15, జూన్ 2010, మంగళవారం

చమత్కార పద్యాలు - 4

చమత్కార పద్యాలు
సాహిత్యంలో చాటుపద్యాలు, అవధానపద్యాలు, కావ్యాలలో శబ్దాలంకారలతో శోభిల్లిన పద్యాలలో కవులు చూపిన చమత్కారాలు మనల్ని ఆనందింప జేస్తాయి. అలాంటి పద్యాలను సేకరించి వివరణతో మీ కందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందుకు వేటూరి వారి "చాటుపద్య మణిమంజరి", ప్రొ.జి.లలిత గారి "తెలుగులో చాటుకవిత్వము", కొన్ని ఇతర గ్రంథాలు నాకు ఉపయోగ పడుతున్నాయి. ఈ "చమత్కార పద్యాలు" మిమ్మల్ని అలరిస్తాయని ఆశిస్తున్నాను.

చమత్కార పద్యాలు - 4

మొన్న నా బ్లాగులో "టంట టంట టంట టంట టంట" అనే సమస్య నిచ్చాను. దానికి స్ఫూర్తి భోజుడిచ్చిన సమస్య.
ఒకసారి భోజ మహారాజు తన ఆస్థాన కవులకు "టంటంట టంటం టట టంట టంటం" అనే సమస్య నిచ్చి పూరించ మన్నాడట. అప్పుడు కాళిదాసు లేచి క్రింది విధంగా పూరించాడు.
రాజాభిషేకే మదవిహ్వలా యా
హస్తాచ్చ్యుతో హేమఘటో యువత్యా |
సోపానమార్గేషు కరోతి శబ్దం
టంటంట టంటం టట టంట టంటం

వివరణ:- రాజుగారి స్నానానికి నీళ్ళు తెచ్చిన యువతి అతని సౌందర్యం చూచి మోహపరవశురాలై తన చేతిలోని బంగారు బిందెను జారవిడిచింది. ఆ బిందె మెట్ల మీదుగా "టంటంట టంటం ...." అని శబ్దం చేస్తూ దొర్లి పడిందని భావం.
నా అనువాదం -
రాజు స్నానమాడ రమణి యాతని యంద
మును కనుఁగొని మోహమున మునింగి
ఘటము విడిచిపెట్టఁగా దొర్లె మెట్లపై
టంట టంట టంట టంట టంట.

7 కామెంట్‌లు:

 1. టంటంట టంటం టంటంట టంట: (హస్త చ్యుత పాత్ర చివర నేలపై పడి ఆగిపోతుంది కాన టంట: అని ముగుస్తుంది)

  రిప్లయితొలగించండి
 2. ఈ సమస్య నేనూ విన్నానండి. ఇలాంటిదే మరొకటుంది. "గుగ్గుళుంగుళుంగుళుం గుళుః" - ఇలా ఏదో..

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !
  01అ)
  __________________________________

  జలకమాడు రాజు - జిలుగున వెలుగంగ
  జలము ఘటమును గొను - జాణ జూచి
  జార విడువ బాన - సవ్వడి మెట్లపై
  టంట టంట టంట - టంట టంట !
  __________________________________

  రిప్లయితొలగించండి