీ లీలలివెగ!
  మండ్రాటముగా శిలయయి పడు గౌతమునిన్
  ఆండ్రు నీ పదమందెను.
  గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్.

  రిప్లయితొలగించండి
 2. రవి గారూ,
  "మండ్రాటము" ... మీ కెక్కడ దొరుకుతాయండీ ఇంత చక్కని పదాలు? పూరణ బాగుంది. కాని "గౌతమునిన్ ఆండ్రు" ప్రయోగమే పానకంలో పుడకలా తగుల్తోంది. అన్నట్టు .. నేను పూరించినప్పుడు "తండ్రి" శబ్దం స్ఫురించలేదు.

  రిప్లయితొలగించండి
 3. శంకరయ్య గారు

  నేను ఇలా ప్రయత్నించాను

  ఉండ్రాళ్ళను తిన్నట్టుగ
  హండ్రెడు పర్సెంటు సొమ్ము హారము కాగా
  తండ్రీ ప్రాజెక్టుల పని
  గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్.

  రిప్లయితొలగించండి
 4. హరి దోర్నాల గారూ,
  మీ పూరణ హండ్రెడ్ పర్సెంట్ ఓ.కే. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. శంకరయ్య గారు, మీరనుకున్నంత గొప్పవాణ్ణి కాను. జాలంలో బ్రౌణ్య గ్రంథం ఉంది. ఇలాంటి దుష్కర ప్రాసలున్నప్పుడు అందులో చూసి కిట్టించడమే తప్ప, స్వయంప్రతిభ కాదు నాది.

  రిప్లయితొలగించండి
 6. నా దో సరదా పూరణ నాలకించండీ

  లెండ్రా, పల్లము వల్లనె
  గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచే
  పొండ్రా యెనకే, ఇహ ఆ
  పండ్రా, రాళ్ళన్ బడి శిలపాలయి నారేం?

  రిప్లయితొలగించండి
 7. శంకరయ్యగారూ!

  ఈ సమస్య వ్యుత్పత్తి గురించి మీ వల్ల తెలిసింది. చాలా సంతోషం.

  పూరణలు అందరివీ బాగున్నాయి. కవుల సంఖ్యని పెంచుతున్నందుకు మీకు అభినందనలు.

  దయచేసి కొనసాగించండి!

  రిప్లయితొలగించండి
 8. తండ్రీ కృష్ణా! నిన్నును
  గుండ్రాతికిఁగట్ట మాత కోపము తోడన్
  గండ్రించితివట తరువుల్
  గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్!!

  రిప్లయితొలగించండి
 9. పండ్రెండొందలు టికెటుకు!
  రండ్రా పోదామనఁవిని rockకు బోవన్
  ఓండ్రెట్టెను సింగరొకడు
  గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్

  (నా ఉద్దేశం ఆ గోల వినలేక గుండ్రాయి కూడా నడిచి బయటకు వెళ్ళిపోయింది అని).

  రిప్లయితొలగించండి
 10. గిరి గారూ,
  సరదాగా సాగింది మీ పూరణ. బాగుంది.

  కృష్ణశ్రీ గారూ,
  "శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం. నా బ్లాగు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

  కొత్తపాళీ గారూ,
  స్వాగతం. నా బ్లాగు నచ్చినందుకు ధన్యుణ్ణి.

  జిగురు స్త్యనారాయణ గారూ,
  పూరణ బాగుంది. ధన్యవాదాలు.

  సందీప్ గారూ,
  హాస్యస్ఫోరకంగా సమస్యను పూరించారు. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  01)
  __________________________________

  బండ్రాజు పెట్ట మూపున
  గండ్రంబుగ నున్న రాయి - గాడిద జేరెన్ !
  పండ్రెండు మైళ్ళ దూరము !
  గుండ్రాతికి కాళ్ళు వచ్చి - గునగున నడిచెన్ !
  __________________________________

  రిప్లయితొలగించండి
 12. వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. శంకరయ్యగారూ!

  ఇలాంటి పూరణలకి యేమైనా అర్థం వుందా?

  గుండ్రాతికి కాళ్లు వచ్చి, గుణ గుణ నడచినా, మన కవిత్వాలు కనీసం తప్పటడుగులైనా వేస్తాయా? యేమో. మీరే చెప్పాలి!

  రిప్లయితొలగించండి
 14. కృష్ణశ్రీ గారూ,
  చాలా సందర్భాలలో ఇలాంటి పూరణలలో భావసౌందర్యం లోపించవచ్చు. కాని ఇవి కవికి భాషపై ఉన్న అధికారాన్నీ, అతని పదసంపదనూ, సమయస్ఫూర్తిని తెలియజేస్తాయి. ఒక సమస్యకు పరిష్కారం ఆలోచించి, దానికి పద్యరూపం ఇవ్వడం ఒక విధంగా కవికి ప్రసవవేదనే. పద్యం పూర్తయినప్పుడు, దానిని ఇతరులు ప్రశంసించినప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం.

  రిప్లయితొలగించండి
 15. శంకరార్యా ! చాలా చక్కగా చెప్పారు !
  సమస్య అంటేనే - అర్థం లేనిదీ - అపార్థం కలిగించేదీనూ !
  దానిని సాధించి సక్రమం చేసినపుడు కలిగే ఆనందం అనుభవిస్తే గాని
  అర్థం కాదు !

  రిప్లయితొలగించండి
 16. గుండ్రాయని పొర బడితిని
  గండ్రిసుకన పైన మెరసి కనబడుచుండన్!
  ఎండ్రియె యది, కాల్దగులగ
  గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్!!

  రిప్లయితొలగించండి
 17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. ఉండ్రాని యడవి లోన
  గుండ్రాయై పడియున్న కోమలిపై కో
  దండ్రాముని పదముల్ సోకి
  గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్.

  చిన్నప్పుడు మా నాన్న ఈ పద్యం చెప్పెవారు. గుర్తు వున్నంత లొ రాసాను.
  తప్పులు వుంటె క్షమించ గలరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కిరణ్ గారూ,
   బ్లాగును వీక్షించినందుకు, వ్యాఖ్యానించినందుకు సంతోషం!
   మీ నాన్నగారు సరిగానే చెప్పి ఉంటారు. మీరు చెప్పిన పద్యంలో కొన్ని లోపాలున్నాయి. నా సవరణ...
   ఉండ్రాని యడవిలోనన్
   గుండ్రాయిగను పడియున్న కోమలిపై కో
   దండ్రాము పదము సోకిన
   గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్.

   తొలగించండి