27, జూన్ 2010, ఆదివారం

సమస్యాపూరణం - 23

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
రతము ముగియకుండ రమణి లేచె.

18 కామెంట్‌లు:

  1. టీవి జూచుటన్న చెవికోయు కోడలు
    జూడసాగె పెందలాడ సినిమ
    అంట్లు తోమ పిలిచె అత్తమ్మ; బాలభా
    రతము ముగియకుండ రమణి లేచె

    రిప్లయితొలగించండి
  2. గొల్లలు భక్తితోఁ గొల్చిన సత్యనా
    రాయణుఁ గాంచిన రాయుడొకడు
    భక్తితోఁ స్వామిని వారసునిమ్మని
    వ్రతముఁ జేయుట, వైశ్యుడొకడు
    జూచిన పిమ్మట, చొక్కపు పూజలు
    తాఁజేతు ననియె వ్రత మహిమ గని,
    సంతానము గలిగె సంపదలు పెరిగె
    పూజలు మాత్రము పొసగవయ్యె

    సత్యదేవు కిన్క సంపదల్ గతియించె
    తప్పు మాపు కతన మొప్పుపూజ
    చేయ బూనెఁ గాని మాయలో పడిపోయి
    రతము ముగియకుండ రమణి లేచె

    లేచినంతనె మతి లేమికి వగచి నా
    రాయణుఁ గొలిచె ననురక్తి తోడ,
    స్వామి భక్త సులభ సత్యమూర్తి సిరుల
    కరుణ కురియజేసె గరిమఁ జూపి

    రిప్లయితొలగించండి
  3. హరి దోర్నాల గారూ,
    మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. గిరి గారూ,
    సత్యనారాయణ స్వామి వ్రతకథను సాంతం చెప్పారు. బాగుంది. అయితే వ్రతమునకు వికృతి రతము అనుకున్నారు. రతము శబ్దానికి "అనురాగం కలది, ఇష్టం కలది, ఆనందం, మైథునం అనే అర్థాలున్నాయి. గమనించండి.

    రిప్లయితొలగించండి
  5. శంకరయ్య గారు,
    పూరణ పంపిన కొద్ది సేపటికి నాకూ అనుమానం కలిగింది - వెంటనే ఒక త్రోవకూడా కనబడింది, పూరణలో అది సమ్మతమో కాదో మీరే తెలుపండి.

    సత్యదేవు కిన్క సంపదల్ గతియించె
    తప్పు మాపు కతన మొప్పుపూజ
    చేయ బూనెఁ గాని మాయలో పడిపోయి
    వ్రతము ముగియకుండ రమణి లేచె

    అని పూరిస్తే, గణ యతి భంగము జరుగదు. చేసినదల్లా చివరి పాదంలో వ్ - ను తగిలించడమే. సంధివల్ల సమస్యలో ఇచ్చిన పదాలను ప్రాస, యతి భంగము జరగకుండా మార్చినా తప్పులేదని తెలుసు కానీ, పైవిధంగా చేయవచ్చునో లేదో తెలియదు. మీరే చెప్పాలి.

    రిప్లయితొలగించండి
  6. గిరి గారూ,
    పాదాంతాక్షరం తరువాతి పాదాద్యక్షరంతో కలువవచ్చు. కాని వ్రతములో వకారం పూర్వపాదంలో అంత్యాక్షరం కాదు కదా.

    రిప్లయితొలగించండి
  7. రథము ముగ్గు వేయ రమణి యొకతి వచ్చె
    ఫోను రాగ నడుమ లోనికేగె
    'థ' పలకంగ లేని తరుణి పలికెనంత
    "రతము ముగియకుండ రమణి లేచె"!!

    రిప్లయితొలగించండి
  8. సత్యనారాయణ గారూ,
    పూరణ చాలా బాగుంది. ధన్యవాదాలు.
    ఈ రోజు చాలా సులభమైన సమస్య ఇచ్చాను. ఎక్కువగా పూరణలు వస్తాయనుకున్నాను. కాని చిత్రం! ముగ్గురే పూరించారు. బహుశా సమస్యలో అశ్లీలం ఉందనుకున్నారేమో?

    రిప్లయితొలగించండి
  9. శంకరయ్య గారు,
    మొదటిది సరిపోలేదు కనుక, ఇదిగో ఇంకో పూరణ
    గుఱక వెట్టి నిదుర జాఱె గురుడదెపుడు?
    కరికి లేని కుంభ మరయగ నెది ?
    గుఱక వల్ల పడకటింట నొఱిగె నేమి?
    రతము ముగియ, కుండ, రమణి లేచె

    గిరి

    రిప్లయితొలగించండి
  10. ఎన్నో రోజుల తరువాత ఈ రోజు నా బ్లాగులో ఓ కొత్త టపా ప్రచురించాను - వీలున్నప్పుడు చూడండి

    రిప్లయితొలగించండి
  11. శంకరయ్య గారు,
    మీ అభినందనలకు ధన్యవాదములు.
    "రతము"ను రతమనే అర్థములో పూరిస్తే కొంతవరకు సులభమైన, హరి గారు దాన్ని "భారతము" గా మార్చినట్టు మరో పదముగా మార్చలని ప్రయత్నిస్తే కొంచెం కష్టంగానే ఉన్నది. అందుకే నేను అలా దొడ్డి దారిన పూరించేశా. :-)

    గిరి గారు,
    మీరు సమస్యను విఱిచి, గుఱక పెట్టించిన తీరు బాగుంది.

    రిప్లయితొలగించండి
  12. గిరి గారూ,
    మీ ప్రశ్నోత్తర మాలికా పూరణం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. శంకరయ్య గారు,
    ఈ మధ్య సమయం కుదరక మీ బ్లాగు ప్రతి రోజు చూడలేక పోతున్నాను. ఈ రోజే కొన్నిటిని చూసాను. అందరి పూరణలు చాలా బావున్నాయి.
    క్రమం తప్పకుండ ప్రతి రోజు సమస్యలు ఇస్తున్న మీకు, అద్భుతమైన పూరణలతో అలరిస్తున్న కవులకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    1)
    _______________________________

    రాత్రి వేళ నాట్య - రాణియౌ రాధిక
    నాట్య శిక్ష జేయు - నట్టి వేళ
    భర్త వచ్చి నంత - పలుకరించి; తన భ
    రతము ముగియకుండ - రమణి లేచె !
    _______________________________

    శిక్ష = సాధన
    భరతము = భరతనాట్యము

    రిప్లయితొలగించండి
  15. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. రాత్రి ప్రక్క ఇంటి రామాయణమ్మును
    చెప్పి పిన్ని గార్కి చెవులు గొరికె,
    రావె! యనగ భర్త, రమ్యమౌ పిన్ని భా
    రతము ముగియకుండ; రమణి లేచె.

    రిప్లయితొలగించండి
  17. దేవళమ్ములోన దేవయ్య భారత
    కథను జెప్పుచుండఁ గడు ముదమున
    వినుచునుండి భర్త విచ్చేయు ననుచు భా
    రతము ముగియకుండ రమణి లేచె.

    రిప్లయితొలగించండి