28, నవంబర్ 2013, గురువారం

సమస్యాపూరణం - 1248 (ఫలశతము నొసంగె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా!

37 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    వ్రతం చెడ్డా ఫలం దక్కినట్టు
    వల చిరిగితే చిరిగింది గానీ
    వందల కొద్దీ చేపలు దొరికినవి ! చాలుగదా :

    01)
    _____________________________________

    అలలవి వచ్చెడు నీటిని
    వలకును దొరికెను ఝషములు - వందల కొలదిన్
    వలయదె చినిగెను పోనీ !
    ఫలశతము నొసంగె జీర్ణ - పాదప మౌరా !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  2. 1996 నవంబరు నెలలో
    కోనసీమలో ఒక కాళరాత్రి !

    మెల్లగా వర్షం మొదలైంది !
    కరెంటు పోయింది !
    పెను తుఫానుగా మారింది !
    గంటకు 150-170 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు !
    తలుపులూ కిటికీలూ కొట్టుకుంటుంటే మూసుకొని లోపలే ఉన్నామంతా !
    బయటకు వెళ్తే మనుషులు కూడా ఎగిరిపోతారేమో నన్నంత భయంకరమైన గాలీ !
    దానికి తోడు సూదుల్లా గుచ్చుకునే వానా !

    ప్రళయం తన ప్రతాపం చూపి వెళ్ళిపోయింది !
    తెల్లవారింది !
    తలుపులు తెరుచుకున్నాయి !
    చిన్నగా వర్షం పడుతోంది !
    రెండడుగులు బయటకు వెళ్ళి చూస్తే
    ఏముంది ??????????????????????????????????
    అంతా సర్వ నాశనం !
    ప్రకృతి విలయతాండవం !
    కొబ్బరి చెట్లతో కళకళ లాడే కోనసీమలో ఒక్కచెట్టూ నిలబడి లేదు !
    అథవా నిలబడినా తల లేకుండానే యెక్కడో ఒకటీ అరా !
    మర్రి, రావి, నిద్రగన్నేరు , తాడి , నేరేడు , వేప , మామిడి, అరటి
    అదీ ఇదీ అనిలేదు ఏ చెట్టూ నిలబడి లేదు !
    ఎన్నో యిళ్ళు కూలిపోయాయి !
    దాదాపు 20 వేలమంది మనుషులు మృత్యు వాత బడ్డారు !
    పశువులైతే లెక్కే లేదు !
    ఒక్క కొబ్బరి చెట్లే 30 లక్షలుంటాయని అంచనా !
    కరెంటు పునరుద్ధరణకు రెండు నెలలు పట్టింది !
    ఐదారు మీటర్ల కైవారం గలిగిన వృక్షాలు గజానికొక్కటి రోడ్డు కడ్డంగా నేలనంటుకొని !
    ఊరికే చెట్లను కొంచెం పక్కకు తప్పించి దారివ్వడానికి వారం రోజులు పట్టింది !

    ****
    ఎన్నో ఏళ్ళనుండి చూస్తున్న ఊళ్ళైనా
    ఏ ఊరేదో తెలిసేది కాదు !
    దారి పొడుగునా పశు కళేబరాలు ! దుర్గంధం !
    కూలిపోయిన యిళ్ళతో, విరిగి పోయిన చెట్లతో అన్ని ఊళ్ళూ ఒకేలా ఉండేవి !
    అసలు ఏ వస్తువైనా నిలబడి ఉంటేగా !

    *****
    ఆ విలయానికి ప్రత్యక్ష సాక్షిని నేను !
    మళ్ళీ అంతటి తీవ్రతతో ఈ రోజు "లెహెర్" తుఫాను రాబోతోందట !
    ఇదే జేస్తుందో మరి ??????????????????????

    *****
    అప్పుడు నిజంగానే చూశాన్నేను
    జీర్ణ పాదపానికి ఫల శతములు !
    విరిగి పోయిన ఒక్కో కొబ్బరి చెట్టుకూ
    పనికి రానివీ , పనికొచ్చేవీ వందకు పైనే కాయలూ పిందెలూ :

    02)
    _____________________________________

    విలయపు ధాటికి నొరిగెను
    పెళపెళ లాడుచును పెక్కు - వృక్షము లెన్నో !
    కలగా మిగిలెను నేటికి !
    ఫలశతము నొసంగె జీర్ణ - పాదప మౌరా !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  3. ధర్మరాజు పుట్టాడని వినగానే గాంధారి
    గుండలు బాదుకోలేదట ! కడుపు మీద బాదుకుందట !
    ఫలితం ! గర్భ విచ్ఛిత్తి !
    వ్యాసుల వారి దయవల్ల ఆ జీర్ణ గర్భానికి 101 శిశువులు జననం !
    మీకు తెలియని దేముంది :

    03)
    _____________________________________

    విలవిల లాడుచు గర్భము
    నలకను గాంథారి కుదుప - నచలకు నొరగన్
    బిలబిల లాడెడు శిశువుల
    ఫలశతము నొసంగె జీర్ణ - పాదప మౌరా !
    _____________________________________
    అచల = నేల

    రిప్లయితొలగించండి
  4. జలమది గంగను దించిన
    నల శంకరు తపోధనులు నడచిన ధరణిన్
    నిలయమట వింత గాదని
    ఫల శతము లొసంగె జీర్ణ పాదప మౌరా !

    రిప్లయితొలగించండి
  5. సతీసావిత్రి !
    తెలుసుగా మీకందరికీ !
    మొదలు నరికిన చెట్టు(జీర్ణపాదపము) వలె కూలిపోయిన భర్తను బ్రతికించు కొనుటకు
    యముని వెంట పడి
    శోధించి, వేధించి , సాధించినది ఏమిటి ?
    మొదటి వరంగా అత్తమామలకు నేత్రదృష్టీ,రాజ్యప్రాప్తీనూ !
    రెండవ వరంగా తల్లిదండ్రులకు శత సంతానమునూ !
    కదా !
    మనం ఇక్కడే ఆగిపోదాం !
    మరి జీర్ణపాదపం వల్ల ఫలశతం లభించినట్టేగా :

    04)
    _____________________________________

    యిలపై కూలిన భర్త , నె
    టులైన సాధించ నెంచి - టుంటుక మైనన్
    బలముగ శనితో బోరుట
    ఫలశతము నొసంగె జీర్ణ - పాదప మౌరా !
    _____________________________________
    టుంటుకము = అల్పము(యముని ముందు సావిత్రి అల్పాతి అల్పంగదా)

    రిప్లయితొలగించండి
  6. పళ్ళచెట్టుకే గదా రాళ్ళ దెబ్బలన్నట్టు
    పళ్ళతో నిండుగా నున్న చెట్టును
    రాయితో కొడితే ఒకటి రెండు పళ్ళనే యిస్తుంది !
    అదే గొడ్డలితో కొడితే వందలాది పళ్ళ నిస్తుంది !
    ఎంత దయ :

    05)
    _____________________________________

    బలవంతముగా నరకిన
    ఫలవంతపు నెట్టి మేటి - పల్లవి యైన
    న్నలుగక, నవ్వుచు ,గరుణను
    ఫలశతము నొసంగె జీర్ణ - పాదప మౌరా !
    _____________________________________
    పల్లవి = చెట్టు

    రిప్లయితొలగించండి
  7. అరటి చెట్టు మొదల్లో నున్న పిలక మళ్ళీ మళ్ళీ పళ్ళ నిస్తుంది :

    06)
    _____________________________________

    గెలయున్న నరటి తుంచిన
    ఫలములతో నిచ్చు పిలక - పాదము నందున్ !
    మొలచిన పిలకలు మరిమరి
    ఫలశతము నొసంగె జీర్ణ - పాదప మౌరా !
    _____________________________________
    తుంచు = నరకు

    రిప్లయితొలగించండి
  8. అద్దాన్ని బాగా ఎత్తు మీదనుండి గట్టిగా నేలకేసి కొడితే ఫల శతమే గదా :

    07)
    _____________________________________

    యిల నెత్తి , కొట్ట నద్దము
    గలగల మని పగిలి యిచ్చు - ఘనమగు సరణిన్
    వెలలేని ముక్క లెన్నియొ
    ఫలశతము నొసంగె జీర్ణ - పాదప మౌరా !
    _____________________________________
    వెలలేని = పనికిరాని

    రిప్లయితొలగించండి
  9. తల్లిదండ్రుల్ని ప్రేమగా సేవిస్తే
    తండ్రి పోయిన పిదప ఫల శతమేమి ? సహస్రమే :

    08)
    _____________________________________

    విలువైన తండ్రి యాస్తికి
    నిలలోవారసుడు తనయు - డే గద , పిదపన్
    మెలకువగా మెలిగి నపుడు !
    ఫలశతము నొసంగె జీర్ణ - పాదప మౌరా !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  10. విత్తు తులలేనిది గదా !
    అది నశించి , వృక్షమై తరతరాలు ఫల(విత్తు) శతాన్నిస్తుంది గద :

    09)
    _____________________________________

    తులలేని విత్తు నాటిన
    పలవలుగాపెరిగి పెద్ద - పాదప మగుట
    న్నిలనిచ్చు తర తరంబుల
    ఫలశతము నొసంగె జీర్ణ - పాదప మౌరా !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  11. సలిపె వివిధ రీతుల బో
    ధలు భీష్ముం డంతిమ దశ ధర్మసుతునకున్
    జలజాక్షు ననుగ్రహమున
    ఫల శతము నొసంగె జీర్ణ పాదప మౌరా!

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    ముందుగా శ్రీ నేమాని గురుదేవులను మన్నించమని ప్రార్థిస్తూ...

    (Dirty picture ) డర్టి పిశ్చర్ చిత్రము పై
    ===========*============
    చెత్త చిత్ర మిది యనుచు జెప్పగాను
    జూడ వచ్చిన జనులను జూచి బలికె
    ధరణి పై దీయని ఫల శతము నొసంగె
    జీర్ణ పాదప మౌర విచిత్ర ముగను !

    ( జీర్ణ పాదపము=చెత్త చిత్రము)

    రిప్లయితొలగించండి
  13. బలయుతుఁడై వానరమూ
    కలసహితుఁడు రాముఁడు దశకంఠుని గూల్చన్
    తెలిపెను పాలన విధములఁ
    ఫల శతమునొసంగె జీర్ణ పాదపమౌరా!

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. మలమల మాడుచు నెండకు
    నిలిచెడు జనులకు గొడుగుగ నీడను యిచ్చున్
    బలవంతముగా గొట్టిన
    ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా!

    రిప్లయితొలగించండి
  16. డిల్లీలో చెత్త నమ్మిన వాడు కోటీశ్వరు డయ్యెనట. (2000 కోట్లు స్వాదినము జేసు కొన్నట్లు విని యుంటి ). వానిని జూచి జనులు
    ==========&==========
    అలతి యలతి వ్యర్థ ములను
    నలయక సొలయక ననుదిన మందున గూర్మిన్
    గలిపెడి, సిరివంతుని గని
    ఫల శతము నొసంగె జీర్ణ పాదప మౌరా!

    రిప్లయితొలగించండి
  17. పలవలు గలిగిన మామిడి
    ఫల శతము నొసంగె, జీ ర్ణ పాదప మౌరా !
    బల హీ న మగుట వలనన
    జలమును సరి బీ ల్చలేక చావగ నుండెన్


    రిప్లయితొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  19. తలచుచు రాముని మదిలో
    నిలచెను రాఘవునిజూడ నిత్యము శబరీ
    పిలుచుచు వచ్చిన ప్రభువుకి
    ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా

    రిప్లయితొలగించండి
  20. ఫలితంబెరుగక వృక్షము
    కలకాలంబిచ్చు ఫలము కమనీయముగా
    తొలిమలి దశలను దాటిన
    ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా

    రిప్లయితొలగించండి
  21. పలువిధముల రక్కసి మూ
    కలనణచుటకై దధీచి గరిమినొసంగెన్
    బలియగుచు నెముకల,భళిర!
    ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా!

    రిప్లయితొలగించండి
  22. పొలమున బీజము వేయగ
    మొలకెత్తిన మొక్క యొకటి ముదుసలిదై యా
    మలి వయసునందు గూడను
    ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా.

    రిప్లయితొలగించండి
  23. బలమైన రసాలమ్మిది
    ఫలశతము నొసంగె, జీర్ణ పాదప మౌరా !
    విలువైన కలప నిచ్చెను
    ఇలలో వృక్షముల మేలు నెన్నగ వశమే.




    రిప్లయితొలగించండి
  24. కళ కళ లాడిన తరువుగ
    ఫలశతము నొసంగె .జీర్ణపాదప మౌరా
    కలపగ మారెను నేడిక
    చలికాలము నందు మంట సత్వర మిడగన్

    రిప్లయితొలగించండి
  25. శ్రీ కుసుమ సుదర్శనగారు
    మీ పద్యములో మొదటి పాదములో మరియు రెండవ పాదములోగల గణ
    దోషమును గమనిచగలరు. స్వస్తి

    రిప్లయితొలగించండి
  26. శ్రీ కుసుమ సుదర్శనగారు
    మీ పద్యములో మొదటి పాదము కాదు రెండవ పాదములోగల గణ
    దోషమును గమనిచగలరు. స్వస్తి

    రిప్లయితొలగించండి
  27. శ్రీ లక్ష్మీనారాయణ గారూ & శ్రీసుధాకర్ కుస్మ గారు! శుభాశీస్సులు.
    శ్రీ సుధాకర్ గారి పద్యములో నెట్టి గణభంగమునూ లేదు. వారికి అభినందనలు.

    శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: శుభాశీస్సులు.
    వానర మూకల సహితుడు అనే సమాసము బాగులేదు.
    బలయుతుడై కోతుల మూ
    కల తోడుత ...... అని మార్చుదామా?

    శ్రీమతి శైలజ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    నీడను + ఇచ్చున్ అనుచోట సంధి నిత్యమై నీడనిచ్చును అగును. నీడనొసంగున్ అని మార్చుదాము.

    శ్రీ వరప్రసాద్ గారూ: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    సిరివంతుడు అనుట కంటే శ్రీమంతుడు అని గాని లేక ధనవంతుడు అంటే బాగుంటుంది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  28. శ్రీమతి శైలజ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యమును పూర్తిగా పరిష్కరించితిని - అన్వయ సౌలభ్యము కొరకు:

    తలచుచు రాముని కొరకై
    నిలుచుచు శ్రీరాము పిలుపునే శబరి వినెన్
    సలిపి సమర్చన ప్రభునకు
    ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా!

    రిప్లయితొలగించండి
  29. ఇల చిత్ర నాయికొక్కతె
    వెల కొలదగు వలువగట్టె, వేలంబందున్
    కలదలపని విలువందెను
    ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా!

    రిప్లయితొలగించండి
  30. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఒక మిత్రుని బంధువుల పెళ్ళికి నిన్న వరంగల్ వచ్చి, ఇక్కడే ఉన్నాను. నిన్నటినుండి బ్లాగుకు అందుబాటులో లేను. మన్నించండి.
    గురుదేవులు పండిత నేమాని వారు మిత్రుల పూరణలను పరామర్శించి దోషసవరణ చేశారు. వారికి ధన్యవాదాలు.
    రేపటికి ఆశ్రమానికి చేరుకుంటాను.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణల నవరత్నాలను అందుకొని సంతోషించాను. అన్నీ బాగున్నవి. అభినందనలు.
    కోనసీమలో విలయాన్ని వర్ణించిన తీరు ప్రశంసనీయం.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    శబరి ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కుసుమ సుదర్శన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీ దేవి గారూ,
    దధీచి ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గండురి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. శ్రీ పండిత నేమాని గురువర్యులకు నమస్కారములు
    శ్రీ కుసుమ సుదర్శన్ గారి పద్యములో నేను ఎందుకో, ఏ ఆలొచనలో నున్నానో కాని పొరపడి గనదోషం
    మని సూచించాను. మీ సూచనను చదివిన తరువాత మరల చూశాను నిజముగా అందులో ఏ దోషం లేదని గ్రహింఛి
    చింతిస్తున్నాను . గురువుగారు మీ సూచనకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  32. హమ్మయ్య !
    లెహెర్ తుఫాను వచ్చింది వెళ్ళింది ప్రశాంతంగా
    ప్రళయమేమీ సృష్టించ కుండానే !

    శంకరార్యా ! ధన్యవాదములు !

    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    రిప్లయితొలగించండి
  33. జల మది గంగను దించిన
    బలమౌ తాపసులు మునుల పావన భువికిన్
    నిలయ మిది వింత గాదని
    ఫల శతము నొసంగె జీర్ణ పాదప మౌరా

    గురువులు క్షమించాలి సవరించిన పద్యమ

    రిప్లయితొలగించండి
  34. తెలుగున్ మరాఠి హిందీ
    మలయాళము వంగ భాష మరియెన్నెన్నో
    కలిగించెను సంస్కృతమే...
    ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా!

    రిప్లయితొలగించండి
  35. జలగాము నందు ముదుసలి
    పలువురు సాయిబులు మెచ్చ పంటలు పండన్
    నలుగురు భార్యల కూడగ
    ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా!

    రిప్లయితొలగించండి