"ఈ శునకము కృష్ణమూర్తియే యెన్నంగన్"
పిండిప్రోలు లక్ష్మణకవి (1770-1840) సి.పి. బ్రౌన్ ఆదరాన్ని పొందిన పండితుడు. ఇతడు నిగ్రహానుగ్రహ సమర్థుడట! పండిత సభల్లో నిర్భయంగా తన కవిత్వాన్ని వినిపించేవాడు. రావు దమ్మన్న అనే వ్యక్తి ఇతని లంకభూమిని దౌర్జన్యంగా అపహరించాడు. లక్ష్మణకవి కోర్టులు, దావాలతో నిమిత్తం లేకుండా "లంకా విజయం" అనే ద్వ్యర్థి కావ్యాన్ని రచించి తన భూమిని తిరిగి సంపాదించుకున్నాడు. ఈ కావ్యానికి "రావణ దమ్మీయం" అనే నామాంతరం ఉంది.
శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి, మొక్కపాటి పేరి శాస్త్రి ఇతని సమకాలికులు. వీరి మధ్య తరచుగా వాదోపవాదాలు జరుగుతూ ఉండేవి.
ఒకసారి లక్ష్మణకవి శిష్టు కృష్ణమూర్తి శాస్త్రికి
"ఈ శునకము కృష్ణమూర్తియే యెన్నంగన్" అనే సమస్యను ఇచ్చాడట. అందుకు కోపించిన శాస్త్రి దానిని ఇలా పూరించాడట.
దాశరథీ శబ్దమ్మును
దాశరథి పరమ్ముఁ జేయు ద్వైయర్థిక దు
ర్ధీశక్తి బిడాలమునకు
నీ శునకము కృష్ణమూర్తియే యెన్నంగన్.
రావణ దమ్మీయం అనే ద్వ్యర్థి కావ్యంలో దాశరథి శబ్దానికి రెండర్థాలు చెప్పిన లక్ష్మణకవి అనే పిల్లికి కృష్ణమూర్తి కుక్కే అని భావం.
అందుకు లక్ష్మణకవి "త్రిపురాసుర సహారంలో విష్ణువు శివునికి బాణమయ్యాడు. ఈ కృష్ణమూర్తి ఈశునకు అమ్మైన విష్ణుమూర్తి అని పొగడితే శాస్త్రి తాను అంతటి పొగడ్తకు తగినవాడిని కాదనుకున్నాడేమో. తనను తాను శునకంతో పోల్చుకున్నాడు" అని అవహేళన చేసాడు.
("తెలుగులో చాటు కవిత్వము" సిద్ధాంత గ్రంథ రచయిత్రి డా. జి. లలిత గారికి కృతజ్ఞతలతో)