20, జనవరి 2017, శుక్రవారం

సమస్య - 2258 (శునకమ్ములు పూవులాయె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటు లగున్?" లేదా...
"శునకమ్ముల్ గుసుమంబు లాయె ననఁగాఁ జోద్యమ్ముగా నెంతురా?"

80 కామెంట్‌లు:

  1. శ్యామాఛ్ఛబలం ప్రపద్యే శబలాఛ్ఛ్యామం ప్రపద్యే అశ్వ ఇవ రోమాని విధూయ పాపం చంద్ర ఇవ రాహోర్ ముఖాత్ ప్రముచ్య ధూత్వా శరీరం అకృతం కృతాత్మా బ్రహ్మ లోకం
    అభిసంభవామి అభిసంభవామి
    .....ఛాందోగ్య ఉపనిషత్



    ధనధాన్యంబుల ప్రజలను
    కనక రజతములను వీడి కైవల్యమునన్
    జనుదెంచు ఘడియన యముని
    శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటులగున్?

    (శ్యామ, శబల, యముని శునకముల పేర్లు) 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      ఉపనిషద్వాక్యప్రమాణంతో మీరు చేసిన పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి

    2. చాలా బాగుందండీ జీ పి శాస్త్రి గారు,

      అస్త్ర సన్యాసం చేయ కుండా (కొన్ని రోజుల మునుపు చెప్పారను కుంటా) మీరు కొనసాగించడం తో రోజుకో ఉపనిషద్, గుళికలు 'కందం' లో యిమడటం చాలా బాగుంది. !

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
  2. కనుమాయది పెనుగారడి
    పనిగట్టుకు నేర్చు కొనగ పరమ ప్రీతిన్
    మన శకుని పాచిక లవలె
    శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటు లగున్

    రిప్లయితొలగించండి
  3. ముని మంత్రము పఠియించగ
    దినకరుడే తరలి రాగ దివిజు డనంగా
    కనికట్టున మంత్రించగ
    శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటు లగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      గారడి, కనుకట్టుల ప్రస్తావనతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి


  4. అనకొండను యలవోకగ
    తన జాదూతో జిలేబి తరుణిగ మార్చెన్
    మన పీసీ సర్కారౌ,
    శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటు లగున్?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ ఇంద్రజాలికుని పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనకొండనె యలవోకగ' అనండి.

      తొలగించండి
  5. డా.పిట్టా
    కొను నింటను శునకమ్మును
    తనమాతాపితల సుతుడు దాచును బయటన్
    తినిపించను లాలించను
    శునకమ్ములు పూవులాయె జోద్యమెటులగున్?
    మును హర్షంబన నంబరాల దిగెనే మోదంబునన్ బూవులే
    ఘన వర్షంబులు జాలు నిప్పటికవే గాంచంగనౌ దీవెనల్
    జనె నా జల్లులు జారవే బహువడిన్ జాజుల్ మరీ మల్లెలై
    వినగా "కుక్కలు బిల్లులే గురిసె బల్ వేడ్క"న్న నా యాంగ్ల భా
    వనలన్ జూడము మృగ్యమాయె చినుకుల్ బాటింప నీవాక్యమున్
    "శునకమ్ముల్ గుసుమంబులాయె ననగా జోద్యమ్ముగా నెంతురా!"
    "It rains cats and dogs"జడివానకు వాడిన ఆంగ్ల జాతీయము(idiom).

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      పెంపుడు కుక్కని పువ్వులా, తల్లిదండ్రులను ముండ్లుగా భావింఛే కొడుకొకడు నాకు తెలుసు.
      రెండవ పూరణలో ఆంగ్ల జాతీయాన్ని సమర్థంగా వినియోగించుకొనడం ప్రశంసార్హం.

      తొలగించండి
  6. ఘనుడా పార్థుడు సవ్యసాచి ఘన సత్కార్యంబు సాధించగన్
    జనియెన్ పాశుపతాస్త్ర సాధనకు ప్రాజాపత్యమాశించియున్
    తను గాండీవము దాల్చి లుబ్ధకునిపై దర్పంబు చూపించ నీ
    శునకమ్ముల్ గుసుమంబు లాయె ననఁగాఁ జోద్యమ్ముగా నెంతురా?

    రిప్లయితొలగించండి
  7. 1)
    ఘన పాశుపతముఁ గొనఁ దప
    మును జేయు నరుని నెదిర్చె ముక్కంటి, కిరా
    తునిపై వేయఁగ నా యీ
    శున కమ్ములు పూవులాయెఁ జోద్య మెటు లగున్?
    2)
    ఘనమౌ పాశుపతమ్ముఁ బొందఁగఁ దపఃకర్మోద్యముండై త్రిలో
    చను నర్చించెఁ గిరీటి, యంతటఁ బరీక్షాన్యస్తచేతస్కుఁడై
    చనుదేరన్ శబరుండుగా నరుఁడు విస్తారమ్ముగా వేయ నీ
    శున కమ్ముల్ గుసుమంబు లాయె ననఁగాఁ జోద్యంబుగా నెంతురా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. కిరాతార్జునీయమును కనులకింపుగా చూపించారు.
      కందములో "నరుని నెదిర్చె ముక్కంటి, కిరా/ తునిపై నరుడేయఁగ నీ/ ...అనిన నెట్లుండును?

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      ధన్యవాదాలు. మీ సవరణ బాగున్నది.

      తొలగించండి
  8. తన ప్రియుడేతెంచ మెురిగె
    శునకమ్ముల్, పూవులాయె జోద్య మెటులగున్
    వనితామణి మేల్కెునగన్
    కనులే! మధురోహ లలుమ కాముండెగయన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. కనికట్టు మాయ కాదిది
    చినపిల్లల యాట నేడు చేతుల పనియౌ
    కనుమూసి తెరువ ప్లేడో
    శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటు లగున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      బాగున్నది మీ పూరణ.
      'ప్లేడో' అన్నది ఇంద్రజాలికుని పేరా?

      తొలగించండి
    2. "ప్లేడో" అనునది చిన్న పిల్లల ఆట వస్తువు. దీనిలో చిన్నప్పుడు మీరూ నేనూ బంకమట్టి వినాయకుణ్ణి చేసిన విధంగా నూతన బంక ప్లాస్టిక్ ముద్దలూ, వాటితో బాటు వివిధ రకములైన మణుగుపూల చక్రములవలె మూసలూ వస్తాయి. ఆ ముద్దను చేతి యంత్రములో నింపి నొక్కగానే రకరకాల ఆకారాలలో తయారయి వస్తాయి. ముద్దను చేతితో మరలా నొక్కి వేరే ఆకార చట్రము బిగించి నొక్కినవెంటనే వేరే బొమ్మ తయారవుతుంది.

      బ్రహ్మదేవుని సృష్టి వలె..."పునరపి జననీ జఠరే శయనం" వలె...

      తొలగించండి
    3. శాస్త్రి గారూ,
      నాకు తెలియని విషయాన్ని వివరించినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  10. శ్రీగురుభ్యోనమః

    వనవాసంబున ఫల్గునుండు హరు దివ్యాస్త్రంబునున్ కోరగా
    తనదౌ రూపము మార్చి యర్జునుని యుద్ధమ్మందు కవ్వించగా
    ఘనమౌ వాడి శరమ్ములన్ విడువగా కైమోడ్పులై యా మహే
    శున,కమ్ముల్ గుసుమంబు లాయె ననఁగాఁ జోద్యమ్ముగా నెంతురా

    రిప్లయితొలగించండి
  11. తనమాయను తెలియకయే
    పెనుపందిని గొట్టి నరుడు వీరుండగుచున్
    ఘనముగనే వేయగ నీ
    శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటులగున్?

    రిప్లయితొలగించండి
  12. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    కన స్త్రీ పురుషుల మనముల c

    బ్రణయము బుట్టి౦చు బుష్పబాణుడు స౦ధి౦

    చును సుమశరము లన (గ) = రతీ

    శున కమ్ములు పూవు లాయె జోద్య

    . . మెటులగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మన్మథుని బాణాలు పువ్వులే కదా! చాలా చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
  13. ఇనసమ తేహుడు శీవుడే
    తనతో పోరుకు తలపడు దనుజుల శరముల్
    తునుకలు గావించెను; నీ
    "శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటు లగున్?"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్ధన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      తేహుడు... దేహుడు/తేజుడు...? (ఏదైనా సరిపోతుందనుకోండి)

      తొలగించండి
  14. సవరించినది :
    కం.ఇనసమ తేజుడు శివుడే
    తనతో పోరుకు తలపడు దనుజుల శరముల్
    తునుకలు గావించెను; నీ
    "శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటు లగున్?"
    ఈశునకు + అమ్ములు (బాణములు)

    రిప్లయితొలగించండి
  15. వినువీధిని నేగుచు చూ
    చిన గగన గమన రథమునఁ జిన్నగఁ గనులం
    దనరంగ రంగు రంగుల
    శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటు లగున్?


    వినయం బించుక లేక యొండొరులు నావేశంబునం బోరుచుం
    గనిపింపంగ జనాటవీ స్థలమునం గౌలేయ కాకారులై
    నినదం బంబర మంటఁ బోరుచు నటన్ నిత్యంబు రక్తాంగులై
    శునకమ్ముల్ గుసుమంబు లాయె ననఁగాఁ జోద్యమ్ముగా నెంతురా?

    [కౌలేయకము = శునకము; కుసుమము = కుసుంభవర్ణము (ఎరుపు రంగు)]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంతో అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  16. కనగా భువన ద్రుమమునకు
    ఘనమగు గంధములతో సొగసులిడ బూనన్
    మునులగు వ్యాసాదులు, శుక,
    శునకమ్ములు పూవులాయె చోద్యమెటులగున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      'శుక శునకమ్ములు..."? "శుక శౌనకులు' అనడం సరియైనది.

      తొలగించండి
  17. ఇనకులతిలకునిపైనను
    రణరంగపుమధ్యమమున రయమున ఖగముల్
    దనుజుండు విసర నా యీ
    శున కమ్ములు పూవులాయెఁ జోద్య మెటు లగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. కనలుచు రణమున నర్జును
    డనవరతము శివుని పైన నమ్ముల నేయన్
    ఘన పాశుపతము నిడు యీ
    శున, కమ్ములు పూవులాయెఁ జోద్య మెటు లగున్?

    రిప్లయితొలగించండి
  19. రిప్లయిలు
    1. మనమున నెన్నడును దలచ
      కనజామీళుండు తనదు కడపటి వేళన్
      వినగనె తిరునామం బీ
      శు,నకమ్ములు పూవులాయె జోద్యమెటులగున్!

      అకమ్ములు= పాపములు

      తొలగించండి
    2. గుఱ్ఱం శ్రీదేవి గారూ,
      అజామీళుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని ఈశున్+అకమ్ములు.. అన్వయం కుదరడం లేనట్టుంది.

      తొలగించండి
    3. సీతాదేవి గారు చక్కటి భావముతో నున్నది మీ పూరణ. దలచక / నజామీళుండు లో ప్రాసాక్షరము న రాదు. యజామిళుండని అనవలసి యుండును. ఆ బ్రాహ్మణుని పేరు అజామిళుఁడు.
      ఈ సవరణ తో నన్వయము కూడ కుదుర గలదు.

      హనువేళనజామిళుడట
      తనయుని నారాయణు నతి తమిఁ బిలిచిన నం
      తనె తలచిన రీతవ నీ
      శు,నకమ్ములు పూవులాయె జోద్యమెటులగున్!
      [హనువేళ = మరణసమయము]

      తొలగించండి
    4. కవివర్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు! పద్యరచవలో ప్రాధమిక దశలో నున్న నన్ను అభినందించి నందులకు కృతజ్ఞతలు!

      మీ పూరణ అత్యధ్బుతంగా యున్నది!
      మీరు వ్రాసిన ద్విపద కావ్యం " పద్మావతీ పరిణయం" మా అన్నయ్య ద్వారా అందినది.
      చదువుతున్నాను. చాల బాగున్నది!
      ధన్యవాదములు!

      తొలగించండి
    5. గురుతుల్యులు పూజ్యులు శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమస్కారములు !
      మీరు రచించిన ''పద్మావతీ శ్రీనివాసం'' నాకు మా గురువుగారు శ్రీ ప్రభాకర శాస్త్ర్రి గారి ఆశీస్సులతో లభించింది. ధన్యులము!

      తొలగించండి
    6. శ్రీమతి సీతాదేవి గారికి, శ్రీ సునీల్ గారికి ధన్యవాదములు నమస్సులు.

      తొలగించండి
  20. కనకపు సింహాసనమున
    శునకమ్ముల నుంచె నొకడు చూడుడటంచున్
    కనికట్టున వీక్షకులకు
    శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటు లగున్?

    రిప్లయితొలగించండి
  21. ఘనమౌ పాశుపదంబుఁ బొందగను సంకల్పించి, ధ్యానమ్ము తా
    మనసున్ నిల్పి కపర్దిపైన కడు సమ్మానమ్ముతో చేయగన్
    కనిపించెన్ పరమేశ్వరుండు గిరిపై గాండీవికిన్ బోయగా
    పెనగన్ వారలు సూకరమ్ముకొరకై వివ్వచ్చుడేయంగ నీ
    శున కమ్ముల్ గుసుమంబు లాయె ననఁగాఁ జోద్యంబుగా నెంతురా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      చక్కని పూరణ. అభినందనలు.
      పాశుపదంబు -> పాశుపతంబు ... టైపాటు.

      తొలగించండి
  22. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తన గారడి విద్యలతో
    కనికట్టు న్నాతడంత ఘనముగ వింత
    ల్పనుచుచు తేర్చెడి వేళన్
    శునకమ్ములు పూవులాయె జోద్య మెటులగున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. మన శివసూనుఁడు తారకు
    దునిమెడు వాడగు నటంచు స్త్రోోత్రమ్ము లిడన్
    ననవిలుతుడు విసరఁగ నీ
    శున కమ్ముల్ పూవులాయెఁ జోద్యమెటులగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. గురువు గారికి వందనములు. సవరించిన పద్యాన్ని పరిశీలించ కోరుతాను.. ధన్యవాదములు.
    కనగా, భువన ద్రుమమ్మున
    ఘనమౌ విఙ్ఞాన సుమ సుగంధాల నిడన్
    మునులను వారలె జగదీ
    శున కమ్ములు, పూవులాయె చోద్యమెటులగున్?

    రిప్లయితొలగించండి
  25. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఘన వీక్ష్యమ్మును గొల్పి చూపరులకున్ కల్లోలముం గూర్చుచున్
    తనదౌ వింతగు గారడీ చలుపుచు న్ద్రష్టల్ ప్రమోదించగా
    కనికట్టున్నటునిట్టుగా కలుపుచున్ కైపిచ్చు నేమమ్మునన్
    శునకమ్ముల్ గుసుమంబు లాయె ననఁగాఁ జోద్యమ్ముగా నెంతురా?"

    రిప్లయితొలగించండి
  26. కనగాశవములు సిద్దుని
    తినమన?గురువాజ్ఞ చేత తినుటకు వెళ్ళన్
    తనకది నగుపించెను లే
    శునకమ్ములు పూవులాయె|జోద్యమెటులగున్?
    2.ఘనుడే| వచ్చిన రాఘవేంద్ర గురు సాంగత్యమ్ము నాసించియున్
    మనసున్ ద్రుంచి పరీక్ష లుంచె గద సామాన్యుండ?దైవమ్ముకే
    తినగా నుంచె నవాబు మాంసమును యాదేశానదెప్పించగా?
    శునకమ్ముల్ గుసుమంబులాయె ననగా జోద్యమ్ముగానెంతురా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'మాంసమును+ఆదేశాన' అన్నపుడు యడాగమం రాదు. 'మాంసమునె యాదేశాన' అనండి.

      తొలగించండి
  27. ధనమివ్వని పని జేయని
    ఘనులే పాలకులవంగ ఘనముగ నిత్యం
    మన యింటిని గాపాడెడి
    శునకమ్ములు పూవులాయె జోద్యమెటులగున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సునీల్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిత్యం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'ఘనముగ సతమున్। మన యింటిని...' అనండి.

      తొలగించండి
    2. గురువు గారికి నమస్కారములు !

      ధనమివ్వని పని జేయని
      ఘనులే పాలకులవంగ ఘనముగ సతమున్
      మన యింటిని గాపాడెడి
      శునకమ్ములు పూవులాయె జోద్యమెటులగున్!

      తొలగించండి

  28. పిన్నక నాగేశ్వరరావు.

    ఘన యింద్రజాలికు డొకడు

    కనికట్టును చేయ మారె కాకిగ పికము

    న్ననల మ్మయ్యెను సలిలము

    శునకమ్ములు పూవులాయె జోద్యమెటు
    లగున్.
    **********************************

    రిప్లయితొలగించండి
  29. మనసిశయు డేసె పరమే
    శున కమ్ములు, పూవులాయెఁ జోద్య మెటు లగున్?
    కనిపించ నతనుశరములు
    ననలే కద మరులు గొల్పు నర్మిలి హెచ్చన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  30. కనకపు సింహాసనమున
    శునకముకూర్చున్న క నకశుభ లక్షణమే
    మనవలయు మారదుకదా
    శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటు లగున్

    రిప్లయితొలగించండి
  31. *హరినామస్మరణ విడువని తనయుని హిరణ్యకశిపుడు దండించు సందర్భాన్ని యూహించుచు

    అనవరతమ్ము నరి దలచు
    తనయుని పై కినుకబూని దండింపగ నా
    ఘనుడౌ హరినామ పరవ
    శునకమ్ముల్ పూవులాయె జోద్యమెటులగున్


    తనయుండెంతగ జెప్పినన్ వినక బద్మాక్షున్ మదిన్ గొల్వగన్
    దనుజుండంతట కోపమంది తనయున్ దండింప బాణమ్ముతో
    ఘనమౌశిక్షను వేయమన్న హరియే కాపాడెనా పారవ
    శ్యునకమ్ముల్ కుసుమమ్ములాయె ననగా చోద్యమ్ముగా నెంతురా!

    రిప్లయితొలగించండి
  32. సమస్య : "మఱ్ఱాకుల విడెము సేయ మనసాయనయా !"
    విడెము లేక విడియము = తాంబూలము.తమల పాకులతో కదా తాంబూల సేవనము ! మరి మఱ్ఱాకులతో ఎలా ? పూరించిన కవి గారెలా చేశారో చూద్దాము.
    పూరణ:
    కం. కొఱ్ఱన్నము ఘృత సూపము
    బఱ్ఱెల పెరుగూరగాయ పచ్చడి తోడన్
    బిఱ్ఱుగ భోంచేస్తిమయా
    మఱ్ఱాకుల ; విడెము సేయ మనసాయనయా
    ఘృత; = నెయ్యి; సూపము = పప్పు , బఱ్ఱె పెరుగు, ఊరగాయ, పచ్చడితో కొఱ్ఱన్న భోజనం చేశాము, మఱ్ఱాకులలో !
    (మఱ్ఱాకుల విస్తర్లలో); ఇక తాంబూలం వెసుకోవాలని మససౌతూంది.
    (మోదుగాకులతోనే గాక మఱ్ఱాకులతో కూడా కుడతారేమో విస్తర్లు !)

    రిప్లయితొలగించండి
  33. ఘనమౌ బంగరు గద్దెనెక్కగనునా ఘాటైన పోరాటలో
    శునకమ్ముల్ ;...గుసుమంబు లాయె ననఁగాఁ జోద్యమ్ముగా నెంతురా?
    జనముల్ కూర్చిన నోట్లు మాలలను నేజంజాటమే లేకయే...
    కనులన్ పండుగ జేయగా నగవుచున్ కన్యామణుల్ ప్రీతినిన్

    రిప్లయితొలగించండి