13, నవంబర్ 2013, బుధవారం

సమస్యాపూరణం - 1234 (మత్తుఁ గలిగించువాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
మత్తుఁ గలిగించువాఁడె పో మంచివాఁడు.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదములు.

33 కామెంట్‌లు:

  1. వన్నె చిన్నెలు కురిపించి వలను విసరి
    గగన సీమల దేలించి కధలు జెప్పి
    పంచ ప్రాణము నీవంచు ముంచి వలపు
    మత్తుఁ గలిగించువాఁ డె పో మంచి వాఁ డు

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    మత్తువైద్యుడు సరియైన మోతాదులో మత్తివ్వడం వల్లనే గదా
    శస్త్రచికిత్సలు సజావుగ జరిగేది !

    కాని పేరేమో(కీర్తి) శస్త్రచికిత్సకునకు వస్తుంది !
    "అబ్బ ! ఆయన హస్తవాసి మంచిది !
    ఆయన ఆపరేషన్ చేస్తే తప్పకుండా నయమవుతుంది " అని

    పాపం ! మత్తువైద్యుని పేరు కూడ యెవరూ
    తలుచుకోవడం కాదు కనీసం తెలుసుకోరు !

    మరి మత్తిచ్చేవాడే గదా మహ మంచివాడు :

    01)
    __________________________________________

    శస్త్ర వైద్యు డదె చికిత్స - జరుపు నపుడు
    వాని విచికిత్స దూరము - తాను జేయు
    మత్తు వైద్యుడు సరిపడు - మత్తు నిచ్చి
    పెక్కు జీవుల రక్షించి - పేరు గొనగ !
    మత్తుఁ గలిగించువాఁడె పో - మంచివాఁడు !
    __________________________________________

    విచికిత్స = సంశయము(మత్తు సరిగ్గా యెక్కిందా లేదా అని)


    రిప్లయితొలగించండి
  3. "దేవదాసు"
    శరశ్చంద్రుని నవల !

    డి ఎల్ నారాయణ నిర్మించిన చిత్రం !
    సీనియర్ సముద్రాల రచన
    సుబ్బరామన్ సంగీతం
    వేదాంతం రాఘవయ్య దర్శకత్వం
    నాగేశ్వర్రావు
    సావిత్రి
    రంగారావు
    రామాంజనేయులు(సి ఎస్ ఆర్)
    పేకేటి

    నటనా వైదుష్యం
    మరువ గలమా మరో జన్మ కైనా ???

    మత్తిచ్చి దేవదాసు బాధను తీర్చిన భగవాన్ మంచివాడే గద :

    02)
    __________________________________________

    మగువ , మరువగ లేక , తా - మ్రగ్గు చున్న
    దేవదాసును , సారాయి - దెచ్చి యిచ్చి
    మంచి మత్తును గలిగించె - మరువ బాధ !
    మత్తుఁ గలిగించువాఁడె పో - మంచివాఁడు !
    మత్తు నిద్రలో దేవదా - మరచె పారు !
    __________________________________________
    పారు = పార్వతిని దేవదాసు పలకరించే తీరు
    దేవదా = దేవదాసును పార్వతి పిలిచే పేరు


    రిప్లయితొలగించండి
  4. ఇహ పరమ్ముల వీడుచు నహ రహమ్ము
    శివును ధ్యానించి తరియించ చిత్త మలర
    భక్తి రసమున మునుగంగ భాగ్య మనెడి
    మత్తు గలిగించు వాడె పో మంచి వాడు

    రిప్లయితొలగించండి
  5. క్రూరుణ్ణి వాల్మీకిగా మలచుటకు
    మత్తిచ్చిన నారదుడు మంచివాడే గద :

    03)
    __________________________________________

    దొంగతనములు , హత్యలు , - దోపిడీలు
    నిత్య కృత్యంబు లైన, సౌ - నికుని జేరి
    రామ నామామృతపు రుచి - ప్రజ్వరిల్ల
    మత్తుఁ గలిగించువాఁడె పో - మంచివాఁడు !
    __________________________________________
    సౌనికుడు = బోయ

    రిప్లయితొలగించండి
  6. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తనే మత్తు నిచ్చినవాడు
    మంచివాడే కాదు మహాత్ముడు కూడా :

    04)
    __________________________________________

    బానిసత్వపు జనులదౌ - బాధ నెరిగి
    భారతంబున పౌరుల - బాధ్యత యని
    కోట్ల మందదె తన తోడ - గూడి నడువ
    పూర్ణ స్వాతంత్ర్య పోరాట - స్ఫూర్తి యనెడి
    మత్తుఁ గలిగించువాఁడె పో - మంచివాఁడు !
    __________________________________________

    రిప్లయితొలగించండి
  7. ఎన్నికలలో పోటీ చెయ్యాలంటే
    దైవాంశ సంభూతుడో
    రాజవంశంలో పుట్టిన వాడో
    జమీందారు బిడ్డడో
    కనీసం
    అగ్రకులస్థుడో

    ఉండాలనుకొనే రోజుల్లో
    సామాన్యుడు కలలో కూడా ఊహించలేని రీతిలో
    బడుగు బలహీన వర్గాల వారికి టిక్కెట్లిచ్చి
    యెమ్మెల్లేలుగా యెంపీలుగా గెలిపించి
    తెలుగు దేశం పిలుస్తోంది రా యంటూ నినదించి
    అందరిలోనూ రాజకీయ మనే మత్తు నింపిన
    నందమూరి అందగాడు
    అన్నగారు
    మంచివాళ్ళల్లో మొనగాడు :

    05)
    __________________________________________

    దుష్ట కాంగ్రెసు దుర్నీతి - దొరల కన్న
    తెల్ల దొరలదె నయమన్న - తీరు మార్చ
    కోరి చేరెను జనులతో - పోరు సలుప
    తెలుగు దేశము జేరగా - బిలిచె నపుడు
    రండి రారండి యనుచును - రాజకీయ
    మత్తుఁ గలిగించువాఁడె పో - మంచివాఁడు !
    __________________________________________

    రిప్లయితొలగించండి
  8. మదిని బాధలు చెలరేగి మౌనమంది
    చిన్నబోవుచు నుండగా చెంతజేరి
    మంచిమాటల గమ్మత్తు పెంచి పంచి
    మత్తుఁ గలిగించువాఁడె పో మంచివాఁడు

    రిప్లయితొలగించండి

  9. వృద్ధాశ్రమ వాసుల కి కవితా కిక్కు నివ్వ
    శంకరుడు అరుదెంచే ! ఆశ్రమ వాసులారా
    ఇక మీకు పొద్దు పోవడం తెలియనంత
    మత్తుఁ గలిగించువాఁడె పో (ఈ)మంచివాఁడు!!


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. రాజేశ్వరి అక్కయ్యా,
    ఈకాలంలో అలాంటి వాళ్ళే మంచివాళ్ళుగా చలామణి అవుతున్నారు. బాగుంది మీ మొదటి పూరణ.
    భక్తిరసపు మత్తు సర్వశ్రేష్ఠం కదా! మీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ అయిదు పూరణలూ ఒకదానిని మించి మరొకటిగా చాలా బాగున్నవి. అభినందనలు.
    నాల్గవ పూరణలో ‘మంది + అదె’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ‘కోట్ల కొలది జనము తనన్ గూడి....’ అందామా?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. మానవాళికి హాస్యము మత్తు గొలుపు
    నట్టి హాస్యమ్ము దెప్పించు హాస్య రసపు
    మాటలాడి మానవులకు మనమునందు
    మత్తుఁ గలిగించు వాఁడె పో మంచివాడు.

    రిప్లయితొలగించండి
  12. శ్రీమతి జిలేబి గారి భావమునకు నా పద్య రూపము.
    జిలేబిగారూ భావముబాగుంది అభినందనలు.

    వృద్ధ ఆశ్రమ వాసికి శ్రద్ధగాను
    ప్రొద్దు పోవగ వచ్చెను పూట పూట
    పద్య రసమిచ్చి శంకర పండితుండు
    మత్తుఁ గలిగించువాఁడె పో మంచివాఁడు

    రిప్లయితొలగించండి
  13. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    జిలేబీ గారి భావనికి చక్కని పద్యరూప్పాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు.
    ‘వృద్ధ ఆశ్రమ’ అని విసంధిగా వ్రాసారు. అక్కడ ‘వృద్ధు లాశ్రమమం దుండ శ్రద్ధతోడ’ అంటే ఎలా ఉంటుందంటారు?

    రిప్లయితొలగించండి
  14. మాస్టరుగారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు. బాగుంది.
    సవరణతో..

    వృద్ధు లాశ్రమమం దుండ శ్రద్ధతోడ
    ప్రొద్దు పోవగ వచ్చెను పూట పూట
    పద్య రసమిచ్చి శంకర పండితుండు
    మత్తుఁ గలిగించువాఁడె పో, మంచివాఁడు

    రిప్లయితొలగించండి
  15. మత్తు గలిగించు వాడె పో మంచి వాడు
    కాడు కాడయ్య! మిక్కిలి కరుణ మెరయ
    తత్త్వమసియని జ్ఞానబోధల నొనర్చి
    మత్తు వదిలించగల వాడు మంచివాడు

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమానిగారికి పూజ్యగురుదేవులు
    శంకరయ్యగారికి వందనములు
    మాయజగమును సృజియించి మానవులకు మనసుమమతలు కల్పించి మరులు గొల్పి
    బ్రతుకునాటకమందున పాత్రలందు
    మత్తు కల్గించువాడె పో మంచివాడు

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. మత్త్తు గలిగించు వాడెపో మంచి వాడు
    కాడు! కలము కదిలించి కవిత లల్లి
    కరకు గుండెలు కరిగించి గాఢ నిదుర
    మత్తు వదిలించ గలవాడు మంచి వాడు

    రిప్లయితొలగించండి
  19. భక్తి గాథల వినిపించి పారవశ్య
    ము గలిగించి శ్రోతలకెల్ల పుణ్య గతులు
    కలుగ నా మకరందపు కమ్మనైన
    మత్తుఁ గలిగించువాఁడె పో మంచివాఁడు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
    ==========*=========
    ఆలిబిడ్దలను మరచి యాన్ని విడచి
    యపరిచితుల నడుమ కొంచమైన నిద్ర
    మత్తు గలిగించు వాడెపో మంచి వాడు
    మాధవుండు జనుల కెల్ల బాధ లందు!

    రిప్లయితొలగించండి
  21. మత్త్తు గలిగించు వాడెపో మంచి వాడు
    కాడు! కలమును కదిలించి కవిత లల్లి
    కరకు గుండెలు కరిగించి గాఢ నిదుర
    మత్తు వదిలించ గలవాడు మంచి వాడు

    రిప్లయితొలగించండి
  22. చలువ వెన్నెల జల్లిన చందమామ
    మేలి బంగరు పాపల మేనమామ
    మబ్బు మాటున దాగొని మనసు దోచి
    మత్తు గలిగించు వాడెపో మంచివాడు

    రిప్లయితొలగించండి
  23. కడదాకా తోడు రాలేడు ఎవడు,
    అలా వచ్చినోడైనా వింటాడా గోడు?
    ఆర్చినా తీర్చినా ఒకడే పరమాత్ముడు,
    లేనిది ఉన్నదనే మత్తులో ముంచి తెల్చువాడు
    ఆ మత్తుఁ గలిగించువాఁడె పో మంచివాఁడు, వాడొక్కడే ఉన్నాడు

    రిప్లయితొలగించండి
  24. లక్ష కోట్లును దోచెను లక్షణముగ
    నీతులు బలుకుచు దిరుగు నేత, నేడు
    నీతి లేని జనుల కవినీతి యనెడి
    మత్తు గలిగించు వాడెపో మంచి వాడు
    ===================*==============
    కాకి గూటికి జేరక కావు కావు
    మనుచు నుండ మాధవుడేను నండ దండ
    యనుచు నా భక్తి మార్గము నందు నున్న
    మత్తు గలిగించు వాడెపో మంచి వాడు

    ( కష్ట కడలిని యున్న వానికి భక్తి మార్గము నందు నున్న సుఖము జూపు వాడు)

    రిప్లయితొలగించండి
  25. మానసిక రోగి శ్రేయంబు మదిని గోరి
    వైద్యుడు మదిలో మర్మంబుఁ బట్ట నెంచి
    పలుకు తేనెల రువ్వుచు వశుడు గాగ
    మత్తు గలిగించు వాడె పో మంచి వాడు

    రిప్లయితొలగించండి
  26. పండిత నేమాని వారూ,
    అజ్ఞానపు మత్తు వదిలించే మంచివానిని గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీరావు గారూ,
    మీరు సృష్టికర్తనే ప్రస్తావించారు కదా! బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    భక్తిమధువు యొక్క మత్తును గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘యాన్ని’...?
    *
    మద్దూరి ఆదిత్య గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    అది టైపాటు "యన్ని" టైపాటు కు మన్నించగలరు.

    రిప్లయితొలగించండి
  28. కార్తికమ్మున పరమేశ! కాలకాల!
    భక్తవత్సల!శంకరా!భవవిదూర!
    మోక్ష మీయర! యని సతము శివభక్తి
    మత్తుఁ గలిగించువాఁ డె పో మంచి వాఁ డు

    రిప్లయితొలగించండి
  29. మిస్సన్న గారూ,
    భక్తి అనెడి మత్తును ప్రస్తావించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. ఒక చిన్న సూచన:
    మాయ జగము అను సమాసము సాధువు కాదు. మాయాజగము అనుట సాధువు. స్వస్తి.

    శ్రీమతి శైలజ గారూ! శుభాశీస్సులు.
    మీరు చాలా వేగముగ పద్యకవితలో సాగుచున్నారు. అభినందనలు. మీ పద్యములలో కొన్ని సూచనలు:

    1. గాఢ నిదుర మత్తు అను సమాసము బాగులేదు. గాఢ అనునది సంస్కృత పదము - దానికి బదులుగా వేరొక తెలుగు పదమును వేసి చూడండి.

    2. మేలి బంగరు అనుట కంటె మేల్మి బంగరు అనుట మంచిది. స్వస్తి.

    రిప్లయితొలగించండి


  31. మానసిక రోగి శ్రేయంబు మదిని గోరి
    వైద్యుడు మదిలో మర్మంబుఁ బట్ట నెంచి
    పలుకు తేనెల రువ్వుచు వశుడు గాగ
    మత్తు గలిగించు వాడె పో మంచి వాడు

    రిప్లయితొలగించండి
  32. పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    *
    సహదేవుడు గారూ,
    హిప్నాటిస్టు విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. శంకరార్యా ! ధన్యవాదములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    రిప్లయితొలగించండి