16, ఆగస్టు 2019, శుక్రవారం

సమస్య - 3105 (గాధిసుతునకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గాధిసుతునకు మేనక కన్నతల్లి"
(లేదా...)
"మేలుగ గాధిసూనునకు మేనక తల్లి యగున్ నిజంబుగన్"

57 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    మేలుగ నాట్యమాడుచును మేనును నర్పణ జేసెగా భళా
    మేలుగ గాధిసూనునకు మేనక;..తల్లి యగున్ నిజంబుగన్
    వీలుగ పారిపోవుచును వీడుచు బిడ్డను కానలందునన్?
    తేలిచి చెప్పు శంకరయ తేటగు నీతిని నాకు ప్రొద్దుటన్!

    రిప్లయితొలగించండి
  2. ఇంద్రు డనినంత పరమేశు నినుమ డించు
    దేవ వేశ్యగ కాణాచి దివిని నేలు
    తపము భంగము జేయగ తరలి వచ్చె
    గాధి సుతునకు మేనక కన్న తల్లి

    రిప్లయితొలగించండి
  3. ఆశ్రమమ్మున పెరిగిన యతివ యేను
    నీవు వలచిన యందాల నెలత యామె
    యే, శకుంతల జన్మించె నిలను జూడ
    గాధిసుతునకు, మేనక కన్నతల్లి.

    రిప్లయితొలగించండి


  4. ఇంద్రు డే నంపగా వచ్చె నింద్రియముల
    ధాటి పెంపున నేర్పనాదటను నలిని
    గాధిసుతునకు మేనక! కన్నతల్లి
    యయ్యెను శకుంతలకు ప్రణయపథమందు!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    మేలములాడెదో.! అతని మేను స్పృశించెదొ.! కాని అల్లక...
    ల్లోలమునాపి రమ్మిటకు లోలవిలోచన.! యంచు దేవతా
    పాలకుడంప.,నచ్చటకు వచ్చె మనంబు చలింపజేయగా
    మేలుగ గాధిసూనునకు మేనక ., తల్లి యగున్ నిజంబుగన్
    లాలితపక్షికిన్ మృదులలాస్యకు బాలశకుంతలాఖ్యకున్.!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  6. గురుడు ప్రశ్నించ నొకఛాత్రు డురుతరమగు
    వేగ మొప్పార క్షణమైన నాగకుండ
    పలికె నీవిధి నజ్ఞానకలితు డగుట
    గాధిసుతునకు మేనక కన్నతల్లి

    చాలముదంబుతో నచట జక్కగ విద్యలు నేర్చునంచు నా
    బాలుని స్వీయనందనుని వారలు పంపగ నాంగ్లసీమ కా
    నేలను మిత్రకోటికనె నిక్కము వాడొక మందబుద్ధియై
    "మేలుగ గాధిసూనునకు మేనక తల్లి యగున్ నిజంబుగన్".

    రిప్లయితొలగించండి


  7. వేలుపుఱేడు గాభరని వెల్లువ మీరగ నాట్యమాడుచున్
    వాలుచు మీద మీద తన వాల్జడ ధాటిని పంచె నర్మిలిన్
    మేలుగ గాధిసూనునకు మేనక! తల్లి యగున్ నిజంబుగన్
    తేలగ ప్రేమ మార్గమున తెమ్మర వీచి శకుంతలన్ గనన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  8. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    "భోజ్యేషు మాతా..."

    నాలుగు కూరగాయలను నందము నొందుచు తెచ్చి కానలన్
    వీలుగ కత్తిపీటనట వేగమె దొంగిలి పర్ణశాలనున్
    కాలిచి తైలమందునను కమ్మని వేపుడు వండిపెట్టగా
    మేలుగ గాధిసూనునకు మేనక తల్లి యగున్ నిజంబుగన్ 😊

    రిప్లయితొలగించండి
  9. కౌశికుఁడుమేనకలకునుకలిగెనెమ్మి
    నెమ్మనంబులనెగసెను నెనరు ఝరిగ
    కూర్మిఫలము శకుంతల కూతురయ్యె
    గాధిసుతునకు, మేనక కన్నతల్లి.

    రిప్లయితొలగించండి
  10. (భరతుని కన్నతల్లికి కన్నతల్లి మేనక)
    వాలగు కన్నుదోయి చెలు
    వారగ గాంచుచు ,వన్నెచిన్నెలన్
    జాలుగ గ్రుమ్మరించుచును ,
    సన్ముని భోగపుబత్ని యయ్యెలే
    మేలుగ గాధిసూనునకు
    మేనక ;తల్లి యగున్ నిజంబుగన్
    బాలితసర్వరాజ్యుడగు
    భారతు గన్న వరాలతల్లికిన్ .

    రిప్లయితొలగించండి
  11. దల్మి పనుపున మునిజేయు తపము భంగ
    పరచుటకు వచ్చినప్పుడు ప్రణయినయ్యె
    గాధిసుతునకు మేనక ; కన్నతల్లి
    యయ్యెనటుపై శకుంతల కతనిగూడి

    రిప్లయితొలగించండి
  12. పరగ నెవరికి బ్రహ్మర్షి పదము దక్కె
    చేరి ఋషి చెంత నెవ్వతె చెరచె తపము
    వదలె నెవ్వరు దయమాలి పట్టి నడవి
    గాధిసుతునకు మేనక కన్నతల్లి

    రిప్లయితొలగించండి
  13. తళుకు బెళుకుల మేనక దరికి జేర
    పరవశింపగ తపమది భంగమయ్యె
    గాధి సుతునకు... మేనక కన్నతల్లి
    శిశు శకుంతల కయ్యెను చిత్రముగను

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    బుద్థి నెఱుగుము దుష్యంత! బుధుడవౌచు
    సుగుణవతి మా శకుంతల జూడుమయ్య
    కూర్మి బంచుకు పుట్టిన కూతురీమె
    గాధి సుతునకు, మేనక కన్నతల్లి.

    రిప్లయితొలగించండి
  15. హేలగ నాట్యకత్తెయట నేలికనాఙ్ఞను భూమికేగుచున్
    తూలెడు నొంపుసొంపులను తొందరపాటున పత్నయయ్యలే
    మేలుగ గాధిసూనునకు;మేనక తల్లియగున్ నిజంబుగన్
    జాలిగ పక్షిజాతులవి సాకిన బాల శకుంతలాఖ్యకున్

    రిప్లయితొలగించండి
  16. ప్రేయసిగనాయె బుడమిని బ్రేమజూపి
    గాధిసూనునకుమేనక,కన్నతల్లి
    మిన్నదైవముగంటెను నెన్నగాను
    దల్లిదండ్రుల సేవించనుల్లమలరు

    రిప్లయితొలగించండి
  17. గాఢ మధుసేవ చేసిన కవియొకండు
    వావివరుసలు మరచి తా వదరుచుండె
    రామచంద్రుని యిల్లాలు రంభయౌను
    గాధిసుతునకు మేనక కన్నతల్లి.

    రిప్లయితొలగించండి
  18. పడతి మేనకా సుందరి భార్య గాదె
    గాధి సుతునకు, మేనక కన్నతల్లి
    యే గదా శకుంతలకును, యోగ మాయ,
    దాక్షి , పార్వతీ దేవికి తరచి చూడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యోగమాయ... తరచి చూడ' దీనికి అన్వయం?

      తొలగించండి
  19. మేలుగ గాధిసూనునకు మేనకతల్లియగున్నిజంబుగన్
    చాలును సామి!మీపలుకుసైయననొప్పదుగాధీసూనుకున్
    మేలుగదల్లియౌననుట ,మేదినిప్రేయసియౌనుగానికన్
    భాలపు నేత్రునత్తయగుభామయెమేనకనామధేయుగాన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సూనునకున్' అనడం సాధువు. 'నామధేయుగాన్'?

      తొలగించండి
  20. పర్వతరాజు భార్య, మైనాకుడి తల్లి మేనక.

    ఇంద్రుఁ డరుదెంచి రెక్కల నేయ దలపఁ
    సంద్ర మునదాగె నొకకొండ జడిసి కొనుచు
    నతడె మైనాకు డనువాడు నవుత నా న
    గాధిసుతునకు మేనక కన్నతల్లి.

    రిప్లయితొలగించండి
  21. బాలశకుంతలన్ వనముబాలొనరించిరి కౌశికుండుఁనా
    వేలుపుతొయ్యలక్కట వివేచనమాని వివేక హీనులై
    బాలను సాకె కణ్వముని బాధ్యతఁనివ్విధినామె కూతురౌ
    మేలుగ గాధిసూనునకు, మేనకతల్లియగున్ నిజంబుగన్.

    రిప్లయితొలగించండి
  22. మిత్రులందఱకు నమస్సులు!

    [వనదేవతలు మేనక చేష్టలను చూచి, తమలో తాము అనుకొను సందర్భము]

    "వేలుపు ఱేని యానఁ గొని, వేగమె మేనక కౌశికున్ గనెన్!
    లీలఁ దపస్సు భగ్నమగు రీతిని సౌఖ్యము నిచ్చెఁ గాంక్షమై

    మేలుగ గాధిసూనునకు మేనక! తల్లి యగున్ నిజంబుగన్
    బాల శకుంతలా మణికి, భావినృపాంబకు జన్మ నిచ్చియున్!"

    రిప్లయితొలగించండి
  23. చాలిక నీదు వాదనము చక్కగ జెప్పెద తెల్లమౌ నికన్
    జాలిగ జూచు పాప గని సాకెను కణ్వ మహర్షి, కూతురౌ
    మేలుగ గాధిసూనునకు, మేనక తల్లి యగున్ నిజంబుగన్
    బాలికకా శకుంతలకు భారత వర్షపు మూల గాధలన్

    రిప్లయితొలగించండి
  24. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    గాధిసుతునకు మేనక కన్నతల్లి

    సందర్భము: స్వేచ్ఛా కాముకతతో వర్తిల్లే ఆధునిక యువత తెలుసుకోవలసిన విశేషా లిం దున్నవి..
    "స్వీయ" అంటే తనకు సొంతమైన మగువ. "పరకీయ" అంటే ఇతరులకు సొంతమైన.. ఎవరో పెండ్లి చేసుకొన్న యువతి. స్వీయతో శారీరక సుఖం ధర్మం. పరకీయతో సుఖించా లనుకోవడం అధర్మం.
    "కన్య" అంటే పెండ్లి కానిది. అటువంటి దానితో సుఖించా లనుకోవటం కూడా అధర్మమే! ఎందుకంటే ఆమె తల్లితండ్రుల వద్ద వున్నప్పటికీ ఎవరికో దానం చేయబడవలసి వున్నది. అంటే ఎవరికో కట్టబెట్టాల్సి వున్నది. అది వివాహ మంగళ పురస్సరముగానే జరుగవలసివున్నది. ఆ తర్వాతనే శారీరక సుఖం ఆమోద యోగ్యం.
    అటువంటి వివాహ రూపకమైన సత్సంప్రదాయానికి వివాహాత్ పూర్వ శృంగారం విఘాతాన్ని కలిగిస్తుంది.
    కన్య.. పెండ్లితో స్వీయగా మారుతుంది. కామం ధర్మ కామ మవుతుంది. అప్పుడు శారీరక సుఖానుభవానికి అర్హత కలుగుతుంది.
    ధర్మ అవిరుద్ధమైన.. అంటే విరుద్ధంకాని.. లేదా ధర్మబద్ధమైన కామం పరబ్రహ్మమే! "ధర్మావిరుద్ధం భూతేషు కామోఽస్మి భరతర్షభ!.." జీవులలో అటువంటి కామమును నేనే!.. అని గీతలో కృష్ణ భగవానుడు వక్కాణించినాడు.
    ధర్మబద్ధం కాని కామం పరబ్రహ్మమునకు దూరం చేస్తుంది.
    విశ్వామిత్రుడు తపోనిష్ఠలో నుండగా మేనక అనే అప్సరస వచ్చి తపోభంగానికి యత్నించింది. అధర్మ కామ పరవశుడైన విశ్వామిత్రునికి తపోభంగమయింది. వారి కొక పాప పుట్టింది. మేనకమాత్రం పాపను వదలి దేవ లోకానికి వెళ్ళిపోయింది. అతడు తిరిగి మరింత ఘోరమైన తపస్సుకు సంకల్పించినాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    స్వీయతో లైంగిక ప్రియ సుఖం బది యొప్పు..
    నదియె ధర్మం బని రార్యు లెల్ల..
    పరకీయతో సుఖం బనుభవించుటయె త..
    ప్పది యధర్మం బని రార్యు లవనిఁ..
    కన్య పెండిలి స్వీయగా మారినప్పుడే
    ధర్మ కామార్హత ధరణిఁ గలుగు..
    ధర్మావిరుద్ధమై తనరు కామమె బ్రహ్మ..
    మా బ్రహ్మమునకుఁ దా నగును దూర
    మవని ధర్మంబు కాని కామానురక్తి..
    నచ్చ రగు మేనకను గల్గె నా యవస్థ
    గాధి సుతునకు.. మేనక కన్నతల్లి
    యయ్యుఁ బాపను విడనాడి యరిగె దివికి..

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    16.8.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  25. అప్సరస లెంచ నింపుగ నమ్మ లౌదు
    రయ్య రాజ మున్యాదుల కవనిఁ గాంచ
    నాదరం బొప్పఁ జెప్పఁగ నత్త యగును
    గాధిసుతునకు మేనక కన్నతల్లి


    కాల గతస్మృతుల్ దలఁచఁగా విదితం బగు నిశ్చయమ్ముగా
    నాలియె చంద్ర వంశజున కమ్మయు నా భరతాఖ్య నేతకున్
    లీలగ నా శకుంతల కులీనకు, బద్మదళాక్షి కూతురే
    మేలుగ గాధి సూనునకు, మేనక తల్లి యగున్ నిజంబుగన్

    రిప్లయితొలగించండి
  26. శ్రీలెసగన్ ధరాతలని చెన్నెసలారెను భారతమ్ముఁ దా
    పాలనఁ జేయగన్ భరతవల్లభుడట్లుగ వంశమూలమై
    వాలుగ వానకిన్ జనని భవ్యశకుంతల, యామె
    కూతురౌ
    మేలుగ గాధిసూనునకు, మేనక తల్లి యయెన్ నిజంబుగన్,

    రిప్లయితొలగించండి
  27. పాఠశాలన విద్యార్థి ప్రశ్నవేయ
    గాధిసుతునకుమేనక కన్నతల్లి
    యనుట సరియైన దేయనె వినినరాము
    పక్కజూపుల పరవశంబెక్కబలికె!

    రిప్లయితొలగించండి
  28. బేలయటంచు దల్చితివి బీరువు కారణ జన్ము రాలెగా
    మూలము గాంచినన్ దెలియు ముగ్దమనోహర సుందరాంగి యా
    బాల జనించెనోయి యిల పావను డౌముని పుంగవుండెయౌ
    మేలుగ గాధిసూనునకు, మేనక తల్లి యగున్ నిజంబుగన్

    రిప్లయితొలగించండి


  29. నయముగ దరికి చేయుచు నాట్యమాడి
    మరులు గొలుపుచు చక్కగా మచ్చికయ్యె
    గాధిసుతునకు మేనక, కన్నతల్లి
    యై శిశువును వీడిచనియె నీవని యందు

    మౌని చేయుచున్న తపము మానిపించ
    వలపు కురిపించి మురిపించి భార్యయయ్యె
    గాధి సుతునకు మేనక ;కన్న తల్లి
    యయ్యు వీడి చనియె బిడ్డ నవని యందు

    రిప్లయితొలగించండి
  30. తేటగీతి
    కణ్వమునిగాంచి తెచ్చిన కమలనయని
    భరతు జనని శకుంతల వనమునందు
    పక్షి జాలము పెంచిన బాల సూన
    గాధిసుతునకు, మేనక కన్నతల్లి

    ఉత్పలమాల
    కాలెను వేల్పురాయునకు కౌశికు మేటి తపంబు గాంచగన్
    బేలుచుఁ బిల్చి యానతిడ ప్రేమల మోహము నంకురించగన్
    లీలగ నాట్యగానముల రెచ్చెడు సోయగ మారబోయ నే
    మేలుగ గాధిసూనునకు మేనక తల్లి యగున్ నిజంబుగన్?



    రిప్లయితొలగించండి
  31. తేటగీతి
    చిత్రసీమలో చిత్ర విచిత్రములన
    మేనకా గాధిసుతులుగ మేటినటులు
    కాలగతి ప్రభావమ్మేమొ గాంచ నేడు
    గాధిసుతునకు మేనక కన్నతల్లి

    రిప్లయితొలగించండి
  32. కవిమిత్రులారా! నమస్సులు. ఈరోజు ఉదయమే బయల్దేరి ఆకాశవాణికి వెళ్ళాను. అక్కడ రికార్డింగ్ ఆలస్యమయింది. అక్కడినుండి ఒక బంధువు (కవాడిగూడా) ఇంటికి వెళ్ళి ఇంతకుముందే నెలవు చేరాను. రేపు భద్రాచలం బయలుదేరుతున్నాను. ఎల్లుండి అక్కడ పుస్తకావిష్కరణ సభ ఉంది. మళ్ళీ సోమవారం హైదరాబాద్ చేరుకుంటాను. ఈ నాలుగు రోజులు నేను బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. దయచేసి పరిస్పర గుణదోష విచారణ చెసికొనవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి